Paramacharya pavanagadhalu    Chapters   

11. గడిచిన గండం

స్వామినాథన్‌కు అయిదేండ్ల వయసు వచ్చింది. అప్పుడు వాళ్ల నాన్నగారు సుబ్రహ్మణ్య శాస్త్రిగారు పోర్టోనోవో లో ఉపాధ్యాయులుగా వున్నారు. ఆ సంవత్సరం చిదంబరక్షేత్రంలో ఇలైమైక్కినార్‌ గుడిలో కుంభాభిషేకం జరుగుతోంది. శాస్త్రిగారు కొడుకును తీసికొని ఆ వుత్సవం చూచేందుకు అక్కడికి వెళ్ళారు. వాళ్ళకు తెలిసిన వాళ్లు వెంకటపతి అయ్యర్‌ అని ఒకాయన వుంటే వాళ్ల యింట్లో బస చేశారు. 'కుంభాభిషేకానికి వెళ్లేటప్పుడు లేపుతాను, అందాక పడుకో' అని ఆయన కొడుకును పడుకోబెట్టాడు. తీరా స్వామినాథన్‌ లేచే సరికి తెలతెలవారుతూ వుంది. తనను నిద్ర పుచ్చి, మరిపించి తండ్రి ఆ ఉత్సవానికి వెళ్లాడేమోనని ఆ పసి హృదయం బాధపడింది, కాని అసలు జరిగిన సంగతి ఏమిటంటే, ఆ వుత్సవానికి ఎవరూ వెళ్లలేదు. కారణం ఆరాత్రి కుంభాభిషేకం మొదలు కాకముందే ఆ ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. చాలా మంది ఆ తొక్కిడిలో చనిపోయారు కూడా. స్వామినాథన్‌ వాళ్లు గనుక ఆ రాత్రి ఉత్సవానికి వెళ్లుంటే ఏమయేదో వూహించటం కష్టం. స్వామినాథన్‌ ముందు ముందు ఈ ప్రపంచంలో నిర్వహించవలసిన బాధ్యతలెన్నో వుండటం వల్ల భగవంతుడా పిల్లవానిని పెద్ద గండం నుంచి కాపాడాడు.

అంతకంటే చిత్రం యింకొకటి జరిగింది. స్వామినాథన్‌ తల్లి ఉత్సవం చూడటానికి రాలేదు. పోర్టోనోవోలో వుండి పోయింది. అదే రాత్రి ఆమెకు చిదంబరంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు కల వచ్చింది. దాంతో ఆమె ఆందోళన చెంది చిదంబరం నుంచి వచ్చేవాళ్లను కలుసుకొని అక్కడేం జరిగిందో ఏమిటో తెలుసుకుందామన్న ఉద్దేశ్యంతో రైలు స్టేషన్‌కు వెళ్లింది. తీరా అక్కడ ఆమెకు క్షేమంగా యింటికి తిరిగి వస్తున్న తన భర్తా, పుత్రుడూ కనిపించారు. ఆమె 'అమ్మయ్యా' అని వూపిరి పీల్చుకొని గండం తప్పినందుకు ఎంతో సంతోషించింది.

'హిందూయిజం పునరుజ్జీవనం పొంది బలీయంగా తయారు కావాలి. ఇది హిందువుల శ్రేయస్సుకే కాక లోక కళ్యాణానికి అవసరం. సనాతన ధర్మాన్ని సమగ్రంగా స్వచ్చంగా కాపాడిన ఖ్యాతి భారతీయులదే!'

- పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters