Paramacharya pavanagadhalu    Chapters   

81. రాజా ధర్మస్య కారణం

బ్రిటీషు జాతీయుడు సర్‌ పాల్‌బ్రూక్‌ 1958లో మదరాసులో స్వాముల వారిని కలిసారు. రాత్రి 8.30 గం.ల సమయం. చుట్టూ కొబ్బరి చెట్లున్నాయి. మధ్యలో ఒక గడ్డి వాము. ఆరుబయట ఏర్పాటయింది ఆ సమావేశం.

స్వాముల వారు వచ్చి అక్కడ ఒక పీట వుంటే దానిపై కూర్చున్నారు. డ్యూక్‌, ఆయన మిత్రుడు హెస్టిన్‌ కిందనే చతికిలపడి కూర్చున్నారు.

డ్యూక్‌ 'అంతంలేని అన్వేషణ' అన్న పుస్తకం రాశాడు. దానికాపేరెందుకు పెట్టారని స్వామి అడిగారు. 'నా అన్వేషణ పూర్తికాలేదు, అందుకని' అని డ్యూక్‌ చెప్పాడు.

స్వాముల వారు దానిపై 'మీ అన్వేషణ బాహ్యమైనదయితే అంతం లేదు. దిగంచలాలను అందుకోవాలి. ఆ పైన మిథ్య, అలా కాక మీ అన్వేషణ ఆంతర్యమైనదైతే ఆత్మదర్శనంతో అది అంతం అవుతుంది' అని అన్నారు.

తరువాత కాసేపాగి స్వామి మళ్లీ యిలా అన్నారు: 'ఒక విధంగా అంతరాన్వేషణ కూడా అంతంలేని దనవచ్చు. అన్వేషించే వస్తువుకు అంతం లేదు కనుక.'

వచ్చిన వారు పాశ్చాత్యులు, వారికి నేలపై బాసిపట్లు వేసుకొని కూర్చునే అలవాటు లేదు. అందువల్ల వారు కాసేపు కాళ్లు బారచాపి, కాసేపు ముడుచుకొని రకరకాలుగా అవస్థపడుతున్నారు. అదిచూచి అక్కడ వున్న వారొకరు స్వాములవారి సన్నిధిలో అలా కాళ్లు బారచాపటం మర్యాదకాదని వారికి హితవు చెప్పబోయారు. అది విని స్వామి, 'వారు చిన్న పిల్లలతో సమానం. వారిని అలా నిర్బంధించవద్దు. వారెలా కూర్చున్నా ఫరవాలేదు' అని చెప్పారు.

ప్రజలు తమ జీవితాలను గడుపుకోవటం పురుషార్థాలయిన అర్థం. కామం, మోక్షం - వీటిని సంపాదించుకోడానికే అయితే ఈ పురుషార్థాలను సంపాదించుకోడం అనేది ధర్మబద్దంగా జరగాలి. అందుకే ధర్మం మొట్టమొదటి పురుషార్థంగా ప్రాధాన్యం సంతరించుకొంది. రాజు పని ఏమిటి? ప్రజలు ధర్మాన్ని విడువకుండా వుంటూనే అర్థ, కామ, మోక్షాలను సంపాదించుకొనేలా చూడటం. అందువల్ల రాజా ధర్మస్య కారణం అన్నారు, అని స్వాముల వారు పాల్‌ డ్యూక్‌కు వివరించారు.

Paramacharya pavanagadhalu    Chapters