Paramacharya pavanagadhalu    Chapters   

75. అది మాకు శిరోధార్యం

శ్రీవారు గురజాడలో చల్లా శేషాచల శర్మగారి యింటి యందు విడిది చేసి వున్నప్పుడు, వారి పాదాలకు బంగారు పూలతో పూజ చేయాలనే సంకల్పం శర్మగారికి కలిగింది. ఆరోజు పాదపూజ శర్మగారిదని నిర్ణయం అయింది. సామాన్యంగా పాదపూజ ముందు ఆదిశంకరుల పాదాలకు జరుగుతుంది. శర్మగారి దృష్టిలో ఆదిశంకరులకు, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామికి తేడా లేదు. కనుక బంగారు పూలు చేయించి తీసుకొని స్వామి సన్నిధికి వెళ్లారు.

ఇంతలో పాదపూజ వారి పేర్లు పిలుస్తూ శర్మగారిని రమ్మన్నారు. వెళ్లి సాష్టాంగపడి కూర్చున్నారు శర్మగారు.

'ఏం! మామూలు పూలతో పూజ చేస్తే వాడిపోతాయనా బంగారు పూలు చేయించావ్‌?' అడిగారు స్వామి.

శర్మగారు నివ్వెరపోయారు, బంగారు పూలసంగతి స్వామికెలా తెలుసా? అని.

'సర్లే! ఏవీ పూలు? నూటపదకొండా?' అన్నారు స్వామి, అక్కడ శర్మగారుంచిన పూలపొట్లం అందుకుంటూ.

'లేదు స్వామి! నూట ఎనిమిదే!' అన్నారు శర్మగారు.

'లెక్క పెట్టు' అని స్వామి పొట్లం అక్కడ పడేశారు.

లెక్కిస్తే నూటపదకొండు వున్నాయి!

పూజ విజయవంతంగా పూర్తయింది.

తరువాత బంగారపు పని వానిని 'ఎన్ని పూలు చేశావు?' అని విచారించగా 'ఒకటి రెండు పూలు తప్పిపోయినా, తరువాత యిబ్బంది రాకుండా నూట పదకొండు చేశా'నని జవాబు వచ్చింది.

అది సరే! పూలు చేయించి, తూకం వేయించి తీసుకున్న శర్మగారికి ఆ సంగతి తెలియలేదు. కాని స్వామికెలా తెలిసింది?

తరువాత శ్రీవారు ఆ పూలను మాలగా చేయించి తెప్పించమన్నారు. అలాగే దండకూర్చి తెప్పించగా, స్వామి మహాత్రిపుర సుందరి, చంద్రమౌళీశ్వరుల ముందు వినయంగా తలవంచి నిలుచోని, ఆ మాల తమ మెళ్లో వేయమన్నారు.

శర్మగారు సందేహించి తాను ఆదిశంకరుని పాదుకలు, పరమాచార్య పాదాలు ఒకటేనని భావించి పూజ చేశానని, పాదపూజ చేసిన పూలను శిరస్సున ఎలా ధరిస్తారని తటపటాయిస్తూన్నట్లు తెలిపారు.

'నీవు ఏ భావంతో పూజ చేసినా నాకు సంబంధించినంతవరకు నీవు పూజ చేసింది శ్రీ ఆదిశంకర భగవత్పాదుల పాదుకలకే, ఆ నిర్మాల్యము మాకు శిరోధార్యం' - అని మరింత వినయంగా తలవంచి ఆ మాల ధరించారు ఆచార్యులు.

ఆదిశంకర భగవత్పాదుల స్మరణ అందరికీ ఆనందమే. ఆయన పరమశివావతారం. వటవృక్షం క్రింద దక్షిణామూర్తి మౌనంతో, ధ్యానంతో కూర్చుని వుంటారు. కలికాలంలో అలా వుంటే కుదరదు. మిగిలిన యుగాలలో రాక్షసులను చంపటానికి విష్ణువు ఆయుధాలతో అవతరించేవాడు. ఇపుడు రాక్షసులు వేరే ఎక్కడోలేరు. మన ఆలోచనల్లోనే వారున్నారు. విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే మారీచ సుబాహులు ఆ యజ్ఞాన్ని పాడు చేయటానికి పూనుకున్నారు. కాని వారు విశ్వామిత్రుని మనస్సు నావేశిస్తే, యజ్ఞం చేయాలన్న ఆలోచనే ఆయనకు కలిగేది కాదు. ఇప్పుడు అసురులు మన బుద్ధివృత్తులుగా మారి వున్నందున మనమే రాక్షసకృత్యాలన్నీ చేస్తున్నాం.

దక్షిణామూర్తిగా ఆయన మౌనం అనంతం కాగా, అది శంకరాచార్యులుగా ఆయన వాదం అనంతం.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters