Paramacharya pavanagadhalu    Chapters   

8. కుర్రవానిలో గురుదర్శనం

స్వామినాథన్‌ యింటికి ఓ రోజు వాళ్ల నాన్న గారి మిత్రుడొకరు వచ్చారు. ఆయన న్యాయవాది. అంతేకాదు, ఆయనకు జ్యోతిషం కూడా తెలుసు. తన రెండవ కొడుకు జాతకాన్ని ఓసారి చూడవలసిందని శాస్త్రి గారు కోరగా ఆయన వచ్చారు.

కాసేపు జాతకాన్ని పరిశీలించిన తరువాత ఆయన శాస్త్రిగారి భార్యను ఓ చెంబెడు నీళ్లు తీసికొని రమ్మని అడిగాడు. 'నీళ్ళెందుకు తెమ్మన్నాడా' అని శాస్త్రి గారాలోచిస్తుంటే, ఒక వేళ మంచి తీర్థం అడుగుతున్నాడనుకొని ఆవిడ వెళ్లి ఓ చెంబుతో మంచినీళ్లు తెచ్చి యిచ్చింది.

న్యాయవాది లేచి ఆ చెంబందుకొని స్వామినాథన్‌ దగ్గరికి పోయాడు. ఆ నీళ్లతో ఆ పిల్లవాడి కాళ్లు కడిగాడు. తల్లీ తండ్రీ నిర్ఘాంతపోయి చూస్తుండగా ఆయన ఆ బాలునికి ఎంతో భక్తితో సాష్టాంగనమస్కారం చేశాడు.

శాస్త్రిగారు ఆశ్చర్యం నుండి తేరుకొని 'అదేంపని! పెద్దవాడివి నువు పిల్లవాడి ముందు సాగిలపడటమేమిటి?' - అని మందలిస్తున్నట్లు అన్నారు.

అప్పుడా న్యాయవాది నవ్వుతూ, 'నేనెంత? ఈ ప్రపంచం అంతా ఈ చిన్నవాని పాదాలకు ప్రణమిల్లే రోజు రేపు రాబోతుంది. కాని అప్పుడు నేనుంటానో, ఉండనో తెలియదు కదా! అందుకని ఈరోజే ఆ పని చేసి తరించా' - అన్నాడు.

తరువాత అబ్బాయి జాతకాన్ని గురించి చెబుతూ, భావిలో ఆ పిల్లవాడు ఆత్మజ్ఞానిగా రూపొంది అందరి పూజలూ అందుకొంటాడని వివరించాడు.

ఆ న్యాయవాది చెప్పిన జోస్యం తరువాత అక్షరాలా నిజమైంది. అశేష ప్రజలతో బాటు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కూడ వినమ్రులై ఆ బాలునికి సాష్టాంగ ప్రణామం చేసే రోజు వచ్చేసింది. - ఆ పైన పదేళ్లయినా గడవకుండానే...

'వేదాలు పవిత్ర నదీ ప్రవాహం వంటివి. ఆయా మతాలు ఆ పావన నదీ తీరంలో అక్కడక్కడా నెలకొల్పబడిన స్నాన ఘట్టాలు'.

- పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters