Paramacharya pavanagadhalu    Chapters   

61. పేద వానికి పెద్ద పని

కృష్ణాజిల్లాలో పండరిపూర్‌ అని వొక వూరుంది. అక్కడ ఒకసారి మకాం చేశారు. స్వామి. అర్థరాత్రి సమయంలో ఆయనకొక ఆలోచన వచ్చింది. దివిసీమ తుఫాన్‌లో అనేక వందల మంది మరణించారు. అకాలంగా మరణించిన ఆ ప్రేతాత్మలకు భోజనం వేదనాదమే. అది ఏర్పాటు చేసి వెళ్లాలి. ఇది వారి సంకల్పం.

ఇంకేం, అక్కడ వున్న వారిలో ఒక ఘనాపాఠీ వున్నాడు. ఒక వేద పాఠశాల పెట్టాలిక్కడ. వేదం చెప్పే ఉపాథ్యాయుల మంత్రోచ్ఛాటనలు, వేదం చదివే విద్యార్థుల వేద పాఠాలు ప్రేతాత్మలకు శాంతి కలిగించాలి. ఈ పని నువు చేయి. విద్యార్థులందరితో సంధ్యావందనం అగ్నికార్యం సకాలంలో విధి విధానంగా చేయించు. నీ సంధ్య ఆలస్యమయినా 'ఫరవాలేదు', అని చెప్పారు.

ఆ ఘనాపాఠీ కలిగిన వాడు కాదు, పైగా బహుకుటుంబీకుడు, నలుగురిని కలిస్తే గాని ఇల్లు గడుపుకోవడమే కాదు. ఇంక ఈ భారం ఎలా మోయటం?

'ఎలాగా?' - అన్నాడాయన ఎట్టకేలకు ధైర్యం చేసి.

'అంతా అమ్మవారే చూసుకుంటుంది', అన్నారు స్వామి.

ఈ పేద సన్యాసి మాట ఆ పేద వైదికునికి (వేదపండితునికి) వేద వాక్కు కన్నా, సుగ్రీవాజ్ఞ కన్నా మిన్న! వేద పాఠశాల పెట్టాడు. దిగ్విజయంగా నడుపుతున్నాడు. ఆ యింట్లో ఒక పక్క వేద ఘోష, మరో పక్క కొడుకులూ, కోడళ్లూ, మనుమలూ, మనుమరాండ్ర కోలాహలం! ఆయనకు పన్నెండు మంది ఆడపిల్లలు! అందర్నీ వేదపండితులకే యిచ్చి చేశాడు. ఉన్న వొక్క కొడుక్కూవేదమే చెప్పించారు. ఆధునిక సమాజంలో వేద విద్యకు ఆదరణ కరువేనని తెలిసీ పేదరికానికి వెరవక కేవలం ఒక సన్యాసి మాటపై నిలబడి ఇంతటి భారాన్ని నిబ్బరంగా మోస్తున్న ఆ బడుగు బాపని ధైర్య సాహసాలు, తెగువ, త్యాగం నిరుపమానం.

శివము, కళ్యాణము, మంగళము, శుభము - అన్నీ శివుడే. ఆ శివుడే పరమ మంగళ స్వరూపులైన మన (ఆది శంకర) ఆచార్యులు.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters