Naa Ramanasrma Jeevitham    Chapters   

36. ఎవరు గెలుస్తారో చూద్దాం

భగవాన్‌ మేనత్తకొమారుడు రామస్వామిగారున్నారు గదా. వారి భార్య అమ్మాళుమ్మ కుంభాభిషే కానికి వచ్చి భగవానుకు ఆపరేషన్‌ అయిన వెనుక గూడా కొద్దిరోజులున్నది. 7-4-49 ఉదయాన ఎనిమిదింటికి ఆ పండు ముత్తైదువ భగవాన్‌ సన్నిధికి వచ్చి నమస్కరించి తమ వా రెవరికో జబ్బుగా వున్నదనీ తా నక్కడికి పోవలెననీ మనవి చేసింది ఆమెకు గొంతుకు పై భాగంలో నిమ్మకాయంత కణితి వుండటం భగవాన్‌ గమనించి చూచి ''సరే. వెడుదువుగాని కాని నీ గొంతుపైన వున్నదే అదేమిటి?'' అన్నారు. ''ఏమో తెలియ లేదు. ఆ విధంగా ఎదుక్కొని వస్తున్నది'' అన్న దామె. ''బాధ ఏమీ లేదా?'' అన్నారు భగవాన్‌. ''ఒత్తితే తప్ప బాధ ఏమీలేదు. రోజు రోజు ఎదుగుతున్నది అన్నదామె.'' ఓహో, సరి సరి అంటూ సమీపస్థులను చూచి ''అదిగో! ఆమెకు చూడండోయ్‌ ఎట్లా ఎదుగుతున్నదో, ఓత్తితే తప్ప బాధ ఏమీలేదట. మన చేతికి వచ్చినటువంటిదే అదీను. ఆ నెల్లూరు నుండి వచ్చిన పట్టీల మందువేస్తే దానికన్నా నయమౌతుందేమో?'' అన్నారు భగవాన్‌. ''తెస్తునా'' అన్నా రాభక్తులు, ''ఊ.ఊ తీసుకొనిరా. మంచి మందట. దానికన్నా నయం కానీ, మనకు ఆపరేషన్‌ అయిందిగా'' అన్నారు భగవాన్‌.

ఆ భక్తుడు వెళ్ళి మందుడబ్బీ తెచ్చాడు. భగవాన్‌ అది చేత్తో పట్టుకొని నా వైపు తిరిగి ''ఇదుగో మందు. ఆమె కివ్వండి. దానికన్నా నయంకానీ'' అని అంటూ వుండగానే ఆమె కొమారుడు విశ్వనాథబ్రహ్మచారి వచ్చాడు. భగవాన్‌ వారిని పిలిచి, ''ఇదిగో, ఇది అమ్మ కివ్వవోయ్‌. మనకు కోత అయిందిగా. ఇక ఇదెందుకు? దానికన్నా నయంకానీ'' అంటూ ఆ డబ్బీ యిచ్చారు. వారది తెచ్చి తల్లి కిస్తే మహాప్రసాదంగా గ్రహించింది. ఆ వెనుక ఆమెకు ఆ పట్టీలూ, పచ్చాకులూ, పాలవత్తులూ వేయడంవల్ల ఆ కణితి కరిగిపోయిందట. మాకు మాత్రం ''దానికన్నా నయంకానీ'' అన్న భగవాన్‌ వాక్కు అశనిపాతంవలె గుండెల్లో గుచ్చుకొని బాధించింది.

''దానికన్నా నయంకానీ'' అంటే తమకు తగ్గదనా అర్థం. ''ఈ సారి మొదలంటా తీసివేశాం. ఇక రా'' దని డాక్టర్లంటూ వుంటే ఈ వాణి ఇట్లా పలుకుతున్న దేమా అన్న తలపోతలతో నా తల తిరిగిపోయింది.

ఈ ఆపరేష& అయిన వారంలోనే టి.పి. యార్‌ వస్తే వారిని భగవాన్‌ సేవకు నియమించి యస్‌. దొరనా మయ్యరు మద్రాసు వెళ్ళారు. టి.పి. యార్‌ భగవానుని విడువకుండా సంచరిస్తుంటే భగవాన్‌ నవ్వుతూ నన్ను చూచి ''ఇదుగో! ఇదివరకున్నవారు చాలరని వీరిని గూడా మనకు కాపలా పెట్టారు. వీరు వా రిందరికీ తనిఖీదార్‌. ఇనస్పెక్టరన్న మాట'' అనిన్నీ అప్పడప్పుడు హాస్యంగా అంటూ వచ్చారు. రెండు వారాలు గడిచినా భగవాన్‌ చేతిపుండు మానుపట్టిన జాడ కనుపించకపోగా ఏదో భారంగా వున్నట్లు తోచసాగింది. టి. పి. యార్‌ 1949 ఏప్రియల్‌ రెండవ వారంలోనే పట్నం వెళ్ళుతానని చెప్పి ఇంకా వెళ్ళకపోగా ఏదో విచారంగా ఉన్నట్లు గోచరించడమే కాక ఆశ్రమాధి కారులంతా అక్క డక్కడ చేరి గుస గుస లాడుతూ వుండటం వల్ల సందేహం కలిగి 22-4-49 సాయంకాలం భగవా& బయటికి వెళ్ళిన సమయంలో టి. పి. యారును కలుసుకొని ''పట్నం వెడతానని వెళ్ళలేదే? భగవా& చేతిపుండు ఎట్లా గున్న దేమిటి?'' అన్నాను. వారు జూబ్లీ హాలు నానుకొనివున్న మైదానంలోకి చల్లగా దారితీసి రహస్యంగా ''ఏం జేప్పేదమ్మా. కుట్టిన కుట్లల్లో రెండు వూడినవి. తద్ద్వారా రక్తం స్రవిస్తూ వున్నది. మళ్ళీ లోపల ఎదుగుతున్న దేమోనని అందరికీ సందేహంగా వున్నది. అందువల్ల వెళ్ళలేదు'' అన్నారు. ''నేనూ అదే అనుమానించాను. అట్లాగే అయిందా?'' అంటూ విచారంతో ఇవతలకు వచ్చాను.

''ఈసారి వస్తే మనం చూచుకుందాంలే'' అని భగవాన్‌ సెలవిచ్చి వున్నారు గదా. ఇక తమ వైద్యం చూచుకుంటారేమోనన్న ఆశ వున్నప్పటికీ లోపల ఏదో భయంపీకుతునే వున్నది. ఇంతలో భగవా& వచ్చికూర్చుని నావైపు వరకాయించి చూచారు. ఆ చూపుతోనే నా మనోవేదన గ్రహించి మౌనంగా వూరుకున్నారు. ''జరిగేది జరుగుతుంది, జరగనిది జరగనే జరగదు'' అన్న భగవానుని ఉపదేశ##మే స్మరణకు తెచ్చుకుంటూ నేనూ మాట్లాడలేదు.

ఆ వెనుక ఒకటి రెండు రోజుల్లో ఆ కణితి మళ్ళీ ఎదుగుతూ రక్తం స్రవిస్తూ వున్నదన్న విషయం ఆనోటా ఆనోటా పడి అందరికీ తెలిసింది. చొరవగల భక్తులో లొకరు శ్రీవారిని సమీపించి ''ఆ కురుపు ఇంతచేసిన్నీ మళ్ళీ సెలవేసిందటే'' అన్నారు మెల్లిగా. ''ఆ.ఆ. అవును, అసలు మొదలది పులి పురికాయంత వున్నది. ఉంటే వుండేసిపోతుంది. పోనీయండఱ్ఱా అంటే కాదు కూడదని కోశారు. అంతకన్న పెద్దదిగా ఎదిగింది. అదీ కోశారు. మీ పని ఇట్లాగున్నదా? అని ఇంకా పెద్దదిగా ఎదుక్కొని వస్తున్నది. వీరు యస్‌. దొరసామయ్యరుకు వ్రాశారు. వారు రేడియం సూదులు వేసి కట్టేందుకు ఎవరినో తీసుకొని నాల్గయిదు రోజుల్లో వస్తారట. చూద్దాం ఎవరు గెలుస్తారో?'' అన్నారు భగవా&.

ఈ సారి వస్తేమనం చూచుకుందామని సెలవిచ్చారు గదా భగవా&. మళ్ళీ ఇదంతా ఎందుకా అని నాలో నేననుకున్నాను. నిజంగా ''మావల్ల కాదు, భగవానే ఏదైనా చూచుకోవలసిందని'' అంతా కలిసి ప్రార్థిస్తే తామే చూచు కుంటారేమోననీ కేవలం అట్లా కాకుంటే ఆయుర్వేద వైద్యు లెవరినైనా అడ్డం పెట్టుకొని వచ్చ కామెర్ల నాటివలెనే ఏదో మందు చేయించుకొని తిని నయం చేసుకుంటారేమోననీ నా ఆశ, ఆ ఆశకు అవకాశం కలుగలేదు.

Naa Ramanasrma Jeevitham    Chapters