Paramacharya pavanagadhalu    Chapters   

110. కనకాభిషేకం

ఒకసారి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి స్వాముల వారి దర్శనం చేశాడు. ఆయనకు 80 సంవత్సరాల వయసుంటుంది. ఆ బ్రాహ్మణుడు స్వాముల వారితో ''స్వామి! మీకు కనకాభిషేకం చేసి ఆ దివ్య దృశ్యం చూడాలని నా కాశగా వుంది. మీరు తప్పక వొప్పుకోవాలి', అని కోరాడు. స్వాముల వారు ఏం చెప్పలేదు.

ఆయన తరువాత చాలసార్లు వచ్చాడు. వచ్చినప్పుడల్లా అదే మనవి. స్వామి వారి నుండి సరే అన్నమాట రాలేదు. అయినా ఆయన అడగటం మానలేదు. స్వాముల వారు తన బిగింపు వదలలేదు.

ఇదిలా జరుగుతుండగా వయసు పైబడుతూ వుండటం వల్ల ఆయన చూపు మందగించి, చివరకు అసలే పోయింది.

అయినా ఆయన వచ్చి మళ్లీ అదే మనవి చేశాడు. స్వాములవారికి కొంత సందు దొరికింది. 'మీరు కోరింది నా కనకాభిషేకం చూడాలని కదా, యిప్పుడు మీకు చూపుపోయింది కనుక యిక మీరా సంగతి మర్చిపోవచ్చు' అని ఆచార్యులు ఆయనతో అన్నారు.

అయితే ఆయన పట్టువదలని విక్రమార్కుడు. పోయి కండ్లకు చికిత్స చేయించుకున్నాడు. ఆయన సంకల్ప బలం ఎలాంటిదో కాని ఆయనకు మళ్లీ చూపు వచ్చింది. ఇక నేం, 'నాకు మళ్లా చూపు వచ్చింది. కాబట్టి కనకాభిషేకం ఎప్పుడు?' అంటూ ఆయన మళ్లీ వచ్చాడు.

స్వాముల వారా భక్తుడి అభిమాన తీవ్రతను చూసి ఇక ఆయన మాట కాదనలేక పోయారు. ఆ వృద్దుని ఆసక్తి, పట్టుదల, అభిమానం ముప్పిరిగొని స్వాముల వారితో 'సరే' అనిపించాయి.

ఈ కనకాభిషేకం చేయించుకోవడానికి తనకేవిధమైన యోగ్యతా లేదని స్వాముల వారు చెప్పడంలో ఆయన నమ్రత కనిపిస్తుంది. నిజమైన కనకాభిషేకం శంకర భగవత్పాదులు నిర్దేశించిన మార్గంలో నడుచుకోవడమేనని వారనడంలో విజ్ఞత దీపిస్తుంది. ఆ అర్థంలో మనమందరం నిత్యం కనకాభిషేకం చేసుకోవాలని కోరడంలో ఆయనకు మనందరిపై గల కరుణ వెల్లడౌతుంది.

Paramacharya pavanagadhalu    Chapters