Paramacharya pavanagadhalu    Chapters   

15. స్వామినాథన్‌గా వెళ్లి స్వామిగా రాక

జగద్గురువులుగా స్వామి వారు అభిషేకించబడిన 1907 ప్రాంతంలో కంచి కామకోటి పీఠం కంచిలో కాక కుంభకోణంలో వుండేది. అందువల్ల ఆచార్యులుగా కలవైలో అభిషేకించబడిన తరువాత శ్రీ చంద్రశేఖర సరస్వతి కుంభకోణం బయలుదేరి దారిలో తిండివనంలో ఆగారు.

కొద్ది రోజుల క్రితం స్వామినాథన్‌గా తమ మధ్య తిరిగిన కుర్రవాడు స్వాములవారై - అందులోనూ జగద్గురువు కంచి కామకోటి శంకర పీఠాధిపతియై వస్తున్నారన్న వార్త ఆ గ్రామంలో ఎంతో సంచలనం కలిగించింది. ఊరంతా అందంగా అలంకరించబడి ఏదో ఉత్సవం జరుగుతున్న విధంగా సందడిగా వుంది.

స్వామినాథన్‌ క్లాసు పిల్లలు, స్కూలు పిల్లలు, అతను చదువుతున్న అమెరికన్‌ మిషన్‌ స్కూలు ఉపాథ్యాయులు, ఇంకా యితర పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులందరూ స్వాములవారి దర్శనంకై బారులు తీరారు. నిన్నటిదాకా గోష్పాదమంత పిలక ముడివేసుకొని, చెవుల పోగులతో ఒక అంగవస్త్రం లుంగీగా చుట్టుకొని తిరుగాడే స్వామినాథన్‌ ఎక్కడ? తలబోడి చేయించుకొని కాషాయ వస్త్రాలు, దండం, కమండలం ధరించి పాదుకోళ్లతో నడుస్తూ అమిత తేజస్సుతో ఆదిశంకరుల అపరావతారంలా వచ్చే ఆచార్యస్వామి ఎక్కడ?

స్వాముల వారు మాత్రం అరమరికలేకుండా తమ తోటి పిల్లలందరితోటి మాట్లాడారు. ఉపాథ్యాయులను సగౌరవంగా పలుకరించారు. అందరి ఆత్మీయత, ప్రేమాదరాలను చూరగొన్నారు. అలా మూడు రోజులాయన ఆ వూళ్లో గడిపారు. పూర్వాశ్రమంలో ఆయన తండ్రి, తల్లి, బంధువులు అంతా వచ్చివినమ్రులై నమస్కరించి జగద్గురువుల ఆశీస్సులు పొందారు. నిజంగా అది ఎవరికైనా గుండెలు కదిలించే సన్నివేశం. స్వామిది ఎంతో చిన్న వయసు. తలవని తలంపుగా సన్యాసం వచ్చి పడింది. అయినా ఆచార్యులు ఎంతో నిబ్బరంగా, తొణుకు బెణుకు లేకుండా ఏ విధమైన భావం మొహంలో కన్పించకుండా తన విధుల్ని నిర్వర్తిస్తూ పోవటం అందరికీ ఆశ్చర్యంగా వుండేది. 'సన్యాసం దానంతట అది పైన బడినా, సహజ సిద్దమేమో వీరికి సంగరాహిత్యం?' - అని అప్పుడాయన ప్రవర్తన గమనించిన పండితులే అచ్చెరువునందారు.

తిండివనం నుండి కుంభకోణం చేరిన తర్వాత 1907 మే 9న శ్రీ చంద్రశేఖర సరస్వతికి శాస్త్రోక్తంగా పీఠారోహణ (పట్టాభిషేక) మహోత్సవం అక్కడ ఏర్పాటు చేశారు. ఆచార్య పీఠానికి చక్రవర్తులకు మల్లేనే రాజలాంఛనాలు వుంటాయి, - ఛత్ర చామరాలు, గజవాహనాలు, ముత్యాల పల్లికి, సింహాసనం, కిరీటం - యిలాటివన్నమాట.

పట్టాభిషేకానికి తంజావూరు రాజా శివాజీ గారి రాణులు- మహారాణి జీజాంబా బాయి సాహెబాలు కావలసిన రాజోచిత వస్తు సామగ్రి, సంబారాలు పంపారు. తంజావూరు బంగారు కామాక్షి దేవాలయం నుండి, జంబుకేశ్వరం అఖిలాండేశ్వరి గుడినుండి, కంచి కామాక్షి ఆలయం నుండి అర్చక స్వాములు వచ్చి స్వామి వారిని వేదోక్తంగా అభిషేకించారు.

శ్రావ్యంగా సాగే వేదమంత్రోచ్చారనల మధ్య స్వాములవారిని సింహాసనం పై కూర్చోపెట్టి తంజావూరు రాజకుటుంబసభ్యులు, అనేకమంది జమీందారులు, పండితులు, ప్రముఖులు సామాన్యప్రజానీకం ఎందరో ఆ ఉత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించి పులకించారు. వరుసగా ఒక్కొక్కరు వచ్చి ఆచార్యులకు ప్రణామం చేసి ఆశీస్సులందుకొన్నారు.

ఆ రాత్రి తంజావూరు మహారాజా వారు పంపిన పట్టపు ఏనుగుపై బంగారు హోదా వేసి స్వామి వారిని ఎక్కించి వైభవంగా ఊరేగించారు. 87 సంవత్సరాల పాటు సాగిన స్వామి వారి కంచి కామకోటి పీఠాధిపత్యం ఆనాడలా అత్యంత వైభవంగా చిరస్మరణీయంగా ప్రారంభమయింది.

''ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టటం, దప్పికతో వచ్చిన వారికి మంచి నీళ్లివ్వటం మన ధర్మం. ఇది మనకు మన పెద్దలు బోధించిన సంగతి. ఒక చెరువు తవ్విస్తే అది మనుషులకే గాక, జంతువులకు కూడా ఉపయోగిస్తుంది. జీవకోటి అంతా పరమాత్మ స్వరూపమే కనుక మనం ఏ ప్రాణికి సేవ చేసినా అది భగవత్కైంకర్యమే అవుతుంది.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters