Naa Ramanasrma Jeevitham    Chapters   

49. దుశ్శకునాలు

31-1-50 తేదీన ఉదయం 9 గంటలకు యథాప్రకారం దర్శన సమయంలో భగవా& సన్నిధికి పోష్టు వచ్చింది. చూచి పంపిన వెనుక భగవాన్‌ నావైపు చూచి ''ఇదుగో! ఈ పోష్టులో ఆస్ట్రేలియా నుండి 18 మంది సంతకాలతో ఒక ఉత్తరం వచ్చంది. విషయం ఏమంటే 'భగవానుకు అస్వస్థతగా వున్నదని విన్నాము. చాలా ఆందోళనగా వున్నది. త్వరగా నయం చేసుకోవాలని మా ప్రార్థన' అని, ఇదే విషయం. 18 మంది సంతకాలు చేశారు.'' అని సెలవిచ్చారు. ''అందరి ప్రార్థనా అదే'' అన్నా నేను. ''ఊ-ఊ అంటూ వూరు కున్నారు భగవాన్‌.

9-2-50 తేదీకి తిరిగి కురుపు నెలవేసినట్లు తెలిసింది. చొరవగలవారెవరుగానీ ఎట్లాగైనా నయం చేసుకోవాలని భగవానుని ప్రార్థిస్తే ''నేనేం జేసే'' దనీ ''నాదే మున్న'' దనీ భగవాన్‌ సెలవిస్తూ వుండటంవల్ల దేవతా ప్రార్థనలు చేసి చూద్దామని కొందలరు స్త్రీలు 14 వ తేదీనుండి మండలం లెక్కన లలితా సహస్రనామ పారాయణం ప్రారంభించారు. 15-2-50 తేదీన రాఘవాచారి వచ్చి చూచి ''ఇక ఏమీ చేసేందుకు లేదనీ అనవసరంగా ఆ మందులూ ఈ మందులూ వాడి పథ్యపానాదులతో భగవాన్ను బాధింపవద్ద''నీ చెప్పి వెళ్ళిపోయాడు.

అయినా కొందరు భక్తులకు ఆయుర్వేదం ఋషీప్రోక్తం గనుక ఆ వైద్యం చేస్తే భగవాన్‌ సంకల్పం తెచ్చుకొని పచ్చకామెర్లనాటివలెనే ఏవొ మూలికలు చెప్పి చేయించుకుంటారేమోనన్న భ్రాంతి వదలక లక్ష్మీపతిని రప్పిస్తే మంచిదనికొందరూ మూసయితేబాగని మఱికొందరూ సూచిస్తూ కె.కె. నంబియారును పురస్కరించుకొని ''మూసును తీసుకొని వస్తా'' మని శ్రీవారి నడిగితే ''ఇంకాకొద్దిరోజులు ఈహోమియో వైద్యమే చూద్దాము'' అన్నారు భగవాన్‌. 16, 17 తేదీలలో విపరీతమైన వార్తలు బయలు దేరినవి. ఏమంటే భగవాన్‌ శరీరం బాగుండలేదని విని గుంపులు గుంపులుగ డాక్టర్లు వచ్చినట్లే జ్యోతిష్కిలున్నూ వస్తూపోతూ వుండేవాళ్ళు. వాళ్ళంతా భగవాన్‌ చరిత్రలోని జాతక చక్రం చూస్తు గ్రహస్థితి ఏమీ బాగుండలేదని అంటూ వుండేవాళ్ళు. ఫిబ్రవరి 16, 17 తేదీలలో ఎక్కువ రోజులు గడవదనిన్నీ గుసగుసలాడసాడగారు. అది వనీ చూచీ ఆదుర్దాగా వున్న నావద్దకు 18 వ తేదీన ఒక ముసలమ్మ వచ్చి విచారంతో ''రెండు వారాలకన్న భతవాన్‌ వుండరని డాక్టర్లన్నారట'' అన్నది. నాకేమీ తోచక ఆ మధ్యహ్నాం భగవా న్నేదో అడగాలని సత్యానందంతో చెప్పి శ్రీవారి సన్నిధికి వెళ్ళాను. ఏమడిగేందుకు జంకి నిలుచుంటే ''ఏమో అడగాలంటిరే? అడగండి'' అన్నాడు సత్యానందం. ''ఏమి?'' అన్నారు భగవాన్‌. ''చెయ్యి విషయమే. మళ్ళి వచ్చిందే'' అన్నాను. ''వస్తేయేమి ? వస్తుంది పోతుంది'' అన్నారు భగవాన్‌. ఆ మాటల్లో వున్న శ్లేష గ్రహించలేక నయమౌతుందన్నారను కొని ''ఎప్పుడు పోతుందో. మా మనస్సుకు ఎప్పుడు శాంతి కలుగుతుందో తెలియడం లేదే. అంతా యేమో భయం కరంగా చెప్పుకుంటున్నారే?'' అన్నాను. ''చెప్పుకుంటే చెప్పుకొని పోతారు. పోనీ'' అన్నారు భగవాన్‌. ''అదే అడుగుతాను. డాక్టర్ల నిర్ణయంగ్రహాలబలిమీ భగవచ్ఛక్తిని ఏమీ చేయలేవు. మాకు భగవాన్‌ అభయమిస్తే చాలును''అన్నాను. నా అమాయికతకు భగవాన్‌ చిరునవ్వు నవ్వుతూ ''ఊ-ఊ'' అని తలవూపారు. అదే అభయంగా భావించి మరి మాట్లాడలేక బయటికి వచ్చేశాను.

19-2-50 తేదీన శాంతమ్మగారు ఎవరో ఆయుర్వేద వైద్యులను రప్పింతామన్న యత్నంలో అలిమేలమ్మ అత్తనుతోడు తీసుకొని భగవాన్‌ వద్దకు వెళ్ళి మనవిచేస్తే ఆమెకు ఏదో సమాధానం చెప్పి పంపి, ఆమె వెళ్ళిన వెనుక అత్తతో ''నాకు అమ్మమందువేస్తే చాలును. ఈ గొడవంతా ఎందుకు'' అన్నారట భగవా&. ''అమ్మ ఆకులతో పాలతో ఈలాంటి గడ్డలు ఎందరికో నయం చేసింది'' అని 23-3-49 తేదీన భగవా& సెలవిచ్చి ఉండటంవల్ల ఇప్పుడీ మాట వినగానే ''అయ్యో అమ్మ మందన్న నెపంతో తామే ఏదైనా చికిత్స చేసుకునేవారేమో. మించిపోయింది,'' అని అత్తవాళ్ళంతా అనుకున్నారు. 20 వ తేదీకి ఇంకా ఎక్కువైందని తెలిసింది. భక్తులంతా ఏ వైద్యమూ లేకుండా ఎందుకని మూసును రప్పించడానికి నిశ్చయించి భగవాన్‌తో మనవి చేస్తే ''ఏమో మీ యిష్టం'' అన్నారు భగవాన్‌. ఆ నాడేకుంజుస్వామి వెళ్ళి 22 వ తేదీకి మూసును తీసుకొని వచ్చారు. వైద్యానికి వచ్చిన వారందరివలెనే మూసున్నూ ''నాదేమీ లేదు. నిమత్తమాత్రమే. భగవాన్‌ కరుణించి నయంచేసుకొని మా కొఱకుగాను ఈ శరీరం కొంతకాలం నిలిపివుంచాలి'' అని ప్రార్థిస్తూ ''ఈ పుండుకు రక్తార్బుదమని పేరు'' అని చెప్పి 24 వ తేదీన వైద్యం ప్రారంభించాడు.

ఈ వైద్యం ఇట్లా సాగుతూ వుండగా 1-3-50 మధ్యాహ్నాం 2 గంటల ప్రాంతంలో నేను నా కుటీరంలో వ్రాసుకుంటూ వుండగా కలం కాగితం వణకటం ప్రారంభిస్తే తల ఎత్తి చూచాను. గోడనున్న పటాలతో సహా ఆడుతూ ఒకటి రెండు నిమిషాలు భూమి అంతా కంపించి శమించింది. భగవాన్‌ శరీరారోగ్యం సరిగా లేనప్పుడు ఈ భూకంపం ఏమిటా? అన్న ఆదుర్దాతో ఆశ్రమానికి వెడితే అక్కడందరూ ఈ విషయమే చెప్పారు. అదే గాక దొంగ భయాలూ నక్కల కూతలూ కుక్కల ఏడ్పులూ ఇత్యాది అరిష్టాలు అనేకంగా గోచరిస్తూ వున్న వాతావరణం చూచి ఏమీ తోచక 2-3-50 తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఏదో విధంగా సందు చేసుకొని భగవానుని సమీపించి ''చెయ్యి ఎట్లాగున్నది?'' అన్నాను ఆత్రతతో. భగవా& మూసు చేస్తున్న వైద్య విధానమంతా వివరంగా చెప్పి రక్తం కొంచెం కారటం తగ్గింది'' అన్నారు. ''అయితే కొంచెం నయమేనా?'' అన్నాను. ''ఊ-ఏం నయం?'' అన్నారు భగవాన్‌. ''అయ్యో! ఎంత కాలం ఇట్లా చూడగలం? త్వరగా నయం కావాలి'' అన్నాను. ''ఊ-ఏమో'' అన్నారు భగవాన్‌. ఆ మాటతీరు చూస్తే ఈ వైద్యంతో గూడా తగ్గదేమో నన్న సందేహం తోచింది. ఇంతవరకూ ఈ ధోరణి భగవానుని నోట నేను వినలేదు కాబట్టి భయం తోచి మరి మాట్లాడలేక నిరాశతో బయటికి వచ్చాను.

Naa Ramanasrma Jeevitham    Chapters