Paramacharya pavanagadhalu    Chapters   

58. నువు చేసేది మంచిపనే, అదే చేయ్‌!

భారతీయ విద్యాభవన్‌ అధ్యక్షులు శ్రీ ధర్మసే ఖటావ్‌ స్వాముల వారి దర్శనం చేశారు. ఖటావ్‌ ను స్వామివారికి పరిచయం చేశారు, అక్కడున్న వారు.

'వీరి రెండు పేర్ల మధ్యలో ఇంకోపేరుండాలే,' అన్నారు స్వామి. ఆ పరిచయం చేసిన వ్యక్తి ఖటావ్‌ తోటి వచ్చిన వారే కాని ఆయన కా సంగతి తెలవదు.

ఖటాన్‌ గారది విని, 'అవును స్వామీ! నా పూర్తి పేరు 'ధరం సే మూల్‌ చంద్‌ ఖటావ్‌' అన్నారు.

ఖటావ్‌ గారు గొప్ప పారిశ్రామిక వేత్త. బాగా వున్నవాడు. స్వామి వారితో తాను స్వామికి కొంత ద్రవ్యం యివ్వాలని వచ్చినట్లుగా చెప్పాడు.

స్వామి 'సంతోషం! నీవు భారతీయ విద్యాభవన్‌కు అధ్యక్షుడివిగా వుండి ధర్మ ప్రచారానికి తోడ్పడుతున్నావు, అది కొనసాగించు, అదే నీవు నాకు చేయదగిన సేవ,' అన్నారు.

ఖటావ్‌ గారికి ఆశ్చర్య మేసింది. ఆయన కనుపిస్తే చాలు, అంతా ఆయనను ఏదన్నా విరాళం అడగాలని ఎదురు చూస్తుంటారు. ఇదేమిటి, ఈ స్వామి యిలా మాట్లాడతాడు? ఖటావ్‌ గారు సాగిల పడ్డారు స్వామికి యినుమడించిన భక్తి ప్రపత్తులతో.

ఇంకోసారి గుజరాతీ సేఠ్‌ ఒకరు స్వామి దగ్గరకు వచ్చి ఎట్టాగయినా స్వామికి కొంత ధనం సమర్పించుకోవాలని కూర్చున్నాడు.

స్వామి మఠం గుమాస్తాను పిలిచి ఈయన మనకేదో వొకటి యిద్దామనుకుంటున్నారు. మనకు ఏంకావాలి? ఏమడుగుదాం? - అని సలహా చేశారు.

''ఆ గుమాస్తా స్వామి శిష్యులే కదా! ఆలోచించి, స్వామి! ప్రస్తుతం మన కన్నీ వున్నాయి. సరే! వారిస్తామంటున్నారు. కనుక మన ఆవులకు కాస్త పచ్చ గడ్డి, తెలకపిండి యిమ్మంటే సరి! అన్నాడు

''గోవులకు మేత! భేష్‌''! - అని ఆమోదించారు స్వామి.

కోటీశ్వరుడు ఇద్దామనివస్తే యిదా అడిగేది?

'దాత పెంపు సొంపు తలప వలదె?'అనుకుని వుంటాడా సేఠ్‌!

Paramacharya pavanagadhalu    Chapters