Paramacharya pavanagadhalu    Chapters   

49. చరమ వృత్తి

1938లో స్వాములవారు నెల్లూరు వచ్చారు. పురజనులకోరికపై అక్కడ దాదాపు 3 నెలలున్నారు. ఒక రోజు ఏదో గోష్ఠి జరుగుతూ వుంటే మండలీక వేంకటశాస్త్రి గారు చరమవృత్తి అని ఏదో చెప్పబోయారు. వెంటనే స్వామి, 'శాస్త్రీ! చురమవృత్తి అంటే ఏమిటి?' అని అడిగారు.

శాస్త్రిగారు, 'చరమవృత్తి అంటే మరణలీనమైన వృత్తి'- అని చెప్పారు. దానిపై స్వామి, 'ధ్యానము చేయగా, చేయగా, అది పరిపక్వమై అందు కలిగే అఖండ బ్రహ్మాకార వృత్తికి చరమవృత్తి అని పేరు', అన్నారు.

దానిపై శాస్త్రిగారు 'చిత్తం, రేపు మళ్లీ దీనిని గురించి మనవి చేస్తాను', అన్నారు. ఆరాత్రి శాస్త్రిగారు గ్రంథాలను తిరగేశారు, చరమవృత్తి అర్థం కోసం. అద్వైత సిద్ధి అనే గ్రంథంలో 'చరమవృత్తి మరణకాలీన అఖండ బ్రహ్మాకార వృత్తి' అని కన్పించింది. అలా మూడు చోట్ల ఆ గ్రంథంలో వుంది. శాస్త్రిగారా మూడు స్థలాలను జాగ్రత్తగా మననం చేసికొని మరునాడు స్వామిని కలవటానికి వెళ్లారు. వెళ్లగానే స్వామి, 'చరమవృత్తి గురించి ఏదయినా గ్రంథంలో ప్రమాణం దొరికిందా?' అని అడిగారు. శాస్త్రిగారు తాను 'అద్వైతసిద్ధి'లో ఒక స్థలంలో చదివింది చెప్పారు.

స్వామి వెంటనే 'మిగతా రెండు చోట్ల ఏం రాశారో వినిపించు' అన్నారు. తాను 3 స్థలాలలో రాసింది గుర్తు పెట్టుకొని వచ్చిన సంగతి స్వామి కెలా తెలిసింది? అని ఆశ్చర్యపడుతూనే శాస్త్రిగారు శ్రీవారికి యిక తాను చెప్పవలసినది ఏదీ లేదని వూరుకున్నారు. అయితే స్వామి వూరుకోలేదు. 'నీవు చెప్పినదానికి ప్రమాణం చూపావు. మరి నేను చెప్పిన దానిక్కూడ ఏదయినా ప్రమాణం దొరుకుతుందేమో చూడు', అన్నారు.

'నేను మానవమాత్రుణ్ణి కనుక నేను చెప్పిన దానికి ప్రమాణం చూపించవలసి వుంది. మీరో! భగవానులు. వేదానికి వలె మీరు స్వత! ప్రమాణులు, మీ నోటి వెంట వచ్చే పలుకునకు ప్రమాణం చూపనక్కరలేదు' - అని శాస్త్రిగారు బదులు చెప్పారు.

కాని స్వామి వదలలేదు. 'నీకు నేను వకాల్తా యిస్తున్నా, నా తరపున నీవు గ్రంథాలు తిరగేసి నా మాటలకేదన్నా ఆధారం దొరుకుతుందేమో చూచి చెప్పు' అన్నారు. శాస్త్రిగారికేమీ తోచలేదు. ఏ గ్రంథమని తాను వెదక గలడు? సరే! ఇంటికి రాగానే పుస్తకాల బీరువా తెరచి చేతికి తగిలిన పుస్తకాన్ని బయటికి లాగారు, చూస్తే అది భగవద్గీతకు శ్రీ మధుసూదన సరస్వతీస్వాములు రచించిన వ్యాఖ్యానము. దానిపేరు గూడార్ధ దీపిక, తెరవగానే 18వ అధ్యాయం వచ్చింది. అది చూస్తూ వుండగా అందులో ఒక చోట చరమవృత్తికి సంబంధించిన చర్చ కన్పించింది. అందులో రెండు విధాలుగా ఈ సంగతిని చర్చించారు.

సాధకునికి బ్రహ్మజ్ఞానం కలగ్గానే అజ్ఞానం అంతా ఒక్కసారిగా నశించదు. కొంచెం మిగిలే వుంటుంది. మరణకాలంలో అఖండ బ్రహ్మాకార వృత్తి కలిగి ఆ కొంచెం కూడా నశిస్తుంది. అప్పుడు ముక్తి కలుగుతోంది. దీని ప్రకారం చరమవృత్తి అంటే మరణకాలీనాఖండ బ్రహ్మాకార అని అర్థం. ఇదే శాస్త్రిగారన్నది.

ఇక రెండో పక్షం, విద్యుచ్ఛక్తి సంపర్కం వలన ఫాన్‌ తిరుగుతూ వుంటుంది. కరెంటును ఆపి వేశాం. అయినా అదివరకు విద్యుత్తు యిచ్చిన వూపును బట్టి కరెంటు ఆగినా మరి కొంత సేపటి వరకూ ఫాన్‌ తిరుగుతూనే వుంటుంది. తరువాత అది క్రమంగా నిదానించి ఆగిపోతుంది. అలాగే ధ్యానం చేయగా చేయగా పరిపక్వత చెంది బ్రహ్మజ్ఞానం కలిగిన వానికి అఖండ బ్రహ్మాకార వృత్తిచే అజ్ఞానం పూర్తిగా నశిస్తుంది. కాని కరెంటు ఆగిన తరువాత కొంత సేపు ఫాన్‌ తిరిగినట్లు దేహాదికముల సంస్కారాలు, ప్రభావం కొంతకాలం వుంటాయి. అప్పుడు సంస్కారాలు నశించి మరణకాలంలో వేరే బ్రహ్మజ్ఞానం అక్కర లేకుండానే దేహాదికములు పోతాయి. ఈ ప్రకారం చూస్తే చరమవృత్తి అంటే ధ్యాన పరిపాకాంతంలో కలిగే అఖండ బ్రహ్మాకార వృత్తి అని అర్థం. ఇది స్వామి చెప్పింది.

శాస్త్రి గారికి ఏనుగెక్కినంత సంతోషం కలిగింది. వెదకబోయిన తీగె కాలికి తగలటానికి కారణం ఎవరు అని వారాలోచించుకున్నారు. అంతా స్వామి అనుగ్రహం అనిపించింది. మరునాడు పుస్తకం తీసుకొని పోయి స్వామి వారి వాక్యాలకు ప్రమాణం దొరికిందని చూపారు. స్వామి ఏ ఆసక్తీ చూపక ' ఈ పుస్తకం చూడాలని నీకెలా తోచింది?' అని అడిగారు.

'ఏదో అదృశ్యశక్తి నాకీ సహాయం చేసింది. నాకు కన్పించకుండా నాకు యీ పుస్తకాన్ని ఎవరో అందించారు. ఈ పేజీ దగ్గరే పుస్తకం తెరవబడేట్లు అనుగ్రహించారు. ఈ విచారం దగ్గరే నీ దృష్టి సోకేట్లు చేశారు. అంతా స్వామి అనుగ్రహం. నేను నిమిత్తమాత్రుణ్ణి' అనుకొని నమస్కరించారు శాస్త్రిగారు మరోసారి స్వామికి.

Paramacharya pavanagadhalu    Chapters