Paramacharya pavanagadhalu    Chapters   

35. స్వాధ్యాయనిష్ఠులకు స్వర్ణకుండలాలు

ఈ ప్రపంచం ధర్మం ఆధారంగా నడుస్తూ వుంది. ధర్మానికి మూలం వేదం. వేదం మంత్ర స్వరూపం కాబట్టి శబ్ద రూపంలో అది ఆకాశంలో ఎప్పుడూ వ్యాపించి వుంటుంది. ఆత్మ శక్తి గల మహాఋషులు ఆ మంత్రాలను దర్శించి తమ శిష్యులకు ఇస్తారు. గురు శిష్యపరంపర వేదాలను రక్షిస్తూ వుంటుంది.

వేదపారాయణ వలన పారాయణ చేసే వారికేగాక అన్నిలోకాలకు కళ్యాణం వొనగూడుతుంది. యజ్ఞయాగాది క్రతువులు చేయటంలో కూడ వేదమే మార్గదర్శి. వేదాన్ని అభ్యసించి వారికి జీవనం గడవటం కష్టంగా వుండటంతో వేదాధ్యయనం చేయటానికి ముందుకువచ్చేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వచ్చింది.

అయిదువేల సంవత్సరాలకు పూర్వం వ్యాసభగవానుడు వేదాన్ని నాలుగు భాగాలుగా ఋక్‌, యజుర్‌, సామ, అధర్వ రూపంలో విభజించాడు. అప్పుడు మొత్తం 1131 వేదశాఖలుండేవి. ఈ శాఖలను గురుశిష్య పరంపరగా అధ్యయనం చేసే కుటుంబాలు అనేకం దేశమంతగా వుండేవి. ప్రస్తుతం, 21 ఋగ్వేద శాఖలలో వొకటి మాత్రమే నిలిచి వుంది. యజుర్వేదానికి చెందిన 101 శాఖలలో నాలుగు మాత్రమే లభిస్తున్నాయి. సామ వేదానికి చెందిన 1000 శాఖలలో కేవలం మూడు - అంటే ఛందోగ లేక కౌధుమ తలవకార లేక జైమిని, రాణాయనీయ శాఖలు మాత్రమే కన్పిస్తున్నాయి.

అధర్వవేదానికి గల 9 శాఖలలో శైనక శాఖాధ్యయనం చేసిన వారొకరైనా నేటికి మిగిలివున్నారా అనేది సందేహం.

మంత్రద్రష్టలయిన ఋషులు వేదాలను లోకానికి చరిత్ర తొలిదినాలలో ఏనాడు అందించారో గాని అప్పటినుండి నేటివరకు వేద మంత్రాలను ఏ మార్పు లేకుండ రక్షించుకొనటానికి ప్రయత్నం కొనసాగుతూనే వుంది. ఇందుకు లక్షణ గ్రంధాలు కూడా వున్నాయి. వేదమంత్రముల ఉచ్చారణను కూడ పద-క్రమ-జట-ఘన అను నాలుగు పద్ధతులలో రక్షించుకుంటూ వస్తున్నారు. ఘనాపాఠీ అంటే నాలుగు పద్ధతులూ చదువుకున్న వేదపండితుడన్నమాట.

వేదంలోని ప్రతి అక్షరంలోనూ ఎన్ని మాత్రలున్నాయి, అందు ఏది వర్ణం ఉత్పత్తి అయే స్థానం, దానిలో ముఖ్య భాగమేది, అంతగా ప్రాధాన్యం లేని భాగం (Stress ఎక్కువ, తక్కువ) ఏదీ, వర్ణం ఉత్పత్తి చేయటంలో (ఉచ్ఛరించటంలో) వుండే రకరకాల ప్రయత్నాలు, పలికే వివిధ స్వరాలు, ఆ స్వరాలను ఉచ్ఛరించేసమయంలో శ్వాసపీల్చటం, విడవటం చేయవలసిన పద్ధతి, వేదములలోని సప్త స్వరాలకును, సంగీతంలోని సప్తస్వరాలకు గల పరస్పర సంబంధం, వేదంలోని స్వరాలకు మయూర (నెమలి), వృషభ (ఎద్దు), గాంధాన (కందహారుకు చెందిన గొర్రె), క్రౌంచ, కోకిల (పక్షులు), అశ్వ (గుర్రం), గజ (ఏనుగు) మొదలైన వాటి సహజ ధ్వనులతో గల సామ్యం (పోలిక)---వీటినన్నిటిని ఈ లక్షణ గ్రంధాలు చక్కగా వివరించి వున్నాయి. ఇంత శ్రద్ధ తీసికోవడానికి కారణం ఉంది. వేదం సరిగా ఉచ్చరించబడక పోతే ఆ పారాయణ ఆశించిన ఫలాన్ని ఈయకపోగా, అందుకు విపరీతమైన, అనిష్టమైన, అరిష్టదాయకమైన ఫలాన్ని యిస్తుంది. అందువలననే వేదాల అధ్యయనానికి తగిన ప్రోత్సాహం కల్పించటానికి పరమాచార్య ప్రత్యేక శ్రద్ధ చూపారు. తాము ధరించే దండం వేదవిధిని రక్షించుటకే ఆని ఆయన చెప్పారు.

ఆయన నేతృత్వంలో కంచి కామకోటి పీఠం వేద ప్రచారానికి ఎంతో కృషి చేస్తోంది. స్వామివారికి 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఏర్పాటయిన 'షష్ట్యబ్ద పూర్తి నిధి' వలన వచ్చే ఆదాయాన్ని వేదభాష్యం నేర్చుకొనే వారికోసం వినియోగిస్తున్నారు. వేద పండితులకు పరీక్షపెట్టి, అందులో నెగ్గినవారికి భాష్యరత్న వంటి బిరుదులు, ఉపకారవేతనాలు ఇవ్వటం కూడ ప్రవేశ##పెట్టారు. 1964లో బెంగాల్‌ వేద పాఠశాలను నెలకొల్పారు. 1965లో అక్కడ పీఠం వారు వేదభవనాన్ని ఏర్పాటు చేశారు.

1986లో కాళహస్తిలో స్వాములవారు ఏర్పాటుచేసిన విద్వత్‌ సదస్సులో వేద పండితులకు సన్మానాలు, సాలీనా సంభావన యివ్వాలని తీర్మానించారు. తిరుమల, తిరుపతి దేవస్థానం వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఉత్సాహంగా కొనసాగిస్తుండటం ముదావహం.

ఒకసారి వేదపండితులలో ఉద్దండులైన వారికి బంగారు కుండలాలు యివ్వాలనే సంకల్పం స్వామివారికి కల్గింది. అప్పుడాయన దర్శనం కోసం ఓ సంపన్నురాలు వచ్చింది. ఆయన మాటల సందర్భంలో తన సంకల్పం ఆమెకు తెలియజేసి అందుకు నూరు సవరనుల బంగారం కావాలి. మీరివ్వలేరా? అని అడిగారు. ఆమె వెంటనే తన మెళ్లో వున్న గొలుసు తీసి ఆచార్యుల పాదాల దగ్గర పెట్టింది. తరువాత కొద్ది రోజులలోనే ఆమె 100 సవరనుల బంగారం తెచ్చి స్వాముల వారికి అర్పించింది. స్వామి సిద్ధ సంకల్పులు గదా!

Paramacharya pavanagadhalu    Chapters