Paramacharya pavanagadhalu    Chapters   

10. మురుగులకు వచ్చిన మొప్పం

చిన్నప్పుడు స్వామినాథన్‌ చేతులకు బంగారు మురుగులుండేవి. ఒక రోజు అతడు బయట ఆడుకొంటుంటే, అతని మురుగులను కాజెయ్యాలన్న వుద్దేశ్యంతో వొక దొంగ అతని దగ్గరకు వచ్చాడు. అటూ యిటూ చూసి దగ్గరలో పెద్ద వాళ్లెవరూ లేరని నిర్థారించుకొని అతడు నెమ్మదిగా స్వామినాథన్‌తో ఆ మాట, యీ మాట చెబుతూ, పిల్లవాడి చేతులకున్న మురుగులను సవరించడటం మొదలు పెట్టాడు.

స్వామినాథన్‌ అమాయకుడు, మోసం యెరుగని స్వచ్ఛమైన మనసు అతనిది. పైగా బాల్యం, అందువల్ల ఆ వ్యక్తి దురుద్దేశం అతనికి అర్థం కాలేదు. 'నామురుగులు వదులుగా వున్నాయి కదా!', అని స్వామినాథన్‌ ఆ అపరిచిత వ్యక్తి నడిగాడు. 'అవును', అన్నాడతను. 'అయితే జారి పోకుండా బిగించు', అని హుకుం జారీ చేశాడు బాలకుడు.

'అమ్మో, ఆ పని నాకు రాదు. బంగారప్పని చేసేవాళ్ల దగ్గరకు పోయి చేయించుకుని రావాలి', అని చెప్పాడు ఆ అగంతకుడు.

''అయితే, యింకేం, నువే వీటిని తీసికొని పోయి బిగుతుగా చేయించుకొనిరా!'' - అని మళ్లీ వొక హుకుం జారీ చేశాడు, బాల స్వామినాథన్‌.

''అలాగే!'' అని ఎంతో వినయంగా తల వూపి, నెమ్మదిగా రెండు చేతులకున్న మురుగులు తీసికొని జారుకోబోయాడు. తన రొట్టె అంత తొందరగా విరిగి నేతిలో పడుతుందని వూహించని ఆ చోరుడు.

'ఆగు!', పిలిచాడు స్వామినాథన్‌. ఆ వ్యక్తి బిత్తరపోయాడు, మళ్లీ ఏమొచ్చిందోనని.

'నీ పేరు చెప్పు!'

'పొన్ను స్వామి!'

''భేష్‌! త్వరగా మురుగులు బిగుతు చేయించుకురా, పొన్నుస్వామి!'' కేకేశాడు, బాల స్వామినాథన్‌ వుడాయిస్తున్న మోసకారినే చూస్తూ. తరువాత తాపీగా ఇంటికి వెళ్లి ' నా మురుగులు వదులయి పోతున్నాయి. మీరేమో బిగుతు చేయించరాయె, అందుకని నేనే యిందాక పొన్నుస్వామికిచ్చి పంపించా', అని ఘనంగా చెప్పాడు.

'పొన్నుస్వామి ఎవర్రా?' - అంటే 'పొన్ను స్వామే' నన్న జవాబు వచ్చింది. దానితో ఇంట్లో వాళ్లు ఏదో మోసం జరిగిందని గ్రహించి మురుగులు కాజేసి పోయిన వాడి కోసం వెతికారు. కాని ఆ పొన్నుస్వామి మళ్లీ కనిపిస్తేనా!

Paramacharya pavanagadhalu    Chapters