Naa Ramanasrma Jeevitham    Chapters   

62. ఆలయంలో సర్ప సమ్మేళనం

సిమెంటుపని ముగిసిన వెనుక సంప్రోక్షణాదులు జరిపి నిత్యం వెళ్ళకున్నా విశేషదినాలలో అర్చకునితోపాటు నేనూ వెళ్ళి అభిషేక పూజాదులు సక్రమంగా జరిపించి వచ్చేదాన్ని, అధేవిధంవగా ఒక విశేషదినమందు ఉదయం 8 గంటల లోపల పూజాద్రవ్యాలూ, ఆవు పాలూ అన్నీ బుట్టలో పెట్టు కొని కృష్ణకాలువజలం చెంబుతో పుచ్చుకొని కొండకువెళ్ళాను. అర్చకుడు రాఘవరావు అన్నం గిన్నెను గుడ్డలో కట్టుకొని అది ఒక చేత్తో, నీళ్ళబిందె ఒక చేత్తో పుచ్చుకొని బయలు దేరాడు. అతను ముందూ నేను వెనుక ఎక్క సాగాము. కొంత ఎక్కిన వెనుక ''నేను ముందు వెళ్ళి తలుపు తెఱచి గుమ్మంలో ముగ్గువేస్తాను. మీరు నిదానంగా రండి'' అని తాను గబగబా మెట్లెక్కి తలుపు తెఱచి గాభరాతో వెనక్కువచ్చి మెట్లవద్ద నిలబడ్డాడు. ఆ గుళ్ళోకి, అప్పుడప్పుడు పాములు వస్తూవుంటవనీ, లింగాన్ని చుట్టుకుంటవనీ విని వుండుటవల్ల అతని గాభరా చూచి ''ఏమయ్యా! స్వాముల వారు వచ్చేరా యేమి?'' అన్నాను. ''ఆ-ఆ'' అంటూ నేను మెట్లన్నీ ఎక్కేవరకూ అల్లాగే నిటిచిపోయా డాతడు. నేను వెళ్ళి ''ఏరీ, ఎక్క డున్నారు. చూద్దాం రా బాబూ. వారే వెళ్ళిపోతారు భయ మెందుకు?'' అన్నాను. ఇద్దరం గుడిని సమీపించాం. ''అదుగోనండీ అత్తయ్యగారూ. ద్వారబంధం పొడుగునా చూడండి'' అని దూరంగా వుండే చూపాడు. నేను దగ్గరకు వెళ్ళి చూచాను. ద్వారబంధానికి లోవరుసన తోకపైకీ తల క్రిందివైపుకీ పెట్టి కదలక మెదలక బారుగా వుండి పోయిం దా సర్పం. ''వెళ్ళు నాయనా, వెళ్ళు. అభిషేకం చెయ్యాలి. వెళ్లు బాబూ. ఇక్క డుండకు'' అంటూ చప్పట్లు కొట్టాను. కదలదు. ''హరే రమణహరే రమణ'' అంటూ పాట పాడి ''పోనాయనా.' అంటాను. ఊహూ చలనం లేదు.''హుష్‌ హుష్‌'' అంటూ దూరంనుంచే అతనూ అదిలించాడు. ప్రయోజనం సున్న. ఏం చేయాలి? అభిషేకం చేయకుండా వెడదామన్నా తలుపులు మూసేందుకు వీలులేదు. తలుపులు మూయకుండా వెడితే సామానుదొంగలపాలవుతుంది. అయినా ఆ విశేష దినంనాడు అన్నీ సిద్ధపరచుకొనివచ్చి అభిషేకం చేయకుండా వెళ్ళటం నాకేమీ నచ్చలేదు. దాదాపొక గంటవరకూ అనేక రకాల శబ్దంచేసి చూచాం. ఏమి మార్పు లేదు. నా కప్పుడు ''వారెవరో మహాత్ములయి వుంటారు. ఈ చొక్కా తొడుక్కొని వచ్చారంతే'' నన్న శ్రీ భగవాన్‌ మాటలు మననానికి వచ్చి ''రాఘవరావ్‌. నే నా పాముకు ప్రక్కనే గుమ్మంవద్ద నిలుచుంటాను. నీవు లోపలకు వెళ్ళి అభిషేకం చెయ్యి. ఈ దృశ్యానికి భయపడి ఈ పర్వదినం నాడు అభిషేకం మానరాదు'' అన్నాను. ''అమ్మో! ఆ పాము లోపలకు వస్తేనో?'' అన్నాడాతడు. నాకేదో వెఱ్ఱి నమ్మకం కలిగి ''అది లోపలకు రానే రాదు. అథవా అల్లా వస్తే నేను దాన్ని గట్టిగా పట్టుకొంటాను. నీవు బయటకు వెళ్ళు. అది నన్ను కరిచినా ఫరవాలేదు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను'' అని దృఢస్వరంతో చెప్పాను.

