Paramacharya pavanagadhalu    Chapters   

9. గంపెడాశ - గండుపిల్లి

స్వామినాథన్‌ చిన్న పిల్లవాడుగా వున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒక గండుపిల్లి ఒకరోజు వాళ్ల యింట్లో దూరింది. ఏదన్నా తినే వస్తువు దొరుకుతుందేమోనని అది అక్కడా యిక్కడా వెతుక్కుంది. ఇంతలో రాగి ముంత ఒకటి దాని కళ్లబడింది. అందులో ఒక బెల్లం ముక్క వుంది. ఏదో తినేది దొరికింది యింతే చాలునని అది ఏ ఆలోచన లేకుండా ఆ ముంతలో మూతిదూర్చి అడుగున వున్న బెల్లం ముక్క నందుకోబోయింది. ఆశకొద్దీ మూతిలోపలికి జొనిపింది కాని అది మళ్లీ తన తలకాయను బయటకు తీసుకోలేకపోయింది. కారణం దాని తలకాయ ఆ ముంతలో యిరుక్కుపోవడమే. ఎలాగయినా తలకాయను బైటకు లాగేసుకోవాలన్న ఆత్రంతో అది అటూ యిటూ పరుగెత్తటం ప్రారంభించింది. అయితే దానికి అప్పుడు కండ్లు కనపడవు గదా! - గోడకో దేనికో వెళ్లి అది కొట్టుకోడం, దాంతో ఆ రాగి ముంత చప్పుడు కావటం జరుగుతోంది. బయటపడుకున్న శాస్త్రిగారు వాళ్లూ లోపల యెవడో దొంగ ప్రవేశించి అంతా సవరిస్తున్నాడనుకొన్నారు. గప్‌చిప్‌గా ఇరుగుపొరుగును పిలిచి కర్రలూ కట్టెలూ తీసుకొని అంతా ఆ దొంగల్ని పట్టుకోవాలన్న సంరంభంలో సన్నద్ధులై వెళ్లి ఆ గది తలుపులు తీశారు. తీస్తే ఏముంది? రాగి ముంతలో మూతిపెట్టిన మార్జాలం!

ఆ తరువాత అంతా నవ్వుకొని నెమ్మదిగా ఆ పిల్లిని పట్టుకొని ఎంతో అవస్థపడి దాని ప్రాణాలు కడబట్టకముందే దాని తలకాయను ముంతలో నుంచి బయటకు తీశారు. ఆ పని పూర్తయ్యేసరికి వాళ్ల తల ప్రాణలు తోకకు వచ్చాయ్‌!

ఈ సంఘటన స్వామినాథన్‌ మనసుసై చెరగని ముద్రవేసింది. ఆశ అన్ని కష్టాలకు మూలం అన్న సంగతిని యీ సంఘటన వివరిస్తుంది. పిల్లి చేస్తున్న చప్పుళ్లు విని దొంగలు పడ్డారని పొరపడ్డ పెద్దల 'రజ్జు సర్పభ్రాంతి'ని కూడా ఈ కథ వెల్లడిస్తోంది.

'అన్ని మతాలూ ఒకటే అని గుర్తించటమే హిందూ మతం గొప్పతనం. మతాలు పరస్పర విరుద్ధం కావు. సనాతన ధర్మానికి చెందిన అంశలు మాత్రమే. ఇది ఏదో సిద్దాంతమో, ఎవరి వూహో కాదు. ఆత్మ దర్శనం చేసిన మన మహర్షులు చాటిన సత్యం'

- పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters