Paramacharya pavanagadhalu    Chapters   

38. 'లక్ష్మీ సహస్ర శర్మ'

జగద్గురువులకు అనేక మంది రచయితలు, గౌరవాభిమానాలతో తమ రచనలను పంపుతుంటారు. అలా మఠానికి వందల కొలది పుస్తకాలు వచ్చి చేరుతూ వుంటాయి. ఆ రచయితల కోర్కె తమ రచనలు స్వామి వారి దృష్టికి వెళ్లాలనే.

శ్రీ వేదుల సూర్యనారాయణశర్మగారు తణుకులో వుండే రోజుల్లో ఆయన లక్ష్మీ సహస్రం అని వేయి పద్యాలు వ్రాసారు. వానిని పుస్తక రూపంలో తీసుకొని వచ్చారు. ఆ పుస్తకం కాపీని ఆయన కంచిస్వాముల వారికి పంపారు. తరువాత నాలుగయిదేండ్లు గడిచాయి. ఆ తరువాత ఒకసారి జగద్గురువులు తణుకు వచ్చారు. గోస్తనీ నదికి స్నానానికి వెళ్లి వస్తూ ఒక చోట ఆగి 'ఇక్కడెక్కడో లక్ష్మీసహస్రశర్మ యిల్లు ఉండాలే' అని వాకబు చేశారు. అప్పుడక్కడున్న వారెవరో 'లక్ష్మీసహస్రం రాసిన శర్మగారయితే యిదిగో, యీ ఎదురిల్లే' అన్నారట.

అప్పుడా జనంలోనే వుండి స్వామి వారి దర్శనం చేసికొంటున్న శర్మగారు యిదంతా విని ముందుకు వచ్చి స్వామి వారికి పాదాభివందనం చేసి తానే లక్ష్మీసహస్రం రాసిన శర్మనని మనవి చేశారు.

అన్ని వందల పుస్తకాలు వస్తుంటే స్వామివారందులో తను రాసిన పుస్తకాన్ని చదవటం, తరువాత ఎన్నేండ్లకో తణుకు వస్తే తన పుస్తకంపేరే గాక తన పేరు (శర్మ) గుర్తు పెట్టుకొని వాకబు చేయటం, అదీ సరిగ్గా తన యింటి ఎదుటనే పల్లకీ ఆపి అడగటగం చూసి శర్మగారికి ఎంతో ఆశ్చర్యం, ఆనందం కలిగాయి.

అయితే స్వామి వారాయన పట్ల చూపిన అనుగ్రహం అంతటితో ఆగలేదు. ఏదో పర్వదినం సందర్భంగా స్వామి వారు ఆ వూళ్లో ముత్తయిదువలకు సువాసినీ పూజ చేసి చీర, రవికె బహూకరించారు. ఆ సందర్భంగా శర్మగారిని పిలిపించి ఆయన లక్ష్మీ సహస్రం నుంచి పద్యాలు చదవమన్నారు. ఒక్కొక్క పద్యం పూర్తికావటంతోటే స్వామి ఒక్కొక్క ముత్తయిదువకు చీర, రవికె, బహూకరిస్తూ వచ్చారు. లక్ష్మీదేవికి స్వయంగా అర్చన చేసి పసుపు కుంకుమలతో చీర, రవికె అర్పిస్తున్నట్లే వుంది ఆదృశ్యం. శర్మగారాశించిన దాని కన్నా ఆయన పుస్తకానికి అలా ఎన్నో విధాల స్వామి ఆశీస్సులభించింది.

Paramacharya pavanagadhalu    Chapters