Paramacharya pavanagadhalu    Chapters   

31. పనిమనం చూస్తే పైకం పైవాడు చూస్తాడు

స్వాములవారెప్పుడూ ఏదో ఒక కార్యం తలపెడుతూ వుండేవారు. ఒకసారి ఇలయాత్తంలో ఆయన వున్నప్పుడు విద్వత్‌ సదస్సు నొకదానిని ఏర్పాటు చేయాలన్న యోచన వచ్చింది. మత విశ్వాసాలను పెంపొందించటం, కళలను ప్రోత్సాహించటం గురించి చేయవలసిన కార్యక్రమాలను ఆ సదస్సులో రూపొందించాలనుకున్నారు.

ఒకరెవరో, 'అంతా బాగానే వుంది కాని దానికి కావలసిన డబ్బు ఎలా వస్తుంది?' అని అడిగారు.

''సదస్సు ఎట్లా నడపాలో మనం చూచుకుంటే చాలు. ద్రవ్యం సంగతి చంద్రమౌళీశ్వరుడే చూసుకొంటాడు' అన్నారు ఆచార్యులు. అలాగే జరిగింది. విద్వత్‌ సభ మహావైభవంగా జరిగింది.

తిరువారూర్‌లో ఆలయరథం కాలిపోయింది. సుబ్బరాయవాద్యార్‌ అనే అతను దానిని తిరిగి చేయించాలనుకున్నాడు. స్వామివారు ఆశీర్వదించి ప్రోత్సహించారు. కొద్దిరోజులలోనే పైకం ఎలా పోగయిందో ఏమోగాని ఆలయానికి కొత్త రథం అమరింది.

1941 లో తంజావూరులోని బంగారు కామాక్షి ఆలయాన్ని పునరుద్ద రించాలనుకొన్నారు. అలాగే చేశారు. కుంభాభిషేకం జరిపించారు. జంబుకేశ్వరంలో చెట్లు, పొదలూ పెరిగి పంచముఖలింగేశ్వరాలయం ఎక్కడున్నదో తెలియని సమయంలో దానిని కనుగొని, పునరుద్ధరించి, కుంభాభిషేకం జరిపారు పరమాచార్య. అంతేకాదు, కామాక్షికి వెండి రథం చేయించారు. దేశమంతటా కంచికామకోటి మఠం ఆధ్వర్యంలో ఆది శంకరుల విగ్రహాలను, పాదుకలను ప్రతిష్ఠించి మండపాలను నిర్మించారు. అనేక యజ్ఞాలు, యాగాలు చేశారు. వేదాథ్యయనాన్ని ప్రోత్సహించారు. శ్రీ రంగపట్నంలో రంగనాథాలయ గోపుర నిర్మాణంలో తెర యివతలకు రాకుండా వుండి వారెంతో కీలక పాత్ర నిర్వహించారు.

అన్నిటికీ - యింకా ఎన్నిటికో కావలసిన ద్రవ్యం సంగతి ఆయన ఎన్నడూ ఆలోచించలేదు. చంద్రమౌళీశ్వరునిదే ఆ బాధ్యత అని గాఢంగా విశ్వసించారు. ఆ ఆదిభిక్షువే ఆయనకు అన్నివేళలా అండదండగా నిలిచాడు. ఆయన సంకల్పించిన పనులన్నీ నెరవేర్చేందుకు కావలసిన అర్ధబలం, అంగబలం సమకూర్చాడు.

Paramacharya pavanagadhalu    Chapters