Naa Ramanasrma Jeevitham    Chapters   

54. నా ఉత్తర దశ

మా అన్నా, వదినె, నేనూ నా కుటీరం చేరుకొని స్నానపానాదు లయిన వెనుక, నేను ఒకసారి ఆశ్రమానికి వెళ్ళి సమాధివద్దకొంచెంసేపు కూర్చుని వస్తానని మా వాళ్ళతో చెప్పి వెళ్ళాను. సమాధివద్దకు వెళ్ళేసరికి 9 గంట లయింది. కావలి మనుష్యుడు తప్ప మరెవ్వరూ లేరు. సమాధికి దగ్గరగా వెళ్ళి, నమస్కరించి, ఆ ధూళిని శిరసావహించి సావధానంగా సన్నిధిలో గత రాత్రి నుంచి ఉగ్గబట్టుకొని వున్న దుఃఖమాంతా ఒక్కసారి వెళ్ళబోసుకొని కంటినీరు తుడుచుకుంటూ ఇంటిదారి పట్టాను. రాత్రి 10 గంటల వేళ అల్లా ఒంటరిగా వెడుతున్న నన్ను దూరం నుంచి చూచి ఈమె ఏమవుతుందో ఏమో నని కుంజుస్వామి నాకు తెలియుకుండానే నా వెనుక రాసాగారు. నేను సరిగా ఇల్లు చేరుకుంటానో లేదో నన్న భయంతె మా అన్న ఎదురుగా వస్తున్నారు. వారి రాక చూచి కుంజుస్వామి వెనుక్కు తగ్గారు. నేను వెనకా ముందూ వున్న వారిద్దరినీ చూచి ''ఎందుకూ మీ రిద్దరూ ఇల్లా వెంబడించారు. నేను ఏమయిపోతా నని?'' అన్నాను. ''ఏమో నమ్మా! రాత్రివేళ ఒంటరిగా వచ్చావంటే ఎల్లాగో అనిపించిందమ్మా'' అన్నారు ఆ ఆత్మ సహోదరుడూ జన్మసహోదరుడూను. బసకు చేరగానే మా అన్న '' నీ వీ సమయంలో ఒంటరిగా ఇక్క డుండవద్దు, మాతో రావా'' లన్నాడు.

మరుదినం ఉదయాన భగవాన్‌ సమాధిపై నున్న లింగానికి సాధారణ అభిషేక పూజాదులు జరిపి కొత్త ఇత్తడి పాత్రతో పాయసం వండి ఒక సద్బ్రాహ్మణునకు దానం ఇచ్చారు. పదవ రోజువరకూ అల్లాగే జరుగగలదనిన్నీ చెప్పారు. మేము అదంతా చూచుకొని మద్రాసుకు బయలుదేరివెళ్ళాం. కారులో మా అన్న స్నేహితులొక రున్నారు. భగవా9 విషయాలే మాట్లాడుకుంటూ వెళ్ళటంలో మా అన్న స్నేహితునితో ''మా నాగమ్మకు ఇప్పుడు తల్లీ తండ్రీ లేనట్ల యిందండీ'' అన్నాడు. నా కెంతో దుఃఖం వచ్చింది. ఎల్లాగో దిగమ్రింగి ఇల్లు చేరాము. అక్కడ, అంటే మద్రాసులో, మూడు రోజు లుండేసరికి మూడు యుగాలయిన ట్లనిపించింది. మా అన్న, వదినెలను చూచి ''తండ్రి గతించగానే బిడ్డలంతా పారిపోతారా? అంతా కలసి ఆ దుఃఖం అనుభవించి తదనంతర క్రియలు జరుపుకోవాలి గాని అక్కడ నివాసంగా వున్న నేను పారిపోవటం ధర్మం కాదు. మీరు ఎప్పుడూ దూరంగా వున్నవాళ్ళే. నే నల్లాగాదే? నేను ఏమవుతానో అని భయవడవద్దు'' అని వాళ్ళకు నచ్చజేప్పి వెంటనే ఆశ్రమం చేరుకున్నాను. భగవాన్‌ దేహం విడచినది ఏప్రిల్‌ 14వ తేదీ గనుక 23 వ తేదీ దశాహమయింది. ఆ నాడు సమాధి పై నున్న లింగానికి మహన్యాస పూర్వకంగా మహాభిషేకమూ, సహస్రనామార్చానా, సమారాధన ఇత్యాదులన్నీ జరిగినవి. భగవానుని ఘాతతనువు సమాధిగతమైనది ఏప్రిల్‌ 15 గనుక ఏప్రిల్‌ 24 వ తేదీ పదవ దినముగా భావించి మద్రాసులోని భక్తులంతా ఒక సమావేశం (అంటె సంతాపసభ) మా అన్న గారున్న ఇంటి డాబామీద జరుపుకొనునట్లుగా ఏర్పాటు చేశారు. ఆవేళకు నన్ను రమ్మని కోరుటవల్ల ఇక్కడ దశాహపూజ చూచుకొని ఆ రాత్రికే బయలుదేరి మద్రాసు చేరుకొని అక్కడి సంతాపసభలో పాల్గొని ఎవ రెంత చెప్పినా అక్కడ ఆగక తిరిగి వెంటనే ఆశ్రమం చేరుకొన్నాను.

భగవానుని పూతతనువు సమాధిగతమైనది మొదలు రెండువేళలా సక్రమంగా అభిషేక, పూజానివేదనాదులు జరుగునట్లు ఏర్పాట్లయినవి గదా? ఆ పని శ్రద్ధతో నెరవేర్చుటకు భగవానునకు అన్నం తెచ్చి కొత్త హాలులో యిస్తూ వచ్చిన పాఠశాల విద్యార్థి కె. కృష్ణమూర్తీ, అతనికి తోడుగా యన్‌. సుబ్రహ్మణ్యమూ నియమింపబడ్డారు. వారికి సలహా దారుగానూ సహాయకారిగానూ ఎ. వెంకటేశ్వరశర్మగారినిన్నీ నియమించారు. నాడు మొదలూ నేటివరకూ ఆ మువ్వురూ ఆ కైంకర్యమును క్రమం తప్పకుండా నెరవేరుస్తూ వున్నారు.

మద్రాసులోని సంతాపసభలో పాల్గొని నేను తిరిగి వచ్చిన వెనుక భక్త సోదర సోదరీ సమూహంలో కలిసి భగవానుని గుఱించే మాట్లాడుకుంటూ, కన్నీటిధారలే పన్నీటి ధారలుగ భగవానుని సమాధి చుట్టూ అభిషేకం చేసుకుంటూ మడలాభిషేకం మయ్యెవరకూ ఎవ్వరూ ఎక్కడికీ పోరాదని మాలో మేము కూడబలుక్కొని కాలం గడుపుతూ రాగా మే 23 వ తేదీన మహా వైభవోపేతంగా మండాలాభిషేకం జరిగింది. ఆ వెనుక కట్ట తెగిన ప్రవాహంలాగా భక్త సమూహంలో చాలామంది యాత్రార్థులై బయలుదేరారు. కొందరు ఉత్తరాభిముఖులై కాశీయాత్రకు, కొందరు పశ్చిమాభిముఖులై గోకర్ణాదిక్షేత్రములకూ వెళ్ళారు. నేనూ మనశ్శాంతి కొఱకై దక్షిణాభిముఖంగా రామేశ్శర యాత్రకుగాను ఒంటరిగానే వెడుతున్నట్లు మా అన్నకు వ్రాసి వెంటనే బయలుదేరి వెళ్ళాను. తిరువణ్ణామల నుండి విల్లుపురం వెళ్ళి రామేశ్వరం రైలు ఎక్కాలి.

Naa Ramanasrma Jeevitham    Chapters