Naa Ramanasrma Jeevitham    Chapters   

35. జరిగేది జరగనే జరుగుతుంది

24-3-49 నుండి కృష్ణభిక్షువు రమణలీల చదివారు ఆ వెనుక 26-3-49 సాయం కాలం గోశాలవైపు నుండి వచ్చి భగవాన్‌ సోఫామీద కూర్చుండగానే నూతను లెవరో వచ్చి నమస్కరించారు. ఆ వచ్చిన వారి మెడమీద నిమ్మకాయంత కణితి వున్నట్లు అందరికీ గోచరించింది. భగవా నది పరిశీలనగా ఛూచి మా అందరి వైపు తిరిగి ''అదుగో! వారి మెడమీద ఎంత కణితి వున్నదో ఛూచారా? మన చేతిదీ అంతే. ఒత్తితే తప్ప నొప్పిలేదు. మన్నేమీ బాధించడం లేదు గదా, ఉంటే వుండేసి పోతుందంటే వినరు, కోస్తారట, ఏం జేసేదీ?'' అన్నారు.

ఏదిగానీ భగవాన్‌ సుముఖంగా మాట్లాడితే బాధకం లేదుగాని ఇట్లా మాట్లాడుతుంటే ఇదేం సుఖపడుతుందా అని నా బెంగ. భగవా& ఇట్లా సెలవిస్తున్నారని ఆఫీసులో ఎవరైనా చెప్పి ఆపరేషన్‌ ఆపితే బాగుండునని అల్లాడుతానే గాని ఆ సాహసం ఎవరి కున్నది? నేనే వెళ్ళి చెప్పి చూద్దా, మంటే ''ఇప్పుడు మనం చెపితే వినరు. ఈసారికి పోనిమ్మని' భగవా& సెలవిచ్చారు గదా. ఏతావతా పచ్చకామెర్లనాటి వలె భగవానే గట్టిగా వద్దని చెప్పరాదా? అనీ, ఏ కారణం వల్లనైనా డాక్టర్లు రావడం ఆగిపోతే బాగుండునే అని రాత్రంతా మనస్సులో కల్లోల పడ్డాను.

తెల్లవారింది. యథాప్రకారం ఏడున్నగకు భగవాన్‌ సన్నిధికి వెళ్ళి కూర్చున్నాను. తిరుచ్చుళికి వెళ్ళి వచ్చిన గి. సాంబశివరావుగారున్నూ కూర్చున్నారు. ఇష్టాగోష్ఠిగా తిరుచ్చుళి సమాచారాలు మాట్లాడుతూ వుంటే ఎనిమిదింటికే పోష్టు వచ్చింది. భగవాన్‌ చూచి పంపిన వెనుక ''ఇవాళ పోష్టు ఇంత త్వరగా వచ్చిందేమి?'' అన్నా రొక భక్తులు. ''పట్నంనుండి డాక్టర్లు వస్తారట. సిద్ధంగా వుండవద్దూ?'' అన్నారు భగవాన్‌. నా గుండె ఝల్లుమని ''వస్తారా?'' అన్నాను అప్రయత్నంగా. ''ఊ. అంతా తయారు చేస్తున్నారు. వాళ్శెందుకు విడుస్తారు'' అన్నారు భగవాన్‌. ఎవరి నోటా మాటలేదు. పావుగంటకల్లా యస్‌. దొరసామయ్య రుతోసహా డాక్టర్లు వచ్చి భక్తితో ప్రణమిల్లి ''ఆసుపత్రికి పోదుమా?'' అని శ్రీవారి నడిగారు. ''ఊ.ఊ'' అంటూ తల వూపి ఊరుకున్నారు భగవాన్‌.

వా రటు పోగానే భగవా& నన్ను చూచి ''అరుగో! డాక్టర్లు వచ్చారు'' అన్నారు. నివ్వెరపడుతూ వూరుకున్నా నేను. సాంబశివరావుగా రందుకొని ''నెల్లూరునుండి పట్టీలమందు వచ్చిందే పోష్టులో'' అన్నారు. ''వచ్చింది. ఏం జేసేదీ? అరుగో! వచ్చారే వారు. కోస్తారట. పట్టీలు రెండు రోజులే వేశాము. ఇంతలో వారు వచ్చి కోస్తామని మూహూర్తం పెట్టి వెళ్ళారు. ఇక ఇదెంతుకని మానేశాము. ఉండనీయండి. ఎవరికైనా ఉపయోగిస్తుంది. మనకు కోత సిద్ధంగా వున్నదే. ఇదెందుకు?'' అన్నారు భగవాన్‌. భగవాన్‌ ఈ విధంగామాట్లాడు తున్నారు గదా. ఇప్పుడైనా ఆపరేషన్‌ వద్దని ఆపుతారేమోనని వెఱ్ఱి ఆశ పీడిస్తూనే వున్నది నాకు. ఇంతలో అంతా తయారయిందంటూ ఆసుపత్రినుండి వచ్చా రొకరు. భగవాన్‌ కాళ్ళు సవరించుకోవటం చూచి నా ఆశ వదలి ''జరిగేది జరుగుతుంది. జరుగనిది జరుగనే జరుగదు అన్న ఉపదేశం ఈ విషయంలో గూడా ఆచరణరూపంగా చూపుతున్నారే భగవా&'' అన్నాను దీనంగా. భగవా& దృఢస్వరంతో ''అవును జరిగేది జరగనే జరుగుతుంది. మనం వద్దన్నా ఆగదు. కానీ, ఎట్లాగన్నా కానీ'' అంటూ సోఫాదిగి గోశాల వైపుకు వెళ్ళి తిరిగి రావటం ఆసుపత్రికే వెళ్ళారు.

మత్తు ఇవ్వకుండానే ఆపరేష& చేస్తారని అటూ యిటూ తిరుగుతున్న వారివల్ల వింటూ, ఆసుపత్రి వైపేచూస్తూ అంతా జూబ్లీ హాల్లోనే కూర్చున్నాం. ఆపరేష& అయి కట్టు కట్టేసరికి పదకొండు గంటలయింది. ఆసుపత్రి నుండి భోజనశాలకు భగవా& వెళ్ళుతూ వుంటే చూచి ఉన్న వాళ్ళం ఉన్నట్లే ఉన్న చోటనే నమస్కరించి అంతా కుటీరాలకు చేరుకున్నాం. భోజనానంతరం పట్నం డాక్టర్లు వెళ్ళి పోయారు. నాకు ఏమీ తోచక రెండింటికే ఆశ్రమానికి వెళ్ళి కృష్ణయ్య రమణలీల ఆ నాటికి చదవడం ఆపినట్లు తెలుసుకొని భగవా& సన్నిధికి వెళ్ళాను ముఖమంతా డస్సి వున్నది. శ్రమ గదా అని విశ్రాంతిగా పడుకుంటారా యేమన్నానా. యథాప్రకారం సోఫామీద కూర్చునే వున్నారు. ఆ ఱాతిసోఫాకు ప్రక్కన ఆనుకునేందుకై నా లేదు. వెడల్పూ తక్కువే. చేతికా కట్టు, కదిలేందుకు లేదు మెదిలేందుకు లేదు. హాలులో వున్న సోఫా తెచ్చి వేస్తామన్నా ఒప్పుకోలేదు. ఆ ఱాతి సోఫామీదే రాత్రింబవళ్ళు వుంటూ వచ్చారు భగవా&. కార్యక్రమంలో ఏమైనా మార్పిడిచేసి విశ్రాంతి తీసుకున్నారా అంటే అదీలేదు. యథాప్రకారం అన్ని కార్యక్రమాలూ నడుస్తునే వున్నవి. అడిగే ప్రశ్నలకూ చెప్పే ప్రత్యుత్తరాలకూ అంతే లేదు. ''ఎట్లాగున్న'' దని ఎవరైనా అడిగితే ''ఏమున్నదీ? ఇప్పుడేమీ లేదు. అంతా సరిపడి పోతుంది'' అని ఎగరగోట్టేస్తూ వచ్చారేగాని ఏ మాత్రం బాధ బయటికి కనుపరచలేదు.

Naa Ramanasrma Jeevitham    Chapters