Paramacharya pavanagadhalu    Chapters   

45. అతీంద్రియ జ్ఞాని

ఒకసారి కామకోటి మఠంలో స్వామి సన్నిధిని యం.యస్‌.సుబ్బలక్ష్మి గారు కచేరీ చేశారు. సుబ్బలక్ష్మి గారికి భగవద్భక్తి ఎక్కువ. అందులోను కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య అంటే ఎంతో గౌరవం, భక్తీను.

స్వామి వారి సన్నిధిలో పాటకచేరీ అంటే బయట వుండే హంగులేమీ వుండవు. ఆమె, ఆమె భర్త సదాశివన్‌, వయోలిన్‌ వాయించేవాడు, మృదంగం వాయించేవాడు, ఆ బృందం తమ సామాన్లు పట్టుకొని నిశ్శబబ్దంగా లోనికి వచ్చి అక్కడున్న జంపఖానాపై సర్దుకొని కూచున్నారు. స్వామిరాగానే సాష్టాంగ నమస్కారాలు చేసి ఆయన అనుమతి తీసికొని కచేరి ప్రారంభించారు.

సుబ్బలక్ష్మిగారు సుప్రసిద్ధగాయని, ప్రత్యేకించి, భక్తి గీతాలు ఆలపించటంలో అందెవేసిన చేయి, అందులోనూ పరమాచార్య సన్నిధి. భక్తిరసంలో ఓలలాడుతూ ఆమె పరవశించి పాడుతోంది.

స్వామి వారు మాత్రం ఎప్పటివలె ముఖంలో ఏ భావం లేక నిర్లిప్తులుగా వున్నారు. కాని మిగిలిన వారంతా మైమరచి వింటున్నారు. అంతా అనగానే సుబ్బలక్ష్మి గారి కచేరీలకు సాధారణంగా హాజరయే వేలాది జనం కాదు. స్వామి వారితో పాటు అక్కడ మహావుంటే ముఖ్యులో పది మంది వుంటారేమో వారు.!

పాటపాడుతూనే సుబ్బలక్ష్మిగారు లేచి నిల్చున్నారు. తరువాత తోటకాష్టకం అందుకొన్నారు. ఒక్కొక్క శ్లోకం పూర్తి అయినప్పుడల్లా ఆమె స్వామి వారికి ఎంతో భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారం చేస్తూ వచ్చారు.

ఇదంతా జరుగుతున్నంతసేపు స్వామి వారు తన కేదీ పట్టనట్టు కూచున్నారు. ఆయన ముఖాన ఏ భావమూ లేదు. ఒక పండు తీసికొని అటు యిటూ త్రిప్పుతూ కూచున్నారు. తరువాత నెమ్మిదిగా దానిని వలిచారు. అటూ యిటూ చూసి దగ్గరలో ఒక నాలుగేండ్ల కుర్రాడు వుంటే వాడిని పిలిచి వాడి చేతిలో ఆ పండు వేశారు. మళ్లీ యింకొక పండు తీసికొన్నారు. దాంతో మళ్లీ కాసేపు ఆడుకొన్నారు. అప్పుడక్కడ వున్న వారిలో విశాఖ గారొకరు. ఆయన అసలు పేరు మెట్టపాలయం ఓరుగంటి బాలకృష్ణ శర్మ. ఆయన జగద్గురు బోధలు అన్న గ్రంథం రచించారు. పూర్వాశ్రమంలో స్వామి వారి సోదరులైన సాంబశివశాస్త్రి గారు అరవంలో రచించిన స్వామి వారి జీవిత చరిత్రను శర్మగారు తెలుగించారు. యీ క్రీడనంతటినీ శర్మగారు గమనిస్తూ, మనసులో 'ఈసారి స్వామి వారి చేతిపండు ఏ అదృష్టవంతునికి చేరునో?' అని అనుకున్నారుట. ఆ తరువాత కొద్ది క్షణాలకే స్వామి శర్మగారికి సైగ చేసి పిలిచి ఆయన చేతిలోనే ఆ ఫలాన్ని వేశారు!

కృష్ణుడెలా వున్నాడు? మనసును చదవటం స్వామి వారికి సహజక్రీడ అనిపిస్తుంది. ఒకసారి ఒక ముత్తయిదువకు ఒక కల వచ్చింది. ఏమని? తనతో చిన్న కృష్ణుడు వచ్చి ఆడుకొంటున్నట్లు. ఆ కల సంగతి స్వామి వారితో మనవి చేయాలని ఎంతో కోరికతో స్వాముల వారి దర్శనానికి వచ్చింది. ఆవిడ, తీరా స్వామి వారి సన్నిధిలోకి వచ్చి నమస్కరిస్తుండగానే స్వామి ఆమెను చూసి, ''చెప్పవూ, కృష్ణుడెలా వున్నాడు? కువలయదళ నీలం!'', అన్నారు.

చాలా పుణ్య క్షేత్రాలలో రథోత్సవాలు నిర్వహిస్తారు. రథం లాగటంలో జాతి, మత భేదాలు గాని, బీదవాడని ధనికుడనే తేడా గాని వుండదు. ఆ బాల గోపాలం అంతస్థులను మరచి అత్యుత్సాహంతో యిందులో పాల్గొంటారు. దేవుని సన్నిధిలో అంతా సమానమే అన్న దానికి యిది తార్కాణం. రథం లాగేటప్పుడు అంటుగాని, మైల గాని లేదు, రథం లాగింతర్వాత యింటికి వెళ్లి స్నానం చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఆచారాన్ని సముద్ధరించాలి. రథం చిన్నదైనా, పెద్దదైనా సరే!, అంతా కలిసి రథం లాగటంలో పాల్గొనాలి. ఈ ఆచారం మన సంఘీభావానికి గుర్తు.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters