Paramacharya pavanagadhalu    Chapters   

37. సిద్ధః కవీనాం కలిదైవయోగం

1938లో శ్రీవారు చాతుర్మాస్యం గుంటూరులో చేశారు. సుప్రసిద్ధకవి శ్రీ కల్లూరి సుబ్రహ్మణ్యదీక్షితులుగారు అక్కడ స్వాముల వారిని దర్శించారు.

దీక్షితులుగారు స్వాములవారితో తాను చిన్నతనంనుండి తెలుగులో కవిత్వం రాస్తున్నానని, స్వభావసిద్ధంగా వచ్చిన యీ కళ ప్రస్తుతం వ్యసనంగా మారిందా అన్న అనుమానం కలుగుతోందని అన్నారు.

దానికి స్వాములవారు ''నీకు కృతార్థత కవిత్వం మూలంగానే'' అన్నారు.

'అనాయతనప్రాణ మసంయతాక్షం

అబ్రహ్మచర్యా నశనాది ఖేదం

చిత్తం మహీశే నిభృతం నిధాతుం

సిద్ధః కవీనాం కలిదైవ యోగం'

ప్రాణాయామం వంటి యోగం అక్కర లేదు. కనుబొమలమధ్య చూపునిలిపి తపస్సు చేయనక్కరలేదు. బ్రహ్మచర్యంతో పనిలేదు. ఉపవాసాదులు, వ్రతాలతో అవసరంలేదు. ఈశ్వరునిపై మనసు లగ్నం చేసి తరించే సులభోపాయం కవిత్వం అని ఆయన అన్నారు.

స్వాములవారు ఆదేశించినట్లుగా దీక్షితులుగారు నారాయణీయం, మూక పంచకశతి ఆర్యాద్విశతి మొదలయిన గ్రంథాలను తెలుగులోకి అనువాదం చేశారు. స్వాములవారిపై ఆయన గురు కృపాలహరి అనే సంస్కృత కావ్యం కూడా రాశారు. ఆచార్యుల జీవిత కథను కూడా రచించారు.

విద్యాదానం ఎంతో గొప్పది. విద్యను పాత్రత కలిగిన వానికే యివ్వాలి. అందుచేత విద్యాదానం విషయంలో మన వారు ఎంతో శ్రద్ధ తీసుకొనే వారు. ఎందుకంటే అపాత్రునికి విద్యాదానం చేయటం పిచ్చివాని చేతికి మారణాస్త్రం యివ్వటం లాంటిది. ప్రాణం పోయినా, మన పూర్వులు, అపాత్రుని విజ్ఞానాన్ని ఎరుకబరచే వారు కాదు.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters