Naa Ramanasrma Jeevitham    Chapters   

4. శరణాగతి

భగవాన్‌ తెలుగు వారితో తెలుగే మాట్లాడుతారని లోగడనే విన్నాను. నే నున్న ఆ పది రోజులలో తెలుగు వ్రాయడమూ చదవడమూ కూడా తెలుసునని తేలింది. కొందరు భక్తులు ఏదో వ్రాసి శ్రీవారికి అందీయడమున్నూ చూచాను. వారంతా పండితులు కారు. సామాన్యులే. అందులో కొందరు స్త్రీలున్నూ వున్నారు. అందువల్ల ఫరవాలేదని శరణాగతి పద్యాలు ఎనిమిది వ్రాసి ఆ కాగితం శ్రీవారి కీయుటకు జంకి వారు బయటికి వెళ్ళినప్పుడు సమీపవర్తిగా నున్న మాధవస్వామి కిచ్చి బయటికి వచ్చాను. భగవా& తిరిగి వచ్చి కూర్చున్న వెనుక మాధవస్వామి ఆ కాగితం ఇస్తే సావధానంగా చూచి, మాధవస్వామితో ''ఏమోయ్‌! ఆమె పేరు నాగమ్మట. ఇవి శరణాగతి పద్యాలు. పుస్తకంలో అంటించు'' అని ఆ కాగితం ఇస్తే, స్తోత్రాలన్నీ అంటించిన పెద్ద బైండు పుస్తకంలో అంటిస్తూ ''రామస్వామి అయ్యరున్నూ శరణాగతి వ్రాశారు గదూ?'' అన్నారు మాధవ స్వామి. ''అవునవును. వారు పాటగా వ్రాస్తే ఈమె పద్యాలు వ్రాసింది.'' అన్నారు భగవాన్‌. నాకెంతో సంతృప్తి కలిగింది. భగవాన్‌ సన్నిధిలో గొప్ప గొప్ప పండితు లుంటారు గాబోలు, మనమూ మన చదువూ, మన కవిత్వమూ ఏం పనికి రాగలవని అనుకున్న నాకు కొంచెం ధైర్యం గూడా వచ్చింది.

మరి నాల్గురోజులకు ''ఆశ్రమం - మహర్షి'' అనే శీర్షికతో మూడు పద్యాలు వ్రాసి వెనుకటి వలెనే శ్రీవారి కందించాను. భగవాన్‌ అప్పుడు ఏమీ చెప్పలేదు. మరు దినం మాధవస్వామి హాలు వెలుపల దుప్పట్లు దులుపుతూ వుంటే ''స్వామీ! నిన్నటి పద్యాలు ఏం జేశారు?'' అని మెల్లిగా అరవంలో అడిగాను. భగవానుకు వినిపించలేదని నా వూహ. ''పుస్తకంలో అంటించా మమ్మా'' అన్నారు. మాధవస్వామి. సరేనని హాల్లోకి వెళ్ళి నమస్కరించి లేవగానే ''మీరు అరవం ఎల్లా వచ్చింది?'' అన్నారు భగవా& చిరునవ్వుతో. నాకు విస్తుబోయినట్లయింది. గుక్క తిప్పుకొని ''మా చిన్నన్నగారు సెంట్రల్‌ బ్యాంకులో పనిచేస్తున్నారు. వారు కోయంబత్తూరు, ఎర్నాకొలం, అలప్పి అటంతా తిరుగుతూ వుంటే, వారి కుంటుంబంతో నేనూ అప్పుడప్పుడు తిరగటంవల్ల మాట్లాడటం వచ్చింది'' అన్నాను. అదే శ్రీ భగవానునితో నాకు జరిగిన ప్రథమ సంభాషణ. భగవాన్‌ సన్నిధిలో నా వంటి అల్పజీవికి ఆశ్రయం లభింప గలదా? అన్న తలపోతలతో వున్న నన్ను తాముగా పలుకరించి మాట్లాడిన ఈ సంభాషణవల్ల బ్రహ్మానంద సముద్రంలో మునిగినట్లయింది నాకు. ఎల్లాగో తమాయించుకొని యథాస్థానంలో కూర్చున్నాను. ఐహికంలో అనురాగమున బంధించే ముఖ్య ప్రేమాస్పదులు (అంటే తల్లీ, తండ్రీ, భర్తా, బిడ్డలూ) అతి బాల్యం. లోనే అంతరించటంవల్లా, ఆధ్యాత్మిక జీవితానికి అవలంబన చిక్కనందువల్లా దారం తెగిన గాలిపటం వలె అల్లాడుతూ వున్న నా మనస్సు శ్రీ భగవానుని అలౌకికమైన కృపావీక్షణ మనే పాశంలో చిక్కి చల్ల చల్లగా లాగబడుతూ శ్రీవారి పాదపద్మములందు బంధింపబడుతున్నట్లు స్ఫురింప నారంభించింది. అబ్బ! అంతటితో నా తల నున్న భారం దింపినట్లయింది.

అప్పటికి ఆశ్రమానికి వచ్చిమూడు వారాలు గడిచినవి. ఈ మూడు వారాలలో భగవాన్‌ వద్ద భక్తుల కుండే స్వతంత్రమూ, వా రడిగే ప్రశ్నలూ భగవాను డిచ్చే ప్రత్యుత్తరాలూ విన్న కొద్దీ జన్మ తరింపజేయగల శ్రీగురు డీతడే నన్న విశ్వాసం కుదిరి, ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని అనన్యశరణాగతి చెందవలెనన్న దృఢనిశ్చయం కలిగింది. గీతా నవ మాధ్యాయం 22 వ శ్లోకంలో

''అనన్యా శ్చిన్తయన్తోమాం యేజనాః పర్యుపాసతే |

తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం వహామ్యహం ||

అనిగదా చెప్పారు. ముందు మనం అనన్యచింతతో సేవిస్తే గదా వెనుక వారు మన యోగక్షేమాలు నెత్తిన వేసుకోవడం? అందువలన అనన్యచింతతో శ్రీగురు సన్నిధిని సేవచేద్దామని తోచింది. విజయవాడలో పెద్ద వదినెగారికి ప్రసవ సమయం సమీపించింది. పురిటి వేళకు తిరిగి రాగలనని చెప్పి వచ్చాను. తెచ్చినజొన్న నూక వగైరా సామగ్రిన్నీ అయిపోయింది. ఇప్పటికిక వెళ్ళి ఇక్కడే వుండిపోయే ఏర్పాటుతో తిరిగివద్దామనితోచి, భగవాన్‌ అనుజ్ఞపొందకుండా బయలు దేరేందుకు మనస్సొప్పక చిన్న చీటీలో తమ సన్నిధి విడిచి వెళ్ళుటకు మనస్సొప్పకున్నా మావాళ్ళతో అన్నమాట నిలుపుకోవాలని బయలుదేరుతున్నాను. త్వరలో తిరిగివచ్చునట్లనుగ్రహింపవేడెదను.'' అని వ్రాసి శ్రీవారి చేతికే అందించాను. ''సరే'' నన్నట్లు తలవూపి ఆ కాగితం మడచి షెల్ఫులో పెట్టారు భగవాన్‌.

Naa Ramanasrma Jeevitham    Chapters