Paramacharya pavanagadhalu    Chapters   

96. ఇక నుంచి వద్దన్న పని చేయకు!

ఆ రోజు పూజ పూర్తయింది. అంతవరకూ ఆనందతన్మయులై ఆ పూజను తిలకిస్తున్న జనమంతా లేచి వరుసలు కట్టి నిలుచుంటున్నారు, తీర్థం తీసికోడానికి.

ఇంతలో అయిదేండ్ల పిల్లవొకతె ఏడుపులంకించుకొన్నది. సంగతేమిటంటే ఆ సందట్లో ఎవరో ఆ పిల్ల మెళ్లో వున్న బంగారపు గొలుసు కాస్త కొట్టేశారు. చుట్టూ చేరిన వారంతా ఎలా పోయింది? 'మీరు కూచున్న చోట వెతికారా?' 'అసలిక్కడకు వచ్చినప్పుడు వేసుకొచ్చారా? గుర్తు తెచ్చుకోండి!' యిలా తలవొకరకంగా పరామర్శిస్తున్నారు

ఆ పిల్ల, పిల్ల తల్లి కాసేపు వెతికి, తరువాత నిల్చోని తీర్థం కోసం స్వాములవారి దగ్గరకు చేరారు. స్వామి ఆవిడను క్యూలోంచి తప్పుకొని పక్కకు నిల్చోమని సైగ చేశారు.

ఈలోగా 'క్యూ' ముందుకు జరుగుతోంది. ఒక వయసు మళ్లినావిడ ముందుకు వచ్చి తీర్థం కోసం స్వాముల వారి ముందు చేయి జాపింది.

స్వామి ఆవిడ వేపు చూసి ఉద్దరిణ పక్కన బెట్టి 'ఇచ్చేయి' అన్నారు. 'నాదగ్గరేముంది స్వామి యీయటానికి?' అందావిడ.

'ఎందుకు పాపం మూటకట్టుకుంటావు?' అన్నారు స్వామి. ఇంతలో పక్కన వున్న ఆడవాళ్లు ఆమెను పట్టుకొని వెదకగా బొడ్లో దోపుకున్న బంగారు గొలుసు బయటపడింది. అది ఆ పిల్లదే!

స్వామి తాను పక్కకు నిలబడమని సైగ చేసిన తల్లినీ, పిల్లనూ పిలిచి తీర్థం యిచ్చారు. తరువాత అక్కడ పెట్టివున్న గొలుసు తీసుకొని వెళ్లమన్నారు. అంతేకాదు. ఆ గృహిణి వేపు చూస్తూ 'ఇక నుంచి వద్దన్న పని చేయకు', అన్నారు.

గృహిణ చెంపలు వేసుకుంటూ 'అలాగె స్వామి!' అని గొలుసు తీసుకొని, కండ్లు తుడుచుకొని స్వామికి సాగిల పడి మొక్కి సెలవు తీసికొంది. ఇంతకూ వద్దనగా ఆవిడ చేసిన పని ఏమిటి?

ఆమె భర్త గుమస్తా, అతడు తన ఉద్యోగానికి టైము తప్పకుండా వెళ్లాలి. భార్య పూజ గురించి తొందర పడుతుంటే తనకు అన్నం వడ్డించిన తరువాత పూజకు పొమ్మని భార్యకు చెప్పాడతను. అయితే ఆవిడకు, పాపం!, తొందరగా వెళ్లి పూజ చూడాలని వుంది. అందుకని ఆదరాబాదరాగా అన్నం వండి, అక్కడ పడేసి భర్తను వడ్డించుకుని తినమని గబగబా పూజ దగ్గరికి వచ్చిందా యిల్లాలు.

'పూజ మీదా, తీర్థం మీదా నీకెంత శ్రద్ధ వున్నా నీ ధర్మాన్ని నీవు వదలిపెట్టకు. నీ భక్తి కన్నా స్వధర్మం ముఖ్యం' అన్నది స్వామి మతం.

ఇదే నీతిని బోధించే కథ మనకు భాగవతంలో వుంది. ఒక ముని తపస్సు చేసికొంటుంటే, ఒక కొంగ ఆయన పై రెట్ట వేసింది. అన ఆగ్రహించి దానివేపు చూసే సరికి అది అతని కోప దృష్టికి మాది చచ్చి కింద పడింది. ఆయన అది చూసి 'అయ్యో' అనుకొని ఆ తరువాత వూళ్లోకి భిక్షకు వెళ్లాడు.

ఒక యింటి ముందు ఎంతో సేపు నిలుచున్న తరువాత గాని ఆ యిల్లాలు భిక్ష తేలేదు. ఆలస్యమయినందుకాయన మండిపడ్డాడు. అయితే ఆవిడ కంగారు పడకుండా, 'నీవు కోప దృష్టితో చూడగానే చచ్చిపడిపోడానికి నేనేం కొంగను కాను' అంది శాంతంగా!

కొంగ సంగతి యీవిడ కెలా తెలిసిందబ్బా! అంత శక్తి యీవిడ కెలా వచ్చింది? అని అందుకావిడ ఏ వ్రతం చేస్తోందో?' అని ఆశ్చర్యపడి ఆయన ఆ సంగతేదో వివరించమని ఆమెనే అడిగాడు.

ఆవిడ నవ్వి, నేనే తపస్సూ, ఏ వ్రతమూ చేయటం లేదు. ఇల్లాలిగా నా స్వధర్మం నేను చేస్తున్నా అంతే! నా భర్తకు అవసరమైన సపర్యలు చేసి ఆయనను నిద్రబుచ్చి, నా స్వధర్మం నిర్వర్తించుకొని వచ్చినందువలననే నీకు యీ రోజు భిక్ష తేవటం ఆలస్యమయింది, అని వివరించిందామె. ఆ తర్వాత వచ్చే ధర్మ వ్యాధుని కథ కూడ 'స్వధర్మాన్ని ఆచరించటం ఎంత ముఖ్యమో తెలిపేదే. ఆ విషయాన్నే సూచించిన స్వామి ఆయిల్లాలిని స్వధర్మాన్ని అలక్ష్యం చేయొద్దని హెచ్చరించారు.

భోజన కాలంలో గోవింద నామ స్మరణ చేయండి!గోవింద స్మరణంచే పూతమైన అన్నం శరీరంలో ప్రవేశిస్తే అది పరమాత్మ ధ్యానం చేయాలన్న కోరికను పెంపొందిస్తుంది. ఆ అన్నసారం ఫలంగా దైవధ్యాన భావన కలుగుతుంది.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters