Paramacharya pavanagadhalu    Chapters   

103. ఆపద మొక్కుల్లో అభయం

నల్లగొండ జిల్లాలో ఒక సిమెంటు ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. 1983 ఫిబ్రవరిలో నిర్మాణం పూర్తి అయింది. మోటార్లు అమర్చాలి. బెంగుళూరులోని ఒక ప్రభుత్వ సంస్థ దగ్గర ఆ ఫ్యాక్టరీకి కావలసిన మోటార్లు అమ్మకానికి సిద్దంగా వున్నాయి. ఆ ధైర్యంతో మార్చి 1న ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టుకొన్నారు.

కాని ఆ సంస్థ వారు మొత్తం డబ్బు రూ. 12 లక్షలు ముందు చెల్లిస్తే గాని మోటార్లు ఇవ్వమన్నారు. వీరి దగ్గర అంత డబ్బు తయారుగా లేదు. ఫ్యాక్టరీ ప్రారంభం కాగానే నెలరోజులలో యిస్తామన్నా వారొప్పుకోలేదు.

అప్పుడు ఆ ఫ్యాక్టరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన శ్రీ పల్లెంపాటి వెంకటేశ్వర్లు గారు కంచి స్వామిభక్తులు కనుక 'స్వామీ, నీదే భారం' అని ప్రార్థిస్తూ కూర్చున్నారు. అంతే!

ఆశ్చర్యం! అంతకు ముందు ఖాతాపై మోటార్లివ్వనన్న కంపెనీ వారు మనసు మార్చుకొని, బెంగుళూరు నుండి ఫ్యాక్టరీ దాకా లారీ బాగుగకూడ తామే భరించి మోటార్లు సరాసరి ఫ్యాక్టరీకి పంపించారు. రూ. 12 లక్షలు ముందుగా చెల్లించాలన్న షరతును సడలించారు. ప్రారంభోత్సవం నిరాటంకంగా జరిగింది. ఆ తరువాత మూడు నెలల లోగా వారి బాకీ అంతా ఫ్యాక్టరీ చెల్లించింది.

స్వామి వారి ఆదేశానుసారం 18 పురాణాలను తేట తెనుగులో అనువదింపచేసి మూలశ్లోకాలతో సహా ప్రచురించే మహత్తర కార్యం శ్రీ వెంకటేశ్వర్లు గారు నిర్వహిస్తున్నారు... హైదరాబాదులో వెంకటేశ్వరస్వామి ఆలయం, సత్యనారాయణ స్వామి ఆలయాల నిర్మాణంలో వీరు ప్రధానపాత్ర వహించారు.

మనం ఏ పూజ చేసినా ముందుగా 'పరమేశ్వర ప్రీత్యర్థం' అని ప్రారంభిస్తున్నాము. ఇలా సంకల్పం చేసే సంప్రదాయాన్ని ప్రారంభించింది, ఆదిశంకరులవారే, అంతకు ముందీ భావం లేదు. యజ్ఞయాగాదులుక్కూడ యిప్పుడిదే సంకల్పం.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters