Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ సప్తపఞ్చాశదుత్తరశతతమో7ధ్యాయః

అథ శావాశౌచాధికమ్‌.

పుష్కర ఉవాచ :

ప్రేతశుద్ధిం ప్రవక్ష్యామి సూతికాశుద్ధిమేవ చ | దశాహం శావమాశౌచం నపిణ్డషు విధీయతే. 1

జననే చ తథా శుద్ధిర్బ్రాహ్మణానాం భృగూత్తమ | ద్వాదశాహేన రాజన్యః పక్షాద్వైశ్యోథ మాసతః.2

శూద్రోనులోమతో దాసే స్వామితుల్యం త్వశౌచకమ్‌ | షడ్భిస్త్రిభిరథై కేన క్షత్రవిట్శూద్రయోనిషు. 3

బ్రాహ్మణః శుద్ధిమాప్నోతి క్షత్రియస్తు తథైవ చ |

విట్శూద్రయోనేః శుద్ధిః స్యాత్ర్కమాత్పరశురామక. 4

షడ్రాత్రేణ త్రిరాత్రేణ షడ్భిః శూద్రే తథా విశః | ఆదన్తజననాత్సద్య ఆచూడాన్నైశికీ శ్రుతిః. 5

త్రిరాత్రమావ్రతాదేశాద్దశరాత్రమతః పరమ్‌ | ఊనత్రైవార్షికే శూద్రః పఞ్చాహాచ్ఛుర్ధిరిష్యతే. 6

ద్వాదశాహేన శుద్ధిః స్యాదతీతే వత్సరత్రయే | గతైః సంవత్సరైః షడ్భిః శుద్దిర్మా సేన కీర్తితా. 7

స్త్రీణామకృతచూడానాం విశుద్ధర్నైశికీ స్మృతా | తథా చ కృతచూడానాం త్ర్యహాచ్ఛుద్ధ్యన్తి బాన్ధవాః. 8

వివాహితాసు నాశౌచం పితృపక్షే విధీయతే | పితుర్గృ హే ప్రసూతానాం విశుద్ధిర్నైశికీ స్మతా. 9

సూతికాదశరాత్రేణ శుద్ధిమాప్నోతి నాన్యథా | వివాహితాహి చేత్కన్యా మ్రియతే పితృవేశ్మని. 10

తస్యాస్త్రిరాత్రాచ్ఛుధ్యన్తి బాన్ధవా నాత్రసంశయః | సమానం లఘ్వశౌచం తు ప్రథమేన సమాపయేత్‌.11

అసమానం ద్వితీయేన ధర్మరాజవచో యథా |

పుష్కరుడు చెప్పెను : ఇపుడు ప్రేతశుద్ధి-సూతికాశుద్ధులను గూర్చి చెప్పెదను. సపిండులలో (మూలపురుషుడు మొదలు ఏడవ తరమువరకు ఉన్నవారిలో) మరణాశౌచము పది దినములు. జననాశౌచము కూడ అంతే. పరశు రామా! ఇది బ్రాహ్మణుల విషయమున చెప్పిన అశౌచము. క్షత్రియులకు 11 రోజులు, వైశ్యులకు 15 రోజులు, శూద్రులకు ఒక మాసము అశౌచము. శూద్రులకు చెప్పిన ఈ అశౌచము అనులోమజునకు స్వామి ఎన్ని దినముల ఆశౌచము పాటించునో సేవకులకు గూడ అన్ని దినములే. జననాశౌచము క్షత్రియ-వైశ్య-శూద్రులకు గూడ పది దినములే. పరశురామా! బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులకు ఈ విధముగనే శుద్ధి యగును. కొందరి మతమున వైశ్య-శూద్రులకు జననాశౌచము పదునైదు దినములు. బాలకుడు దంతోత్పత్తికి పూర్వమే మరణించినచో జననాశౌచమునకు సద్యః శుద్ధి కలుగును. దంతములు వచ్చిన తరువాత చూడాకరణమునకు పూర్వము మరణించినచో ఏకరాత్రాశౌచము; యజ్ఞోపవీతధారణమునకు పూర్వమైనచో త్రిరాత్రాశౌచము; అనంతరము దశరాత్రాశౌచము. మూడు సంవత్సరముల లోపు బాలుడుమరణించినచో శూద్రునకు ఐదు దినముల తరువాత అశౌచనివృత్తి. మూడు సంవత్సరముల పిమ్మట నైనచో పదునొక దినముల తరువాతను, ఆరు వర్షములు దాటిన తరువాత నైనచో ఒక మాసము తరువాతను నివృత్త మగును. చూడాకర్మ జరుగని కన్య మరణించి నపుడు ఒక రాత్రి మరణాశౌచ మగును. చూడాకర్మ జరిగిన పిమ్మట నైనచో బంధువులకు మూడ దినముల పిమ్మట శుద్ధి యగును. వివాహితస్త్రీల మరణాశౌచము పితృకులమువారికి ఉండదు. తండ్రి యింటిలో పుత్రిక బిడ్డను కన్నచో ఆ జాతాశౌచము ఒక్క రాత్రిమాత్రమే ఉండును. ఆ స్త్రీ మాత్రము పది రోజుల తరువాత శుద్ధురాలగును. వివాహితకన్య పితృగృహమున మరణించినచో పితృకులమువారికి అశౌచము మూడు రాత్రు లుండును. సమానఅశౌచమునకు ముందు శుద్ధి చేసికొనవలెను. అసమానాశౌచమునకు అనంతరము చేసికొనవలెను, అని ధర్మరాజు చెప్పెను.

దేశాన్తరస్థః శృత్వా తు కుల్యానాం మరణోద్భవౌ. 12

యచ్ఛేషం దశరాత్రస్య తావదేవశుచిర్భవేత్‌ | అతీతే దశరాత్రే తు త్రిరాత్ర మశుచిర్భవేత్‌. 13

తథా సంవత్సరే లీతే స్నాత ఏవ విశుధ్యతి | మాతామహే తథాతీతే హ్యాచార్యే చ తథా మృతే. 14

రాత్రిభిర్మాసతుల్యాభిర్గర్భస్రావే విశోధనమ్‌ | సపిణ్డ బ్రాహ్మణ వర్ణాః సర్వ ఏవావిశేషతః. 15

దశరాత్రేణ శుధ్యన్తి ద్వాదశాహేన భూమిపః | వైశ్యాః వఞ్చదశాహేన శూద్రా మాసేన భార్గవ. 16

ఉచ్ఛిష్టసన్ని ధావేకం తథా పిణ్డం నివేదయేత్‌ | కీర్తయేచ్చ తథా తస్య నామ గోత్రే సమాహితః. 17

భుక్తవత్సా ద్విజేన్ద్రేషు పూజితేషు ధనేన చ | విసృష్టాక్షతతోయేషు గోత్రనామానుకీర్తనైః. 18

చతురఙ్గుల విస్తారం తత్ఖాతం తావదన్తరమ్‌ | వితస్తిదీర్ఘం కర్తవ్యం వికర్షూణాం తథాత్రయమ్‌. 19

