Paramacharya pavanagadhalu    Chapters   

21. ఆచార్య స్వాముల అభేదం

శ్రీ చంద్రశేఖర సరస్వతి 1907లో ఆశ్రమం స్వీకరించగా, మరో చంద్రశేఖరులు, శ్రీ చంద్రశేఖర భారతి స్వామిగా 1912లో శృంగేరి పీఠాన్ని అధిరోహించారు. ఇద్దరూ గొప్ప పండితులే. ఇద్దరూ ఆత్మదర్శనం చేసి జీవన్ముక్తులయిన ఆధ్యాత్మిక శిఖామణులే. రెండు శంకరపీఠాలకూ చిరకాలంగా స్పర్థ నడుస్తున్నా, ఈ జగద్గురువులిద్దరకూ ఒకరంటే మరొకరికి ఎంతో గౌరవాదరాలుండేవి.

1925లో కంచివారు ఇలయాత్తంలోనూ, శృంగేరివారు దానికి 10 కి.మీ.లలో వుండే కుస్రత్తురు లోనూ బసచేసి చాతుర్మాస్యం నిర్వహిస్తున్నారు. పండితులూ, భక్తులూ యిక్కడకీ అక్కడికీ తిరుగుతూ వుండేవారు. జగద్గురువులు పండితులతో మాట్లాడే సమయంలో ఒకరిని గురించి మరొకరు ఎప్పుడూ గౌరవ మర్యాదలతో ప్రస్తుతి పూర్వకంగా ప్రస్తావించే వారు.

శృంగేరి వారు చాతుర్మాసవ్రతం అయిపోయి కుస్రత్తూరు విడిచి వెళ్లుదామనుకుంటున్న రోజున కంచివారు ఆ గ్రామంలో నుండి వెళ్లే సందర్భం తటస్థపడింది. గ్రామస్థులు ఆయనను కూడా స్వాగత సత్కారాలతో ఊరేగింపుగా తీసికొని రావాలని సంకల్పించారు. ఇది తెలిసిన కొందరు శృంగేరీ వారి దగ్గరకు పోయి 'మీరీ వూళ్లో వుండగా కంచి వారికి కూడా వూరేగింపట! చూశారా అన్నారట. అయితే అది విని శృంగేరి వారు 'అటులనా', అని ఆనందించి కంచి వారి పల్లకీ మోయటానికి తన బోయీలను పంపారట!

ఒకసారి కలకత్తాలో కంచి వారు సాగించే దేవీ నవరాత్రములలో పూజకు వస్తానని వొప్పుకున్న వేద పండితులొకరు ముందు అక్కడ సంకల్పం చేయించారు. అయితే వారికి శృంగేరి వారిపై భక్తి ఎక్కువ. అందువల్ల ఆయన నవరాత్రులు మధ్యలో వదిలి శృంగేరి వెళ్లి శంకరాచార్యులను కలిసి ఆ సంగతి చెప్పి తాను శృంగేరి వారి వద్దనే నవరాత్రములు గడుపుతానని అన్నారట. శృంగేరిస్వామి చంద్రశేఖరభారతి అది విని 'తప్పు!' ఆయనకూ, నాకు అభేదం (తేడా లేదు). సంకల్పం చేయించి మధ్యలో విడచిరాతగునా' అని మందలించి వెనక్కు పంపారు. ఆయన ఎట్లాగో కష్టపడి దశమి నాటికి కలకత్తా చేరుకొని స్వాములవారిని కలిసి జరిగింది విన్నవించారు. కంచిస్వామి ఆయనను ఎంతో ఆప్యాయతతో మర్యాద చేసి బాధపడవద్దని అనునయించారు.

Paramacharya pavanagadhalu    Chapters