Paramacharya pavanagadhalu    Chapters   

53. కంచికి పోయిన కట్నం పేచీ కథ

1949 లో స్వాములవారు తంజావూరు జిల్లా పేరాలం రైల్వే జంక్షను దగ్గర వున్న విల్లుపూడి అనే గ్రామంలో నాలుగు రోజులు విడిది చేశారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు కొంతకాలం జనరల్‌ మేనేజర్‌గా వున్న టి.కె. త్యాగరాజన్‌ అక్కగారి వూరది. స్వాములవారిని తమ యింటికి భిక్షకు ఆహ్వానించిందావిడ. అందువల్ల త్యాగరాజన్‌ కూడ అక్కడ వుండటం తటస్థించింది.

పూజ చూడటానికి ఆ వూరివారే గాక దేశం నలుమూలలనుండి వచ్చిన వారెందరో అక్కడ వున్నారు. పూజకాగానే భక్తులకు స్వామి తీర్థం యిస్తున్నారు. క్యూలో వస్తున్న వారిలో బొంబాయి నుంచి వచ్చిన కుటుంబం వొకటుంది. ముందు తల్లి, తండ్రి వచ్చి తీర్థం తీసుకొన్నారు. తరువాత కొడుకు సుమారు పాతికేళ్ల వాడొచ్చి చేయి పట్టాడు.

స్వామివారు తీర్ధం యివ్వకుండా ఉద్ధరిణ వెనక్కు తీసికొని 'నీవూ నీ భార్య కలిసి వచ్చి తీర్ధం తీసుకోండి!' అన్నారు. ఆమాట విని ఆ యువకుడు తెల్లబోయాడు.

ఇంతలో పక్కగా వున్న ఆడవాళ్ల గుంపులో నుంచి ఒక అమ్మాయి ముందుకు వచ్చి ఆ యువకుడితోపాటు తానూ చేయి చాపింది. స్వామి యిద్దరికీ తీర్థం యిచ్చారు. తీర్ధం తీసుకొని ఆ అమ్మాయి యువకునితో కాక ఆడవాళ్ల వైపు పోతుంటే స్వామి 'అంతా కలసి బొంబాయి వెళ్లండి!' అని ఆశీఃపూర్వకంగా అన్నారు.

కట్నం విషయంలో వచ్చిన పేచీ మూలంగా ఆ అమ్మాయి పుట్టింట్లోనే వుంటోంది. పిల్ల కాపురం యిలా అయిందే అన్న బెంగతో ఆ పిల్ల తల్లి స్వామివారిని కలసి పిల్ల కాపురం చక్కబడటానికి ఆయన ఆశీస్సులు పొందాలని అక్కడికి వచ్చింది. అయితే తన కథ స్వామికి చెప్పుకొనే అవకాశం ఆమెకు అప్పటికింకా దొరకలేదు. పూజ తరువాత కదలిద్దామని కూచున్నాను. అయితే వాళ్లకు అదే రోజు అక్కడకు ఆ అమ్మాయి అత్తవారు వచ్చిన సంగతి తెలియదు. బహుశా ఆ అమ్మాయి అత్తవారు కూడ వీరికిజనంలో గుర్తించి వుండరు. బొంబాయి నుంచి వచ్చిన వాళ్లకు ఆ అమ్మాయి ఆ రోజక్కడకు వస్తుందనే సంగతి అసలే తెలియదు. వాళ్లేదో పనిపై మయూరం వచ్చి స్వామివారు సమీపంలో వున్న సంగతి విని దర్శనంకై కారులో వచ్చారు.

ఆ కుర్రవాడు తీర్థంకై చేయి జాపినపుడు 'నీ భార్యతో కలసిరా!' అని స్వామి అన్నారు. వాళ్లిద్దరూ కలిసి వుండటం లేదని స్వామికెలా తెలుసు? తీర్ధం కోసం కలిసి వద్దామనుకున్నా అతని భార్య అతనికి అక్కడెలా దొరుకుతుంది? ఆ వచ్చిన జనంలో అతని భార్య వుందని స్వామి ఎలా గ్రహించారు? వాళ్లందరిని బొంబాయి పొమ్మన్నారు; వాళ్లది బొంబాయి అని స్వామికి ఎలా తెలిసింది?

బొంబాయి ప్రయాణం సంగతి అనుకోలేదు కదా, అందుకని ఆ అమ్మాయి తనతో బట్టలేమీ తెచ్చుకోలేదు. ఆ సంగతే అన్నది వాళ్లమ్మ.

'బట్టలకేం ఫరవాలేదు. అవి బొంబాయిలో కొంటాం. స్వామి చెప్పినట్లు యిప్పుడే నలుగురం కలిసి బొంబాయి వెళ్లాలి'-- అని వారంతా అనుకొని స్వామికి నమస్కరించి బొంబాయి దారి పట్టారు.

ఏదయితేనేం కట్నం పేచీ కథ కంచికి, ఆ కుటుంబం సుఖంగా యింటికి వెళ్లారు.

కొంత మందికి ఆయా విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస వుంటుంది. ఆ విషయాలను వివరించగల వారెవరూ అని వారు వాకబు చేస్తారు. ఆ విషయాలు తెలిసిన వారు లభించినా, జ్ఞానం సంగతి వదిలి యితర కొలబద్దలను పెట్టి వారిని చూసేవారుంటారు. వారు మనకు నచ్చని వారయినా, లేక లౌకికంగా మనకన్న తక్కువ స్థాయిలో వున్న వారయినా, 'పోయి, పోయి, వాని వద్దనా నేర్చుకొనేది' అని ఈసడించుకొని వదిలేయటం కద్దు. కాని ఆ రకంగా చేయకూడదు అని తిరువళ్లు వర్‌ 'ఎవరెవరి నోట ఏ సుద్ది విన్నా, దాని మర్మమెరగ జ్ఞాన మగును' అని చెప్పారు.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters