Naa Ramanasrma Jeevitham    Chapters   

30. ఖాండిక్య కేశిధ్వజుల కథ

''ఇక్ష్వాకుకుమారుడైన నిమి అనే రాజువంశంలో ధర్మధ్వజుడనే రాజుకు కృతధ్వజుడు, మితధ్వజుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. కృతధ్వజుడు మిథిలకు రాజైనాడు. (మిథిలాధినాథు లందరకూ జనకులని సామాన్యనామం.) మితధ్వజుడు వలసరాజ్యానికి అధిపతియైనాడు. వా రిద్దరూ ధర్మాత్ములై రాజ్యములు పాలిస్తూ వుండగా కృతధ్వజునకు ఆత్మవిజ్ఞాన సంపన్నుడైన కేశిధ్వజుడును, మితధ్వజునకు కర్మ శూరుడైన ఖాండిక్యుడును జన్మించారు. వా రిద్దరికీ అంటే ఖాండిక్య కేశిధ్వజు లిద్దరికీ కారణాంతరములవల్ల విరోధం కలిగి కడపట యుద్ధసన్నద్ధులై ఇక్షుమతీ నదీతీరంలో, ఇద్దరిని, అద్దరిని, ఉభయులు సైన్యాన్ని నిలిపి ప్రజలు భయపడునట్లు అనుదినము ఒకరి నొకరు ఢీకొని యుద్ధం చేశారు. కడకు కేశిధ్వజుని సేనలధాటికి ఆగలేక ఖాండిక్యుడు దీనుడై కతి సయపరివారంతోనూ, భార్యాబిడ్డలతోనూ పాఱిపోయాడు.

అట్లు పాఱిపోయిన ఆ ఖాండిక్యు డొక దుర్గమమైన అడవికి వెళ్ళి దారిపొడుగునను శత్రువుల రాక తన కెరిగించుటకై కొండ కొనలయందు కావలి వారినుంచి ఒక చోట పాళెమునకు ఆవరణగా కంచె నాటించి ఆ యావరణ లోపల వర్ణకుటీరములందు ముఖ్యజనులతో నివసిస్తూ వున్నాడు. అక్కడ కేశిధ్వజుడున్నూ రెండు రాఙ్యములు తన కే చేరినను గర్వించక శ్రౌతకర్మచేత ఙనన మరణ ప్రవాహరూపదుఃఖ సహితమైన ఈ సంసారసాగరమును దాటదలచి, బ్రహ్మజ్ఞానాశ్రయుడై, స్వర్గభోగాది ఫలాపేక్షమాని యజ్ఞములు చేస్తూ అందొక్క దానికి దీక్షితుడై వుండగా, ఆ యజ్ఞ ధేనువు చాలా సమీపంలో వున్న పచ్చిక మేస్తూ వెళ్ళి, ఒక దట్టమైన పొదను సమీపించి, అక్కడ యముని జండావలె చలిస్తూ వున్న పులితోకను చూచి అంబా అని అరుస్తూ పరుగెత్తింది. ఆ పులి గోవువెంట పడటం చూచి గోవుల కాపరి మూర్ఛిల్లాడు. ఆ పులి గోవును తన గుహ కీడ్చుకొని, పోతూవుంటె పొలము కాపరులు, స్నానం చేసే బ్రాహ్మణులు చూచి అదలించారు. ఆ పులి ఆ అదలింపులకు బెదరి గోవు మెడకొఱికి విడిచిపోయింది. కాని గోవు బ్రతకలేదు. రాజుకు ఆ వార్త తెలిసి ఋత్విక్కులను ప్రాయశ్చిత్తమడిగాడు. వారు క సేరువు నడుగుమన్నారు. కసేరువు శునకు నడుగుమన్నాడు. ఆ శునకుడున్నూ తనకు తెలియదనిన్నీ చెప్పి, ''ఎవరైతే నీచే జయింపబడి అడవిని వున్నాడో ఆ ఖాండిక్యునకు తప్ప వే రెవ్వరికీ ఈ ధర్మసూక్ష్మం తెలియదు. నీకు తగునని తోచినట్లయిన అతని వద్దకు వెళ్ళుము'' అన్నాడు.

