Paramacharya pavanagadhalu    Chapters   

43. అపర 'అప్పర్‌'

దక్షిణాదిన యిదివరకు యిద్దరు గొప్ప శివభక్తులుండేవారు. ఒకరు జ్ఞాన సంబంధర్‌, ఈయన బ్రాహ్మణుడు, రెండవ వారు అప్పర్‌, ఈయన వెళ్లాలజాతికి చెందినవాడు. ఇతడు మొదట జైనమతం తీసుకొన్నాడు. కాని తరువాత తన అక్కతిలకవతి అనే గొప్ప శివభక్తురాలి వలన తిరిగి శివభక్తుడుగా మారాడు.

అప్పర్‌, జ్ఞాన సంబంధర్‌ - యీ యిరువురూ వొకరిని గురించి మరొకరు విన్నారు. ఒకరిపై మరొకరికి గౌరవం కలిగింది. అప్పర్‌ను చూడాలని జ్ఞాన సంబంధర్‌కూ, జ్ఞాన సంబంధర్‌ను చూడాలని అప్పర్‌కూ ఆలోచన కలిగింది. ఒకసారి జ్ఞాన సంబంధర్‌ ఎక్కడికో యాత్రలకు పోతూ ఉండగా అప్పర్‌ వుండే వూరి మీదుగా వెళ్ళాల్సి వచ్చింది. గొప్ప భక్తుడు వస్తున్నాడని తెలిసిన గ్రామస్థులు పొలిమేర వద్దనే ఆయనకు ఘనంగా స్వాగతం చెప్పి పల్లకీలో వూరేగిస్తూ తీసుకొని వస్తున్నారు. వూళ్లోకి రాగానే జ్ఞాన సంబంధర్‌ 'అప్పర్‌ ఎక్కడ?' అని అడిగారు.

'ఇక్కడ', అని పల్లకీ కింది నుంచి వినపడిందట. జ్ఞాన సంబంధర్‌ అంటే వున్న భక్తి కొద్దీ అప్పర్‌ ఆయనకు స్వాగతం పలకటానికి పొలిమేర దగ్గరకి పోవటమే కాదు ఆయన కూచున్న పల్లకినీ యితర బోయీలతో పాటు తానూ మోస్తున్నాడు!

సరిగ్గా అప్పరు లాంటి భక్తుడొకరు స్వామి వారికి కూడా తటస్థపడ్డాడు. ఆయన చెట్టినాడు నివాసి రామనాధ చెట్టియార్‌, స్వామివారు కడియాపట్టి అన్న గ్రామం వచ్చినపుడు వూరి వారు స్వామికి ఊరిబయటనే ఎదురుకోళ్లు చేసి, పల్లకీపై ఊరేగిస్తూ గ్రామంలోకి తీసికొని వచ్చారు. ఊరేగింపు అయిన తరువాత ఆ జన సమ్మర్థంలో చెట్టియార్‌ ఎక్కడా స్వాముల వారికి కన్పించలేదు. ఆయన అక్కడి గ్రామస్థులను 'చెట్టియార్‌ ఎక్కడా కనిపించలేదేమిటి?' అని అడిగారు. కొద్ది దూరంలో వున్న చెట్టియార్‌ అది విని వచ్చి స్వాముల వారికి కనిపించి నమస్కారం చేశాడు.

'ఇంత సేపు ఎక్కడ వున్నావు? కనబడలేదు?' అని అడిగారు స్వామి. 'ఎక్కడికీ పోలేదు, మీ పల్లకీ మోస్తున్నా' అని చెట్టియార్‌ నవ్వుతూ జవాబు చెప్పారట. అప్పరును తలపిస్తూ.

Paramacharya pavanagadhalu    Chapters