పాపమాయువకుడు నా మాట నమ్మి ''సరే'' నన్నాడు. నేనా పాముప్రక్కనే నిలబడి అతడిని సంభారసహితంగా లోపలికి పంపాను. భయంతోనే యథావిధిగా అభిషేక అర్చనాదులు నడిపి, ధూపదీపనై వేద్యాదులన్నీ జరిపి నా చేతికి మంత్ర పుష్పానికి దళాలిచ్చి మంత్రర పుష్పం చదివాడు. నేను మాత్రం కదలక ఆ పాము ప్రక్కనే నిలిచి, చూస్తునే వున్నాను. మంత్ర పుష్పం ముగింపయి దక్షిణతోసహా పత్రి పళ్ళెంలో వేశానో లేదో వెంటనే ఆ పాము కదిలింది. అటు బయటివైపుకు తిరుగక, గర్భగుడివైపుగా నా కాలి ప్రక్కనే తిరిగింది. ఆ అర్చకుడు తత్తరలాడాడు. నా మనస్సులోనూ కొంచెం కలవరం కలిగింది. నా మాటకై కాదు. ఆ అర్చకుణ్ణి కాపాడాలిగదా! ఎల్లా రక్షణ అని వెంటనే భగవానుని స్మరించి, ధైర్య యుతమైన మనస్సుతో ఆ పామునుద్దేశించి ''ఇటు తిరుగుతా వెందుకు నాయనా? బయటికి తిరుగు బాబూ'' అన్నాను. శాంతంగా, వెంటనే ఆ పాము ఇటు తల అటు త్రిప్పి బయటి దారిబట్టి జరజరా గుడికి ప్రదక్షిణంగా వెళ్ళిపోయింది. వెంటనే నేనూ నా వెనుక ఆ అర్చకుడూ బయటికి వచ్చి చూచాం. ఎక్కడా ఆ పాము జాడయే గోచరించలేదు. నేనప్పుడు ''చూచావా రాఘవరావ్‌. వా రెవరో మహాత్ములుసుమా. ఈ పుణ్యదినంనాడు, భోగేశ్వరుని అభిషేకం చూడాలని ఆ రూపంతో వచ్చారు. అదివరకు మనం ఎంత శబ్దం చేసినా వెళ్ళక మంత్రపుష్పం కాగానే వెళ్ళిపోయారు. ఏమంటావ్‌'' అన్నాను. అతడు ఆశ్చర్యచకితుడై ప్రసన్నచిత్తంతో నాకు ప్రసాదం ఇచ్చాడు. ద్వారం బంధించి ఇద్దరం కొండ దిగాం. ఈ వింత సమాచారం అతడు ఎందరితోనో చెప్పాడు. ''మా అత్తయ్యగారు పాములతోగూడా మాట్లాడుతారు'' అని అంటూవుండేవాడు.

ఆ కొండమీద జనసంచారం తక్కువ అవడంవల్ల పాముల సంచారం ఎక్కువగానే వుండేది. మా యింటి వెనుకనే, పైరు పొలాలుండటం వల్ల ఇంటి ప్రాకారంలోనూ సర్పసంచారం వుంటూనే వుండేది. ఆశ్రమంలోగూడా వాటి సంచారం అలవాటే గనుక, నావల్లవాటికిగాని వాటివల్ల నాకుగాని అలజడి వుండేదికాదు. ఆలయాలలో నవరాత్రి పూజలున్నూ జరిపించాము. అప్పుడూ ఆ పాములు అటూ యిటూ తిరుగుతూనే వుండేవి. కాని భగవదనుగ్రహంవల్ల ఎవరినీ ఏమీ చేయలేదు. అక్కడున్న అయిదారేండ్లలో స్వామికి పార్వేట ఉత్సవాలున్నూ జరిగినవి. ధర్మకర్తలు, మా అన్నలూ ఇతర దాయాదులూ కావటంవల్ల నాకేమీ కర్తృత్వం లేకుండానే ఆ కర్మకాండ జరిగిందన్నమాట. అప్పుడే నేను ''భోగేశ్వర మహిమ'' అనే శీర్షికతో ద్విపద మాలిక, వచనము వ్రాశాను. ''ఆరాధన'' అనే పత్రికలో ప్రకటించారు. అయితే ఈ కర్మకాండలో మగ్నమయి ఆశ్రమం మాటే మరచిపోలేదు. ఎక్కడున్నా నేను రమణాశ్రమవాసినే. ఏదిచేసినా అది శ్రీరమణ సేవయేగాని మరొకటి కాదు. ఎక్కడున్నా మధ్యాహ్నం రెండు, మూడు ఆ ప్రాంతాల వినాలన్న కుతూహలంతో వచ్చిన స్త్రీ పురుషులకు ఒకటి రెండు గంటల కాలం శ్రీరమణ బోధామృతమును పంచిపెట్టటం నాకు పరిపాటి అయింది. 1954 మే, ఆ ప్రాంతాలనుండీ 1959 మార్చివరకూ నేను కొలనుకొండలోనే వున్నప్పటికీ భగవా& జయంతికీ, ఆరాధనకూ ఆశ్రమానికి వెళ్ళి, ఒకటి రెండు నెలలు వుండిన్నీ వస్తూవుండేదాన్ని. వెళ్ళినప్పుడల్లా లేఖలపఠనం జరుగుతునే వుండేది.

Naa Ramanasrma Jeevitham    Chapters