Paramacharya pavanagadhalu    Chapters   

44. పిల్లలు - పెద్దలు

ఒకసారి స్వామి వారు తిరుచునాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఒక గ్రామంలో వారు వెళ్లుతూ వుంటే ఒక దృశ్యం ఆయన కంటపడింది. ఒక చిన్న పిల్లవాణ్ణి వాళ్ల అక్కయ్య దేనికో మందలిస్తూ వుంది. ఆ అమ్మాయి వయసు 12 మించదు. ఇంతకూ ఆమె ముద్దుల తమ్ముడు చేసిన నేరం చాలా పెద్దదే. అబద్ధం చెప్పాడు. అలా అబద్దాలాడుతే తన తమ్ముడు చెడిపోతాడని, ఇక నుంచయినా నిజమే చెప్పవలసిందని ఆ అమ్మాయి అతడికి బోధిస్తోంది. ఆ అమ్మాయిని చూస్తే స్వామి వారికి చిన్న పిల్ల మాట్లాడుతున్నట్లనిపించలేదు. మహాత్ములెవరో ప్రబోధం చేస్తున్నట్లు అనిపించింది. తరువాత ఎంత కాలం గడిచినా, ఈ సంఘటన ఆయన మనః ఫలకం పై నుండి చెరిగి పోలేదు.

ఇదిలా వుండగా కేరళలో మరొక సన్నవేశం ఆయన కంట పడింది. అక్కడ ఆయనొక సత్రంలో బస చేశారు. పక్కన ఒక గదిలో యిద్దరు నంబూద్రి బ్రాహ్మణులున్నారు. ఇద్దరూ పెద్దవాళ్లే. ఏదో కబుర్లలో పడిపోయారు. ఇంతలో పూజ సమయం అయింది. అందులో ఒకాయన దేవతార్చన పెట్టె బయటకు తీశాడు. అయితే కబుర్లలో కాలం గడిపిన ఆయనకు పూజ చేసే 'మూడ్‌' రాలేదు. శ్రద్ధ లేకుండా మొక్కుబడిగా పూజ చేయటం కన్న అసలు మానేసింది మేలనుకున్నాడు. మళ్లీ విగ్రహాలను దేవతార్చన పెట్టెలో పెట్టి భద్రంగా దాచేశాడు. ఆరాధనా విషయాలలో ఆయన చూపిన నిజాయితీ స్వామిని ఆకర్షించింది.

చిన్న పిల్ల తమ్ముడు చేస్తున్న తప్పును తెలుసుకోగలిగింది సరిదిద్దే యత్నం చేస్తోంది. పెద్దవాడే యిక్కడ తప్పు (లౌకికమౌన ముచ్చట్లలో పడి పూజకు అనువయిన పవిత్ర వాతావరణాన్ని ఏర్పరచుకోలేకపోవడం వారు చేసిన తప్పు) చేశాడు అయినా మరో తప్పు (శ్రద్ధ లేని పూజ చేయడం) చేయకుండా నిజాయితీ చూపినందుకు స్వామి ఎంతో హర్షించారు.

విజయం కలిగితే అహంకారం పెరుగుతుంది. అలా మనలో అహంకారం ఎక్కడ పెరిగిపోతుందోనని అమ్మ మధ్య మనకు ఏవో కష్టాలను కలుగజేస్తుంది. ఆమె కృప చేతనే కష్టాలు తీరిపోతాయనే నమ్మకంతో, అమ్మను ధ్యానిస్తూ , ఆమెనే నమ్ముకొని మన కర్తవ్యం మనం నిర్వర్తిస్తూ పోతుంటే చివరకు ఆమే మనకు సంతోషం, జయం కలిగిస్తుంది.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters