Naa Ramanasrma Jeevitham    Chapters   

33. కణితి

1949 ప్రారంభంలో శ్రీ భగవానుని ఎడమ మోచేతికి పైభాగంలో వెనుక ప్రక్కన పులిపురికాయవలె ఒక కణితి కనుపించి క్రమంగా ఎదుగుతూ 1-2-49 నాటి కది గోలీ కాయంత లావయిందట. ఇంకా పెరిగితే శ్రమ కలిగిస్తుందని తోచి శస్త్రచికిత్స చేద్దామని ఆశ్రమ వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టరు శంకరావున్నూ రిటైర్డ్‌ సర్జన్‌ శ్రీనివాస రావున్నూ కలిసి యోచించి, ఒక దినం శ్రీవారితో మనవి చేస్తే ''నా కేమీ బాధగా లేదే. ఉంటే వుండేసి పోతుంది. దాన్నెందుకు కదల్చటం'' అన్నా రట భగవాన్‌.

ఆ కణితి రోజు రోజు ఎదగటం చూచి డాక్టర్లకు భయం తోచిందట. వారు ఆదుర్దాతో భగవానుని సమీపించి ''ఇది రోజురోజు ఎదుగుతున్న దే. శస్త్రచికిత్స చేయాలి'' అన్నారట. ''ఎదిగితే ఎదుగుతుంది. మన కేమి? దాని పని అది చూచుకుంటుంది. మన మెందుకు కదల్చటం?'' అన్నారట భగవాన్‌. ''ఇంకా ఎదిగితే కష్టం. కాదా? ఇప్పుడే తీసివేస్తే పోతుంది.'' అన్నారట డాక్టర్లు. భగవాన్‌ తలపంకిస్తూ ''ఓహో! పోతుందా?'' అని పలికి వూరుకున్నారట.

ఇరువది రోజుల క్రిందట కుంభాభిషేక సామగ్రి సమకూర్చడానికయి మద్రాసుకు వెళ్ళి వున్న సర్వధికారి నిరంజ నానందుల రాకకు ఎదురుచూస్తు, కొద్దిరోజులు ఆపరేషన్‌ ఆపారట డాక్టర్లు. 8-2-49 న వచ్చారు. వెంటనే డాక్టర్లు పై సమాచారం చెప్పి, వారి ఒప్పుదలమీద 9 వ తేదీ ఉదయం అల్పాహారానంతరం గోశాల వెనుకకు వెళ్ళిన భగవాన్‌తోనూ అక్కడే మనవిచేసి, శ్రీవారు తిరిగి వచ్చే సమయంలో న్నానాల గదికి పిలుచుకొని వెళ్ళి ఆపరేషన్‌ చేస్తూ వుండగా, సుబ్బలక్ష్మమ్మ నా వద్దకు వచ్చి ''భగవాన్‌ ఒంటి మీద కత్తిపెట్టి కోస్తున్నారే వీళ్ళు. ఎంత తొందరో చూచావా?'' అని కళ్ళనీళ్ళు కారుస్తూ చెప్పింది. ''అదేమిటమ్మా?'' అంటూ విషయం విచారిస్తే పై సమాచార మంతా తెలిసింది. 1948 నవంబరులో నేను మన వైపుకు వెళ్ళి వుండడంవల్ల ఈ కణితిని గుణించి అంతవరకూ నాకు తెలియదు. సెగకురు పేమో ననుకొన్నానే గాని మన కడుపులో సెగపెట్ట వచ్చిన మారియని తెలియక ''ఎందుకమ్మా అంత భయం? సెగకురుపేమో?'' అన్నాను. ''కాదమ్మా. ఏదో కణితిట. 'వుంటే వుండేసి పోతుంది. బాధా లేదాయె. కదల్చడం ఎందు' కని భగవా& అంటూ వుంటే 'అట్లా వదలితే ప్రమాద' మని ఆపరేషన్‌ చేస్తున్నారు. అసలు భగనా& శరీరం మీద కత్తి పెట్టవచ్చునా? అన్నా దామె నాకున్నూ శరీరం కంపించింది.

ఇంతలో కట్టుకట్టిన చేతిమీద తుండు కప్పుకొని భగవాన్‌ బయటికి వచ్చి స్వర్ణోత్సవ పర్ణ శాలలో వున్న ఱాతి సోఫామీద కూర్చున్నారు. ముఖం వాడివున్నది. చూడగానే చివుక్కుమన్నది. ఏమడిగందుకూ వీలుకాక యథాస్థానంలో కూర్చున్నాను. కాస్సేవయ్యేసరికి కట్టు రక్తంతో తడిసింది. జ్ఞానుల రక్తబిందువులు చింది భూమిమీద పడితే దేశారిష్టమనీ, ఆ దేశంలో అనావృష్టిదోషం కలుగుతుందనీ పెద్దలవల్ల వినడమేకాక భారతంలో గూడా చెప్పబడివున్నది. కుంభేభిషేకానికి ముందుగా ఈ రక్తపాత మేమా అన్న యోచనలతో నా చిత్తం చింతాకుల మయింది.

కట్టు ఎవరికీ కనుపించరాదు. కప్పుకునేందుకు కండువావున్నదా? తొడుక్కునేదుకు చొక్కా వున్నదా! అర్ధ గజం వెడల్పూ ముప్పాతిక గజం పొడుగూ వుండే తుండు గుడ్డయే కదా శ్రీవారి దుకూల వస్త్రం. దానితోనే కట్టు కనుపించకుండా చలికంఠం కట్టుకున్నట్లు కట్టుకునే వారు భగవాన్‌. సందుల్లో నుంచి ఎవరి కళ్ళనైనా పడేది. చొరవ గల వాళ్ళు కొందరు ''చేతి కదియేమి&?'' అంటే భగవాన్‌ నవ్వుతూ దండకడియం పెట్టుకున్నా ననీ లింగం పుట్టిం దనీ ఇది స్వయంభులింగ మనీ అనేవారు ఛలో క్తిగా.

ఆ రోజుల్లోనే వచ్చేపోయే జనంలో కొందరికి వీపు మీదా, తలమీదా, మెడమీదా నిమ్మకాయంత, వెలక్కా యంత కణుతులు వుండటం చూచి భగవాన్‌ తమ సమీపస్థులకు వారిని చూపి ''అదుకో వారికి చూడు. ఎం తెంత కణుతులున్నవో. మనదీ అటువంటిదే. అది వారినేం జేసిందీ? ఇదిన్నీ అట్లాగే వుంటే వుండేసిపోతుందయ్యా, వుండనీయండంటే వదల్లేదు'' అనిన్నీ అంటూ వచ్చారు.

ఆ వెనుక కొద్దిరోజులకే కట్టు విప్పారు. గాయం మానుపడుతున్నదనిన్నీ అన్నారు. మచ్చపడితే మళ్ళీరాదట, కాని ఎన్నాళ్ళకూ ఆ జాడ కనుపించలేదు. మధ్య మధ్య ఆ చెయ్యి సవరించుకుంటూనే వున్నారెందుకో. మొత్తం మీద కుంభాభిషేకం సందడిలో ఈ విషయాన్ని అంతగా ఎవరూ పాటించుటకు వీలుకాలేదు. భగవాన్‌ శరీరం బాగా ఆరోగ్యంగా వున్నదనే చాలామంది అభిప్రాయం. నాకూ నా వంటి వారింకాకొందరికీ మచ్చపడలేదే ఏమా అన్న సందేహం బాధిస్తూనే వచ్చింది. కాని పోని తలపులతో కలతపడటం ఎందుకని ధైర్యం తెచ్చుకుంటూ వచ్చాము.

Naa Ramanasrma Jeevitham    Chapters