Paramacharya pavanagadhalu    Chapters   

23. తింటా, తీసుకురా!

పరమాలూరు శివన్‌ స్వామి వారి భక్తులు, శివన్‌ మహామాఘమహోత్సవంలో లక్షలాది మంది యాత్రికులు ఉచితంగా భోజన వసతి ఏర్పాటుచేసిన దాత. 1926 ప్రాంతంలో స్వామి ఉపవాస దీక్ష గురించి శివన్‌ విని, చలించి దీక్షను విరమించ వలసిందిగా కోరుతూ స్వామి వారికి ఒక పెద్ద ఉత్తరం రాశాడు. శ్రీవారిచ్చిన జవాబుతో తృప్తి చెందక, తానే వచ్చి శ్రీవారిని కలిసి దీక్షను విరమించవలసిందని ఎంతగానో వాదించాడు. వేడుకొన్నాడు. బతిమిలాడాడు. కాని స్వామి తన దీక్షను సడలించను కూడా సడలించ లేదు.

1935లో స్వామి కటక్‌ పర్యటనలో వుండగా రహస్యంగా కఠోర ఉపవాసాలు ప్రారంభించారు. అప్పుడు మఠంలో ఆర్థిక వ్యవహారాలు చూసే వ్యక్తి రామ్మూర్తిగారు. ఆయనను అంతా ఖజానా రామ్మూర్తి (ఖజానా రామచంద్ర అయ్యర్‌) అనేవారు. ఆయన స్వామికి ఆంజనేయుని వంటివాడు. ఆయన ఎలాగో యీ ఉపవాసాల సంగతి తెలుసుకున్నాడు. దానిని విని ఆయన మనస్సు క్షోభించింది.

రోజూ వందలాది మఠోద్యోగులు, వేలాది భక్తులు స్వామి నీడన సుష్టుగా భోంచేసి త్రేనుస్తుంటే నిరంతర అనుష్ఠానంలో మునిగి తేలే స్వామి అన్నం మానేసి ఆరోగ్యం చెడగొట్టుకొంటున్నారని ఆయన బాధ.

ఆయన స్వామి దగ్గరకు పోయి ఉపవాస దీక్ష మానేయమని అడిగారు. స్వామి సరే అనలేదు. రామ్మూర్తి గారికి స్వామి దగ్గర కొంచెం చనువుంది. అందుకని ఆయన చొరవ తీసుకొని, స్వామి భిక్ష తీసుకోకపోతే తాను మఠం విడిచి పోతానని బెదిరించారు. స్వామి చిరునవ్వు నవ్వగా ఆయన సంతోషంతో మఠం పరిచారకులను స్వామికి రోజూ ఎప్పటిలా ఆహార పానీయాలు అమర్చమని పురమాయించారు.

రామ్మూర్తిగారు బయటకు వెళ్లగానే స్వామి ''ఏదో మన రామ్మూర్తి హఠం చేస్తుంటే సముదాయించి పంపా, అంతే! కాని భిక్ష అవసరం లేద''ని చెప్పేశారు.

మర్నాడే యీ సంగతి రామ్మూర్తి గారు కనిపెట్టారు. ఆ రాత్రి ఎలాగో స్వామిని వొంటరిగా లంకించుకొని రామ్మూర్తి గారు 'సరే! నేను మఠం వదిలి పెట్టి పోతున్నా' అన్నారు. స్వామి బింకంగా 'నీవు పోతే మఠం జరగదా, ఏమి?' - అన్నారు. 'అయితే యిప్పుడే నేను ప్రాయోపవేశం చేసి చస్తా', అని రామ్మూర్తి మఠం వేసి హఠం పట్టికూచున్నారు.

స్వామి ఆ మొండి వాని వేపు దయగా చూశారు. 'నీవే స్వయంగా భిక్షకు ఏర్పాటు చేయి. పరిచారకులు గాని వేరెవ్వరూ యీ ఛాయలకు కూడ రావటానికి వీల్లేదు సరా!' అన్నారు.

రామ్మూర్తి గారికి స్వామి తన పట్ల చూపిన అనుగ్రహం చూసి ఏడుపు వచ్చింది. ఆయన ఆనందంతో ఏడుస్తూ 'అలాగే!' అని ఆ షరతులకు వొప్పుకొని, వెళ్లి రెండు తట్టల నిండా పండ్లు తీసికొని తిరిగి వచ్చారు.

'పండ్లు కాదు. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తాళింపు సెనగలు కావాలి, తే!' అన్నారు స్వామి చిన్న పిల్లవాడిలా,

రామ్మూర్తి గారికి ఆ పేచీలు చూసి నవ్వొచ్చింది. ఎందుకంటే స్వామి సెనగల వంటివి మానాడే తినే రకం కాదు, ఇన్నాళ్లుగా కఠోరోపవాసాలు చేసిన పచ్చి వొంటిపై సెనగలు తింటారా అనటమే గాని, అందుకని ఆయన రెండు పెద్ద పాత్రల నిండా తాళింపు సెనగలు తెచ్చి పెట్టారు., 'స్వామి వొకటో రెండో గింజలు ముందు అమ్మవారి ప్రసాదం తింటారేమో, సరే!' ననుకొని,

స్వామి సావధానంగా కూర్చొని ఆ రెండు పాత్రల సెనగలూ భోంచేశారు. రెండు తట్టల పండ్లూ ఖాళీ చేశారు.

'నాలో ఆకలిని రేపి కూచున్నావు. నేనెంత చెప్పినా వినకుండా. తే! ఇప్పుడు తినటానికి యింకా ఏం తెస్తావో! అన్నారు స్వామి.

రామ్మూర్తి గారు వెళ్లి పెద్ద వెండి కడవ నిండా మర్నాటికి పెరుగు తోడు పెట్టటానికి వుంచిన పాలు తెచ్చారు. స్వామి కడవయెత్తి ఆ పాలన్నీ గట గట తాగేశారు. వెంటనే రామ్మూర్తిగారు చెంపలు వేసుకొని స్వామి కాళ్ల పై పడ్డారు.

'తప్పయింది స్వామి! మీ మహిమ తెలియక భిక్ష చేయుండంటూ వెంబడి పడ్డాను. క్షమించండి. ఇక జీవితంలో మీ భిక్ష మాట తలపెట్టను!' అని మొర పెట్టుకొన్నాడు.

Paramacharya pavanagadhalu    Chapters