Paramacharya pavanagadhalu    Chapters   

99. పంచదారతో ప్రాణ భిక్ష

అది 1978. చావలి సుబ్రహ్మణ్యశాస్త్రి గారనే స్వామి భక్తునికి వొకసారి జబ్బు చేసింది. స్పృహ కూడ లేని స్థితిలో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఆయన కుమారుడు శ్రీరాం హంపి వెళ్లి అక్కడ మకాం చేస్తున్న కంచి కామకోటి పెద్ద శంకరాచార్యులను కలిశారు. శాస్త్రిగారికిజబ్బు చేసిన సంగతి విన్నవించుకున్నారు.

స్వామి అంతా విన్నారు. వెంటనే యింత విభూతి తెప్పించి తన వంటికి రాసుకున్నారు. దానిని వొక విస్తరిలోకి విదిలించారు. శ్రీరాంతో ఆ విభూతి పట్టుకొనిపోయి, నీళ్లలో కలిపి వాళ్ల నాన్నగారికి తాగించమన్నారు.

స్వామి చెప్పినట్లే శ్రీరాం చేశారు. అదేమి చిత్రమో గాని అప్పటికి పది రోజుల నుండి స్పృహ లేకుండా వున్న శాస్త్రి గారు ఆ భస్మపు నీరు గొంతుకలో పడగానే కళ్లు తెరిచి, నిద్ర నుంచి మేల్కొన్న వాడిలా లేచి కూర్చున్నారు. డాక్టర్లకు ఎంతో ఆశ్చర్యం కలిగింది.

శాస్త్రిగారు తిరువాలూరులో బృహదీశ్వరాలయానికి గాలి గోపురాల నిర్మాణం కోసం పది లక్షల రూపాయలు విరాళం యిచ్చారు. ఆలయాధికారులు రసీదుపై శాస్త్రిగారి పేరు రాయబోగా ఆయన వొప్పుకోలేదు. కంచిస్వామి పేరే రాయించారు.

1982లో శాస్త్రి గారికి శతాభిషేకం జరిగితే, అప్పుడు జరపవలసిన ప్రక్రియనంతా కంచి పెద్ద స్వాములే రాయించి పంపారు. హోమాలు అవీ ఆయన చెప్పినట్లే చేయిస్తుండగా, రెండో రోజున శాస్త్రిగారి భార్యకు అకస్మాత్తుగా జబ్బు చేసి కోమాలోకి వెళ్లింది. అప్పడు స్వామి వారు ఉగార్‌ అనే వూళ్లో మకాం చేస్తున్నారు. శాస్త్రిగారి కొడుకు శ్రీకృష్ణ హుటాహుటిన బయలుదేరి అక్కడికి వెళ్లారు. ఆయన స్వామి వారి మకాం చేరుకునే సరికి రాత్రి 2 గంటలయింది. అక్కడే కాచుకుని తెల్లవారుఝూమున నాలుగున్నరకు స్వామిని కలిశారు. అంతా చెప్పారు.

స్వామి వారు కాసేపు కళ్లు మూసికొని ధ్యానం చేశారు. తరువాత కొంచెం పంచదార తీసికొని పొట్లం కట్టి యిచ్చారు. 'ఏమి ఫరవాలేదు. ఇది ఆవిడ నోట్లో వేయండి. అంతా సక్రమంగా జరుగుతుంది', అని ఆశీర్వదించి పంపారు.

ఇంకో చిత్రం, తిరుగు ప్రయాణానికి 'నీకు విమానం ఎన్నింటికి వుంది?' అని స్వామి అడిగారు. '7 గంటలకు అది అందుతుందో లేదోనని భయంగా వుంది' అన్నారు శ్రీకృష్ణ. 'భయం లేదు అందుతుందిలే, వెళ్లు' అన్నారు స్వామి. కారులో ఆఘమేఘాలమీద హైదరాబాదు చేరుకున్నారు. ఆరోజు విమానం గంటన్నర లేటు కావటంతో ఆయన అందుకోగలిగారు. మద్రాసులో విమానం దిగి తనకై వచ్చిన కారులో యింటికి వెళుతూ డ్రైవరును 'అమ్మగారి పరిస్థితి ఎలా వుంది?' అని అడిగారు. డ్రైవరు 'తెల్లవారు ఝామున నాలుగున్నర గంటలకు కళ్లు తెరిచారు' అని చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి ఉగార్‌లో స్వామి ధ్యానం చేసి పంచదార ప్రసాదం శ్రీకృష్ణగారి చేతికిచ్చి భయం లేదని అభయం యిచ్చి పంపారు.

పంచదార నోట్లో పడగానే శాస్త్రిగారి భార్య కళ్లు తెరిచి మాట్లాడటం, శతాభిషేకం పీటల మీద దంపతులిద్దరూ కలిసి కూర్చుని పూజలన్నీ సలక్షణంగా జరుపుకోవడం అయ్యాయి. తరువాత ఒక ఏడాదికి ఆమె స్వర్గస్థురాలయింది.

స్వామి వారికి ఆ సంగతి తరువాత శ్రీకృష్ణ చెప్పగా ఆయన 'మీ అమ్మగారు ఏడాది క్రితమే కాలం చేసి వుండాల్సింది. కాని కామాక్షి అమ్మగారు వారి ఆయుర్దాయం ఒక సంవత్సరం పొడిగించింది. ఆమె తన కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాండ్రతో హాయిగా గడిపి, మీ నాన్నగారి శతాభిషేకం చక్కగా జరుపుకొని ఉత్తమలోకాలకు పోయారు. ఆమె కోసం మీరు విచారపడాల్సిన పని లేదు. అదృష్టవంతురాలు' అని శ్రీవారు వాళ్లను ఓదార్చారు.

శాస్త్ర సాంకేతిక రంగాలలో వచ్చిన అభివృద్ధి వలన, రవాణా సమాచార ప్రసార సౌకర్యాలు పెరగటం మూలంగా ప్రపంచదేశాలు దగ్గరయ్యాయి. దీని వలన వివిధ మతాల మధ్య సదవగాహన, సామరస్యం పెంపొందే అవకాశాలు అధికమయ్యాయి.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters