Naa Ramanasrma Jeevitham    Chapters   

58. ఏషణాత్రయం

మా వదినెకు క్రమంగా జ్వరం తగ్గింది. ఆ వెనుక వాళ్ళు తీర్థవిధి వగైరా కర్మకాండంతా ముగించేసరికి పది రోజులు పట్టింది. నేను మాత్రం యథా విధిగా తోమ్మిది రోజులు గంగాస్నానం, విశ్వేశ్వర సేవ చేసుకున్నాను. నెలవంతా కాశిలోనే గడచిపోవటంవల్ల మా వాళ్ళు హృషీ కేశం ఇత్యాదులు మరొకప్పుడు చూడవచ్చునని ఆ ప్రయాణం విరమించి, గయ వెళ్ళి అక్కడనుంచి కలకత్తామీదుగా ఇల్లు చేరుకుందామని నిశ్చయించారు. నా కిక వంటరి ప్రయాణం తప్పింది. గయ చేరుకున్నాం. వటవృక్షం క్రిందనున్న విష్ణుపాదాలమీద పిండప్రదానం మొదలైన కర్మకాండంతా మా వాళ్ళు చూస్తూవుంటె, సాక్షిమాత్రంగా చూస్తూ నిలబడ్డా నేను. ఆ కర్మకాండ అంతా ముగిసిన వెనుక''కాయ, పండు, ఆకు వదలాలిక్కడ, దంపతు లిద్దరూ ఒకేమాట అనుకొని వదలండి'' అంటూ మావా ళ్ళిద్దరికీ బోధిస్తే వాళ్ళేదో అలోచించి వదిలారు. ఆ గయావళీ బ్రాహ్మణుడూ, కాశి నుంచి మాతో వచ్చిన పురోహితుడూ, ఇద్దరూ నన్ను చూచి ''అమ్మా! మీ రేమి వదులుతారూ!'' అన్నారు. ''అయ్యా! ఇక్కడ అసలు ముఖ్యంగా వదలవలసిన మూడూ ఏవో చెప్పండి'' అన్నా నేను. ''ఏషణాత్రయ మమ్మా'' అన్నారు వారు. ప్రక్కన కొంద రాంధ్రు లుండి ''ఏషణాత్రయ మంటేయేమి?'' అన్నారు. కాశినుంచి వచ్చిన మా పురోహితుడు ఆంధ్రుడే గనుక అత డందుకొని ''దారైషణ,ధనైషణ, పుత్రైషణ, ముఖ్యంగా వదలవలసినవి ఈ మూడూను. అవి వదలలేనివారికే ఏదో కూర, పండు, ఆకువదలమని చెప్తారు. అంతే'' నన్నాడు. నేను అంజలి ఘటించి విష్ణుపాదమునందు దృష్టి నిలిపి ''అయ్యా! నేడు ఆ ఏషణాత్రయమును వదులుతున్నానని గట్టిగా చెప్పలేను. కాని అవి నన్ను వదలిపోవునట్లు అనుగ్రహించమని హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అంతే'' అన్నాను. ప్రక్కన ఒక రుండి ''ఆమె రమణమహర్షి శిష్యురాలండీ. రమణాశ్రమం నుంచి వచ్చింది'' అన్నారు. ''ఓహో! అల్లాగా! ఆ మహానుభావుని సేవించినవారికి ఇదంతా అక్కరలేదు'' అంటూ అంతా ఎవరి పనులలోవారు మగ్ను లెనారు.

Naa Ramanasrma Jeevitham    Chapters