Naa Ramanasrma Jeevitham    Chapters   

56. లేఖలు ద్వితీయభాగ ముద్రణం

రామేశ్వరంలో పార్వతీ పరమేశ్వరులవలె నాకు సహకరించిన ఆ పుణ్యదంపతులను తలచికొని, ఆ వృద్ధ బ్రాహ్మణుడు చేసిన హితోపదేశానుసారం శ్రీ గురుపాదరేణువులచే పవిత్రమైన రమణా శ్రమ నివాసమే నాకు శరణ్యమని భావించి ఏ మాత్రము వ్యవహార గోష్ఠిలో చేరక తప్పించుకొని తిరుగుతూ 1954 వరకూ అక్కడే వుండిపోయాను. ఉదయం 8 గంటల లోపల ఇంటి పనులన్నీ ముగించుకొని, ఆశ్రమానికి వెళ్ళి ఉపనిషత్పారాయణం అభిషేక పూజాదులు అన్నీ చూచికొని పదింటికల్లా కుటీరానికి చేరుకునేదాన్ని. వ్రాసిన లేఖలన్నీ సరి చూచుకుంటూ కొంచెంసేపు గడిపి, భుజించి రవంత విశ్రమించి, ఒంటిగంటకల్లా లేచి స్నానపానాదులన్నీ ముగించుకొని, రెండింటికంతా తయారుగా వుండేదాన్ని, రెండున్నరకల్లా కుంజుస్వామి రామనాథయ్యరూ వచ్చే వాళ్ళు, వాళ్ళకు తెలుగు చదివితే అర్థ మవుతుంది. అందువల్ల లేఖలు మొదటినుంచీ పురాణంలాగా చదువుతూ వుండేదాన్ని. భగవాన్‌ మాటలు వినాలన్న కుతూహలంతో వుండుటవల్ల వాళ్ళెంతో సంతోషంతో వినేవాళ్ళు. 4-30 కల్లా చదవటం విరమించి, వేదపారాయణకు వెళ్ళేదాన్ని. అల్లా కొద్దిరోజులు జరిగేసరికి మరికొందరు పురుషులూ. స్త్రీలు రాసాగారు. అదొక గోష్ఠిగా పరిణమించింది.

ఒక రిద్దరు గూఢచారులవలె వచ్చి విని అవి తామే విన్నట్లు వేరుగా వ్రాయసాగారు. కుంజుస్వామి కది తెలిసి ''అమ్మా! కొన్నాళ్ళీ పురాణం ఆపం'' డన్నారు. ఆగూఢచారులు వెళ్ళేవరకూ అపవలసి వచ్చింది. వారు వూరికి వెళ్ళగానే మళ్ళీ ఆరంభించాం. ఈ పురాణ కాలక్షేపంతో లేఖ లన్నీ భాషా లోపం లేకుండా చక్కగా సవరణచేసుకొనే అవకాశం లభించింది. ఊళ్ళో వున్న రమణ భక్తులు భగవాన్‌ సశరీరులై వుండగా సాయంకాలం వేదపారాయణవేళకు వచ్చి, పారాయణ ముగియగానే వెళ్ళిపోయేవాళ్ళు. భగవాన్‌ ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడ రనే వాళ్ళ వుద్ధేశం. నా లేఖల పురాణం విని ''భగవాన్‌ ఇన్ని మాటలు మాట్లాడే వారా? అయ్యో! మేం విననే లేదే?'' అని ఆశ్చర్యపోయే వారు. ఆ విధంగా రెండు సంవత్సరాలు గడచినవి.

ద్వితీయభాగం లేఖలకు ఆశ్రమం వారివద్ద ఒక కాపీ అన్నయ్యవద్ద ఒక కాపీ వున్న విగదా? ఆ భాగం ఎన్నాళ్ళకూ ఆశ్రమం వారు ప్రకటించే జాడ కనుపించక, మా చిన్నన్న గారు తానే ప్రకటించుటకు నిశ్చయించారు. అవి సరిచూచేందుకు శివరామశాస్త్రిగారికి పంపే అవకాశం లేక మాకు దూరపు బంధువులైన దంటు శ్రీనివాసశర్మగారికిచూపాను. అయన గూడా కొన్ని కావ్యాలు వ్రాసిన వారే. వారు అదంతా పరిశీలించి చూచి ''ఇవి ఎవరూ దిద్దవలసిన పనిలేదమ్మా. అస లిదంతా నీవు వ్రాసింది కాదు. భగవద్వాణి. వారు వ్రాయలేకనా ఇదంతా నీ చేత వ్రాయించింది. నీ కీర్తివర్థిల్లాలని నీచేత ఈ పని చేయించారు. అంతే, సూర్యభగవానుడు తన కిరణములచేతనే చంద్రునికి శక్తినీ వెలుగునూ ప్రసాదించి, అతనిని రాజుగా జేసి తాను మిత్రుడుగ వున్నాడని నే నొక పద్యంలో వ్రాశాను. ఇదీ అల్లాగే వున్నది. శ్రీరమణ భగవానులు తమ అనుగ్రహ కిరణముల చేతనే నీకు తెలివినీ, ధారణాశక్తినీ ప్రసాదించి ఈ పని చేయించారు. నీకు కీర్తి రావాలనేనమ్మా! ఎవరుగానీ ఆధ్యాత్మిక జీవితానికి ఈ ఒక్క పుస్తకం చదివితే చాలును. ఆలపించక వెంటనే ఈ పుస్తకం ప్రకటంచవలసింది'' అని చాలా దూరం చెప్పారు. ఆ వెనుక ఆ ద్వితీయ భాగం ముద్రణ చేసి, ముగింపు సమయంలో ''మీ కిది కావలెనా? లేదా?'' అని ఆశ్రమం కమిటీ వారి నడిగితే ''మేమే తీసుకుంటా'' మని వారి ఖర్చులతో ఆశ్రమం పేరనే 1953 లో శ్రీ భగవానుని నందనవర్ష జయంతి కుసుమార్చనగా అచ్చయి వచ్చింది. 3, 4, 5, భాగాలు నా వద్దనే వుండి పోయినవి.

నేను 1941 జూలైలో శ్రీరమణ భగవానుని సందర్శనానికి వచ్చినది మొదలు 1953 ఏప్రిల్‌ వరకూ సంవత్సరానికి ఏ ఒకటి, రెండుసార్లో దేశానికి వెళ్ళి ఒకటి రెండు నెలలు వుండి వచ్చినా అరుణాచలంలో రమణాశ్రమవాసినిగానే వున్నాను. 1953 ఏప్రిల్‌ లో నా ఆరోగ్యం బాగా చెడి పోయి మంచం పట్టాను. ఒకటి రెండు రోజులు ప్రమాదస్థితిగా వుండుటవల్ల ఇక్కడి భక్తులు మద్రాసుకు ట్రంక్‌ కాలు చేశారు. అక్కడ నుంచి మా అక్క కొమారుడు జి. రఘునాథశర్మ వచ్చి మద్రాసుకు తీసుకొని వెళ్ళాడు. లేడీ డాక్టరుకు చూపగా, గర్భకోశంలో ట్యూమరు (గడ్డ) వున్నదనీ, వారం పది రోజులలో ఆపరేషన్‌ చేయకుంటే కాన్సరు కాగలదనీ చెప్పింది. వెంటనే ఘోషాసుపత్రిలో చేర్చి ఆపరేషన్‌ చేయించారు. ఒక్కనెల ఆసుపత్రిలో వుండవలసి వచ్చింది. అక్కడా నా గదిలో భగవాన్‌ పటంపెట్టుకొని ప్రార్థనాదులు చేస్తూవుంటే చూచికొదరు నర్సులు రమణ భక్తులైనారు. ఆ వెనుక చాలా బలహీనతతో వుండుటవల్ల అన్న లిద్దరివద్దా నాల్గయిదు నెలలు వుండవలసి వచ్చింది.

Naa Ramanasrma Jeevitham    Chapters