Paramacharya pavanagadhalu    Chapters   

66. బాదమాకు - భారతీనిరుక్తి

విజయవాడలో శోధన్‌ పెయింట్స్‌కు చెందిన హరిసోదరులు ఆధ్యాత్మిక చింతన గల పండితులు. వారు తమ స్వగ్రామంలో గాయత్రిదేవి ఆలయం కట్టి నిత్యధూపదీప నైవేద్యాదులతో పూజ చేయిస్తున్నారు. అనేక మంచి గ్రంథాలు స్వయంగా రాసి, ప్రచురించి ఆర్షధర్మ ప్రచారం చేస్తున్నారు. గాంధేయ పద్ధతులలో కుటుంబపరిశ్రమగా రంగల తయారీ చేస్తూ న్యాయంగా సంపాదించిన సొమ్మలో విధిగా కొంత భాగాన్ని ధర్మ ప్రచారానికి వినియోగిస్తున్న వితరణ శీలురు.

వారు భారతీనిరుక్తి అనే గ్రంథం రచించారు. దానిని శ్రీవారికి వినిపించాలని వారి అభిలాష. శ్రీవారు ఏలూరు మకాంలో వుండగా వీరు స్వామిని కలవటానికి వెళ్లారు. వీరు వెళ్లింది ధనుర్మాసంలో బాగా తెల్లవారుఝూమునే లేచి పూజాదికాలన్నీ తెల్లవారే సరికి ముగించుకోడం వల్లనో ఏమో, మధ్యాహ్న సమయంలో అంతా విశ్రాంతిలో వున్నారు. వీరు శ్రీపీఠం విడిది చేసిన చోటికి వెళ్లారు. ఎక్కడా చలీ చప్పిడి లేదు. శ్రీవారికి తాము వచ్చిన సంగతి, వచ్చిన పనీ నివేదించుకుందామంటే అక్కడ ఎవరూ లేరు. ఎలా? ఎవరైనా బయటికి రాకపోతారా అని హరి సాంబశివశాస్త్రి గారు, వారి సోదరులూ వరండాలో నిరీక్షిస్తూ నిలుచున్నారు. పది నిముషాలు కూడ గడవకముందే పక్క తలుపుతెరుచుకొని శ్రీవారే బయటికి వచ్చారు. తన చేతిలో వున్న బాదమాకు వొకటి నేలపై వేసుకొని దానిపై కూర్చున్నారు. ఆశ్చర్యం, ఆనందం, సంభ్రమం ముప్పిరిగొని సాష్టాంగపడిని హరి సోదరులను ఆశీర్వదించి కూర్చోమని సైగ చేశారు. వారేమీ విన్నవించుకోక ముందే '' మీ గ్రంథాన్ని చదవండి!'' అన్నారు.

శ్రీహరి సోదరులు వచ్చిన సంగతిగాని, వారు ఫలానా పనిపై వచ్చారని గాని స్వామి కెలా తెలిసింది? తరువాత కాసేపు గ్రంథ పఠనం జరిగింది.

శ్రీవారు మాట్లాడుతూ గ్రంథరచన చేసే వారికి మూడు నియమాలు పెట్టారు. రచన రచయితలో అహంకారాన్ని పెంపొందించరాదు. పరనిందకూడదు. రచనతో దనార్జన చేయరాదు. రామాయణమనే పేరులో వున్న ఔచిత్యం, రామాయణాన్ని వేరు వేరు కాండలుగా విభజించిన పద్దతిలోని అర్థం, సుందరకాండ సౌందర్యం వీటిని ఈ మూడు నియమాలను పాటిస్తూ గ్రంధస్థం చేయుమని శ్రీవారు హరిసోదరులను కోరారు.

ఎప్పుడో విజయవాడలో శ్రీవారిని కలిసినప్పుడు వాల్మీకి తన కావ్యానికి రామాయణం అన్న పేరు ఎందుకు పెట్టిందీ చెబుతూ, ఆయన కాండలుగా ఆ కావ్యాన్ని విభజించిన వైనంలోని విశేషం. సుందరా కాండ సౌందర్యం గురించి హరి సోదరులు శ్రీవారితో తమ అభిప్రాయాలను వివరించారు. ఎన్నో ఏళ్ల తరువాత శ్రీవారు భారతీనిరుక్తి వింటూ మాటల మధ్య రామాయణ ప్రసక్తి రాగా లోగడ విజయవాడలో జరిగిన సంభాషణను గుర్తు పెట్టుకొని ప్రస్తావించారు. ఆ విషయాలపై గ్రంథం రాయుమని, రాసి వినిపించమనీ కోరారు. ఇవన్నీ వారికి ఎంతో ఆశ్చర్యం, ఆనందం కలిగించాయి. ఇందుకు వారు పెట్టిన నియమాల శ్రేష్ఠత్వం కూడ హరి సోదరులకెంతో సంతోషం చేకూర్చింది.

ప్రేమ శివమే. మంగళమూ శివమే. అంబిక సర్వమంగళ, శివ పార్వతుల మంగళకరమైన ప్రేమ ఎక్కడ కలుస్తున్నది? ఆ కలయిక సుబ్రహ్మణ్యునియందే. సుబ్రహ్మణ్య స్వామికే స్వామి అన్న పేరుంది. తక్కిన దేవతలు వీరి దగ్గరనే స్వామి శబ్దాన్ని ఎరువు తెచ్చుకున్నారు. తిరుపతిలో స్వామి పుష్కరిణి అన్న తీర్థం ఉంది. బాలాజీ అంటే వేంకటేశ్వరుడు, బాలుడంటే సుబ్రహ్మణ్యులు.

స్వామి అనుగ్రహం లభిస్తే మనకు పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం లభించినట్లే. స్వామి అనుగ్రహం పొంద దగిన రోజు సుబ్రహ్మణ్య షష్టి. తెలుగునాట దీనిని సుబ్బరాయుడు షష్టి అంటారు. సుబ్రహ్మణ్యుని నిత్యం ఆరాధించాలి. సుబ్రహ్మణ్య షష్టినాడు స్వామి ఆరాధన విశేషఫలప్రదం.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters