Paramacharya pavanagadhalu    Chapters   

16. ఆచార్యుల శిష్యత్వం

కంచి కామకోటి పీఠాధిపత్యాన్ని చేపట్టిన తరువాత గురువుల నుండి శిక్షణ పొందే అవకాశం తనకు లేకపోవడం ఆయనకు ఎప్పుడూ వెలితిగా అనిపించేది. అయినా తన బాధ్యతలను చేపట్టి సమర్థవంతంగా నిర్వహించటానికి తగిన శిక్షణ పొందే కార్యక్రమాన్ని ఆచార్యులు వెంటనే ప్రారంభం చేశారు. కుంభకోణంలోనే వుంటూ రెండేళ్లపాటు దిగ్దంతులైన పండితుల వద్ద ఆయన సంస్కృతం అభ్యసించారు. కుంభకోణంలో సందడి యెక్కువగా వుండడంతో స్వామి వారి ఏకాగ్రతకు భంగం లేకుండా వుండేందుకు వారి మకాం అఖండకావేరి వొడ్డున వున్న మహేంద్ర మంగళం అనే చిన్న పల్లెకు మార్చారు. నదీ తీరంలో ప్రత్యేకంగా నిర్మించిన పర్ణశాలలో వుంటూ స్వామి వారు వేదాలను, షడ్దర్శనాలను, వివిధ శాస్త్రాలను అధ్యయనం చేశారు. అంతేకాక, గణితశాస్త్రం, జ్యోతిషం, సంగీతం మొదలయిన అనేక శాస్త్రాలను ఆయన నేర్చుకుంటూ వుండేవారు. సమయం చిక్కినప్పుడల్లా దగ్గరలో వున్న లంకలలోకి వెళ్లి అక్కడ కూర్చొని ప్రకృతి దృశ్యాలను ప్రశాంతంగా అవలోకిస్తూ ఆనందించేవారు. ఆ రోజుల్లోనే ఆయన ఫోటోగ్రఫీ యందు ఆసక్తి చూసి, ఆ కళను నేర్చుకున్నారు.

తనను దర్శించటానికి వచ్చే ప్రముఖులను అడిగి ఆయన అనేక విషయాలను తెలుసుకొంటుండే వారు. ఆ విధంగా ఆయన ఒక విజ్ఞాన సర్వస్వంగా రూపొందారు. గండైకొండ చోళాపుంర వెళ్లి అక్కడి ప్రాచీన శిలా శాసనాలను పరిశీలించేవారంటే వివిధ అంశాలపై ఆయనకుండే ఆసక్తి, శ్రద్ధా అర్థం అవుతాయి.

ఆయనకు పాఠాలు చెప్పటానికి వచ్చే పండితులను ఆయన ఎంతో గౌరవంగా చూసేవారు. వారు కూడా ఆయనను ఒక పిల్లవానిగా కాక ఆచార్య స్వామిగా ఎంతో భక్తి ప్రపత్తులతో చూసేవారు. ఇలా పరస్పర గౌరవాభివందనాలతో ఆచార్యుల విద్యాభ్యాసం అత్యంత దీక్షగా కొనసాగింది. నిజానికి తాము పేరుకే స్వాములవారికి పాఠాలు చెప్పడానికి నియమించబడ్డాం. కాని, ఆయనకు మేం చెప్పవలసింది ఉండేదికాదని వారంటుండేవారు. ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలతో కూడ ఆయన పరిచయం సంపాదించారు.

ఆయన మొత్తం 17 భాషలు నేర్చుకున్నారు. తెలుగులో ఆయనతో సంభాషించిన శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య గారు తెలుగు స్వాముల వారి మాతృభాష అనుకున్నారు. ఆయన తల్లిదండ్రులు తమిళనాడులో స్థిరపడ్డ కర్ణాటక ప్రాంతం వారని తెలిసి ఆయన ఆశ్చర్య పడ్డారు. స్వాముల వారు అప్పుడప్పుడు వుపయోగించే ఆంగ్ల పదాల ఉచ్చారణ నిర్దుష్టంగా వుండేదని పాశ్చాత్యులు ప్రశంసించేవారు.

స్వామివారి ధారణ, జ్ఞాపక శక్తి చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఒక సారి మఠంలో ఒకరు శతావధానం చేశారు. స్వామి వారు కూడా తన పక్కన వొక పండితుని కూర్చోబెట్టుకొని శతావధానికి వచ్చిన ప్రశ్నలన్నింటికి తాను కూడా సమాధానాలు చెప్పి విడిగా వ్రాయించారు. అవధానం పూర్తయింది. శతావధాని యిచ్చిన సమాధానాలతో స్వామివారు అంతకు ముందు రాయించిన జవాబులను పోల్చి చూస్తే రెండూ యించుమించు వొకే విధంగా వున్నాయి!

పిడికెడు బియ్యం....

వంట చేయటానికి బియ్యం కడిగేటప్పుడు ఒక పిడికెడు బియ్యం వేరే వొక పాత్రలో రోజూ వేయండి! అందులో ఒక చిల్లర డబ్బు ఉంచండి! మీ పేట వాసులంతా ఒక సంఘంగా ఏర్పడి, అలా పోగుబడే బియ్యాన్ని సేకరించండి! మీపేట లోని ఏ ఆలయంలోనైనా ఆ బియ్యంతో పేదలకు అన్నదానం చేయండి! బియ్యంతోపాటు మీరంతా వేసే చిల్లర డబ్బులను వంట చెరకు, ఆదరువులు కొనటానికి ఉపయోగించవచ్చు. పిడికెడు బియ్యంతో పేదలకు ఓ ముద్ద అన్నం పెట్టి, తోటి వారికి సాయ పడ్డామనే తృప్తిని పొందండి! నిష్కామంగా మీరు చేసే యీ సేవకు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది.

(పరమాచార్య ప్రారంభించిన పిడికెడు బియ్యం పథకం)

Paramacharya pavanagadhalu    Chapters