కేశిధ్వజుడు ఆ మునిని చూచి ''స్వామీ ! నా వైరియైన ఖాండిక్యుని ప్రాయశ్చిత్త మడుగుటకై నేను తప్పక పోయెదను. పూర్వ వైరమును దలచి న న్నతడు చంపెనా క్రతుఫలం సిద్ధిస్తుంది. ప్రాయశ్చిత్త మెరిగించెనా క్రతువు. సంపూర్ణమవుతుంది. రెండు విధములా నాకు మేలే గనుక ఇప్పుడే పోగలను'' అని వెంటనే రథం ఎక్కాడు. కేశిధ్వజుడు జింకతోలు ఉత్తరీయం ధరించి ఆయుధం లేకుండా అడవికి వెళ్ళితే అతని కేతనం చూచి కొండకొనల నున్న అక్కడి కావలి వా రాతని గుర్తించి, కూతలిడి వలస వారికి తెలియజేశారు. వారంతా తమ్ము చంపుటకే శత్రువు వస్తున్నాడని భయపడితే ఖాండిక్యుడు వారి భయం పోగొట్టేందుకు కొందరిని నియమించి, కనుమల రక్షణకు కొందరిని పంపిముమ్మరమైన కోపంతో కంపకోటయొక్క ద్వారం తెఱచుకొని బయటికి వచ్చి తన శత్రువును చూపులచేతనే దహించునట్లు చూచి వింట బాణం సంధిస్తూ ఇల్లా అన్నాడు. ''ఓయీ! దుష్టుడా! ధనధాన్యసమృద్ధమైన నా ఐశ్వర్యమంతా హరించి ఇంకా తృప్తిలేక మారీచునివలె జింకతోలును ధరించి ప్రశాంత వేషంతో మాలో ప్రవేశించి సమయం చూచి మా ప్రాణాలున్నూ హరించాలని వస్తున్నావా? ఇదుగో! నా వాడి అలుగున నిన్ను పడవేస్తాను" అన్నాడు. కేశిధ్వజు డా మాటలు విని ''ఓహో! కోపగించక నా మాట వినుము. నేను మిమ్ములను చంప రాలేదు. ప్రమాదవశంగా నా యాగంలో ఒక వైకల్యం సంభవించింది. ఋత్విజుల నందుకు ప్రాయశ్చిత్తమడుగగా వా రెవరికీ తెలియదనీ, నీవైతే చెప్పగలవనీ నన్ను నీ వద్దకు పంపారు. విషయం ఇది. నీవు నాపై కోపం విడిచి ప్రాయశ్చిత్త మెరిగించినా సరే; వైరినగుట నన్ను సంహరించినా సరే'' నన్నాడు.

ఆ పలుకులు విన్న ఖాండిక్యుడు విల్లెక్కుడించి, కంచెలోపలికి వెళ్ళి సుహృజ్జనుల కావృత్తాంతమంతా చెప్పి ఆలోచన అడిగాడు. ఆ మంత్రి సామంతులంతా ''దాయాది మనకు ఏ శ్రమా లేకుండా సమీపానికి వచ్చాడు. వెంటనే వానిని చంపిన రెండు రాజ్యములు నీకు రాగలవు. యజ్ఞయాగాదులవల్ల అతనిని చంపిన పాపమును పోగొట్టుకొన వచ్చును.'' అని ఇంకా ఎన్నెన్నో విధాలుగా శుక్రనీతి నంతా బోధించారు. ఖాండిక్యుడు సావధానంగా అంతా విని వారితో ''అయ్యా! మీరు చెప్పిన పని చేయవలసినదే కాని అతనిని చంపుటవల్ల మనకు రాజ్యము, అతనికి స్వర్గము రాగలవు. ఈ రెండు ఫలములలో ఏది గొప్పదో విచారంచండి. ఈ పాపకృత్యం నేను చేసినట్లయితే నా శత్రువునకు శాశ్వతమయిన పరలోక సుఖము, నాకు స్వల్పకాల భోగ్యమయిన రాజ్య సుఖము కలుగుతుంది. అంతేగాక శరణాగతుని, దీనుని చంపుట మహాపాపమనే కణ్వముని వాక్యం స్మరణీయమైనది గనుక ఈ పాపకృత్యం నేను చేయజాలను'' అని వారికి చెప్పి కంచె వెలుపలికి వచ్చి కేశిధ్వజుని వలన యజ్ఞధేను హననమును విని తగిన ప్రాయశ్చిత్త మెరిగించి సగౌరవంగా పంపాడు.

కేశిధ్వజుడున్నూ తిరిగి వచ్చి ప్రాయశ్చిత్త మొనర్చి, క్రతువు సమాప్తి చేసి, అవభృథస్నానాదులన్నీ ముగించుకొని, ఋత్విజులకు వందిమాగధాదులకు, అర్థిజనులకు అభిమాతార్థాలన్నీ యిచ్చి ఇల్లు చేరుకున్నాడు. అయినా అతని మనస్సు సంతుష్టి చెందలేదు. ఎందువల్లనా అని యోచించి యజ్ఞ ధేను హననమునకు ప్రాయశ్చిత్త మెరిగించిన గురునకు దక్షిణ ఈయకుండుట జ్ఞప్తికి తెచ్చుకొని, ఇచ్చే నిమిత్తం ఖాండిక్యుని వద్దకు వెళ్ళాడు. ఇతడు తనతో యుద్ధానికే వచ్చాడేమో నని ఖాండిక్యుడు తొక్కట పడ్డాడు. వెలికి వచ్చి వెనుకటివలెనే విల్లెక్కు పెట్టు నాతని సంభ్రమం కేశిధ్వజుడు ఆపి ''అయ్యా! నేను నీతో యుద్ధానికి రాలేదు. ప్రాయశ్చిత్తమెరిగించిన నీకు గురుదక్షిణ ఇవ్వటానికి వచ్చాను. నీకు ఏమి కావాలో అడుగు'' మన్నాడు. ఖాండిక్యుడు తిరిగి తన వారితో ఆలోచించాడు. వారంతా ఉబ్బి ''నేడు గదా మన పుణ్యం ఫలించింది. గురుదక్షిణగా చతుస్సముద్రపరివేష్టితమైన రాజ్యమంతా అడుగుట మంచిది. ఆప్తబాంధవరక్షణ కంటే వేరే పుణ్యం వున్నదా ! మన కెప్పుడు బలం రాగలదు ? ఎప్పుడు జయించగలం ? ఎవరూ చావకుండా, గాయపడకుండా రాజ్యం రాగలదు. తప్పక రాజ్యం అడుగవలసిన'' దన్నారు.

ఖాండిక్యు డా మాటలకు చిరునవ్వు నవ్వి ''అయ్యా ! మీరు అర్థశాస్త్ర పండితులుగాని మోక్షమార్గవిచార పండితులు కారు. అతడు ఆత్మజ్ఞాన సంపన్నుడు. నే నా మహాభాగుని వద్దకు వెళ్ళి మహాసుఖాన్నిచ్చే మోక్షమార్గం అడుగక అతిచంచలమైన రాజ్యలక్ష్మిని ఇమ్మని ఎట్లడుగ గలను ? నిమివంశసంజాతులమగు మాబోంట్లకు రాజ్యమా లక్ష్యము? అతడు అమలినయోగాశ్రయుడు. అతనివద్ద ఉత్తమమైన యోగవిద్య గైకొనుట గొప్పదా? రాజ్యం గైకొనుట గొప్పదా? చాలు చాలును మీ యోచనలు. ''అని కంచె వెడలివచ్చి, కేశిధ్వజుని చూచి ''గురుదక్షిణ తప్పక యిచ్చెదవా.'' అంటే ''తప్పక ఇవ్వగలను'' అన్నాడతడు. ఖాండిక్యుడది విని ''అయ్యా నీవు అధ్యాత్మరదుడవు. గురుదక్షిణ ఇవ్వదలచి నట్లయితే సకలక్లేశ నాశనమైనది ఏదో ఆ విద్య నాకు బోధించు'' అన్నాడు. కేశిధ్వజుడు నవ్వి ''ఆహా! నిష్కంటకమైన నా రాజ్య మడుగక ఇది యెందు కడిగావు? క్షత్రియులకు రాజ్యంకంటె ప్రియమైనది ఉన్నదా?'' అన్నాడు. ఖాండిక్యుడు ''రాజా ! నేను రాజ్యం అడుగకుండుటకు కారణం విను. రాజ్యతృష్ణ అవివేకికి కలుగుతుందిగాని వివేకికి కలుగదు. పరాక్రమంవల్ల శత్రుల జయించటం, ప్రజలను రక్షించటం రాజుకు ధర్మములే అయినప్పటికీ ముందే నీచేత జయింపబడితిని గావున రాజ్యపాలన యందసమర్థుడు నయితిని, అందువల్ల ఆ ధర్మపరిపాలనా విసర్జన దోషం నన్నంటదు. పైగా రాజులు ఇచ్చువారుగాని పుచ్చుకొనువారు కాదు గదా? ఒక వేళ పుచ్చుకొన్నను ఆ భూమి భోగయోగ్యమేగాని ధర్మయోగ్యము కాదు. ధర్మయోగ్యము గాని ఈ రాజ్యభిక్ష నాకు అనర్హమని యెరుగుదును. అందువల్ల రాజ్య మడుగుటకు నే నంగీకరింపను. మమకారం వదలని మూఢమతులవలె పండితులు రాజ్యమునకు ఆశపడుదురా? మమకార ముడిగిన మావంటివారికి రాజ్య మెందుకు'' అన్నాడు.

కేశిధ్యజు డది విని పరమానందభరితుడై ఇల్లా అన్నాడు. ''నేను స్వాభావికమైన బ్రహ్మనిష్ఠనుండి కలిగిన ప్రమాదమును దాటగోరి అందుకు సాధనంగా యజ్ఞ యాగాదులు చేస్తూ వున్నాను. అయినా పూర్వకృతకర్మఫలము సంసారమును బలపరచు చుండ లేదా? దానినుండి ముక్తియెక్కడిది? అంటే ఆ ఫలమును భోగముచేత క్షయమొందించుటకై రాజ్యం ఏలుతూవున్నాను. ఓ మనుజపరా! మన యీ నిమివంశము అతిపావనమైనది. ఆ వంశమున జన్మించిన మహాభాగ్యవశముననే నీకు తత్త్వ వివేచన చింత కలిగినది. చాలా సంతోషం. నీకిక తత్త్వబోధ చేస్తారు. శ్రద్ధతో వినుము'' అని చెప్పి శ్రద్ధాభక్తిసమన్వితుడగు ఆ ఖాండిక్యునకు ఆత్మతత్త్వమంతా బోధించి అతడు వలదన్నను వినక అతని రాజ్యమంతా (అంటే ఖాండిక్యుని రాజ్యం) గురుదక్షిణగా ఇచ్చాడు. అయినను ఖాండిక్యుడు ఏ మాత్రమూ మమతను చెందక, బాలుడగు తన కుమారుని రాజుగా చేసి, మంత్రిప్రధానుల కాతని నప్పగించి తాను ఆ వనమునందే ధర్మపత్సీ సమేతుడై తపోనిష్ఠతో నిలిచిపోయాడు. కేశిధ్వజుడున్నూ చాలరోజులు మంత్రులతో సహా వారి రాజ్యమున నిలిచి, తన రాజ్యమునకు తాను వెళ్ళి, ఆత్మవిద్యాతత్పరుడై కొంత కాలమును గడపి స్వాత్మలో లీనమైనాడు. ఈ కథంతా విష్ణుపురాణంలో వివరంగా ఉన్నదని భగవా& చూచి చెప్పే ఉన్నారు గదా? ఆ తత్త్వబోధ వివరం తెలుసుకొన దలచినవారు విష్ణుపురాణం చూడగలరని మనవి.

Naa Ramanasrma Jeevitham    Chapters