Paramacharya pavanagadhalu    Chapters   

24. వినోబా భావే తో....

జూన్‌ 7వ తేదీకి ఒక ప్రత్యేకత వుంది. 1927వ సంవత్సరంలో ఆ రోజున ఆచార్య వినోబా భావే మొదటి సారి గాంధీజీని కలుసుకున్నారు. తిరిగి 1956 లో సరిగ్గా అదే రోజు వినోబా భావే మరో మహాత్ముడు పరమాచార్యను సందర్శించారు.

ఇద్దరూ నిరాడంబరులే కదా! అందుకని వారి సమావేశం ఒక చిన్న పూరిపాకలో జరిగింది. ఇద్దరికీ సంస్కృతం బాగా వచ్చు. అందుకని వారి సంభాషణ దేశభాషలోనే జరిగింది.

వినోబాను చూస్తూనే స్వామి సాదరంగా నారాయణ, నారాయణ అంటూ స్వాగతం చెప్పి కుశల ప్రశ్నలు అడిగారు.

ఇక్కడికి రావటంలో ఏవీ ఇబ్బంది కాలేదు గదా! అని స్వామి వినోబాను అడిగారు. అంతేకాదు 'మీకు అభ్యంతరం లేకుంటే, యిక్కడ మఠంలోనే మీరు బస చేయొచ్చు' అని చెప్పారు.

స్వామి దర్శనం చేసి, ఆశీస్సులందుకోవడానికే తాను వచ్చానని వినోబా అన్నారు.

స్వామి తరువాత యిలా అన్నారు!

పరులసేవ వలన ప్రపంచం అంతగా ఉద్ధరించబడుతున్నట్లు నాకు తోచదు. ఒక్కొక్క వ్యక్తి తన ప్రవృత్తిని బట్టి, తన మనోభావాలను బట్టి సమాజానికి సేవ చేస్తాడు. అందులో ఆక్షేపణ లేదు. కాని లోకులకు తాను ఏ వుపకారం చేసినా అది తన చిత్తశుద్ధికేనని, ఆత్మోద్ధరణకేనని అతడు భావించాలి. అదే తన లక్ష్యం కావాలి.

ఒకరి సాయం లేకుండా బతుకుతున్న వాళ్లు యీ లోకంలో ఎందరో వున్నారు. మాటవరసకు, అడవిలో వుండే జంతువులకు, పక్షులకు ఎవరు ఏ సహాయం అందిస్తున్నారు? వాటి జీవిత సరళిని క్రమబద్దం చేయటానికి ఒక సంఘం వుందా? ఒక ప్రభుత్వం వుందా? అయినా అవి మనుషులకన్నా సుఖంగానే బతుకుతున్నాయి.

సమస్త జీవరాసిలో పరమాత్మ ఉన్నాడు. ఆయన అంతర్యామి. సంఘంలో వుండే ప్రతివ్యక్తి తను చేయవలసిన విధిని, ధర్మాన్ని తెలుసుకొని, ఆ స్వధర్మాన్ని చక్కగా నిర్వర్తించాలి. అదే పరమేశ్వరునికి మనం చేయగల నిజమైన సేవ''.

శ్రీ వినోబా తాను కూడా స్వామితో ఏకీభవిస్తున్నానని అన్నారు.

తరువాత స్వామి యింకా యిలా చెప్పారు:

''చెట్టును పోషించటానికి చెట్టు కుదుట్లో నీరు పోస్తే చాలు. చెట్టు తాలూకు వేళ్లు ఆ నీటిని, నీటితో పాటు భూసారాన్ని పీల్చుకుంటాయి. కొమ్మలకూ, రెమ్మలకూ అందిస్తాయి. మనం ఒక్కొక్క కొమ్మకు, ఒక్కొక్క ఆకుకూ ఆహారం అందించనక్కరలేదు.

అలాగే మనిషి నోటితో ఆహారం తీసుకొంటాడు. అయినా అతని చెవి, ముక్కు, కళ్లు, కాళ్లు, అన్నిటికి ఆహారం అందుతుంది. ఈ సృష్టి అంతా ఏమిటి? ఆ పరమేశ్వరుని అవయవాలే కదా!

జీవులంతా ఆ పరమాత్మ ప్రతిబింబాలు. లోక సేవ చేస్తే పరమాత్మ సేవ చేసినట్లే.

సర్వేజనాః సుఖినోభవంతు

''అందరికీ సుఖం, శ్రేయస్సు కలగాలి

అని మనం ఈశ్వరుని ప్రార్థిస్తాము''

స్వాములవారితో మాట్లాడిన వారందరి లాగే వినోబాభావే కూడా ఎంతో ముగ్దులయ్యారు. 'స్వామి భగవంతునితో సమానం అంటారు. కాని, నాకలాకాదు సాక్షాత్తు భగవంతుడే', అని ఆచార్య అంటూ స్వాములవారి వద్ద సెలవు తీసుకొన్నారు.

'అహింస పరమోత్కృష్ట ధర్మం అంటుంది, మనుధర్మశాస్త్రం. ఇంకొకరిని దేహసంబంధంగా బాధ పెట్టకపోవటం వొక్కటే అహింస కాదు. మరొకరికి బాధ కలిగించే మాటలు కూడ మాట్లాడరాదు. మరొకరి గురించి చెడుగా తలంచరాదు. త్రికరణ శుద్ధిగా మనం పాటించే అహింస వలన మనకు లభించే ఉత్తమ ఫలం మనో నిగ్రహం'.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters