Satyanveshana    Chapters   

6. ఆశ్రమ ధర్మములు

స్వధర్మ నిర్వహణలో యుగధర్మాదుల, కులధర్మాదుల నిర్ణయించిన శాస్త్రములే, ఎల్లమానవులకు సర్వసామాన్యమగు ఆశ్రమ ధర్మములకు ప్రాధాన్యమిచ్చి, వాటి స్వరూపములను నిర్ణయించినవి. అన్ని ధర్మములకు మూలాధారము ఆశ్రమములు జననమాది షోడశకర్మలు మానవుని జీవితములో విది విహితములని చెప్పబడినవి. జీవితమును నాలుగు భాగములు జేసి ఒక్కొక్క భాగమున మానవుడు అనుసరింపవలసిన ధర్మముల నిర్ణయించి ఆ యా భాగములను ఆశ్రమములనిరి. ఆ యా ఆశ్రమముల ననుసరింపవలసిన ధర్మముల, ఆశ్రమ ధర్మముల; కవికులగురువగు కాళిదాసు,

శ్లా|| శైశ##వేభ్యస్త విధ్యానాం, ¸°వనే విషయైషినాం

వార్ధక్యే మునివృత్తీనాం యోగీనాం తేతనుత్యజామ్‌

అని నాలుగు ఆశ్రమముల ధర్మముల క్లుప్తముగ నిర్వచించెను. ఆ నాలుగు ఆశ్రమములు బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము. ఆ యా ఆశ్రమములకు నియమితములైన ధర్మములు విధి నిషేధములతో కూడినవి. మనకు మనోనిగ్రహము తక్కువ. సంసార మొక మహాసముద్రము. మనోనిగ్రహము తక్కువగ గల మానవులు సంసార సాగరమును తరించుటకు గీతలో కర్మమార్గము చెప్పబడినది. దానిని క్రమబద్ధము చేయునది భక్తిమార్గము. కర్మానుష్ఠానముచే అంతః కరణశుద్ధి బడసి, తద్వారా మానవుడు జ్ఞానమార్గము ననుసరించుటకు నర్హుడగును. ఈ కార్మానుష్ఠానమునకు, వర్ణాశ్రమ ధర్మములకు అవినాభావ సంబంధము కలదు. బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, యత్యాశ్రమములలో, ఉత్తరోత్తరము లుత్తమము లందురు. యతులకు సర్వకర్మ సన్యాసరూపమగు నివృత్తియే ఆత్మజ్ఞాననిష్ఠకు సాధనమందురు. కర్మ మార్గము ప్రవృత్తిమార్గము. అది సాధన రూపము. నివృత్తిమార్గము సాధ్యము. కర్మమార్గము విధివాక్యములవలన సిద్ధమగుచు, స్వర్గాది సుఖముల గూర్చుటకే కాక మోక్షప్రాప్తికిగూడ మార్గమే. అట్టి కర్మలు నిత్యనైమిత్తిక, కామ్య, వైదిక, లౌకిక, కాయక, మానసిక, ప్రాయశ్చిత్తాది బహురూపముల చెలువొందుచున్నవి. విధినిషేధములతో కూడిన నాలుగు ఆశ్రమములకు సంబంధించి యున్నవి. అందు ముఖ్యముగా గృహస్థా శ్రమధర్మము కర్మానుష్ఠానమే. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మానుష్ఠానము చేయుచున్న చిత్తశుద్ధి, వైరాగ్యము, జ్ఞానము కలుగును. జ్ఞానము మోక్ష హేతువు అందుచే అన్నిటికి మూలమగు గృహస్థాశ్రమమునకే అన్ని ఆశ్రమముల ప్రాధాన్య మీయబడినది. ఆయా ఆశ్రమముల ధర్మములు స్థూలముగా నిటుల చెప్పవచ్చును బ్రహ్మచర్యమున అధ్యయనాదులు, గృమస్థాశ్రమమున అగ్న్యారాధనాదులు, వానప్రస్థమున అరణ్యావాసము, యత్యాశ్రమమున శ్రవణ మననాదులు. ఆ యా యాశ్రమముల విధులను పరామర్శించుచు, అన్ని ఆశ్రమములకు గృహస్థాశ్రమమే ఆధారభూతం బగుననియు అది ముక్తి సాధనంబనియు సిద్ధాంతీకరించిన వాదమును పరామర్శింతము.

బ్రహ్మచర్యాశ్రమము :- బ్రహ్మచర్యము అనుదానిలో విశాలమైన విస్తృతమైన భావము కలదు. బ్రహ్మచర్యమనగా స్త్రీ పురుష సంబంధము లేకయుండుట అని సాధారణముగా భావించుట కద్దు. అటులకాక సర్వ శారీరక సౌఖ్యములందు నిగ్రహము, మానసిక చాపల్యమును, ఉద్రేకములను నిగ్రహించి అదుపులో నుంచుకొనుటకూడ బ్రహ్మచర్యమనియే అర్థము చెప్పుకొనవలయును శ్రీమన్నారాయణుడు బదరికాశ్రమమున నారదునకు చెప్పిన సనాతనములగు వివిధాశ్రమ ధర్మములు భాగవతమున ఇటుల నున్నవి.

బ్రహ్మచారి, మౌంజీ, కౌపీన, యజ్ఞోపవీత, కృష్ణాజిన, పలాస దండ, కమండల ధరుండును. సంస్కారహీన శిరోహుండును దర్భహస్తుండును, శీలప్రశస్తుండును మౌనియునై త్రిసంధ్యలందును బ్రహ్మగాయత్రి జపించుచు సాయంప్రాతరవీపరంబుల అర్కపావక గురుదేవ తో పాసనంబులు సేయుచు గురు మందిరంబునకుంజని దాసుని చందంబున, భక్తివినయ సౌమనస్యంబులు గలిగి వేదంబులు చదువుచు, అధ్యయనోప క్రమాత సానంబుల భిక్షించి, భైక్ష్యంబు గురువునకు నివేదించి, యనుజ్ఞగొని మితభోజనము కావించుచు, పర్వకాలంబుల నుపవసించుచు అంగ వలయందును, అంగనాసక్తులందును ప్రయోజనమాత్ర భాషణంబు లొనర్చుచు, గురుపరాంగనలవలన అభ్యంగన, కేశపాశ, ప్రసాధన శరీర మర్ధన మజ్జన, రహస్య యోగంబుల వర్జించుచు, గృహముననుండక జీతేంద్రియత్వంబున సత్యభాషణుండై సంచరించవలయును.

ఇది ఆనాటి సంప్రదాయము. దీనివలన ఋష్యాశ్రమములనో, గురుకులములనో, విద్యగఱచు విధానము వివరింపబడినది. ఒక మహర్షి, ఒక కులపతి. ఆనాటి గురుకులములు ఋష్యాశ్రమములు వంటివి. అధ్వయనమనగా వేదాధ్యయనమే. విద్యయనగా ఆధ్యాత్మిక విద్యయే. లౌకిక విద్యల అవిద్యలుగ పరిగణించిరి. వానిని అభ్యసించినను అధ్యాత్మిక విద్యకే ప్రాధాన్యమిచ్చిరి. కొంతకాలము తరువాత వెలసిన గురుకులములు, అగ్రహారములు. అందు కొన్ని ఏకభుక్తములు. మరికొన్ని బహుభుక్తములు. మహారాజకుమారులు సహితము, ఋష్యాశ్రమముల సామాన్యులగు ఇతరులతో కలిసి విద్య నభ్యసించినవారే. సాందీపునిసన్నిధిని కుచేలునితో కలిసి బలరామకృష్ణులు విద్యలు నేర్చునదియు, ద్రుపదుడు ద్రోణునకు సహాధ్యాయియై అగ్ని వేశునికడ విద్యగరచినదియు, పురాణ ప్రసిద్ధము. తరువాతి యుగముల ఆర్షవిద్యాభిమానులగు ప్రభువులు, వేద పండితులకు, శాస్త్రవేత్తలకు అగ్రహారములిచ్చి, విద్యాపీఠముల స్థాపించి సర్వులకు విద్యల అందుబాటులో నుంచినదియు సువిదితమే. ఒక్కొక్క అగ్రహారము ఒక్కొక్క విద్యాపీఠము. ప్రతిఫలము కోరకయే గురువులు శిష్యులకు విద్యలు గరపిరి సద్గృహస్తులు విద్యార్థులకు భిక్షరూపమున భోజనవసతులు చేకూర్చిరి. శిష్యులకు భోజన సదుపాయములు తమ యింటనే కల్పించి విద్యల నేర్పిన వదాన్యులగు గురువులును గలరు. విద్యార్థులు బ్రహ్మచర్య నియమములను కట్టుబాటులను పాటించి శ్రమించి విద్యనార్జించిరి.

వారు లౌకిక విద్యలు నేర్వకపోలేదు. వాటిని కూడ స్వధర్మ నిర్వహణమున కుపయుక్తములుగ భావించి కట్టుబాటులతో గ్రహించిరి. బ్రహ్మచర్యాశ్రమ మానాడు విధినిషేధములతో గూడి ధర్మబద్ధమైనది. గురుశిష్య సంబంధము వాత్సల్యముతో, అభిమానముతో, భక్తిశ్రద్ధలతో పునీతమైనది. కాలము మారినది. రానురాను లౌకిక విద్యలకే ప్రాధాన్యము హెచ్చినది పాశ్చాత్య విద్యావిధానవాసన; ఆర్యవిద్యా విధానమును ఆవరించి కనుచాటు చేసినది. విశ్వవిద్యాలయములు వెలసినవి. కళాశాలలు విద్యాకేంద్రములు, స్థాపింపబడినవి. భౌతిక రసాయన శాస్త్రాదులందు అభిమానము పెరిగినది. వాటికే ప్రాధాన్య మీయబడుచున్నది. రానురాను లౌకిక విద్యలయం దాసక్తియు, ఆధ్యాత్మిక విద్యలయం దనాదరణ పెరిగినవి ఆముష్మికచింత ప్రేరేపించు విద్యలను బోధించుటయే మానిరి మతవిషయమైన విషయములు బోధింపరాదని శాసించిరి. మత మనగా ఏదో ఒకమతము కాదనియు, అది సర్వులకు సమధర్మములైన, సన్మార్గమనము, ధర్మచింతన, సత్ప్రవర్తన, సచ్చీలము, నలవరుచు విద్యయని గ్రహించి, వాటిని ప్రబోధించుట ముఖ్యమని గ్రహించి, పాఠ్యభాగములలో జేర్చుట అవసరమని గుర్తించినటుల కన్పడదు. ఈ కారణమున విద్యార్థులలో క్రమశిక్షణ లోపించుట, మాతాపితలయెడ, గురువులయెడ, పెద్దలయెడ, గౌరవము సన్నగిల్లుట, తటస్థించినది. విద్యార్థులను నిందించిన లాభములేదు. విద్యావిధానములోనే లోపమున్నది. చిన్నతనమునుండియు క్రమమార్గమున తమ పిల్లలను పెంచి, మంచిబుద్ధులు, వినయశీలముల నలవరచని తల్లిదండ్రులది ఆలోపము తమ సంతానము యొక్క భవిష్యత్తు, జీవితము ధర్మమార్గమున నుండుటకు తల్లిదండ్రులు తగుశ్రద్ధ చూపకపోవుట లోపము అట్టి తలిదండ్రులు తమ విద్యుక్త ధర్మముల నెరవేర్ఛక వారి సంతానపు భవిష్యత్తును పాడుచేసిన వారనవలయును. వీరివలెనే అధ్యాపకులును తమ విద్యార్థుల సత్ప్రవర్తనకు సచ్చీలమునకు, ధర్మాభిరతికి సహకరించు బోధలు చేయవలయును. పరీక్ష లలో కృతార్థులగుటకు మార్గముల అన్వేషించుట మాత్రము చాలదు.

ఈ కాలమున నిత్యజీవనమునకు కావసలిన విద్యల నేర్చుచు, వినయసంపత్తి, సభ్యత్వము, సచ్ఛీలము, సంయమనము, ధర్మాచరణ, దైవభక్తి, మొదలగునవి పెంపొందించుటకూడ అవసరమని గుర్తించి విద్యావిధానమును మార్చినగాని విద్యాబోధ సత్ఫలముల నీయదు. సంపూర్తి యనియు చెప్పబడదు. విద్యగరచుట జీవనోపాధికి, ఉద్యోగము చేయుటకు మాత్రమేయని భావించినంతవరకు, అట్టి విద్యలవలన ఒక వ్యక్తికిగాని సంఘమునకుకాని అవంతయు ప్రయోజనముండదు. మానవుని శీలమును, వర్తన సంస్కృతిని పెంపొందించునదే నిజమగు విద్య. 'విద్‌' అనగా To know అనగా జ్ఞానము సంపాదించుట. జ్ఞానమనగా భగవంతుని ఎరుంగుట అనినచో విద్యయొక్క నిజస్వరూపము చెప్పినటులగును. ఎన్ని విద్యలలో కృతార్థులైనను సంస్కృత, సంస్కారములు, ఆలవడనియెడల మానవుడు మానవుడనిపించుకొనడు. ఆధ్యాత్మిక విద్యల నేమరుటచేతనే నేటి విద్యార్థిలోకమున అశాంతి, అరాజకము, అవిధేయత, యుక్తాయుక్త వివేచనారాహిత్యము, పెచ్చు పెరిగినది. ప్రత్యక్షముగ తమ మేలుగోరు తలిదండ్రులయందు, గురువులయందు, భక్తిలేనివారికి అప్రత్యక్షమగు దైవమునందు భక్తి యుండునా ? వారు అనాచారపరులని నిందించిన లాభ##మేమి? మనము వారికి నేర్పు విద్య అట్టిది. రాజకీయ వేత్తలు విద్యావిధానమున ప్రేలిడుచున్నారు. అట్టి రాజకీయవేత్తలలో ఎంతమందికి విద్యావిధాన నిజతత్వము తెలియును ? కొందరు తమ రాజకీయ ప్రయోజనములకు అమాయకులగు విద్యార్థులను బలివెట్టుచున్నారు. అట్టి స్వప్రయోజనపరుల మాటలను నమ్మి తమ కర్తవ్యమగు విధ్యాభ్యాస మును ఏమరచి, ఇతర రాజకీయ వ్యవహారములలో అనవసరజోక్యము కలిగించుకొను విద్యార్థుల భవిషత్తు ఏమి? ఇట్టివి ఎన్నేని సమస్యలు ఉత్పన్నము కాగలవు. జాగ్రత్తగ ఆలోచించుట విద్యావేత్తల విద్యాధి పతుల ధర్మము. ఈ నాటి విద్యార్థులకు, బ్రహ్మచర్యమునకు సగమెరుక. ధూమపానాదులు పరిపాటియైనవి. అసభ్యవచోరచనలు, అసభ్య సినిమా వీక్షణలు సర్వసాధారణమైనవి. వీటిని అరికట్టుటకు మార్గమేమి?

''శాస్త్రసమ్మతమైన ఆనాటి ఆశ్రమధర్మములు కూడా తప్పక అములోలేవని విచారపడనక్కరలేదు. ఆనాటి ఆచారములు ఈనాడు పూర్తిగ అమలులో నుండుటకు అవకాశములు లేకపోవచ్చును. అటు లైనను లౌకిక విద్యలతోపాటు పరవిద్యల బోధించుట మానవజీవితమును సక్రమమార్గమున మంచుటకు చాల అవసరమనియైన గుర్తించి విద్యా విధానమును మార్చవలయును. అటుల జరిగిననాడే విద్యార్థులు నిగ్రహము కలిగి యుక్తాయుక్త వివేచనతో సన్మార్గమున నడచి మానవకోటికి నుపకరించుచు తమ జీవితముల సుఖప్రదము చేసికొనజాలుదురు. అట్టి సద్బ్రహ్మ చారులగు విద్యార్థులు బ్రహ్మచర్యాశ్రమమున విద్యల నభ్యసించి తమ యభిమానశాస్త్రముల కృషిజేసినతరువాత, గురువుల అనుజ్ఞపొంది, మాతాపిత హిత బంధువుల శుభాశ్శీసులతో గృహస్థాశ్రమము స్వీకరింపవనియునని శాస్త్రములు విధించినవి.

గృహస్థాశ్రమము :-

శా. దారాస్వీకృతియు న్దయాభిరతియు న్థర్మార్జితార్థక్రియా

స్ఫారత్వంబును దేవ పితృతిధి పూజా స్థయిర్యము న్దీన దా

సీ రాజీసుత బాంధవాతుర జనశ్రేణి సమృద్ధాన స

త్కారోదారతయు న్గణింప గృహికి న్ధర్మంబు లుద్యన్మతిన్‌.

చ. అనఘ గృహస్థ పరుడై న నరుండు త్రిలోక పోషకుం

డనుపమ పుణ్యమూర్తి యత డాతని సంతతి ధర్మ సంపద

న్ముని పితృ దేవ భూత గణముం గ్రిమికీటక పక్షిసంఘము

న్మను గనుగొంచునుండుదురు మానక యర్ధులు వాని

వక్త్రమున్‌ (మార్క)

ఆ.వె. అతిధి బంధు దేవ పితృ పిశాచ ప్రేత

యక్ష మనుజ భూత పక్షి కీట

కముల కెల్ల విహిత కర్మగతుండై

యతడు సూవె యాశ్రమంబు తరుణి (కాశీ)

అట్టి గృహస్థాశ్రమము ముక్తి సాధనంబు. సర్వశాస్త్రములు ముఖ్యముగా గృహస్థునికొరకే వెలువడినవి. అవి గృహస్థు తరించుటకు సాధనమార్గములు ప్రబోధించునవి. ధర్మముల విధుల నిర్ణయించినవి. గృహస్థాశ్రమమున సర్వాశ్రమ స్వరూప లాభంబు లభ్యమగునని శాస్త్రములు చెప్పుచున్నవి ఇతర ఆశ్రమవాసులందరు తంగేటిజున్నువలె గృహస్థులపై యాధారపడి యున్నవారే. కాని కొందరు వేరుగా భావించు వారు లేకపోలేదు. గృహస్థాశ్రమాచార నిష్ఠునకు బ్రహ్మనిష్ఠ సిద్ధింపదని వారి భావము. బ్రహ్మనిష్ఠ యనగా, సర్వవ్యాపార పరిత్యాగంబున, ననన్య చిత్తంబునంజేసి, బ్రహ్మంబు నెరుంగుట. అనగా సమాధి నిష్ఠాగరిష్టులై దివ్యానుభూతులంది బ్రహ్మసాక్షాత్కారమున జ్ఞానులై ముక్తులగుట. అట్టి జ్ఞానులు కర్మలు చేయనక్కరలేదని వారి భావము. దీని సామంజసము ముందు ముందు విచారింతము. కర్మానుష్ఠానమునకు కర్మసన్యాసమునకు పరస్పరము విరుద్ధము కావున కర్మశూరునియందు బ్రహ్మనిష్ఠ సిద్ధింపదు అని వారి వాదన. కాని వర్ణాశ్రమ కర్మానుష్టాన వంతునకు యధావ కాశంబున బ్రహ్మనిష్ఠ సులభసాధ్యమే కర్మశూరుడు కర్మఫల త్యాగము చేయుటచే నిష్కామకర్మ పరతంత్రుడైన కర్మత్యాగి యగును. అంతియే కాదు, కర్మ సన్యాసికన్న అధికుడనియే చెప్పవచ్చును. అందుచే కర్మ నిష్టుండు బ్రహ్మంబు నెరుంగలేడను నిషోధోక్తి చెల్లదు. అటుల కాని యెడల యత్యాశ్రమము స్వీకరించి కర్మత్యాగము చేసినవారు వినా, మిగిలినవారు ముక్తులగుటకు ఆస్కారములేదని అంగీకరింపవలయును. ఇది శాస్త్రసమ్మతము కాదు. అనుభవవేద్యము కాదు. గృహస్థు స్వీయధర్మ ముల నెరవేర్చుచునే శ్రుతిస్మృతుల ప్రకారము జీవయాత్ర సాగించి, చిత్త శుద్ధి గలిగి, జ్ఞానియగుటకు మార్గము కలదని ఇదవరకే గుర్తించితిమి. గృహస్థులు జ్ఞానులు కాలేరనుట పొరపాటు. పంచమహాజ్ఞానులలో నొక డగు వశిష్టుడు అరుంధతీ ద్వితీయుడైన గృహస్థు. తపోరాశి, జ్ఞాన సముద్రుడు అయిన లోపాముద్ర ప్రాణనాధుడగు కుంభసంభవుడు మహాజ్ఞాని. అతడు వింధ్యాద్రి దమసుడు, సప్తసముద్రముల జౌపోసన పట్టగలిగిన ప్రజ్ఞాశాలి. వాతాపి పితలను భస్మీపటలము చేసిన తపోరాశి; గృహస్థు. జ్ఞానసముద్రుడైన శుకయోగి ధర్మసందేహముల తీర్చిన జ్ఞాని. రాజర్షి జనకుడు, రాజ్యపాలనాభారమును గృహస్థు ధర్మములను విడనాడినవాడు కాడు. కౌశికుడను బ్రాహ్మణునకు జ్ఞానబోధచేసిన ధర్మవ్యాధుడు గృహస్థు, మహాజ్ఞాని, నీతికోవిదుడు, ధర్మశాస్త్రజ్ఞుడగు విదురుడు; గృహస్థు. అందుచే గృమస్థు జ్ఞాని కానేరడు. కావ ముక్తి గాంచలేడనుట వాదమునకు నిలువదు. అది సత్యదూరము. బురదలో తిరుగు కుమ్మరిపురుగురీతి సంసారమునందుండియే సంసార పంకిలము అంటకుండ వ్యామోహములేకుండ, అరిషడ్వర్గముల జయించి సంసారయాత్ర, ధర్మనిర్ణేతవిధియని భావించు వాడు, జ్ఞానిఅగుటకు అభ్యంతరమేమి ? షోడశమహారాజులు, రఘువంశరాజులు, త్యాగరాజు, పోతరాజాదికవులు జ్ఞానులగు గృహస్థులే.

గృహస్థు అనగా వేదోక్తముగ వివాహమైన భార్యతో సంసారము సాగించువాడు. మానవునకు వివాహము అవసరమా? అసవరమే. అగ్న్యా రాధన గృహస్థుని ప్రథమ కర్తవ్యము పంచమహాయజ్ఞములు చేయుట వానివిధి. సపత్నీకునకుగాని అగ్న్యారాధనకు అధికారము లేదు. విధురునకు నిషేధము. అందుచే కర్మాధికారము సంపాదించుటకు మానవుడు గృహస్థుకావలయును. అందుచే గృహస్థాశ్రమము భగవంతుని నిర్దేశ మనియే భావించవయును. గృహస్థు అగుటకు వివాహతంత్రము అవసరమే. స్త్రీ పురుష భేదము లేనియెడల ఈ సృష్టియే లేదు. అందరు అవివాహితులై సన్యాసులేయయిన ఈ సృష్టియంతయు ఎందుకు? అంధుచే నందరు అవివాహితులై సన్యసించవలసినదేయనిగాక మనుజులు వివిధా శ్రమముల స్వధర్మముల నిర్వహింపవలసినదేయనుట ఈశ్వరాదేశము అని భావించుటయే సమంజసము. అదిగాక 'అపుత్రస్య గతిఃనాస్తి' అనిగదా శ్రుతివాక్యము. పున్నామనరకమును మానవుడు తరించుటకు పుత్రుల గాంచవలయును. పితృదేవతలకు స్వర్గవాసము స్థిరము చేయునది వంశవర్ధనమే. పుత్రజననము అటుతల్లివైపు; ఇటు తండ్రివైపు ఏడుతరముల వారిని పునీతుల చేయుననిగదా చెప్పుదురు. చరత్కారునిచరిత్ర ఈ గృహస్థ ధర్మావిశ్వకతను నిరూపించుటకే మహాభారతమున చెప్పబడినది. మహాభారతము పంచమవేదము; వేదవ్యాసప్రతిపాదితము. అందు ప్రతిసాద్యములైన ధర్మములు వేదసమ్మతములు.

వేద్యవ్యాస ప్రోక్తమగు శ్రీమద్భాగవతము మహాభక్త శిఖామణి యగు పోతనామాత్యునిచే ఆంధ్రీకరింపబడినది. అందలి పంచమ స్కంధములో స్వాయంభవుమనువు పుత్రుడగు ప్రియవ్రతుని చరిత్ర కలదు. ప్రియవ్రతుడు నారదబోధితుడై ఐహికవ్యాపారములందు విరక్తుడై, విష్ణుభక్తుడై స్వీయధర్మమగు రాజ్యపాలనజేయ తిరస్కరించి, తపము చేయు చుండెను స్మృతికర్తయగు మనువుపుత్రుడే స్మృతుల ఆదేశమునకు భంగము గలిగించుట ధర్మహాని. అది భగవంతుని నిర్దేశముకాదు. బ్రహ్మ అది గ్రహించి తపమాచరించుచున్న ప్రియవ్రతునకు ప్రత్యక్షమై, తత్త్వోపదేశముచేసి మరల గృహస్థాశ్రమమునకు వానిని మరల్చెను. ఆ బోధ యిటులున్నది. ''శ్రీహరి యాజ్ఞను జీవుండు తపోవిద్యలను, యోగ వీర్య జ్ఞానార్ధ ధర్మములను తనచేత నొరులచేత తప్పింప సమర్థుండుకాడు. ఉత్పత్తి స్థితినాశన బులకు, శోక మోహమయ సుఖదుఃఖములకు, నీశ్వరా ధీనుండుకాని జీవుండు స్వతంత్రుండుకాడు. అట్టి ఈశ్వరేచ్ఛకు కట్టుబడి సుఖదుఃఖముల ననుభవించవలయును. మానవుడు తాను నిమిత్త మాత్రుడనని భావించి, జితేంద్రియుడై యాత్మజ్ఞాన సంపన్నుడైన మోక్షంబు సాధించు. వనవాసియైనను, యతియైనను, జితేంద్రియుడు కాకుండునేని కామాదిసహితుం డగుటంజేసి సంసారబంధంబు వానికి సిద్ధించు మోక్షార్ధియగు నరుండు గృహస్థాశ్రమముననున్నను శ్రీనారాయణ చరాణారవిందంబులను ఆశ్రయించి, యరిషడ్వర్గంబుల జయించి ముక్తసంగుడై ఈశ్వర కల్పితంబులగు భోగముల ప్రసాదముగా గ్రహించి, అనుభవించి, ముక్తుండగును. గుణరహితంబైన స్వాంతంబు ముక్తికారణంబగును. ఈశ్వరుడు సర్వభూతాంతర్యామి యగుచు జీవాత్మ స్వరూపమున నుండును. జీవాత్ముడు జ్ఞానోదయంబునంజేసి, మాయనెంత కాలము గెలువకుండు, నంతకాలము ముక్తసంగుడుకాడు. ఆ నరుడు అరిషడ్వర్గముల జయించి పరతత్త్వంబు నెరింగిన ఈశ్వరుండగు''

చ. తపమున బ్రహ్మచర్యమున దానమునన్‌ శమ సద్దమంబులన్‌

జపమున సత్యశౌచములు సన్నియామాది యమంబులన్‌ గృపా

నిపుణులు ధర్మవర్తనులు నిక్కము హృత్తనువాక్యజంపు పా

వపు గుది ద్రుంతు రగ్ని శత పర్యవనంబుల నేర్చుకైవడిన్‌.

చ. కొందఱు పుణ్యవర్తనులు గోపకుమార పదారవింద జా

నంద మరందపాన కలనా రత షట్పదచిత్తులౌచు గో

వింద పరాయణుల్‌ విమలవేషులు దోషుమడంతు రాత్మలో

జెందిన భక్తిచేత రవిచేకొని మంచునడంచు కైవడిన్‌. (భాగ)

ఇటుల ప్రభోధితుడై ప్రియవ్రతుడు గృమస్థుడై విధివిహితకర్మలు చేసి యధాకాలంబున ముక్తుండాయెను.

వైవాహికజీవితంబు మానవుడు తనకొఱకు తనవారికొఱకు మాత్రమేయని కాక, అతిధియభ్యాగత, నిస్సహాయ, నిరుపేద, బ్రహ్మచారి, యతీశ్వరాదులను, ఇతర ప్రాణులను బ్రోచుటకు నియమితమైనదిగా భావించవలయును అనగా గృహస్థునకు స్వార్ధత్యాగము అవసరమనియు, పరోపకారపారీణత అనుసరణీయ పరమధర్మమనియు మనము గ్రహించవలయును. గృహస్థులే లేనియెడల విద్యార్ధులగు బ్రహ్మచారులకు భిక్షనిడు పుణ్యగేహినులుండరు. యతీశ్వరులకు పాదపూజలుచేసి భిక్షలిడు పుణ్యగృహస్థులుండరు. నిరుపేద, నిస్సహాయ, రోగాక్రాంత దురదృష్టవంతులకు సాయముచేయువారుండరు. యత్యాశ్రమము ఉత్తమమైనదే అయినను, సర్వసంగపరిత్యాగముచేసి ధ్యానమగ్నులై, సమాధినిష్ఠాగరిష్టులైన సన్యాసులు, యోగులు ప్రత్యక్షముగ నిత్యజీవితములో ఇతరులకు గాని, భూతములకుగాని చేయు సహాయముండదు. అట్టి ఆలోచనకే అవకాశముండదు. సర్వము త్యజించి మరిచయేగదా వారు సమాధినిష్ఠాగరిష్టులగుట కనుక పరోపకారముచేయుటకు నిర్ణీతమైన గారహస్థ్యము అతి పవిత్రమైనదని భావించవలయును. దానిని విధినిషేధముల గమనించి పాలించి ధర్మ కర్మాచరణదక్షుడై మానవుడు ముక్తుడగుననుట సర్వులు అంగీకరింపవలసిన పరమసత్యము.

గృహస్థాశ్రమమునే తదితర ఆశ్రమముల ఫలముల నందవచ్చుననికధా చెప్పుచున్నారు. పరదారా పరాజ్ఞ్ముఖంబున, ఆత్మదారా పరితోషంబున, ఋతుకాలాభిగమనంబున, బ్రహ్మచారియు, రాగద్వేష క్రోధాదుల వర్జించుటవలన వానప్రస్థుండును, ఆయాచితోపస్థిత దేహయాత్రామాత్రం బున భిక్షకుండునై గృహస్థు అన్నిఆశ్రమములఫలము దానగైకొనును. బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మానవ యజ్ఞము, అమ పంచమహాయజ్ఞములు చేసి, వివిదషాముఖంబున గృహస్థుండు ముక్తుడగును. యజ్ఞమనగా పూజించి తృప్తికలిగించుట యని అర్ధము. ఆ పంచమహాయజ్ఞముల స్వభావమిట్టిది. బ్రహ్మయజ్ఞమన వేదపారాయణము లేక పురాణపఠనము. ఇది నిత్యకర్మలలో జేరినది. 'యజ్ఞోవై విష్ణుః' అనెడి శ్రుతినిబట్టి పరమేశ్వరప్రీత్యర్ధమై చేయబడు పైదికర్మ యజ్ఞమనబడును. కనుక బ్రహ్మయజ్ఞము వేదపారాయణ రూపము.

దైవయజ్ఞము :- అనగా భగవత్పూజ, దేవతార్ఛన, వైశ్వదేవము, మొదలగు నిత్యకర్మలు. ప్రపంచమందలి సర్వవస్తువులు సర్వేశ్వర కృతములు, సర్వేశ్వరుని మహాత్మ్యము చాటునవి. అట్టి పరమేశ్వరుని ప్రార్ధించి అన్ని వస్తువులను దైవమునకు నివేదించి తరువాత అనుభవించవలయును.

పితృయజ్ఞము :- జీవించియున్న మాతాపితలను పార్వతీ పరమేశ్వరులవలె, లక్ష్మీనారాయణులవలె భావించి, అనుదినము పూజించి పరిచర్యచేయవలయును. వారిమాటల జవదాటరాదు. వారి మరణానంతరము, వారి ఆత్మశాంతికి పితృకర్మలు, పిండప్రదానము చేయవలయును.

మనుష్యయజ్ఞము :- అనగా మానవసేవ. మానవసేవయే మాధవసేవ యని భావించి, పరోపకారపారాయణులు మానవులు కావలయును. ఆర్తులకు సహాయపడవలెను. అట్టివారి కొఱకు ప్రతిమానవుడు తనశక్తివంచనలేకుండ పాటుపడవలెను.

భూతయజ్ఞము :- మానవసేవయేగాక సర్వజీవరాసులకు సహాయ పడుట, గోరక్షణశాలలు, జంతువులకు, పక్షులకు నీళ్ళతొట్టులు ఏర్పాటు చేయుట, పిండితో ముగ్గులువేయుట. భూతబలులిచ్చుట మొదలగు కార్యములన్నియు భూతయజ్ఞరూపములు. మ్రుగ్గులు సున్నముతో పెట్టుట మంచిదికాదు. పిండితో పెట్టిన చీమలు మొదలగువాటికి ఆహారమగును. అటుల భూతతృప్తిఫలము లభించును. యజ్ఞమనునది ప్రీత్యర్ధము చేయుకార్యకలాపమే అయినను కొన్ని యుగములందు పశుహింస చెప్పబడినది. అది కామ్యకర్మయగుటచే ఉత్తమమైనది కాదు. కాని పశువు అను మాటకు వేఱ అర్ధముచెప్పుదురు. ''అహంకారమేవ పశుః'' అని భావింతురు. అహంకారమనగా దేహాత్మలయందు శాశ్వతభావముండు యర్థమే. అదియే పశువు. దీనిని వధింపుమని శ్రుతులు విధించినవి. పశువుకంటె పశువు మూఢమానవుడు. ఆతడు ద్విపాదపశువు. అతడు అహంకార చేతస్కుడు అహంకారమను పశువును జ్ఞానాగ్నిలో భస్మముచేయుటయే నిజమగు యాగము.

మమతవిడచి సాధ్యమైనంతవఱకు ననుమోదించుచు, దైవోసన్నమై, దైవభౌమాంతరిక్షరూపములైన త్రివిధవిత్తముల విహితకర్మలోనర్చుచు, వృత్తిని కల్పించుకొనవలయును. దేశకాలముల కనుగుణముగ దైవోపాదితమైనంతవట్టుకు సేవింపజను, ఇవి, అవి, వీరు, వారు అనక ఎల్లభూతములకు తనకుగలిగిన దానిని బంచిపెట్టవలయును. మానసిక, వాచక, కాయక, రూపములైన, త్రివిధహింసలను వర్ణించుటకంటె వేఱ ధర్మము లేదు. గృహస్థు అసంతుష్టుడు కాకూడదు. ప్రాప్తించినది లేశ##మైనను అదియే పదివేలని తృప్తిజెందనివాడు సప్తలోకముల ఐశ్వర్యము ప్రాప్తించినను లేశ##మైనను తృప్తిచెందడు. అట్టివానికి శాంతియుండదు. అసంతుష్టుడైనచో ఇంద్రియలోలత్వమునజేసి తేజస్సు, విద్య, తపము, యశస్సు, జ్ఞానము క్షీణించును. బహుజ్ఞులు సంశయనివర్తకులు, సభి కాగ్రగుణ్యులయ్యు, పలువురు పండితులు సహితము ఈ పరమసత్యమును ఏమరతురు వారు ఉపనిషత్పారమును బోధించగలరు. వేదాంతార్థముల విపులపఱచగలరు. కాని ఆచరణలో మరతురు. అట్టివారిది పరోపదేశ పాండిత్యము మాత్రమే. వారు తరించుటకు ఏమాత్రము అది సహాయకారి కాజాలదు.

ఈశ్వరదత్తమైన భోగముల ముక్తసంగుడై యనుభవించువానికి దానివలన బంధము కలుగదు. ఇదినాది, నేను దీనినిసంపాదించితిని అను భావమే యుండరాదు. అట్టి యోగ్యుడు గృహస్థాశ్రమమున నున్నను, కుశలకర్మలొనర్చుచు భగవత్కథాకర్ణమున, భగవన్నామస్మరణమున కాలము గుడుపుచున్నవానికి గృహములు, సతి పుత్రాదులు, బంధకారణములు కాజాలవు.

''దానమేవ గృహస్థశ్య'' అను సూక్తిప్రకారము గృహస్థునకు దానమే ప్రధానమైన ధర్మము. స్వధర్మనిష్ఠుండును, భూతదయాపరుడును అయిన నిర్మలహృదయుడు ఉత్తమభక్తితో అతిధి అభ్యాగతముఖమున సమర్పించిన సర్వము, పరమేశ్వరునే జేరును 'అభ్యాగతః స్వయం విష్ణుః' అనికదా స్మృతివాక్యము. అట్టి గృహస్థాశ్రమ పవిత్రతను, గొప్ప తనమును పెక్కురు పెక్కువిధముల శ్లాఘించిరి.

సీ. కొలకులనున్న తంగేటిజున్ను గృహమేధి

యజమానుడంక స్థితార్ధపేటి

పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు

దొడ్డిబెట్టిన వేల్పు గిడ్డికాపు

కడలేని యమృతంబు నడబావి సంసారి

సవిధమేరునగంబు భవన భర్త

మరుదేశ మధ్యమ ప్రపకులపతి

యాకటికొదవు సస్యంబు కుటుంబి

గీ. బధిరపగ్వంధ భిక్షక బ్రహ్మచారి

జటి పరివ్రాజకా తిధిక్షపణకా వ

ధూత కాపాలికా ద్యవాధులకు గాన

భూసురోత్తమ గార్హస్థ్యమునకు సరియె. (స్వా.మ.)

అవి మంత్రసిద్ధుడు ఆదర్శగృహస్థయివ ప్రవరునితో నవివ మాటలు. పాండురంగమహాత్మ్యములో కూడ, గృహస్ధాశ్రమవిశిష్టత ఇటుల చెప్పబడినది. ''ఎవ్వారు గృహస్ధధర్మ వశవర్తులగుదురో వారిసొమ్ము ముక్తియే. గృహస్థాశ్రమమునకు మించిన ముక్తిహేతువైన ఆశ్రమము మిన్నయనునది వేఱొండులేదు.'' అఖిల ధర్మములందును గార్హస్థ్యమెన్న మత్కుటంబనియు, తన్నిష్ఠ నోర్పుతో జరుపవలయుననియు చెప్పబడి నది. అగస్త్యశిష్యులగు ఆ యతి వియతుల చరిత్రలోగూడ గార్హస్థ్యాశ్రమ వైశిష్ట్యము ఈ విధమున వర్ణింపబడినది.

సీ. కీలారములనుండి పాలింటి కేతేర

బహుధాన్యములు చేలబండి యొరగ

నెడనెడ బెండ్లిండ్లు, పడుగులు వొడమ గృ

తార్ధులై యర్ధించు నర్ధులలర

బరిచారికాకోటి పనిపాటు పాటింప

చుట్టంపు సందడి నెట్టు గొనగ

గ్రామమెంతయు నిజప్రాభవంబున మన

సత్యనిష్ఠకు తన్ను సాక్షిగోర

గీ. నిత్యనైమిత్తికములు నిర్ణిద్ర బుద్ధి

నాచరించుచు హరి భుక్తమాత్మ భార్య

భక్తినిడ భుక్తిగొనుచున్న ముక్తిగాని

నిదురవంటిది ఱాతివంటిదియు కాదు. (పాండు)

గృహస్థులకు నిత్యనై మిత్తిక కర్మలు విధి విహితములవిగదా నిర్ణయము. అట్టి నిత్యకర్మానుష్ఠానమునకు సద్గృహస్థు ప్రవరుని ఆదర్శముగా చెప్పవచ్చును. ఆ భూసురుడు.

సీ. వరుణాతరింగిణీ దర విక స్వర నూత్న

కమల కాషాయ గంధమువహించి

ప్రత్యూష పవనాంకురములు పైకొనువేళ

వామన స్తుతిపరత్వమున లేచి

సచ్ఛాత్రుడగుచు నిచ్చలునేగి యయ్యేటు

నఘమర్షణస్నాన మాచరించి

సాంధ్యకృత్యముదీర్చి సావిత్రి జపియించి

సైకతస్థలి గర్మసాక్షి కెఱగి

గీ. ఫల సమిత్కుశ కుసుమాది బహుపదార్థ

తతియు నుతికిన మడుగు దోవతలు గొంచు

బ్రహ్మాచారులు వెంటరా భూసురుండు

వచ్చు నింటికి బ్రజ తన్ను మెచ్చిచూడ (స్వా.మ.)

అటుల విష్ణునామస్మరణముతో ప్రారంభించి చేయవలసిన నిత్య విధులు ఆదర్శగృహస్థుడగు ప్రవరుని నిత్యవిధులుగా జెప్పబడినవి. ఈనాడు అటుల పూర్తిగచరించుటకు సాధ్యముకాకపోవచ్చును. నిద్రనుండి మేల్కొనగానే హరినామస్మరణము చేయుట, ప్రాతఃకాలకృత్యముల నెఱవేర్చి, సంధ్యావందనాదులనైన చేయవచ్చునుగద.

నిత్యానుష్ఠానములో గాయత్రిజపము, సూర్యోపాసన అనగా సూర్య నమస్కారములు, బ్రహ్మయజ్ఞము, పితృతర్పణము ప్రధానముగా చెప్పబడినది. గాయత్రిజపము అతిపవిత్రము, సర్వ అఘనాశనము, ముక్తిదాయకము అని శ్రుతివాక్యము.

గాయత్రి:- గీ. మొదట తుది యోంకృతులతోడ మూర్ధమగుచు

వ్యాహృతుల మూటి నాల్గింటి నధిగమించి

మంత్రరాజంబు గాయత్రి మహిమనొప్పు

గడుపుచల్లగ శ్రుతివిద్య కన్నతల్లి. (కాశీ)

ప్రణవాక్షరభూతంబైన గాయత్రి జపామంత్రంబుగా 21600 వారములు, దివారాత్రంబులు, ఉచ్ఛ్వాసవిశ్వాశరూపంబున జీవుండు జపించుట వలన దూరశ్రవణ, దూరదృష్టి, పరకాయప్రవేశాది దివ్యశక్తుల సంపాదించగలడు. ముద్రాయుత షడంగయోగమున గాయత్రి జపించవలయును. పదునెనిమిది విద్యలలో మహానీయమైనది మీమాంసయనియు, మీమాంసనుమించినది తర్కమనియు, వేదములు తర్కముకన్న మిన్నయనియు, అట్టివేదములు పరమార్ధమే, ఉపనిషత్తులనియు, ఆ ఉపనిషత్తుల మించినది, సర్వమహిమాన్వితమగు, గాయత్రియనుట శాస్త్రసమ్మతము. ప్రతిదినము దశ గాయత్రియైన చేయవలయును.

కం. గాయత్రి పరబ్రహ్మము

గాయత్రి కధీశ్వరుండు కమలాప్తుడు

గాయత్రి మంత్రమునకు

నేయవియును సాటివచ్చు నే మంత్రములన్‌. (కాశీ)

గాయత్రి సావిత్రి విశ్వజనయిత్రి చతుర్వేదమాత ముక్తిప్రదాయిని గాయత్రి జపాపరులకు ఎట్టి దుష్కర్మఫలము లుండవు. తామస స్వభావులు ప్రయోగించు క్షుద్రమంత్రతంత్రములు గాయత్రి జపాపరుల నేమియు చేయజాలవు. అట్టి గాయత్రి కధీశ్వరుండు కర్మసాక్షియగు సూర్యుడు. అందుచే సూర్యోపాసనగూడ నిత్యవిధులలో చెప్పబడినది.

నిత్యవిధులలో పంచమహాయజ్ఞములును, అందు- పితృయడ్ఞమొకటియనియు, దాని స్వరూపమును కొంత గ్రహించితిమి. సజీవులగు జననీజనకుల ప్రవరుడు 'దేవియున్‌ దేవరవోలె' ప్రతిదినము పూజించు చుంéడెనట. నిత్యాగ్నిహోత్రియైన ఆ గృహస్థు భూతబలు నిడుచుండెను. మాతాపితల ఋణమును తీర్చుకొనలేము మాతృదేవోభవః పితృదేవోభవః గురుదేవోభవ, అను సూక్తుల నెరుంగుదుము. మాతాపితల పూజించి పరిచర్యచేసిన మానవులు శ్రీమన్నారాయణుని దయకు పాత్రులై ముక్తులౌదురను సత్యముదెల్పు గాధలు అనేకములున్నవి పుండరీకుని చరిత్ర ప్రబలతార్కాణము.

పుండరీకుడు మాతా పితృ పూజను దేవతా పూజకన్న మిన్నగ భావించి ఆచరించి శ్రీకృష్ణపరమాత్మ కృపావిలోకనమున ధన్యుడై, తన పేర పండరీక్షేత్రము భగవాను డనుగ్రహింప జన్మసార్ధక్యత గాంచిన పుణ్యశీలుడు. ఆతడు 'బ్రహ్మవిద్యాన వంద్యుండు' సజ్జనులకు సన్మార్గులకు సువ్రతులకు మార్గదర్శిగ నుండుటకు కావలసిన సనాతన మానవ ధర్మముల కాటపట్టయిన ఆ భూసురోత్తముడు చేయు పితృసేవ మెచ్చదగినది.

సీ. ఆపాదమస్తంబు నంట నూనియ రాచి

నయముగా నుద్వర్తనం బొనర్చు

జలకమార్చు నఖంపచ స్వచ్ఛ జలముల

దడీయొత్తుగడ మెదుగుడల బొదవి

లఘు ధౌతవసన పల్లవముల గట్టించు

శిరసార్చు మృదులీల సురటి విసరు

చేయూత యొసగి వేం చేయించు లోనికి

ద్వారావతి గలంతి దానె యొసగు

గీ. తెలుపు సంధ్యా సమాధి ప్రయుక్తి

నగ్ని వేలించు విష్ణు సహస్రనామ

పాఠ మొనరించుతరి దోదుపడు గురునకు

గవలు బోకుండ బుత్రుడో కలువకంటి

మ. తిరువారాధన మిట్లొనర్చి ధరణీ దేవాన్వయ శ్రేష్ఠుడౌ

హరి కర్పించుట భావనంబులగు శ్యాల్లన్నంబులున్నేతులున్‌

వరుగుల్‌ చారులు పప్పులప్పడములు న్దాలింపులున్‌ భూపముల్‌

పరమాన్నంబులు బెట్టు నెట్టన భుజింపన్‌ దల్లికిన్‌ దండ్రికిన్‌.

కడువృద్ధులు శిధిలబుద్ధులునగు జననీజనకుల గనిమని నడచుచు అడుగులకు మడుగులొత్తుచు, గాలోచితంబుగా నోములు నోమించుచు కాలవశంబున పరలోకగతులైన జననీజనకులకు అపరకర్మలుచేసే, గయాక్షేత్రంబున బిండప్రదానముజేసె. అట్టి పితృసేవాపరాయణుడగు పుండరీకుని భక్తికిమెచ్చి శ్రీకృష్ణపరమాత్మ భకజనులకు కొంగుబంగారమగుట, పాండురంగనాముడై భీమనదీతీర్థ క్షేత్రంబున మూర్తివంతమై త్రివిధముల దానిని పవిత్రము గావించెను.

అట్టి పితృభక్తి గలవాడే ధర్మవ్యాధుడు. వృద్ధులును, అంధులును అగు మాతాపితల సేవనర్జించి తపంబొనర్చి తన తపఃశ్శక్తివలన ఒక చూపుతో ఒక పక్షిని భస్మీపటలము జేసిన కౌశికుండను బ్రాహ్మణుని చరిత్ర గనిన మానవులకు విధికృతములైన ధర్మములు తెలియనగును. పక్షిని భస్మీపటలము గవించితిని గదా తపశ్శక్తివలన అను దురహం కారము మెయినిండ ఒక విప్రవాటికకు భిక్షార్థమై వెడలె. ఒక గృహము చెంత తదర్థమై నిలువ, ఆయింటి విప్రాంగన వెంటనే వానికి భిక్షనికడ ఆలస్యముచేసిన కోపించె. అంత నా పతివ్రత ''ఓయీ! దుష్టబ్రాహ్మణుడా! ఏమి కళ్ళు ఎర్రజేసెదవు? నీ కోపాగ్నికి భస్మమగుటకు నేను గ్రుడ్డికొక్కెరను కాను'' అనగా కౌశికుడు తన చర్య ఆమె కెటుల తెనిసినదాయని ఆశ్చర్యమంది ''తల్లీః నా యపరాధమును మన్నింపుము. నా కృత్యముల నెటులెరింగితిరి?'' అని పృచ్ఛచేయగా ''కుమారాః నాకు పతియే దైవము పతిచర్యయే పరమధర్మము. నీవు వచ్చినప్పుడు నాపతి పరిచర్యయం దుండుటచే, నాధర్మవిధిని వీడి నీకు భిక్షయిడుటకు రాలేదు. ఆ పతి సేవాభాగ్యమువలన గలిగిన దివ్వదృష్టిచే నీ చర్య నాకు తెలిసినది'' అని సమాధానమీయ ఆ విప్రకుమారుడు ''తల్లీః నాకు ధర్మోపదేశము చేయవే'' యని ప్రార్థింప స్త్రీకి ధర్మోపదేశము చేయుటకు అర్హతలేదు. ఉజ్జయినీపుర పరిసరంబుల నున్న వాటికలో ధర్మవ్యాధుడను జ్ఞాని కలడు అచట నీకు గావలసిన ధర్మోపదేశము దొరకును'' అని ఆమె చెప్పగా కౌశికుడు ఆ పతివ్రత ఆశీస్సులంది సెలవు గైకొని ఉజ్జయినికిం దరలె, ఉజ్జయనిజేరి వాటికయందు చూడ ధర్మవ్యాధుడు మాంస విక్రయము చేయువాడుగ కనబడెను. సమీపించుటకు సంకటపడు కౌశికుని అల్లంతదూరమున జూచి, ధర్మవ్యాధుడు వానిని సమీపించి, దండప్రణామంబులుచేసి, కుశలంబడగి, 'పతివ్రతామతల్లి పంపగా వచ్చితిరా?' అని ప్రశ్నింప కౌశికుడు ఆశ్చర్యమగ్నమానసు డాయెను. తదనంతరము ధర్మవ్యాధుడు, తన కుల ధర్మము నిత్యవిధియునగు పలల విక్రయాదుల పూర్తిచేసి, స్నాతుడై శుచియై, శుభ్రవస్త్రంబుల ధరించి, కౌశికుని తన గృహంబునకు దోకొని పోయెను.

అంత కౌశికుడు వానితో నిటుల సంభాషించె. ''నీవు దివ్య జ్ఞానసంపన్నుడవు. ధర్మోపదేశముచేయ సమర్థుండవు, అర్హుండవు అని యా పతివ్రత పంపినది. ఇది యేమి? పాపకర్మమైన ఈ మాంస విక్రయ వృత్తియేమి? మీరు ఏయే వ్రతములు చేసి దివ్యదృష్ట్యాది శక్తుల సంపాదించితిరి. నా సందేహములను దీర్చి నాకు ధర్మోపదేశము చేయవే'' యని ప్రార్థించె.

ధర్మవ్యాధుడు చెప్పిన సమాధానము శాస్త్రసమ్మతము. ''విప్రోత్తమా మాంసవిక్రయము నాకులవృత్తి. వర్ణాశ్రమ ధర్మముల ననుష్ఠించుట విధి. అది శాస్త్రనిర్దేశము. అటుల స్వీయధర్మమును చేయకుండుట పాపము నకు బాల్పడుటయే. నావృత్తి నిర్వహణలో నేను జంతువులను చంపను. జీవహింస చేయను. మాంసాహారమును భుజింపను. మధువు సేవింపను. శాస్త్రనిర్ణీతమైనది కనుక నేను స్వకుల ధర్మమును అనుసరించుచున్నాను. ఇక నేను పూజించు దైవతములు నా జననీ జనకులే. వారికన్న వేరే దైవములు నాకు లేరు. వారి పరిచర్యయే నావ్రతము, అదియే మోక్షసాధనము. వారి ఆశీస్సులే నా విజ్ఞానమునకు మూలకారణము. నీవు అంధులును కడువృద్ధులును అయిన నీ మాతాపితల - నిస్సహాయులుగా వదలి తపము చేసితివి. వారు ఏకైక పుత్రుడవగు నీ యెడబాటు సహింపక నిస్సహాయులై దురంత దుఃఖముల గ్రుంగి బాధపడుచున్నారు. అది నీకు శుభావహముకాదు తపముచేసి క్షుద్రముగు శక్తుల సంపాదించితివి. ఆ శక్తిని జీవహింసకు నుపయోగించితివి. అరిషడ్వర్గముల గెలువజాల వైతివి. ఒక పక్షి మలమూత్ర విసర్జనమున నిన్ను మైలబఱచినదని కోపఘార్ణమానసుడవై దానిని భస్మము కావించితివి. కోపము బ్రాహ్మణ ధర్మమా? ఆ పక్షి యుద్దేశపూర్వకముగా నిన్ను మైలపరచదుకదా! దూరాలోచన చేయక పాపమునకు ఒడిగట్టితివి. భిక్ష యిడుటలో ఆలస్యము చేసినదని అహంకారమున పతివ్రతపై కోపగించితివి. అట్టి కోపచేతస్కునకు, జననీజనకుల సేమమరయని స్వధర్మచ్చుతుడవగు నీకు, మోక్ష మెటుల గలుగును? భగవంతుడెటుల నిన్ను మన్నించి పాలించును. ఆ మహాతల్లి నా ముఖతః నీకు గుణపాఠము చెప్పించుటకే నిన్నిటకు పంపినది. స్వీయధర్మ నిర్వహణను మాతాపిత శుశ్రూష సంసేవమునను నీ చరిత్ర నాకు తెలిసినది. విప్రకుమారా! అగ్రజన్మంబున జన్మించిని నీకు పరులు వేరుగ చెప్పవలయునా? జన్మచే ఉత్తముడవు. నీకై వంతచెందుచున్న నీ తలిదండ్రులజేరి వారికి సేవచేయుము సకల అర్థములు నీకు చేకూరును. మోక్షమరచేతి పందగును.'' ఈ హితోపదేశమున జ్ఞానబోధితుడై కౌశికుడు ధర్మవ్యాధబొధల గురువాక్యములుగా శిరసావహించి, స్వగృహము జేరి జననీ జనకుల పరిచర్యయే వ్రతముగా కాలము గడపెను. ఈ గాధవలన మాతాపితృపూజలు ఆవశ్యకర్తవ్యములనియు, దాని వలన దివ్యశక్తులు కలుగుననుటయేగాక కులాచారమెట్టిదైనను అనుసరణీయమేయని తేలుటయు, సతికి పతిసేవకన్న సువ్రతము వేరే లేదనియు పాతివ్రత్యమహిమతో సర్వదివ్యశక్తులు కలుగుననియు తెలయుచున్నది.

ఇటులనే సుశీలయను ఒక సాధ్వి పరమ పతివ్రతామతల్లి సాధు స్వభావ, స్వధర్మ నిర్వహణదక్షురాలు కలదు. ఆ సాధ్వి పతికొట్టిన, పతితిట్టిన, పతినిర్దయుడైన, ఎట్టిపాటు పరచినను, తా నన్యధాత్వమండక; పతి దైవమేయని, పరిచర్యజేసి, పూజించునది. సుశీలభర్త, కలుషబుద్ధి, భార్యను బాధించువాడు, పాషండ షండానుబంధి; వేదములు చదివియు వేదవిహితధర్మముల అనువర్తింపడు. బ్రాహ్మణధర్మముల పాలింపడు. దుర్దాన దురాన్నములకు చొరబడు. సుకృతములచేయడు. దుష్కృతములకు ముందంజవేయును. అట్టి పతితుడువాడు. ''పతితుడైన వెలది పాతివ్రత్య మహిమ ఋణ్యుజేసి మనువలయు''నను ధర్మము సుశీలపాటించినది. తన ధర్మనిర్వహణమున శ్రీమన్నారాయణుని మెప్పించినది. ఆద్దేవుని కరుణా మృతధారల తాను తరించినది. భర్తను సన్మార్గవర్తనుగావించినది ఇటు పాతివ్రత్యమహిమచే అజరామరణయశశ్శీలురగు సావిత్రి, అనసూయ, సుకన్య, అరుంధతి, లోపాముద్రమొదలగు వారి పుణ్యగాధలు ప్రసిద్ధములు.

ఇటులనే మానవయజ్ఞము భూతయజ్ఞములనబడు పరోపకారపరత్వమున ఇతరజీవరాసులకు ఆహారపానీయమ లర్పించుట మొదలగు పుణ్య కార్యములు నిరూపించు శిబి, జీమూతవాహన, రంతిదేవాదుల చరితములు సుపరిచితములే. అట్టి సత్కార్యములన్నియు గృహస్థులకు సహజధర్మములు ముక్తిహేతువులు అనిచెప్పబడినవి.

నిత్యకర్మల తరువాత నైమిత్తికకర్మలగు మకరసంక్రమణదానములు, వ్రతములు, పితృశ్రాద్ధాదికర్మలు, ఏకాదశి శివరాత్రి జాగరణలు, మొదలగునవి విధింపబడినవి. నిత్యనైమిత్తికవైదికకర్మలు భక్తిశ్రద్ధతో చేయు గృహస్థులకు, ముఖ్యాదరణీయము అతిధిపూజ.

అతిధిపూజ:-

''నిను దివసాష్టవ భాగం

బున సదనద్వారంబునకుబోయి కడుబ్రియం

బున నతిధినరయవలయుం

దవయతదర్చనకు నెనయ ధర్మములెందున్‌''

ఆటుల నరసి మిత్రుండును ఏకగ్రామవాసియుం గానివానిని.

మ అతిధింగాలసమాగత న్ఘన బుభుక్షాప్తం బధశ్రాంతు నా

తత మారోత్థిత ధూళిధూసరితగాత్ర స్వేదబంధూత్కరా

న్వికు నజ్ఞాతకులాభిదాను గని యతివిప్రున్మహాత్మున్‌ బ్రజా

పతిగా నాత్కదలంచుచున్నుముఖుడై బక్తిన్బ్రయత్నంబునన్‌.

కం. అతిధి కులశీల విద్యా

స్థితు లడుగక యెంత వికృత దేహుడైన

న్మతి విష్ణుగా దలచుచు

నతి ముదమున బూజసేయునది యతిభక్తిన్‌

'అభ్యాగతః స్వయంవిష్ణు' అనిగదా చెప్పుదురు. అట్టి ఆహితాగ్నులగు గృహస్థులు, నిత్యకర్మానుష్ఠానము, వైశ్యదేవాదులు, అయిన తరువాత భూతబలులిడుటకు గృహప్రాంగణంబునకువచ్చి, బలులిడీ, ఎవరైన అభ్యాగతులు కలరాయని తేరిపారచూచుట ఆచారము.

చ. #9; నిజ విభవానురూపముగ నెమ్మియెలర్ప గ్భహస్థుడెమ్మెయిన్‌

ద్విజ వికలాంగ బాల గురు వృద్ధ సుహృజ్జన కోటికన్న దా

న జనిత తృప్తి పొందగ ననారతము న్దగ నాచరించుచు

న్ద్రి జగదభీష్టదస్ధితి బ్రతీ ప్తుడు గా వలయున్గుణోజ్వలా. (మార్కు)

అట్టి అతిధి పూజలో చిన్న పెద్ద తారతమ్యములు చూడరాదు.

''అతిధి కడునల్పుడైన నత్యధికుడైన

నింటికేతేర బ్రియమందు నెవ్వడేని

వా. గౌరవ మదిగౌరవంబుగాని

కాదు గౌరవమాకార గౌరవంబు''

అతిధిని పూజించి ఉపచారవాక్యముల తృప్తుల చేయవలయును, ఆడంబరముకాదు కావలసినది. అప్యాయత, ఆదర్శగృహస్థగుప్రవరుడు అతిధి సేవా పారాయణుడు.

సీ|| తీర్ధసంవాసు లేతెంచినారని విన్న

నెదురుగా నేగు దవ్వెంతయైన

యేగి తత్సదముల కెఱగియింటికి దెచ్చు

తెచ్చి సద్భక్తీ నాతిధ్యమిచ్చు

యిచ్చి యిష్టాన్నసంతృప్తులుగా జేయు'' (స్వా.మ)

అటుల దరిజేరి కుశలప్రశ్నలు చేయుచు సంభావించెడువాడు ఈ విధముగ అభ్యాగత సేవాపరతంత్ర సకలజీవనుడైన ఆ భూదేవకుమారుడు ఒకనాడు కుతపకాలమున వచ్చిన యోగసిద్ధునకు అతిధ్యమిచ్చి యనిన మాటలు గృహస్థాశ్రమమున అతిధి పూజ ఎంత ప్రాముఖ్యమైనదో తెలియజేయును.

ఉ. వానిది భాగ్యవైభవము వానిదిపుణ్యవిశేషమెమ్మెయిన్‌

వానిదవంధ్యజీవనము వానిదిజన్మము వేఱు సేయ కె

వ్వానిగృహాంతరంబున భవాదృశ యోగిజసంబు పావన

స్నానవిధాన్న పాసముల సంతసమందుచుబోవు నిచ్చలున్‌.

మౌనినాధ కుటుంబ జంజాటపటల

మగ్న మాదృశమౌషధ మొండుగలదె

యుష్మదంఘ్రి రజోలేశ మొకటిదక్క.

ప్రవరునివంటి అతిధిపూజా వ్రతుడే నిష్ణుచిత్తుడు. వైష్ణవభక్తులలో విష్ణుచిత్తుడు ప్రధముడు పేరెన్నికగన్నవాడు. ఆ భక్తుని చరిత్ర ఆమూక్త మాల్యద కావ్యమునందు విపులముగా వర్ణింపబడినది. అతడు అపఠితశాస్త్ర గ్రంధజాత్యంధుడు. గురుకృపాకృతంబగు భక్తిమార్గమే శరణ్యమని నమ్మి అనవరతము తనసదనంబునకు భాగవతులగు భద్రమూర్తులురాగా వారిని శ్రీమన్నారాయణరూపులుగా భావించి సేవించుటయే పరమపురుషార్ధమని, పుణ్యప్రదమని భావించుభక్తుడు. భాగవతులురాగా ఎదురేగి ఆహ్మానించి.

కం. న్యాయార్జిత విత్తంబున

నాయేగీశ్వరుడు బెట్టు నన్నంబా ప్రా

లేయాచల పటీరాచల ప

ర్యా యాతాయాత వైష్ణవావలికెల్లన్‌.

అంతేకాని కాకులనుకొట్టి గ్రద్ధలకు పెట్టడు. అధర్మవర్తన సంపాదిత ద్రవ్యాదులచే అతిధిపూజలు చేయుట పుణ్యప్రదముకాదు. అదిపాపమునకే హేతువు గోవులను చంపి చెప్పులు దానము చేసిన ఫలముండునా? అతిధి అభ్యాగతులకు బెట్టలేని నీరసస్థితిలో నున్నను ఆగంతకులగు వారిని దుర్భాషలాడక పరుషములు పలుకక పంపివేయుట సముచితము రంతి దేవుడు వారముదినములు భ్యార్యాపిల్లలతో నిరాహారుడై భగవంతునకు నివేదనజేసిన ఉదకమును గ్రోలనున్న సమయమున, ఒక ఛండాలుడు పిపాసచే సర్ధింపగా, ఆ పవిత్రజలమును వాని కులగోత్రములనెన్నక వానికి నొసంగెను అతధి అభ్యాగత పూజార్ధము ఇంతకన్న మిన్నయగు స్వార్ధ త్యాగము నభూతో నభవిష్యతి.

ఇటువంటి వేదవిహితమైన విధుల ననుష్ఠించుచు అతిధి అభ్యాగతుల పూజించుచు నిత్యజీవనముజరుపు గృహస్థులకు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనములు ముక్తిహేతువులని జెప్పబడినవి. అవి గృహస్థులకేగాక మహా యోగులకు సిద్ధులకు కూడ అనుసరణీయములే. వ్యాసఅగస్త్యాదులు గూడ తీర్థయాత్రలు చేసినటుల పురాణములందు వ్యక్తమగుచున్నది. భక్తుడు భగవంతుని దివ్యరూపముల దర్శింప వివిధ క్షేత్రములకు వెడలు ననియు ఆ యాక్షేత్రముల వివిధరూపముల వివిధ నామముల ప్రత్యక్షమైన ఆ పరమాత్మను దర్శించుటచే తృప్తుడగుననియు ఇదివరకే గ్రహించితిమి.

పుణ్యభూమియగు భరతవర్షము ఆసేతుహిమాచలపర్యంతము పుణ్యక్షేత్రములతో పవిత్రతీర్థములతో విరాజిల్లుచున్నది. ఆయా క్షేత్రముల వెలసియున్న దేవాలయములు మహిమాన్వితములు. అవియన్నియు మహా స్థలములు. వైదికమతమున సగుణోపాసన, విగ్రహారాధనల విశిష్టత చర్చించి యుంటిమి. హిందువులే యననేల ఆయా మతములవారందరు వారివారి పవిత్రక్షేత్రముల దర్శించువారే. అట్టి తీర్ధక్షేత్రములలో దేహములోని అంగములలోవలె కొంచెము తారతమ్యముండవచ్చును. అయినను అన్నియు సేవింపదగినవే ఆయా తీర్థముల మహిమలు పురాణములలో క్షేత్రమహాత్మ్యములలో వర్ణింపబడియే యున్నవి. అట్టి బాహ్యతీర్థములకంటె కూడ ముఖ్యమైనవి అంతరతీర్థములును గలవు. అంతరతీర్థశుద్థిలేక బాహ్యతీర్థములు సేవించిన ఫలములేదు. తీర్థములగూర్చియు తీర్థముల సేవించు విధానమును గురించియు శ్రీనాధకవి సార్వభౌముడు తనకాశీఖండ మహాకావ్యమున చక్కగ వివరించెను. ఆ వివరణగమనార్హము.

గీ. తీర్థములు మానసంబులు ముక్తిదములు

తరుణియివిమేలు బాహ్యతీర్థములకన్న

మానవుండివి యేమఱి మధురవాణి

బాహ్యతీర్థంబులాడ నిష్ఫలముసూవె.

అట్టి మానసికతీర్థంబు లిటుల విశదీకరింపబడినవి.

సీ. తీర్ధంబు సత్య మింద్రియ నిగ్రహము తీర్ధ

మనసూయ తీర్ధంబు వనరుహాక్షి

తీర్థంబు దానంబు తీర్ధంబు సంతోష

మనుకంప తీర్ధంబు కనకగౌరి

బ్రహ్మచర్యంబు తీర్ధంబు తీర్ధంబు ధృతి

యమము తీర్ధంబు విద్రుమాధరోష్ఠి

సమత తీర్ధంబు విజ్ఞానంబు తీర్ధంబు

పుణ్యము తీర్ధంబు పువ్వుబోడి

గీ. తీర్ధములు మానసంబులు ధీవిశుద్ధి

యతిశయిల్లంగనివియాడ కాడినట్టి

పంచజనులకు కల హంస పక్షి గమన

బాహ్య తీర్ధావళులు తీర్ధఫలము నీవు''

చ. బిసరుహ పత్రలోచన కృపీటములందు మునింగి యాడవే

మొసళులు మీలు కర్కటకముల్‌ గమఠంబులు వాని కబ్బునే

యసదృశ##మైన తీర్ధఫల మట్టి విధంబు సుమీ తలంప మా

నసమగు తీర్ధమాడని జనంబులకుం బహు బాహ్య తీర్థముల్‌

మనో వాక్కాయ కర్మల ధర్మమార్గానుసారులు కాని వారికి బాహ్య తీర్థము లాడుట, పుణ్యక్షేత్ర దర్శనము నిష్ఫలమని వేరుగ చెప్పనక్కరలేదు.

గీ. #9; సుదతి యేటికి నంత ర్విశుద్ధిలేని

బాహ్య సంశుద్ధి బహుతీర్థ పరిచయమున

వేయి గడవల జలముల వెలి గడగిన

కలుగునే శుద్ధి వారుణీ కలశమునకు.

తీర్థములు క్షేత్రములు సేవి చున్నప్పుడు మానవుని మనసు గుణములు, లక్షణములు ఎటులుండవలయు ననునదియు, ఈ విధముగ చెప్పబడినది.

సీ. దర్శించునప్పుడు చిత్తము నిర్నిబంధ

బగు ప్రసాద గుణం బందునేని

గలుషంబు గాని దుర్గంధంబు బొరయని

సలిలంబు నెరవుగా గలుగునేని

పావనక్షేత్ర పుణ్యావనీ ధర తపో

వన సన్నికర్షంబు ననరునేని

సంశ్రిత వ్రతులైన సంయమి శ్రేష్ఠులె

యధిక పరిగ్రహం బబ్బునేని

గీ. తీర్థమది తక్కు గల యని తీర్ధమగునె

ధవళలోచన సలిల మాత్రమున జేసి

ముదిత దేహమునం దంగములకు బోలె

దారతమ్యంబు గలదు తీర్థముల కవని.

తీర్థంబులు సేవించునప్పుడు ప్రతి గ్రహము, అనహంకారము, అకోపనంబు, అసత్యము, అనాలస్యం, సమాధానంబు, శ్రద్ధ, దానపరత, హేతునిష్ఠ, క్షేత్రోపవాసము, పితృతర్పణము, బ్రాహ్మణ భోజనము, పితృశ్రాద్ధము, పిండప్రదానము, శిరోముండనంబు, గలయవి, సాంగో పాంగంబుగ, పలం బీయజాలును.

ఇది యటులుండ తీర్థయాత్రల వలన లౌకికముగ సంప్రాప్తమగు లాభములు కలవు. దేశము నాలుగు మూలల వెలసిన క్షేత్రతీర్ధములు దర్శించుచో, ఆ యా ప్రాంతీయుల ఆచార వ్యవహారములు ఆహా రలంకారములు గ్రహింపవచ్చును. పరులతో నెటుల వర్తింపవలయునో, ఆగంతక, అతిథి, అభ్యాగతుల, నెటుల సమాదరింపవలయునో అనుభవమునకు వచ్చును కూపస్థ మండూకమువలె హ్రస్వదృష్టితో తానే గొప్ప, తన ఆచారములే మంచివి అను మూఢవిశ్వాసము పోయి, విశాల దృక్పధము గలుగును అహంభావము నశించును. కష్టముల భరించు ఓర్పు అలవడును. కొన్ని నదులలో స్నానము చేయుటవలన కొన్ని శారీరక బాధలు పోవును. ఆరోగ్యము కలుగును. నవనాగరీకులు పూర్వాచారములందు నమ్మకము లేనివారు సహితము కొన్ని తీర్ధములలో Medical propertice, ఉన్నవని అవి Mineral waters అనియు అంచుచే కొన్ని వ్యాధులు నయమగుచున్నవనియు నందురు. అటులనే పుణ్యక్షేత్రముల వెలసిన దేవతామూర్తులకు మ్రొక్కుట, దాన ఫలసిద్ధి గాంచినవారును ప్రత్యక్షముగ గన్పడుచున్నారు. మంత్రసిద్ధులచే మహానుభావుల పవిత్ర మంత్రములచే పటిష్ఠము చేయబడిన యంత్రములమీద స్థాపించబడిన విగ్రహములు గల పవిత్ర క్షేత్రములు మహిమాన్వితులనుట సత్యము.

దానములు : గృహస్థునకు ముఖ్యకర్తమ్యములుగా చెప్పబడినవి. సర్వభూత తృప్తి గలిగించుటకు, సర్వప్రాణుల యందు దయగలిగి యుండుట ధర్మమనిగదా యంటిమి పరోపకార పారాయణత యధాశక్తి దానములు చేయుట పుణ్యప్రదములు. అట్టి దానములు అన్నదానము, భూదానము, గోదానము, వస్త్రదానము, అభయదానాదులు బహురూపములనున్నవి. అట్టి దానములు చేయు గృహస్థులు పుణ్యలోకమున కరుగుదురు. ఇటుల పవిత్రమైన పుణ్యప్రదమైన విధులు చేయుటకు అవకాశములు గల గృహస్థాశ్రమము, సర్వాశ్రమములలోను ఉత్తమమైనదనియు సర్వాశ్రమములకు, ఆధారభూతమైనదనియు, పవిత్రమైనదనియు భావించుట సముచితము. అది మోక్షదాయకముకాక మరెట్లగును? కర్మ భక్తి మార్గములు గృహస్థునకు విధులుగ జెప్పబడినవి. అట్టి కర్మయోగియగు గృహస్థు సర్వవిధముల ఉత్తమ మోక్షార్హుడు. అట్టి గృహస్థు తన విధుల నెరవేర్చి జ్ఞానియై తరించగలడు. యత్యాశ్రమము స్వీకరింపలేదని బాధపడనక్కరలేదు.

వానప్రస్థాశ్రమము : గృహస్థాశ్రమము తరువాత స్వీకరింప దగినది. భాగవతమున సప్తమస్కంధములో ఇటుల చెప్పబడినది.

మ. వనితా పుత్ర సుహృజ్జనావలులపై వై రాగ్య మూలంబు న

న్దనరం గానకు నేగి వల్కల జటాధారుండు సద్బ్రహ్మచ

ర్య నిరూఢుండును గందమూల ఫల శాఖాహార సంతృప్తుడు

న్ఘన బోధామలినాత్మకుండగుచు వానప్రస్థు డుండున్‌ సుతా.

కం. వినుము వాన ప్రస్థునకున్‌

ముని కథికములైన నియమములు గల వాచొ

ప్పున వనగతుడై మెలగెడి

ఘనుడు మహిర్లోకమునకు గమించు నృపా.

వనంబునకుం జని నీవారాదికంబుల నగ్ని పక్వము చేసియు, చేయకయు, ఎండలో నెండినవైనను సరియె భుజింపవలయును. వన్యాహారం బుల నిత్యకృత్యములైన హోమాదులు చేయుచు ప్రతిదినంబును పూర్వ సంచితంబుల పరిత్యజించుచు నూతన ద్రవ్యంబుల సంగ్రహించి, అగ్ని కొరకు వర్ణశాలనైన, పర్వత కందరంబునైన, ఆశ్రయించుచు ఆరణ్యకముల నిత్యము పఠించుచు, హిమ వాయు వహ్ని వర్షాతాపంబుల సహించుచు, సఖశ్శశ్రుకేశ తనూరుహంబులు సాధితంబులు సేయక, బటిలిండై చరించవలయును. నిజధర్మానుష్ఠాన సమర్థుండై తపము చేయుచు అహంకార మకారములకు దూరుండగుచు పరమాత్మయందు, బుద్ధినిలిపి నిష్కాముండై నిర్వికారుండై సంచరించవలయును. ఈ కాలమున ఈ నియమముల నన్నిటిని గమనించుటగాని, అరణ్యవాసముకాని సాధ్యము కాక పోవచ్చు. అయినను కొంతవరకు వానప్రస్థాశ్రమ ధర్మములు అనుసరించుటకు అవకాశము లేకపోలేదు. గృహస్థు తన పుత్రులు పెద్దవారయిన తరువాత, గృహ నిర్వహణ వ్యవహారముల వారికి పూర్తిగ వదిలి ఐహికవాంఛలను, సౌఖ్యములను లక్ష్యపెట్టక, వాటిని దూరముగనుంచి భగవంతునియందు లగ్న మానసుండై విరక్తి మార్గమునకు మనసును మరల్చవలెను.

భార్యతోనున్నను బ్రహ్మచర్యవ్రతమునే అనుష్టింపవలయును. ఈ ఆశ్రమస్థితి, సాధనస్థితి అంతవరకు గృహస్థుగా మెలగుచు, ఆ అలవాటులు గల గృహస్థు వాటినుండి తన మనసును మరల్చి ముక్తి మార్గాన్వేషణలో లగ్నము చేయవలయును. యత్యాశ్రయము స్వీకరించుటకు కావలసిన నిగ్రహము, సహనము, జ్ఞానసంపత్తి మొదలుగాగల గుణముల అలవరచుకొనుటకు ఈ ఆశ్రమ మెంతయు నుపకరించును. వాంఛల విడనాడవలయును. కోర్కెల చంపుకొనవలయును. కామక్రోధాదుల నిగ్రహింపవలయును. తత్త్వ విచారణ చేయవలయును. ఐహిక వాంఛలందు విరక్తి గలుగవలయును. అట్టివాడు గృహస్థుగా గృహమునే యున్నను సాధనకు అభ్యంతరము లేదు. దైనందిన వ్యవహారముల గృహచ్ఛిద్రముల లక్ష్యము చేయకూడదు. గృహనిర్వహణమున పుత్రులకు అవసరమగు సమయముల తగు సలహా లిచ్చుటయు ధర్మమే. మితాహారి కావలయును పుణ్యవ్రతములు చేయుచుండవలయును. బ్రహ్మచర్యాశ్రమమున అధ్యయనము చేసి గ్రహించిన జ్ఞానమును, గృహస్థాశ్రమమున స్వధర్మ కర్మ క్రియా కలాపముచే అన్వయించుకొని, ఆచరనలో పెట్టుట వలన కలిగిన విజ్ఞాన బలిమి ఐహిక వాంఛలను అతిక్రమించి, పరమాత్మయందే మనసు కేంద్రీకరించవలయును విధి విహిత కర్మల ననుష్టీంచుచు, తీర్థయాత్రలు చేయుచు, భగవధ్యానమున మనసున కేకాగ్రత గలిగించి, పరమేశ్వరచింతను నిస్పృహ నిర్లిప్త వైరాగ్యముల నలవరచుకొనినచో, అట్టివారిబుద్ధి జ్ఞానమార్గమునకు ప్రసరించుమ కర్మ భక్తి మార్గములనుండి జ్ఞానమార్గము జేరుటకు వానప్రస్థాశ్రమము ఒక మజిలీ. ఈ ఆశ్రమమున నియమముతో సాధన చేయువారికి, ఇహలోక సౌఖ్యములు బుద్బుద ప్రాయములనియు, పరలోక సౌఖ్యమే శాశ్వతమనియు, బ్రహ్మాను సంధానమే గమ్యస్థానమనియు తోచును. అటి మానసిక తత్త్వము గలవారు ఈ లోకమున మన మధ్యనున్నను, లేక నిర్జనప్రదేశమున నున్నను. వారి దృష్టి గమ్యస్థానమగు పరమాత్మయందే లగ్నమైయుండును. మానవుల మధ్య వారు ప్రకృతి సిద్ధముగ నున్నను మానసికముగ వారు ఏకాంత వాసము చేయుదురు.

వారికి ముక్తియే ధ్యేయము. వానప్రస్థాశ్రమ ధర్మనిర్వహణమే సాధన. కాని యెంతమంది యటులుండగలరు? వృద్ధులయ్యు అన్ని విధముల సుఖప్రదమగు జరుగుబాటు ఉండియు ఐహికవాంఛలు వీడలేక, ధన వస్తు వాహనముల యం దాసక్తి వీడలేక అనేకవృత్తులు చేయుచు, బాధపడువారిని ఎందరినో చూచుచున్నాము. వారు వారి జీవితములో సుఖమనునది యెరిగి యుండరు. ఇహలోకయాత్రకు కావలసిన వస్తుతతిని గూర్చుటకు దానిని భద్రపరచుటకు, వారు పడు అవస్థ, కడు శోచనీయము వారు సుఖపడరు, తమ వారిని సుఖపడనీయరన్నచో ఇతరుల క్షేమము తలంచరని వేరుగ చెప్పనక్కరలేదు. వీరిని మించిన ప్రబుద్ధులు కొందరు కలరు. వారు యత్యాశ్రమము స్వీకరించియు లౌకిక వ్యవహారముల విడువరు. పూర్వాశ్రమమున తమకు సంబంధించిన భార్యాపుత్ర పౌత్రాదులకు కావలసిన వస్తుసముదాయమును, సమకూర్చుచునే యుందురు. పూర్వవైరముల మరువరు. కులశాఖాభేదముల నేమరరు. పరులకు తత్త్వబోధ చాల చక్కగ చేయుదురు. వివిధ ధర్మముల నుపన్యసింతురు. కాని వారు ఆ ధర్మముల ననుష్టింపరు. కాషాయాంబరముల ధరించియు, మృష్టాన్న భోజనము, మృదుశయ్యాదుల, ఉపహారముల విడువజాలరు. శీతోదకస్నానము వారికి సరిపడదు శరీరశ్రమ ఓర్వలేరు. అట్టి కుహనావర్తనులను చూచుచున్నాము. వీరు అల్పసంఖ్యాకులే కావచ్చు వీరి వర్తనము వలన ఉత్తములు, ఆశ్రమధర్మ నిష్టాపరులు, పరోపకారజీవులయిన, మిగతవారికి కూడ, చెడ్డపేరు వచ్చు అవకాశముండుటచే వీరిని గర్వించవలసి వచ్చినది.

యత్యాశ్రమము నాలుగు ఆశ్రమములలో పరమోత్తమమైనదని పెద్దలు చెప్పు వాద సారాంశము గ్రహింతము. అటుల మిన్నయన బడుటకు ఆ ఆశ్రమ విశేషమేమి? ఆ ఆశ్రమ ధర్మము లెటువంటివి? ఆ ఆశ్రమ స్వీకారము చేయుటకు మానవుడు అధికారి ఎటుల కాగలడు? అర్హత లేమి? లేక అందరూ సన్యాసులు కావచ్చానా? సన్యాసము స్వీకరింపకుండుట పాపమా? స్వీకరించనివారికి ముక్తిలేదా? అనునవిగూడ పరి శీలనార్హములు.

సత్‌=బ్రహ్మమునందు నితరాన్‌=లెస్సయైన ఆస=ఉనికికి సన్యాసమని పేరు. అని శాబ్దికులు అన్వయించిరి. ఆ సన్యాసములో సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అను సాధనములు రెండు. ఏ కొండగుహ లోనో నివసించుచు, తపస్సు చేసికొనుచు, స్థాణువువలె నిర్వికల్ప సమాధి నిష్ఠాగరిష్టులై, దివ్యానుభూతులనంది, తరించువారుండవచ్చు వారు తరింతురు. ప్రత్యక్షముగా వారు తోటి మానవులకు మార్గదర్శకులు కాకపోయినను, వారు తమ మహిమలవలన లోకకళ్యాణము గూర్చుదురందురు. మరికొందరు సవికల్ప సమాధి నిష్ఠాగరిష్ఠులు. వారు ఈ ప్రపంచమునందు అందరిలో నుండియు భగవంతునియందు కేంద్రీకృతమనస్కులై ఏమియు అంటక యుందురు. వారిని ప్రపంచవాసనలు సోకవు. యతులనుగూర్చి భాగవతమున ఇటుల చెప్పబడినది.

''మతికాలుష్య మడంచి యింద్రియములన్‌ మర్థించి కామాది శ

త్రుతతిం దృంచి యసంగుడున్‌ సతత సంతుష్టం డనారంభ వ

ర్జితుడున్‌ నిర్మలుడు న్సమాధిపరుడు న్జిత్సంబు బద్ధుండునై

యతిశోభిల్లు నిరంతరంబు నిల నేకాంత ప్రదేశ స్థితిన్‌.

యత్యాశ్రమము జ్ఞానప్రధానమని అనినంత మాత్రమున కర్మలు చేయనక్కరలేదని కాని, భక్తి మార్గమున చరించుట అసవరమనికాని తొందరపడి భావించుట పొరపాటు. శ్రవణ మనన ధ్యానాధులచే సమాధి నిష్ఠా గరిష్ఠుడగుటచే, యోగధారణచే, బ్రహ్మజ్ఞానము పొంది, తాను తరించి, ఇతరులకు ఆదర్శమైన, తరుణోపాయము జూపుట, యతిధర్మము.

తాను తరించుట మాత్రమే చాలునని ఏ యతీశ్వరుడు తలంపడు. సకల ధర్మముల బోధించి ప్రజలను సన్మార్గగాములజేసి వారికి ముక్తి గలిగించు యత్నము చేయుచునే యుండును. వారు స్వార్థరహితులు. యత్యాశ్రమము స్వీకరించుటకు ప్రతివారికి హక్కుగలదు. అర్హత సంపాదించవలయును అర్హులగు వారికి గూడ కొన్ని నిర్భంధములు కలవు. మాతా పితలు కలవారు, తలిదండ్రుల అనుజ్ఞలేనిది సన్యాశ్రమము స్వీకరించరాదు. అటుల స్వీకరించుట పాపమునకు పాల్పడుటయే. కౌశికుని వృత్తాంతమే తార్కాణము. గ్పహస్థు తన ధర్మపత్ని యనుజ్ఞ కొనిన తరువాతగాని ఆశ్రమస్వీకారము చేయరాదు. అన్ని ఆశ్రమ ధర్మములు యధావిధిగ నిర్వహించి వానప్రస్థాశ్రమము తరువాత సన్యసించి దేహ మాత్రావశిష్టుండును, నిరపేక్షుండును, భిక్షుండును, శాంతుండును, సమచిత్తుండును, నారాయణనామ పారాయణుండునై, కౌపీనంబునకు, అచ్ఛాదమాత్రంబైన వస్త్రంబు ధరించి, దండాదివ్యతిరిక్తంబుల విసర్జించి, శీతోష్టముల, సుఖదుఃఖముల, ఒకే దృక్పధము గలిగి, గ్రహనక్షత్రాది విద్యల జీవింపక, భేదవాదంబులైన తర్కంబున తర్కింపక, ఎందును పక్షేకరింపక, శిష్యులకు బోధించుచు, బహువిద్యల జీవింపక, మత్తుపదార్థముల (గంజాయి నల్లమందు) నుల్లసిల్లక, ఊరూర ఒక రాత్రి నిలచుచు, గృహస్థుల యిండ్ల శయనింపక, కార్యకారణ వ్యతిరిక్తంబైన, విశ్వంబునందు, పరబ్రహ్మంబు నవలోకించుచు జాగరణ, స్వప్న, సంధి, సమయముల, ఆత్మనిరీక్షణ చేయుచు, దేహంబునకు జీవంబు ధృవంబు కాదనియు, మృత్యువు ధృవంబనియు ఎరింగి, జ్ఞానోత్పత్తి పర్యంతము చరియించుచు, అటుమీద విజ్ఞాన విశేషంబు ప్రాప్తించిన, పరమహంసుండై దండ కమండలాది చిహ్నంబులు ధరించియొండె, ధరియించకొండె బహిరంగచిహ్నుండుగా నుండుచు, పరమేశ్వరార్పిత చిత్తుడై, యుండవలయును. వానప్రస్థాశ్రమము తరువాత యత్యాశ్రమము స్వీకరింపవలసినదని సాధారణ ధర్మముగా చెప్పబడినను, బ్రహ్మచర్యాశ్రమమునుండిగాని, గృహస్థాశ్రమము నుండిగాని మానవుడు సన్యాసాశ్రమము స్వీకరించుట నిషేధము కాదు. శుకయోగీంద్రుడే మనకు తార్కాణము. అటుల యత్యాశ్రమము స్వీకరించిన మహాత్ములను, పరివ్రాజకులను, సాధువులను, పీఠాధిపతులను, చూచుచునే యున్నాము. గతజన్మలో ముముక్షువులుగా నున్న వారు, ఏదైన కర్మదోషమున యోగభంగము గలుగ, మరల జన్మమునంది పూర్వజన్మ సంస్కార బలముచే, సంచిత పుణ్యలేశముచే జ్ఞానవంతులై, యత్యాశ్రమ స్వీకారము జేసి తద్వారా మోక్షమునకు అర్తులగుదురు.

సన్యాసికి భక్తునకువలెనే మనోనిగ్రహ ముండవలయును అది లభ్యమగుటకు నిర్జనప్రదేశ, నివాసము, (ఆశ్రమము) తేలికయయిన సాత్వికాహారము, మనసును మంచి విషయములందును, పరమాత్మ యందును లగ్నముచేయుట అనునవి ముఖ్య సాధనములు. సర్వసంగ పరిత్యాగము సన్యాసమను పదమునకు పర్యాయపదము ప్రాపంచిక వాసనల నన్నిటిని త్యజించినగాని సన్యాసి కాలేడు. అట్టి త్యాగమునకు ఆదిభిక్షువగు పరమశివుడే ప్రధముడు. ఆదర్శమూర్తియైన సన్యాసికి నిస్పృహ, నిర్లిప్తత, వైరాగ్యములుగూడ, లక్షణములని యంటిమి ఈ లక్షణములకు శుకయోగి యుదాహరణము. యజ్ఞము, దానము, తపములవలన జీవుడు తరించుననిగదా వేదములు చెప్పుచున్నవి. అందుయతులకు తపస్సు, చాల ముఖ్యమైనది. ఆహార నియమాదుల వలన శరీరమును స్వాధీనములో నుంచుకొనవలయును. అవి ఆత్మోద్ధరణకు హేతుభూతములు. వాటిని ఏమరరాదు. అవి జీవుని పరిశుద్ధుని చేయును. అటుల ఆహార వ్యవహారముల నిగ్రహము కలిగి, శరీరమును స్వాధీనములో నుంచుకొని, మనసును చలింపనీయక, భగవంతునియందు బుద్ధి లగ్నముచేసి, అంతరదృష్టి నలవరచుకొనవలయును.

సన్యాసము, తామసిక సన్యాసము, రాజసిక సన్యాసము, సాత్విక సన్యాసము అను మూడురకములని చెప్పవచ్చును విధ్యుక్త కర్మలు, చేసి తీరవలయుననిగదా శాస్త్రములు శాసించునది. సర్వసంగ వరిత్యాగము చేసితినగదా యని కర్మలనన్నిటిని పరిత్యజించుటకు వీలులేదు. అటుల పరిత్యజించుట తామసిక సన్యాసము. నేను యతిని, జ్ఞానిని, అందుచే కర్మలు చేయను అని చెప్పుట, మానుట అహంకారము. అట్టి అహంకారముతో కూడినవాడు జ్ఞాని యెట్లగును? 'నాకు సర్వము తెలుసును. నేను జ్ఞానిని' అని చెప్పుకొనువాడు, నిజముగ అజ్ఞాని. 'నేను అజ్ఞానిని. తెలిసి కొనదలగినది, తెలిసికొనవలసినది చాల గలదు' అనువాడే జ్ఞాని. వీనికి పురోగమించుటకు మార్గము కలదు. ప్రయత్నము చేయుచునే యుండును.

మొదటిరకమువానికి పురోభివృద్ధి యనునదేయుండదు సర్వము తెలసి కొంటిననువాడు అహంకారి, తామసుడు. సంధ్యానందన స్నాన జపాదులు చేసితీరవలయును. చేయనియెడల రౌరవాదినరకములు ప్రాప్తమగును. శరీరమునకు కష్టము కలుగునని శీతోష్టములకు వెరచి, తీర్థయాత్రలు చేయనక్కరలేదనియు, స్నాన సంధ్య జపాదులు, ఉపవాస వ్రతాదుల త్యజించుట, పుణ్యకర్మలు, పితృశ్రాద్ధాదికముల విసర్జించుట, మొదలగునవి రాజసిక సన్యాస రూపములు. అటుల చరించిన సన్యాసాశ్రమ ఫలము దక్కదు. అహంకార మమకారముల వదలి, ఫలాపేక్ష లేకుండ పరమేశ్వర ప్రీత్యర్ధం, అత్యావశ్యకమైన వేదవిహిత విధుల నియమితములైన కర్మలు చేయుట సాత్విక సన్యాసము. ఇది యుత్తమ సన్యాసము. ఇది గృహస్థులకు వానప్రస్థులకు గూడ సాధ్యము. సాధ్యము మాత్రమేకాదు, సాధనమార్గము కూడ. కర్మపరతంత్రుడు కాకుండ, యోగి కానేరడు.

సన్యాసము బాహ్యసన్యాసము మానసిక సన్యాసము అని ద్వివిధములు. అందు రెండవది ప్రధానము, ఉత్తమమైనది. అదిలేని బాహ్యసన్యాసము నిష్ప్రయోజనము, శుద్ధడాంబికము కాషాయాంబరములు ధరించుటయు, నఖ శ్రశ్రుత తనూరుహముల సాధించి, దండకమండల ధారియయ్యు, ఐహికవాంఛల వదలలేక బంధుమిత్రులందు అభిమానము వీడలేని సన్యాసము బాహ్యసన్యాసము. అది నిష్ప్రయోజనము. అది ఆత్మ వంచన, లోకవంచన, భార్యమీదనో, బిడ్డలమీదనో, కోపమునకాని, సంసారికి సహజమగు ఈతిబాధల నెదుర్కొనలేకగాని, ఋణబాధలనుండి తప్పించుకొనుటకుకాని, సన్యసించిన ప్రయోజన మావంతయు లేదు అది ముక్తిదాయకము కాదు, సరిగదా లోకవంచనమగుట పాపహేతువు స్వీయ ధర్మముల నెరవేర్చలేక పారిపోవుట అగును. అది పిరికితనము. అందు వలన ధర్మచ్యుతి యేర్పడును ఆత్మజ్ఞాన రహితులగు సన్యాసులకు ముక్తి లేదు. ఏలనన అట్టివారికి చిత్తసంస్కారముకాని, జ్ఞానముకాని కలుగుటకు ఆస్కారములేదు సన్యాసాశ్రమము జ్ఞానసమూపార్జనకు ప్రత్యేక ముగా వేదములు విధించినవి. వివేకములేని సన్యాసము ఒక కర్మయే. అది మోక్షహేతువుకాక బంధకారణమగును. మానవుడు సన్యసించినంత మాత్రమున సిద్ధిని పొందలేడు. ముముక్షువు అగు యతి పెక్కురీతుల వేదశ్రవణ మననముల ద్వారా జ్ఞానము సంపాదించగలడు. బ్రహ్మవిదులగు అట్టి యతులకు బ్రహ్మమునందు ఆరోపింపబడిన నామరూపముల పరిత్యజించుటయే సన్యాసము. వారు ధ్యానించునది నిర్గుణము, నిరాకారము. వారిది కర్మసన్యాసము కాదు. అది వేదాంత శ్రవణ మననజన్య జ్ఞానముతో కూడి నది విజ్ఞాన రహిత సన్యాసము శ్రేయస్కారమునకు తగదనికదా యంటిమి. అట్టి సన్యాసము శాస్త్రసమ్మతము కాదు ఆత్మతత్త్వ మెరుంకయు, జిజ్ఞాసులైనకాకయు కేవలము మూఢులు, కర్మసన్యాసము చేసినచో, అనర్ధము లనేకములు సంభవించును. ముక్తి లేకపోవుటయేగాక, నరక ప్రాప్తి కూడ కలుగును. సర్వభూతములకు అభయదానముచేసి మానవుడు సన్యసించవలయును. అనగా సమస్త భూతములందు సమభావముండవలయును. అతడు సమదర్శి కావలయును. ఏ ప్రాణియందును శత్రుభావముకాని, మిత్రభావముకాని యుండరాదు. అట్టి మహానుభావులు శాంతమూర్తులు వారి పరిసరములన్నియు శాంతిమయములే. మహా ఋషుల ఆశ్రమములు అట్టివి. ఆ ఆశ్రమముల సహజ జాతి వైరముగల జంతువులు సహితము, మిత్రభావముతో మెలగుచు పరస్పర సహకారిము కలవిగ నుండునని పురాణములవలన తెలియనగును అట్టి ఋషీశ్వరులే గద సమదర్శనులు.

హృదయ పరిపక్వము కానివారికి సన్యాసము ధర్మముగా జెప్పబడలేదు. మరేమనిన పెక్కు జన్మములలో జేసికొనిన అనేక పుణ్యములచేత పరిపక్వమైన హృదయము కలవాడై అన్ని విషయములయెడ విరక్తి నందిన ముముక్షువునకే సన్యాసరూపమగు ధర్మము కర్తవ్యముగా చెప్పబడినది. అన్నివిధముల కృతార్థుడైన విద్వాంసునకే అది కర్తవ్యము. అట్టి మహనీయులకు పూర్వాశ్రమ వాసనాదులుగాని శత్రు మిత్ర భావములు కాని యుండవు. ఆచరించుట కష్టమని కర్మలు పరిత్యజించినవారికి సన్యాసము కర్తవ్యము కాదు. మోక్షహేతువును కాదు. అట్టివారికి అది స్వధర్మముకాక పరధర్మమే యగును. పరధర్మాచరణ పాపహేతువుకదా. అందుచే నిత్యానిత్య వివేకముచే నేర్పడిన తీవ్రమైన విరక్తి, శమదమాది అంతరంగ సాధనలుగబ సన్యాశ్రమ స్వీకారమునకు దోహదము చేయును. విద్యాజ్ఞానముకాని, ప్రజ్ఞకాని, సంస్కారముకాని లేక అజ్ఞానమువలననో మరేయితర కారణములనో సన్యసించు మూఢులు భ్రష్టులయ్యెదరు. కామక్రోధాదుల జయించక, శమదమాది సాధన సంపత్తిలేక, సద్గురువులబోధలేక, సన్యసించినవాడు దానిఫలమగు బ్రహ్మస్థితినిగాని మోక్షమును గాని బొందలేడు. అనగా నిత్యానిత్య వివేక వైరాగ్య తీవ మోక్షాపేక్షలతో సమస్తమును త్యాగముచేసి, శమదమాది ఆంతరంగ సాధనసంపత్తి శ్రవణ మనన ధ్యాన సమాధ్యావస్థవలన ఏర్పడన విజ్ఞానము కలవాడే యతి. అట్టి మహనీయుడు సర్వత్ర పూజనీయుడు బ్రహ్మస్థితినందగల శక్తిమంతుడు.

మానసిక సన్యాసమనగా గృహస్థుగానున్నను, వానప్రస్థుడుగా నున్నను, మనసును ఐహిక విషయముల తగుల్కొననీయక, తాను నిమిత్త మాత్రుడుగ భగవంతుని నిర్దేశము నెరవేర్చుచుంటినేకాని, నాది అనదగినది నేను చేయునది ఏదియు లేదని, భార్యాపుత్రులుగాని, సిరిసంపదలుకాని తనకు శాశ్వతముకావని భావించి, తాను ప్రతిఫలాపేక్షలేక కర్మతంత్రుడగుటయే ధర్మమని నిర్లిప్తుడై, తృప్తుడై, పరాత్పరునియందు, నిర్మలమైన భక్తి, తన కర్తవ్యమగు, కర్మాచరణయం దనురక్తి, నిరపేక్ష, ఇహలోక వాసనలన్నియు, అశాశ్వతములను భావము. శాశ్వతమగు ముక్తిపధముననే మనసును లగ్నముచేయుట మానసిక సన్యాసము. అట్టివారికి ఒకరు నిందించిన బాధకాని, మరొకరు మెచ్చిన సంతసముకాని లేదు. అట్టివాడు గృహస్థుడయ్యు చిత్తసంస్కారము గల జ్ఞానియే.

గీ. ఆత్మ తప్పించి యెరుగ డన్యంబు నెవ్వ

డాత్మ సంతుష్టు డెవ్వడు? అహర్నిశంబు

నాత్మ నాత్మనె గను నెవ్వా డాత్మ మిధును

డెవ్వ డాతండు యోగ లక్ష్మీశ్వరుండు. (కాశీ)

అంతరంగ వ్యక్తంబైన యాత్మాను సంధానంబు గలిగియుండ వలెను. అట్టి యతీశ్వరులకు సత్ప్రవర్తన అమానిత్వము, దంభరాహిత్యము, అహింస, శాంతము, శౌచము, అర్జువము, స్థయిర్యము, ఆత్మ నిగ్రహము, వాంఛారాహిత్యము, సచ్చీలము, ఆత్మావలోకనము, సమత్వ మాది, సర్వసద్గుణములు సహజములని శాస్త్ర నిర్వచనము. అట్టి యోగీశ్వరునకు 'అహంబ్రహ్మస్మి' అనే స్థితి కలుగును. దానికి అర్హతయు కలదు. కాని యెందరికి అట్టి యుత్తమ స్థితి చేకూరును? యతి అసంతుష్టుడు కాకూడదు. అసంతుష్టుడైనవానికి ఇంద్రియలోలత్వమున జేసి తేజస్సు, విద్య, తపము, యశస్సు, జ్ఞానము, క్షీణించును. బహుజ్ఞులు, సంశయనివర్తకులు, సభికాగ్రగణ్యులయ్యు, పలువురు పండితులు, అసంతోషమనే వ్యాధికి గురియగుచున్నారు. సంకల్ప వర్జనము కామమును, కామత్యాగము క్రోధమును, దృశ్య ప్రపంచ పదార్ధములందు అనర్థ విమర్శ నంబు లోభంబును, తత్త్వవిచారమున భయమును, ఆత్మానాత్మ వివేచనమున శోక మోహములను, సాధుసేవవలన దంభమును, మోసమున యోగాంతరాయములైన లోకవార్తాదులను, దేహాద్యభిమాన త్యాగమున హింసను, కృపచే భూతములవలన దుఃఖమును, సమాధిచే దైవిక దుఃఖ ములను, ప్రాణాయామాదుల బలమున దేహజన్య దుఃఖములను, సాత్వికాహార సేవనంబున నిద్రను, సత్యంబున రజస్తమస్సులను, శాంతము వలన శత్రుత్వమును, గురుభక్తిచే సర్వమును, జయింపవచ్చును యతి యిట్టి సాధనక్రమమున సిద్ధుడగును.

యతికి శ్రవణమనన ధ్యానసమాధులు విధులుగ జెప్పబడినవి వేదాంతార్థముల వినుట, అటుల వినిన అర్థముల మననముచేయుట, అటుల మననము చేసికొనుటలో ధ్యానమగ్నుడై, భృక్కుటియందు దృష్టినిలిపి ఆత్మావలోకనము జేసికొనుట, అటుల ఆత్మావలోకనము చేసికొను సాధనలో సమాధి నిష్టాగరిష్టుడగుట తటస్థించును అట్టి సమాధిస్థితిలో బాహ్యప్రపంచమునేగాక తన శరీరమును గూడ మరచి, పరమాత్మయందు లగ్నమానసుడైన తపస్వికి ఒక అనుభూతి కలుగును. అదియే బ్రహ్మాను భూతి అదియే రూపమున నుండునో, ఆ అనుభూతివలన ఆ తపస్వి యెట్టి ఉచ్ఛస్థితినందునో సామాన్యులు ఊహింపలేని విషయము, బ్రహ్మాను సంధానము, మహర్షులకు తపోసంపన్నులకు మాత్రము సాధ్యము.

తపస్సును శారీరకతపస్సు, వాఙ్మయతపస్సు, శారీరకతపస్సు అనగా శరీరమును నిగ్రహములో నుంచుట. ఆహార వ్యవహార నియమములవలన శరీరమును స్వాధీనములో నుంచుకొని స్నానాదుల, బాహ్య శౌచము పాటించి, ముద్రాసహితముగ పద్మాననాద్యాసనముల సుస్థిరుడై, నిమీలితనేత్రుడై మౌనమున ధ్యానము చేయవలయును. జాగ్రదావస్థలో శరీరమును ఏ పనులు చేయుటకు వినియోగించవలయునో వాటికి మాత్రమే వినియోగించవలయును. అనగా భగవత్పంబంధమైన కార్యములకై కైంకర్యము చేయవలయునన్నమాట. వేదాధ్యాయనము చేయుట, జ్ఞాన భక్తి కర్మ వైరాగ్యముల బోధించు గురువులను పూజించుట, త్రికరణశుద్ధి, బ్రహ్మచర్యము, మొదలగునవన్నియు శారీరక తపస్సులో ముఖ్యమగు సాధనములు. ఇక వాఙ్మయ తపస్సు రూపమేమన, మితభాషిత్వము ముఖ్యము. నిరంతర హరినామస్మరణ కర్తవ్యము. పుక్కిటి పురాణములతో లోకాభిరామాయణముతో వాక్వ్యయము చేయక, ఆ వాక్కును భగవన్నామ స్మరణకు, సత్కధా కాలక్షేపమునకు, ధర్మము ప్రబోధించుటకు వినియోగించవలయును. పరదూషణ చేయుట, అసత్యమాడుట కూడదు. వాఙ్మయ తపస్సులో వీలయినంతవరకు మౌనము పాటించుట చాల ముఖ్యము లోకమునకు ప్రయోజనకరమగు మాటలనే మాటలాడవలయును. మౌనధారియే మానసికముగ నెక్కువగ మననము చేయగలడు. Silence is golden వీటిని రాణింపజేయునది తపస్సు. మనసును నిర్మలముగా నుంచుకొనవలయును ప్రాపంచిక వాసనల కాస్కార మీయరాదు. అష్టాక్షరీజపము చేయవలయును. దుస్సంకల్పములచే, ఐహిక వాంఛలచే, అహంకార మమకారములచే మనసును కలుషితము చేయరాదు. అంతరంగమందలి మలినమును క్షాళనము చేసికొనవలయును. ''సర్వేజనా సుఖినో భవంతు'' అను సూక్తిని మరువరాదు నిష్కపటముగ యోచన చేయవలయును. సహనము, క్షమ మొదలగునవి అన్నియు ఆత్మోద్ధరణ హేతువులనునది మరువరాదు. ఆత్మవితరణము సర్వము విసర్జింపగల కార్యదీక్షయే. తపస్సున సృష్టిమర్మమంతయు ప్రత్యక్షమగును. ఆత్మవితరణమే సకల సృష్టికి ప్రభవకారణమగుటచే చేతనా చేతనములు, సకల జంతు సంతానము, నిఖిల జగత్తు తపఃప్రభావమున ఆచ్ఛాదితమగుట తపోనిధికి ప్రత్యక్షానుభవమగును. ఆత్మకు బాహ్యరూపము ఈ స్థావర జంగమ రూపముననున్న ప్రకృతి అది గ్రహించిన వారికి సమత్వ దృష్టి కలుగును. అట్టి తాపసులే సిద్ధులు, బ్రహ్మవిదులు, వారి యత్యాశ్రమమున పరాకాష్ట నందుదురు.

సన్యాసులు ఒకచోటు నిలకడగ నుండక యూరూర సంచరించు చుండవలయు నంటిమి. కాని రెండవ పక్షము కూడ గలదు. అదియు ప్రయోజనకరమైనదే. పరిపక్వమైన తపస్వి తాను తరించుటతో తృప్తి నందడు. ఇతరులకు తత్త్వోపదేశముచేసి తరుణోపాయము జూపుటకు లోకసంగ్రహణార్థము ఆశ్రమము ఏర్పరచుకొని, ధర్మము ప్రబోధించుచు, ఆదర్శజీవితము గడపును. తన ధ్యానమననాదుల ఏమరడు. ఆ ఆశ్రమ ములనుండు ప్రశాంత వాతావరణము ధ్యానమననాదులకు దోహదకారి, ముముక్షువులకు సాధుసంగమస్థానము. మనస్సునకు నిశ్చలత్వము గలిగించి ఆత్మానాత్మ విచారము చేయుటకు అనుకూలమైన పవిత్ర వాతావరణము కల్పించును. అట్టి ఆశ్రమములు నేటికిని కలవు. రమణాశ్రమము, మెహర్బాబా ఆశ్రమము, సత్యశాయీబాబా ఆశ్రమము, మొదలగునవి అన్నియు అట్టివే. బ్రహ్మసమాజము వారి ధ్యానమందిరములు దివ్యజ్ఞాన సమాజ మందిరములు, కొంతవరకు, ఈ ఆశ్రమవాతావరణ కలవే యనవలయును. బౌద్ధవిహారములన్నియు, ఆశ్రమములే. సగుణోపాసన, సాకారబ్రహ్మారాధన, విగ్రహారాధన, దేవాలయముల, ఆవశ్యకతను గుర్తించిన జిజ్ఞాసువులు ఇట్టి ఆశ్రమముల ఆవశ్యకతను గుర్తింపగలరు. ఈ ఆశ్రమములేకాదు త్రిమతాచార్యుల పీఠములు కూడ ఈ ప్రయోజనమును సాధించుటకు ఏర్పడినవే. గజాస్వాదివాహన సంతతితో పరివారముతో సువర్ణమయ పీఠముతో, సకల సంపద వైభముల నుండు ఈ పీఠముల పీఠాధిపతుల జూచి, యత్యాశ్రమము స్వీకరించి సర్వసంగ పరిత్యాగము చేసిన వీరికి ఈ వైభవాదులు ఆడంబరము ఏల? అని సందేహించు శంకాన్వితు లుండవచ్చు. ఆ సందేహము స్థూలదృష్టికి సమంజసముగా గన్పడి నను, దాని తత్త్వము పరిశీలించినవారికి అట్టి సందేహమున కే ఆస్కారము లేదు. ఆ పీఠాధిపతులు బ్రహ్మచర్యమునుండియు నిగ్రహముతో సమస్త ఐహిక సౌఖ్యములను త్యజించి, శీతోష్ణముల లెక్కచేయక, ఆధ్యయనాదుల, జపా తపాదుల, ఉపవాస వ్రతముల, శారీరకముగ, మానసికముగ, నిగ్రహము అలవరచుకొనిన మహనీయులు. వారు అంతర్ముఖులు. వారి నిత్యకర్మానుష్ఠానము, ఉపవాసాదివ్రతములు, పూజలు, పరాకాష్ట నందినవి ఆచార్య పీఠమునకు సంబంధించిన వైభవమును వారు వ్యక్తిగతముగ ననుభవించుటలేదు. ప్రతి పీఠమందును, పరమాత్మ యేదో రూపమున, మంత్రబద్ధమైన, యంత్రముపై, ఆసీనుడై యుండును.

ఈ పూజాదులు, గజాస్వాదులు, పరివారము, అన్నియు, ఆ పరాత్పరుని సేవించుట కేకాని పీఠాధిపతులగు మతాచార్యుల కొరకు కాదు. ఆ ఆచార్యులు నిత్యము గోపూజ గజపూజాదులచేసి, భూతయజ్ఞము చేయుదురు అన్న దానము చేయుదురు పండిత సభలు జరుపుదురు. వేదవిద్యల, శాస్త్రముల, హిందూమతధర్మముల, ప్రచారముచేయుచు వేదపండితులను సన్మానింతురు. తాము స్వయముగా ధర్మబోధ, మతప్రచారము, చేయుటయే గాక ఇతరులచే చేయింతురు అట్టి పీఠాధిపతులకు చేయు భిక్షలు, పాదపూజలు భగవత్సరముగా స్వీకరింతురేకాని, తమకేనను భావము వారి కుండదు. అట్టి మతాచార్యులు తమ పీఠమునకు ప్రధానకేంద్రమగు స్థానముననే ఎల్లపుడు ఉండక, లోకహితార్థము దేశమంతటను ప్రయాణశ్రమ కోర్చి పర్యటించుచు, చాతుర్మాసవ్రతమును చేయుచు, పరులకు తరుణో పాయము జూపు ధన్యజీవులు. వారు జ్ఞానయోగులు, కర్మయోగులు. సామాన్యమానవు డనుభవించు భోజన మజ్జనాది సౌఖ్యములకూడ వారను భవించుటలేదు. వీరివలెనే యాశ్రమము లేర్పరచుకొనిన సిద్ధులు, యతులు సాధువులు నిత్యకర్మానుష్ఠానమున, వ్రతనియమముల, ఉపవాసాదుల, ధ్యాన మననాదుల, తమ జీవితము పరమేశ్వరార్పితముగ గడపుదురేకాని స్వార్థపరులుకారు. వారు సువ్రతులు. ఆదర్శమానవులు లోకకళ్యాణము మానవాభ్యుదయములే వారి ధ్యేయములు. మానవాభ్యుదయమనగా మానవు లందరు పుణ్యవ్రతశీలురై ముక్తులగుట యనియే వారి భావము.

ఇట్టి సత్సంకల్పముతో విధినిషేధములతో గూడిన యత్యాశ్రమ ధర్మముల పాటించువారు సర్వలోక పూజ్యులు. అట్టి యత్యాశ్రమమెంతయు పరమోత్తమ మైనదనుట సమంజసమే. శ్రవణ మనన ధ్యాన సమాధుల వలన, బ్రహ్మానుభూతిని సంపాధించిన సిద్ధులు, తాము తరించి నిర్వికల్ప సమాధిలో తాము అనుభవించిన దివ్యానుభూతిని సమాధినుండి బయటకు వచ్చినతరువాత లోకసంగ్రహణార్థము వివిధమార్గముల సాధకులకు వివరించి విశదముచేసి సత్యమార్గము చూపుదురు. వారు స్వార్థరహితులు, మహాత్ములు, లోకపూజితులు

----------------------------------------------------------------------------------------------------

భగవంతునికై తనలోకాక వెలుపల వెదకువాడు అజ్ఞుడు తనలో భగవంతుని దర్శించినవానికి తన వెలుపల గూడ కనబడును.

శ్రీరామకృష్ణ పరమహంస

Satyanveshana    Chapters