Naa Ramanasrma Jeevitham    Chapters   

52. మహా నిర్వాణం

23-3-50 తేదీన భగవానుకు శోషరావడం 24 నుండి మూసువైద్యం ఆపడం నెలాఖరుకు కలకత్తా కవిరాజు రాక ఆయన వైద్యం ఇత్యాదులన్నీ జరిగినవి. వారు ఎంతో ఖరీదుగల దివ్యౌషధాలు వాడారు. అప్పుడు ఆయుర్వేద వైద్యులూ పురాతన భక్తులూ అయిన బెంగుళూరు రామ చంద్రరావుగారు దర్శనరార్థం వస్తే వారిని ఈ మందులు కలిపి భగవానుకు ఇచ్చే నిమిత్తం ఆఫీసువారు నియమించారు. అది ఒకటి రెండు రోజులు వాడగానే శ్రీవారి శరీరానికి వేడిచేసి మల ప్రవృత్తి కాకుండా బాధ కలిగించింది. ఆ సందర్భంలోనే ఒకనాడు ఆ మందు తెచ్చిన రామచంద్రరావును చూసి భగవాన్‌ ''నీవు ఇందుకేనా ఇక్కడికి వచ్చింది?'' అని సున్నితంగా మందలించారట. ఆ వెనుక భక్తులంతా యోచించి అన్ని వైద్యాలూ ఆపుచేశారు.

ఏప్రిల్‌ ఆరంభంనుండీ డాక్టర్లంతా ''ఆ రోజు గడువదు. ఈ రోజు గడునదు'' అని అంటూవుండగా 13 వ తేదీ దాటింది. 14వ తేదీ ఉదయాత్పూర్వమే తొందరపని మీద మా అన్నా వదినె మద్రాసు వెళ్ళారు. సూర్యోదయం కాగానే నేను ఆశ్రమానికి వెడితే అక్కడి వాళ్ళంతా ఎంతో ఆందోళనగా వున్నారు. బోసు క్యూ ఏర్పాటయిన స్థలానికి కాపలా వున్నాడు. నన్ను చూస్తూనే కలియుగ భీష్ముడు వెళ్ళిపోతున్నాడమ్మా. రా అమ్మా, రా, ఇక్కడి నుంచి చూడు'' అంటూ కంటితడితో దోవ యిచ్చా డాతడు. క్యూకు కట్టినదిబ్బ మీద నిలబడి చూచాను. నీరుతో నిండి నిగనిగలాడే శరీరంతో యోగనిద్రాపరవశులై పడుకొని వున్నారు భగవాన్‌. క్యూ సిద్ధాంతాన్ననుసరించి ఎక్కువసేపు నిలబడే వీలులేక ఎంతో కించతో ఇవతలకు వచ్చాను.

యథాప్రకారం 9 గం|| నుండి 10 గం|| వరకూ క్యూలో అందరికీ భగవాన్‌ దర్శనం అయింది. నా వంటి దీనభక్తు లెవరూ ఆ మధ్యాహ్నం కుటీరాలకు వెళ్ళలేదు. ఆ సందర్భంలోనే కొందరు భక్తులు నన్ను సమీపించి''అమ్మా! 'మా కొఱకుగాను ఎట్లాగైనా ఈ శరీరం నిలబెట్టుకొవలసిం'దని మే మంతా మొన్నటివరకూ భగవానుని ప్రార్థించాము గాని ప్రస్తుతం ఆ శరీర స్థితి చూస్తే చాలా బీభత్సంగా వున్నది. మన మిక బాధించడం భావ్యం కాదని విరమించుకున్నాము. నీవు కూడా విరమించుకోవాలి తల్లీ. ఆ మార్పు అందరి హృదయాలలోనూ కలిగితే కాని అవతార పరిసమాప్తి కాదేమో యోచించండి'' అన్నారు ఛట్టున. నా గుండె ఝల్లు మన్నది.