వికర్షూణాం సమీపే చ జ్వాలయేజ్జ్వలనత్రయమ్‌ | సోమాయ వహ్నయే రామ యమాయ చ సమానతః. 20

దేశాంతరములో నున్నవాడు జాతమరణాశౌచములను విన్నచో పది రోజులలో మిగిలిన రోజులకు మాత్రమే అశౌచము పట్టవలెను. పది రోజుల తరువాత విన్నచో మూడు రోజులు పట్టవలెను. సంవత్సరము దాటిన తరువాత విన్నచో స్నానమాత్రముచే శుద్ధుడగును. మాతామహుడు గాని, ఆచార్యుడు గాని మరణించినచో మూడు రాత్రులు ఆశౌచము పరశురామా! గర్భస్రావము ఎన్నవ మాసమున జరిగినదో అన్ని రాత్రులు గడచిన పిమ్మట స్త్రీకి శుద్ధి యగును. సపిండబ్రాహ్మణకులమునందు మరణాశౌచము వచ్చినచో అందరికిని పది రోజులలో శుద్ధి. క్షత్రియులకు పదునొకండు రోజులలోను, వైశ్యునకు పదునైదు రోజులలోను, శూద్రునకు ఒక మాసమునకును శుద్ధి (శ్రాద్ధమునందు) ఉచ్ఛిష్ట సమీపమున వేదిని ఏర్పరచి, దాని సంస్కారము చేసి దాని పై కుశలు పరచి, కుశముల పైననే పిండప్రదానము చేయవలెను. ఆ సమయమున ఏకాగ్రచిత్తుడై పితరుల నామగోత్రములు చెప్పుచు పిండప్రదానము చేయవలెను. బ్రాహ్మణులు భుజించిన తరువాత వారికి ధన మిచ్చి సత్కరించి, పూజించి, నామగోత్రోచ్చారణపూర్వకముగ అక్షతసహితజలము విడువవలెను. నాలుగు అంగుళముల వెడల్పు, అంతే లోతు, గల జానెడు గొయ్యి తవ్వి అచట మూడు వికర్షువులు తయారుచేసి, వాటి దగ్గర మూడు అగ్నులను ప్రజ్వలింపచేయవలెను.

జుహుయాదాహుతీః సమ్యక్సర్వత్రైవ చతుస్త్రయః | పిణ్డనిర్వాపణం కుర్యా త్ప్రాగ్వదేవ పృథక్‌ పృథక్‌. 21

అన్నేన దధ్నా మధునా తథా మాంసేన పూరయేత్‌ |

మధ్యే చేదధిమాసః స్యాత్కుర్యాదభ్యధికం తు తత్‌. 22

అథవా ద్వాదశాహేన సర్వమేతత్సమాపయేత్‌ | సంవత్సరస్య మధ్యే చ యది స్యాదధి మాసకః. 23

తదా ద్వాదశ##కే శ్రాద్ధే కార్యం తదధికం భ##వేత్‌ | సంవత్సరే సమాప్తే తు శ్రాద్ధం శ్రాద్ధవదాచరేత్‌. 24

ప్రేతాయ తత ఊర్ధ్వం చ తసై#్యవ పురుషత్రయే | పిణ్డాన్వినిర్వపే త్తద్వచ్చతురస్తు సమాహితః. 25

సంపూజ్య దత్త్వా పృథివీ సమానా ఇతి చాప్యథ |

యోజయేత్ప్రేత పిణ్డం తు పిణ్డష్వన్యేషు భార్గవ | 26

ప్రేతపాత్రం చ పాత్రేషు తథైవ వినియోజయేత్‌ |

పృథక్‌ పృథక్‌ ప్రకర్తవ్యం కర్మైతత్కర్మపాత్రకే. 27

మన్త్రవర్జమిదం కర్మ శూద్రస్య తు విధీయతే | సపిండీకరణం స్త్రీణాం కార్యమేవ తదా భ##వేత్‌. 28

శ్రాద్ధం కుర్యాచ్చ ప్రత్యబ్దం ప్రేతే కుమ్భాన్నమబ్దకమ్‌ | గఙ్గాయాః సికతాధారా యథా వర్షతి వాసవే. 29

శక్యా గణయితుం లోకే న త్వతీతాః పితామహాః | కాలే సతతగే స్థైర్యం నాస్తి తస్మాత్ర్కియాం చరేత్‌. 30

వాటి అన్నింటియందును మూడేసి, లేదా నాలుగేసి హోమములు చేయవలెను. పిదప అచట వెనుకటివలెనే వేరువేరుగా పిండముల నీయవలెను. పిండములను అన్నము, పెరుగు, తేనె, మినుగులు వీటితో చేయవలెను. సంవత్సరము మధ్య అధికమాసము వచ్చినచో దాని కొక పిండము అధికముగా చేయవలెను. లేదా పండ్రెండు మాసముల మాసిక శ్రాద్ధము లన్నియు పండ్రెండవ రోజుననే పూర్తి చేయవలెను. ఈ సంవత్సరమునందు అధికమాసము రానున్నచో ద్వాదశాహశ్రాద్ధదినమునందే ఆమాసముకొరకై ఒకపిండము అధికముగా ఇవ్వవలెను. సంవత్సరము పూర్తి యైన పిమ్మట శ్రాద్ధమును సామాన్యశ్రాద్ధము వలెనే చేయవలెను. సపిండీకరణ శ్రాద్ధమునందు ప్రేతకు పిండము వేరుగా నిచ్చి, పిదప మూడు తరముల పితరులకు మూడు పిండముల వేరువేరుగా ఇవ్వవలెను. ఈ విధముగా నాలుగు పిండములను ఏకాగ్రతతో ఇవ్వవలెను. పరశురామా! పిండముల పూజ చేసి, దానము చేసి, ''పృథివీతే పాత్రము'' ''యే సమానాః'' ఇత్యాదిమంత్రమును పఠించుచు యథోచితకర్మచేసి, ప్రేతపిండమును మూడు భాగములు చేసి, వాటిని వరుసగా పితృ - పితామహ - ప్రపితామహాపిండములందు కలపవలెను. అంతకు ముందు ప్రేతార్ఘ్య పాత్రలను పిత్రాద్యర్ఘ్య పాత్రలతో కలిపివేయవలెను. ఈ రెండు పనులు వేరు వేరుగ చేయుట మంచిది. శూద్రునకు ఈ శ్రాద్ధకర్మ మంత్రరహితముగ చేయవలెను. స్త్రీల సపిండీకరణమును ఆ సమయమునందు ఈ విధముగనే చేయవలెను. పితృదేవతలకు ప్రతి సంవత్సరము శ్రాద్ధము చేయవలెను. ప్రేతకు మాత్రము సాన్నోదకకుంభ దానము ఒక సంవత్సరము పాటు చేయలెను. వర్షాకాలమునందు గంగానదిలోని ఇసుక లెక్క పెట్టవచ్చునేమో కాని అతీతులగు పితరులను లెక్క పెట్ట శక్యము కాదు. కాలము నిరంతరగమన శీలము. స్థిరత్వ మనునది కాలమునం దెన్నడును ఉండదు. అందుచే కర్మలను తప్పక చేయవలెను.

దేవత్వే యాతనాస్థానే ప్రేతః శ్రాద్ధం కృతం లభేత్‌ | నోపకుర్యాన్నరః శోచన్‌ | పేతస్యాత్మన ఏవవా. 31

భృగ్వగ్నిపాశకామ్భోభిర్మృతానామాత్మఘాతినామ్‌ |

పతితానాం చ నాశౌచం విద్యుచ్ఛస్త్రహతాశ్చ యే. 32

యతివ్రతి బ్రహ్మచారిసృపకారుక దీక్షితాః | రాజాజ్ఞాకారిణో యే చ స్నాయాద్వై ప్రేతగామ్యపి. 33

మైథునే కటధూమే చ సద్యః స్నానం విదృయతే | ద్విజేననిర్హరేత్ర్పేతం శూద్రేణ తే కథఞ్చన. 34

న చ శూద్రం ద్విజేనాపి తయోర్దోషో హి జాయతే | అనాథవిప్రప్రేతస్య వహనాత్స్వర్గలోకభాక్‌. 35

సంగ్రామే జయమాప్నోతి ప్రేతేనాధే చ కాష్ఠదః | సంకల్ప్య బాన్దవం ప్రేతమపసవ్యేన తాం చితిమ్‌. 36

పరిక్రమ్య తతః స్నానం కుర్యుః సర్వే సవాసనః |

ప్రేతాయ చ తథా దద్యుస్త్రీం స్త్రీంశ్చైవోదకాంజలీన్‌. 37

ద్వార్యశ్మని పదం దత్త్వా ప్రవిశేయుస్తథా గృహమ్‌ | ఆక్షతాన్నిక్షిపేద్వహ్నౌ నింబపత్రం విదశ్య చ. 38

పృథక్‌ శయీరన్‌ భూమౌ చ క్రీతలఘ్వాశనో భ##వేత్‌ | ఏకః పిణ్డో దశా హే తు శ్మశ్రుకర్మకరః శుచిః. 39

సిద్థార్ధకైస్తిలైర్విద్వాన్మజ్జేద్వాసోమ్బరం దధత్‌ | అజాతదన్తే తనయే శిశౌ గర్భమృతే తథా. 40

కార్యౌ నై వాగ్ని సంస్కారౌ నైవ చాస్యోదకక్రియా | చతుర్థే చ దినేకార్యస్తథా స్థ్నానం చైవ సంచయః.

అస్థిసఞ్చయనాదూర్ధ్వమంగస్పర్శో విధీయతే.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే శావాశౌచాదికం నామ సప్తపఞ్చశదధిక శతతమోధ్యాయః.

మరణించిన వాడు దేవత్వమును పొంది యున్నను. నరకములో శ్రాద్ధమును అచటనే తప్పక పొందును. మరణించిన వానిని గూర్చి ఏడ్చువాడు తనకు కాని, మరణించిన వానికిగాని ఉపకారము చేసినవాడు కాజాలడు. పర్వతము నుండి దుమికి, అగ్నిలోపడి, ఉరి వేసికొని, నీటిలో పడి, ఆత్మహత్యచేసికొన్నవారి మరణాశౌచము బంధువులకు తగలదు. పిడుగుపడి గాని, యుద్ధములో శస్త్రఘాతమువలన గాని మరణించినవారి వలన గూడ మరణా శౌచము ఉండదు. యతులకును, యజ్ఞదీక్షితులకును, రాజాజ్ఞాపాలకులకును అశౌచ ముండదు. వీరు శవయాత్రలో వెళ్ళినచో స్నానముచే శుద్ధు లగుదురు. మైథునము తరువాతను జ్వలించుచున్న శవముయొక్క ధూమము తగిలినను వెంటనే స్నానము చేయవలెను. మరణించిన బ్రాహ్మణుని శూద్రునిచేత మోయించగూడదు. అట్లే శూద్రుని బ్రాహ్మణునిచేత మోయించగూడద. అట్లు చేయుటచే ఇద్దరికిన దోషము. అనాధబ్రాహ్మణశవమును మోసి అంత్యేష్టికి తీసికొని వెళ్ళినవాడు స్వర్గమును పొందును. అనాథప్రేత సంస్కారార్థమై కాష్ఠ మిచ్చువాడు యుద్ధమునందు విజయము పొందును. శవమును చితిపై ఉంచి, దహించి, బంధువులు చితికి అపసవ్యముగా పరిక్రమణము చేసి, సచేలస్నానముచేసి, ప్రేతనిమిత్తము మూడేసి పర్యాయములు జలాంజలి ఇవ్వవలెను. గృహద్వారమునందు మొదట ఱాతిపై పాదములుంచి అగ్నిలో అక్షతలు వేసి, వేపాకులు నమలి, ఇంటిలో ప్రవేశించవలెను. అందరికి దూరముగా చాప వేసికొని నిద్రించవలెను. ఆ కుటుంబములోని వారు ఆ రోజున కొన్న ఆహారమును స్వల్పముగా భుజించవలెను. పది రోజులవరకును రోజుకు ఒక్కొక్కటి చొప్పున పిండము నీయవలెను. పదవ రోజున ఒకపిండము నిచ్చిన తరువాత క్షౌరము చేయించుకొనుటచే పరిశుద్ధుగడును. పదవ రోజున ఆవాలను, తిలలను శరీరమునకు పూసుకొని, నీటిలో మునిగి స్నానము చేసి నూతన వస్త్రములు ధరించవలెను. దంతోత్పత్తికి పూర్వమే మరణించిన బాలునకును, గర్భస్రావముచే పోయిన శిశువునకును దాహసంస్కార జలాంజలులు ఉండవు. శవదాహానంతరనము నాల్గవ రోజున అస్థిసంచయము చేయవలెను. అస్థి సంచయము తరువాత అంగస్పర్శ విహితము.

అగ్ని మహాపురాణమునందు శావాశౌచాదిక మను నూట ఏబది ఏడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters