Paramacharya pavanagadhalu    Chapters   

89. కలసిన పేర్లు - కాలుని చూపు

స్వాముల వారంటే అమిత భక్తిగల శిష్యులెందరో వున్నారు. అట్టి వారిలో ఒకరు తన కుమారునికి చంద్రశేఖర్‌ అని స్వామి వారి పేరు పెట్టుకొన్నాడు. ఆ సంగతి స్వామివారికి విన్నవించుకున్నాడు కూడా.

ఒక రోజు ఆ భక్తుడుండే వూరికి ఎన్నో మైళ్ల దూరంలో కంచిలో వున్న స్వాముల వారుతన అనుయాయులతో ఏదో ముచ్చటిస్తూ వున్నారు. ఉన్నట్లుండి ఆయన సీరియస్‌గా ''అరేయ్‌! నాకు యముడు కన్పిస్తున్నాడురా!'' అన్నారు.

వెంటనే వారంతా 'మీకు యముడు కన్పించటమేమిటి? మీ వంటి ఈశ్వర భక్తులకు ఆమడ దూరంలోకి కూడా యముడు రాలేడు' అని అన్నారు.

స్వాముల వారేమి బదులు చెప్పలేదు. మౌనగా కూర్చున్నారు. బహుశా యమదర్శనం అయిన అనుమానం చేత ఆ పీడ పోవటానికేదన్నా జపం చేస్తున్నారేమోనని అంతా అనుకున్నారు.

కాసేపాగి స్వాముల వారు 'నేను కుహనా సన్యాసిని కదా! యముడికి నేను పనికి రాలేదేమో! నా దగ్గరకు రావటానికి యిష్టపడట్లేదు, అన్నారు గంభీరంగా.

వెంటనే అక్కడున్న వారు 'మీరు సాక్షాత్భగవత్స్వరూపులు. మీరు కుహనా (దొంగ) సన్యాసినంటారేమిటి? భ##లే పరాచికాలాడుతున్నారు, ఆచార్య స్వాములని' నవ్వేశారు..

ఆ తర్వాత చాల సేపటికి మఠానికి ఓ దుఃఖ వార్త అందింది. ఏ సమయాన స్వాముల వారు యమదర్శనం గురించి మాట్లాడారో సరిగ్గా అదే సమయానికి వేరే వూరిలో స్వామి వారి పేరుతో పిలువబడుతున్న స్వామి వారి శిష్యుని పిల్లవాడు వొకడు చనిపోయాడు.

అల్పాయుస్సు కలవాడయిన ఆ పిల్ల వానికి తన పేరు పెట్టటానికి శ్రీవారు సమ్మతించి, అతడిని తరింపజేశారేమో! అతనికి తన పేరే కాక, శిష్యవాత్సల్యం కొద్ది తన అంశ కొంత అతనిలో నిక్షిప్తం చేశారేమో, అతడిని అంతకు ముందు ఆశీర్వదించినప్పుడు? దాని ఫలితంగా, ఆ చంద్రశేఖర్‌ కోసం వచ్చిన యముడు స్వాముల వారి అనుమతి కోసం కనిపించి మౌనంగా కూర్చుని తన అంశను ఉపసంహరించుకున్న తరువాతనే తన పని తాను కానిచ్చుకొని వెళ్లాడేమో? ఎవరి ఊహ వారిది.

Paramacharya pavanagadhalu    Chapters