Paramacharya pavanagadhalu    Chapters   

34. మూక పంచశతి

కంచి కామకోటి మఠంలో అనంతానందస్వామి అని ఒక సన్యాసి వుండేవాడు. ఆయన స్వాముల వారికి ఎంతో సన్నిహితుడు. వారి అంతరంగిక కార్యదర్శి కూడా. ఒకరోజు స్వామివారు ఆయనతో 'నీవు కామాక్షి గుడికి వెళ్లి, అక్కడ మూక పంచశతి పారాయణ చేయి' అని ఆదేశించారు. ఆయన అలాగే చేశాడు. స్వామి అతనికెందుకలా ఆదేశించారో!

వెనకటికి ఒక మూగవాడు కామాక్షి దేవి ఆలయంలో కూచొని తదేకంగా అమ్మవారిని ధ్యానిస్తున్నాడు. అదే మంటపంలో మరొక వ్యక్తి కూడ అమ్మవారిని గూర్చి ధ్యానం చేస్తున్నాడు. ఆయన గొప్ప పండితుడు. అమ్మవారికి దయ కలిగింది. ఆమె స్త్రీ రూపంలో ప్రత్యక్షమయి నోరు తెరువు. నీ నోటిలో వుమ్మివేస్తానని ముందు పండితునితో అన్నదిట. ఆవిడెవరో, ఆవిడ ఉచ్చిష్టం వల్ల తన శౌచానికెక్కడ భంగం కల్గుతుందోనన్నట్లు ముఖం పెట్టాడు. పక్కనే వున్న మూగవాడు ఆవిడే అమ్మవారని గ్రహించి, తన అదృష్టం పండిందని వెంటనే నోరు తెరిచాడు. అమ్మవారతని నోట వుమ్మివేసిందిట. అంతే! శ్రీకరమైన అంబ తాంబూలోచ్చిష్టం తగలగానే ఆ మూగవాడు మహాకవి అయినాడు. అమ్మవారి ప్రభావాన్ని ఆర్యాశతకంగా రచించాడు. కండ్లు అమ్మ పాదాలపై పడగా పాదారవింద శతకం గానం చేశాడు. అమ్మ దయను గురించి స్తుతి శతకం చెప్పాడు. ఆమె కటాక్షం చూసి కటాక్ష శతకం వినిపించాడు. ఆ మూగవాని అనర్గళ కవితా ప్రవాహాన్ని వింటూ ఆనందించి చిరునవ్వు నవ్విన అమ్మవారి మందహాసం చూసి మందస్మిత శతకం గడగడా చదివాడు. అట్లా ఆశువుగా చెప్పిన అయిదు శతకాల సంపుటి అయిన అత్యంత సుందర కావ్యమే మూక పంచశతి.

అమ్మవారి కర్పూర తాంబూల ఖండోత్కరి యొక్క ఉచ్చిష్టంలోంచి పుట్టిన ఆ అద్భుత కావ్యం అమ్మవారి అనుగ్రహాన్ని పొందదలచిన వారు తప్పక పారాయణ చేయదగ్గ గ్రంథం. ఆ గ్రంథాన్ని స్వాములవారి పూనికపై కంచి కామకోటి పీఠం ప్రచురించింది.

ఆ గ్రంథం ఎంతో ముఖ్యమైంది కనుకే స్వాముల వారు అనంతానందునికి దానిని పారాయణ చేయవలసిందన్న ఆదేశం యిచ్చారు.

Paramacharya pavanagadhalu    Chapters