సాయంకాలం ఆశ్రమాధికారులు''భగవా9 శరీరస్థితి ఏమీ సరిగా లేదనీ ఎవరికీ దర్శనం లేదనీ'' ఆజ్ఞాపించారు. ఆ విషయం భగవానుకు తెలిసి ''ఇప్పుడేమీ తొందరలేదు. దర్శనం ఏర్పాటు చేయం'' డని సెలవిచ్చారు. తిరిగి ఆ వెనుక క్యూ ఏర్పాటు జరిగింది. నిత్యం ఆ వేళకు భక్తులందరికీ కృపాదృష్టులచేత ఆదరించే భగవా9 ఆ సాయంకాలం ఏ ఒకటి రెండుసార్లో తప్ప కన్ను తోఱవలేదు. వేల సంఖ్యగా చేరిన జనమంతా దర్శనం చేసుకొన్న వెనుక కడపటి దర్శనంగా క్యూకు ఏర్పరచిన దిబ్బమీదకు వెళ్ళా నేను. డాక్టర్లూ అధికారులు ఆ చిన్న గదిలో భగవాన్‌ సోఫాకు ఆ పక్కగా ఈ పక్కనా నిలిచి తదేక దృష్టితో శ్రీవారి శరీరాన్ని పరిశీలనగా చూస్తూ వున్నారు. ''ప్రభో! ఒక్కసారి నీ కృపావీక్షణం నా మీద ప్రసరింపజేయవా?'' అని మనస్సులో ప్రార్థిస్తూ భగవాన్‌ వైపే దృష్టి నిలిపి అట్లాగే నిలబడ్డా నేను. భగవా9 కళ్ళు కొంచెంగా విప్పారసాగినవి. అది గమనించి పక్కన నిలిచిన వారంతా ఒక్క సారి క్యూ దిబ్బవైపుకు చూచారు. ఆ కళ్ళలో నుంచి ఒక్క చల్లని చూపు నా పక్కకు వచ్చింది. ''ఇదిగో! చూడూ! ఈ జీర్ణశిథిల శరీరాన్ని ఇంకా ఎంత వరకు మోయమంటావు? నీ వింకా దీనిమీద భ్రాంతివదలవా?'' అన్నట్లున్నది ఆ చూపు. వెంటనే నా మనస్సు మారిపోయి ''ఇన్నాళ్ళుగా మమ్ము విడిచి పోవద్దని ప్రార్థించాను గాని ఆ ప్రార్థన ఇక చాలును. ఈ శరీర స్థితిని ఇక చూడలేము. మా కొఱకుగానరు ఈ బరువు మోయవద్దు'' అని మనస్సులో ప్రార్థిస్తూ చూపులతోనే శ్రీవారికి విన్నపం చేసుకున్నాను. వెంటనే భగవాన్‌ కళ్ళు మూతపడ్డవి. క్యూ అధికారులు తొందరించడంవల్ల నే నా స్థలం వదలక తప్పింది కాదు.

ఏడు గంటలు దాటిన వెనుక భగవాన్‌ సమీపవర్తు లను ''దర్శనం ముగిసిందా?'' అని ప్రశ్నించి ముగిసిందని తెలుసుకొని తమ శరీరాన్ని లేవదీసి కూర్చోబెట్టం డని చెపితే వారు అట్లాగే చేశారు. వైద్యులు నాసికా ద్వారంలో నుండి ప్రాణవాయువును లోపల ప్రవేశింపజేయచటానికి సంసిద్ధులైతే భగవాన్‌ వారిని కుడిచేత సైగతో వద్దని వారించి పద్మాసనస్థులై కూర్చున్నారు. ఆ సమయంలోనే ''భగవానుకు ప్రాణవాయువును ఇస్తున్నారు. ఇప్పు డేమీ తొందరలేదు. అంతా ఇళ్ళకు పోయి రావచ్చును'' అంటూ పోలీసు అధికారులు ఆశ్రమమంతా నిండివున్న జనసమూహానికి చెప్పసాగారు. ఆ మాటలు విని కొందరు తమ కుటీరాలకు దారితీశారు. నావంటి మొండి ఘటాలుమాత్రం కదలకుండా ఆ చిన్న గదివైపే చూపులు నిలిపి నిలబడిపోయారు.

ఎనిమిది కావచ్చింది. ఆ గదికి పడమరవైపునవున్న వసారాలో కూర్చుని ''నమస్తే రుద్రమన్యవ'' అంటూ బ్రాహ్మణ సమూహం వేదపారాయణం ఆరంభించారు. దక్షిణ దిక్కుగా కూర్చుని కొందరు భక్తులు ''కరుణాపూర్ణసుధాబ్ధే'' అంటూ ప్రారంభించి పంచరత్న శ్లోకాలు చదివి ఆ వెంటనే ''అరుణా చలశివ, అరుణాచలశివ, అరుణాచలశివ, అరుణాచలా'' అంటూ అరవంలో భగవాన్‌ వ్రాసిన అక్షర మణిమాల పాడసాగారు. ఆ ధ్వని చెవి సోకగానే భగవాన్‌ ఒక్కసారి కళ్ళు తెఱచి ముందువైపు చూచారు. అప్పుడు భగవాన్‌ కళ్ళనుండి ఆనందబాష్పములు రాలడం ప్రక్కన వున్నవారంతా చూచారు. వెంటనే కళ్ళు మూతపడ్డవి. ఆ వెనుక కొన్ని నిమిషములకు శ్వాసము శాంతస్థితిని నిలువ దేహం నిశ్చలమైనది. ఆక్షణమే (రాత్రి 8-47.) అందమైన పెద్ద జ్యోతి ఒకటి దక్షిణ దిక్కు నుండి బయలుదేరి భగవానున్న గదిని దాటి ఉత్తరభాగంలో వున్న అరుణాచలము యొక్క ఎల్లలో మఱగిపోయిందట. భగవాన్‌ వైపే దృష్టి నిలిపిన మా బోంట్ల కది గమనించే అవకాశం లేకపోయింది గాని టవునులోవున్న వారంతా దాన్ని చూచి గగ్గోలుపడి పరుగెత్తి వచ్చారు. ఈ అద్భుత దృశ్యం అరుణాచలంలోనే కాక మద్రాసు మొదలైన అనేక స్థలాలలోనున్నూ కనుపించి నట్లు వెనుక తెలియ వచ్చింది. మద్రాసులో ఉన్న ఉన్నతోద్యోగులైన రమణ భక్తులలో కొందరది చూచి భగవాన్‌ ఆరోగ్యస్థితిని గుఱించి శంకించి వెంటనే ఇక్కడికి ట్రంక్‌ కాలు చేయడమున్నూ జరిగింది. వెంటనే ఆ చిన్న గదిలో నుండి టెంకాయ కర్పూరం అన్న కేకలు వినబడ్డవి. ఎటు చూచినా హాహాకారాలే. భావోద్రేకంవల్ల కొందరు స్త్రీలు మూర్ఛిల్లారు. కొదరు మౌనం వహించారు. ఆబాలగోపాలమూ దుఃఖ పరవశులై ఆ చిన్న గదిని చుట్టుముట్టారు. నే నెట్లాగో సాహసించి ఆ గదిని సమీపించేసరికి 1947 లో భగవాన్‌ సెలవిచ్చినట్లుగా శ్రీవారి దివ్యశరీరానికి దూపమాఘ్రావయామి, దీపం దర్శయామి అయింది. ధూపదీపానంతరం టెంకాయ కొట్టి నైవేద్యం కూడా సమర్పించారు.

చిన్న గదిని ఆవరించి పైకొని వచ్చే జనాన్ని ఆపలేక భక్తులు భగవాన్‌ దివ్య శరీరాన్ని మాతృభూతేశ్వరాలయ మహామండపానికి తెచ్చి దక్షిణద్వారాని కెదురుగా, దక్షిణ ముఖంగా కుర్చీమీద కూర్చోబెట్టారు. ఆర్తులైన భక్తులందరూ ఆ శరీరాన్ని పరివేష్టించి కూర్చున్నారు. వారి దీనాలాపాలు వేదనాదంతో మిళితమై భగవన్నుతిగానూ అరుణాచల శివస్తోత్రంగానూ పరిణమించి ఆ రాత్రి శివరాత్రిగా భక్తులకు జాగరణమైంది. వెంటనే ఈ వార్త రేడియోలవల్లా తంతుల వల్లా సర్వవ్యాప్తం కావటంచేత ఆ రాత్రికే భక్తుల మహాకూటం బయలుదేరి భగవానుని దివ్యశరీరాన్ని దర్శించసాగింది. మరుదినం ఉదయమే మా అన్నా వదినె స్నేహితులూ అంతా వచ్చి చేరుకున్నారు. అంతకుముందే, అంటే భగవా9 దేహం వదలిన వెంటనే, ఆఫీసులో వున్న అధికారవర్గమూ, చిన్నస్వామూలు, ఓమాండూరు రామస్వామి రెడ్డియారూ (మినిష్టరు) కె. కె. నంబియారూ (చీఫ్‌ ఇంజనీయరు) యస్‌. దొరసామయ్యరూ, ఇంకా ఇంకా ప్రముఖులైన భక్తులంతా సమావేశ##మై శ్రీవారి దివ్య శరీరాన్ని ఎక్కడ సమాధి చేయటం అనే విషయం చాలా సేపు చర్చించి, మాతృభూతేశ్వరాలయానికి, అఫీసుకూ మధ్యన వున్న ఖాళీస్థలంలో పాతహాలుకు ప్రక్కనే సమాధి చేయుటకు నిశ్చయించారు. అది నిశ్చయం కాగానే ఆ స్థలంలో గుంట త్రవ్వుట కారంభించి, తిరుమూలరు యొక్క తిరుమంత్రంలో చెప్పిన విధానా న్ననుసరించి లో వరుసనుండి కట్టుకొని రావటంలో కొంత ఆలస్యం అయింది. మధ్యాహ్నానికే సమాధి జరుగునని అనుకున్నారు గాని పై కారణం వల్లనూ, దూరం నుండి వచ్చే భక్తులకు దర్శన భాగ్యం లభింప గలందులకున్నూ ఆ వేళకు ఆ పని జరుగలేదు. ఉదయం 6-30 వరకు అంటే నిత్యం అల్పాహార సమయానికి శ్రీ భగవానుని దివ్య తనువుకు ధూపదీపాదు లర్పించి, పాలు నివేదన చేసి, ఆ పాలు అందరికీ పంచియిచ్చి ఆ వెనుక భోజనశాలలో గంటకొట్టి ఇచ్చవచ్చిన వారికి కాఫీ ఉప్మాలు వినియోగం చేశారు. ఆ నాడే శ్రీ భగవానునకు పాలపూజ ప్రారంభమన్న మాట.

Naa Ramanasrma Jeevitham    Chapters