Paramacharya pavanagadhalu    Chapters   

84. ఎదురొచ్చిన పెన్నిధి

శ్రీపురాణాల రామకృష్ణ శాస్త్రి గారికి పుత్ర సంతానం లేక స్వామిని వేడుకొన్నారు. సేతు స్నానం, నాగప్రతిష్ఠ చేయవలసిందని చెప్పి స్వాముల వారు ఆశీర్వదించారు. ఆయన 1963లో కుటుంబసమేతంగా రామేశ్వరం బయలుదేరుతూ పుదుక్కోట సమీపంలో స్వాముల వారి దర్శనం చేశారు. రామేశ్వరం నుండి తిరిగి వచ్చే సమయంలో మరోసారి దర్శనం అనుగ్రహించమని వేడుకొన్నారు. శ్రీవారు 'అలాగే'నన్నారు.

శాస్త్రిగారు 15 రోజుల పాటు రామేశ్వరం వగయిరా దక్షిణ యాత్రలు చేశారు. తిరిగి వస్తూ స్వామి తంజావూరు సమీపంలో వున్నారని తెలిసి అటువేపు బయలుదేరారు. తంజావూరు యింకా 7 మైళ్లుందనగా రోడ్డు రెండుగా చీలింది. ఎటువెళితే స్వాముల వారున్నవైపు వెళ్లేది అర్థం కాలేదు. కనుచూపు మేరలో ఎవ్వరూ కనిపించలేదు. కారాపుకొని ఏం చేయాలో తెలియక శాస్త్రి గారు శ్రీవారినే స్మరించసాగారు.

ఇంతలో పక్క రోడ్డునుంచి ఒక కారొస్తోంది. దానిని ఆపు చేసి దారడుగాం అనుకుంటుండగనే అది కాస్తా సర్రున వాళ్లను దాటి వెళ్లి పోయింది. 'అరె! ఈ కారు మనం ఆపే లోగానే వెళ్లిపోయిందే'! అనుకొంటుండగా ఆశ్చర్యంగా ఆ చిన్నకారు మళ్లీ వెనక్కు తిరిగి వాళ్ల దగ్గరకు వచ్చింది.

కారులోంచి ఒక వ్యక్తి దిగి తనను తాను పరిచయం చేసుకొన్నాడు. తన పేరు పి.కె.యస్‌. మణిఅయ్యర్‌ అంటూ, 'మీరు కంచి స్వామి ఎక్కడ ఆగారో తెలుసుకోడానికి యిక్కడ ఆగారా?' అని అయ్యర్‌ అడిగారు.

అవునన్నారు శాస్త్రిగారు.

'ఈరోజు స్వామి వారు పుదుక్కోటలో మా యింటికి దయచేస్తున్నారు. మీరంతా కూడ మాయింటికి రండి!' అని శాస్త్రి గారిని ఆహ్వానించాడు, అయ్యర్‌.

వెంటనే శాస్త్రి గారి కారు గూడా అయ్యర్‌ గారి కారు వెంట పుదుక్కోటకు పోయింది. వారితో కలిసి శాస్త్రి గారి కుటుంబం కూడా ఆ రాత్రి శ్రీవారి దర్శనం చేసికొన్నారు. ఆనందంగా.

1965లో శాస్త్రి గారికి పుత్ర సంతానం కలిగింది.

Paramacharya pavanagadhalu    Chapters