Paramacharya pavanagadhalu    Chapters   

90. ద, ద, ద

1966లో విజయదశమి నాడు ప్రఖ్యాత గాయని శ్రీమతి యం.యస్‌. సుబ్బలక్ష్మి అమెరికా వెళ్లింది. అక్కడ ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్‌ హాలులో ఆమె పాట కచేరి జరిగింది. ఆమె గానానికి అక్కుడున్న వారంతా మంత్రముగ్ధుల్లా అయిపోయారు. ఇంతకూ, ఆమె పాడినపాట రాసిందెవరో కాదు, పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామే. ఆ కీర్తన యిది......

''మైత్రీం భజతాఖిల హృజ్జేత్రీం

ఆత్మవదేవ పరానపి పశ్య -

యుద్ధం త్యజత, స్ఫర్థాం త్యజత

త్యజత పరేష్వక్రమమాక్రమణం

జననీ పృథివీ కామ దుఘాస్తే

జనకో, దేవః సకల దయాలుః

దామత్య దత్త దయధ్వం జనతాః

శ్రేయో భూయాత్‌ సకలజనానాం''

తాత్పర్యం: అందరి హృదయాలను ఆకర్షించే మైత్రీ భావాన్ని పెంపుచేసుకోండి! ఇతరులను మీ వలనే చూచుకోండి! విద్వేషంతో కూడిన పోటీ వదలిపెట్టండి! యుద్ధాన్ని మానండి! అక్రమ ఆక్రమణం వద్దు. మన తల్లి భూమి కామధేనువు. మనతండ్రి ఈశ్వరుడు అందరి యెడ దయకల వాడు. దామత్య = నిగ్రహించుకోండి! దత్త = ధారాళంగా దానం చేయండి! దయధ్వం = అందరి యెడ దయతో ఉండండి! అందరికీ శ్రేయస్సు కలుగుగాక!

ప్రజాపతికి మూడు రకాల సంతానం వుంది. (1) దేవతలు (2) మనుష్యులు (3) రాక్షసులు.

దేవతలు వెళ్లి ప్రజాపతిని మాకు ధర్మం బోధించండి అని అడిగారు.

ఆయన 'ద' అన్నాడు. తరువాత నేను చెప్పింది అర్థమయ్యిందా? అన్నాడు.

దేవతలు వెంటనే, ''ఆ! మేము భోగలాలసులం కనుక మీరు 'ద' అంటే దమం అంటే నిగ్రహాన్ని అలవరుచుకోమన్నారు', అని జవాబు చెప్పారు.

వాళ్లు వెళ్లగానే మనుష్యులు వచ్చారు. 'తండ్రీ! మాకేదన్నా బోధించండి!' అంటూ, ప్రజాపతి 'ద' అన్నాడు. నేను చెప్పింది అర్థమయ్యిందా? అని అడిగాడు.

మనుష్యులు 'ఆ! మేము లోభం కలవాళ్ళం. అందుకని మీరు మాకు ద=దత్త అంటే దానం, ధర్మం చేసికోడం అలవాటు చేసికొమ్మన్నారు' అని చెప్పారు.

తరువాత రాక్షసులు వచ్చి అలాగే అడిగారు. ప్రజాపతి వారిక్కూడ 'ద' అని చెప్పి తాను చెప్పింది అర్ధమయిందా అని అడిగాడు.

వాళ్లు మేము స్వభావసిద్ధంగా క్రూరులం, కనుక మీరు మాకు ద =దయను అలవరుచుకోమని చెప్పారు అన్నారు.

కలియుగం కావటం వలన మనలో దైవత్వం, మానవత్వం, దానవత్వం మూడు ప్రస్తుతం ముప్పిరిగొని వున్నాయి.

కనుక మనం ద,ద,ద అంటే దమం, దత్త, దయ మూడింటినీ అలవరుచుకోవాలి. ఈ కథ బృహదారణ్యకోపనిషత్తులో వుంది.

ఈ ఉపనాషత్సుధాసారాన్నే స్వాముల వారు సుబ్బలక్ష్మి గారి మధుర గళం ద్వారా తన కలం నుండి మానవాళికి సందేశామృతంగా మార్చి అందించారు.

'పురాణం మిత్యేవ నసాధు సర్వమ్‌' - ఒక విషయం పురాతనమైంది. కనుక అది మంచిది అనరాదు. మంచిని దేని నుండయినా గ్రహించాలి. పాతదని నిరాకరించటం కూడా సరికాదు.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters