Paramacharya pavanagadhalu    Chapters   

100. పప్పు దొంగకు 'వడ' దెబ్బ

స్వామి వారు ఉదారహృదయులు. కాని ఎవరయినా తప్పు చేస్తే వొప్పుకొనే వారు కాదు. అయితే ఆయన వాళ్లను శిక్షించే తీరు విలక్షణంగా వుండేది.

ఒక రోజున వొక పరిచారకుడు తన తల కింద ఒక చిన్న మూట పెట్టుకొని పడుకొని వున్నాడు. అతడెలాగో మూడు పడుల మినప్పప్పు మఠం స్టోర్సు నుంచి సంగ్రహించాడు. దానిని నెమ్మదిగా బయటకు చేరవేసేందుకు తగిన అదును కోసం నిరీక్షిస్తున్నాడు. ఇంతలో వాడి దురదృష్టం కొద్దీ ఒక మేస్త్రీ అటు వచ్చి ఆమూట చూసి విప్పమన్నారు. మినప్పప్పు బయటపడింది. మేస్త్రీ వాడిని స్వామి దగ్గరకు లాక్కొని పోయాడు, మినప్పప్పు మూటతో సహా.

స్వామి అంతా విన్నారు. వీడికి మినప్పప్పు వడలు, బహుశా, యిష్టమేమో! అందుకని ఈ మూడు పడుల మినప్పప్పు నానబోసి వడలు చేయిండండి! అందులో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర యివన్నీ వేసి మంచి రుచిగా చేయించండి! వీడు ఎన్ని తింటే అన్ని తృప్తిగా వడ్డించండి!' అని సెలవిచ్చారు. ఆ పరిచారకుడు సిగ్గుపడి స్వామికి దండం పెట్టి మళ్లీ అలా ఎప్పుడు చేయనని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

తన దూడకు ఆకలి అయేటప్పడు పాలీయటానికి పరుగెత్తివచ్చే ఆవువలె, అద్వైత తత్వం వెనకబడి పోయినప్పుడు, తిరిగి దానిని లోకంలో ప్రకాశింపజేయటానికి పరమ శివుడు పుడమిపై అవతరిస్తాడని విష్ణుధర్మోత్తరం చెబుతోందని భాస్కర రాయలవారు వ్రాశారు.

నలుగురు శిష్యులతో శంకరాచార్యులుగా శివుడవతరించనున్నాడని యక్షుడొకరు శ్రీరాముల వారికి చెప్పినట్లు కూడా భాస్కరులు వ్రాశారు.

ఆదిశంకరుల వారు పరమశివుని అవతారం.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters