Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ సప్తసప్తత్యధిక శతతమోధ్యాయః

అథ ద్వితీయావ్రతాని

అగ్ని రువాచ :

ద్వితీయావ్రతకం వక్ష్యేభుక్తిముక్త్యాదిదాయకమ్‌ | పుష్పాహారీ ద్వితీయాయామశ్వినౌ పూజయేత్సురౌ. 1

అబ్దం స్వరూపసౌభాగ్యం సర్వభాగ్‌ జాయతే వ్రతీ | కార్తికే శుక్లపక్షస్య ద్వితీయాయాం యమం వ్రజేత్‌. 2

అబ్దముపోషితః స్వర్గం గచ్ఛేన్న నరకం వ్రతీ | అశూన్యశయనం వక్ష్యే హ్యవైధవ్యాదిదాయకమ్‌. 3

కృష్ణపక్షే ద్వితీయాయాం శ్రావణస్య చరేదిదమ్‌ | శ్రీవత్సధారిన్‌ శ్రీకాన్త శ్రీధామన్‌ శ్రీపతేవ్యయ. 4

గార్హస్థ్యం మా ప్రణాశం మే యాతు ధర్మార్థకామదమ్‌ | అగ్నయో మా ప్రణశ్యన్తు మాప్రణశ్యన్తు దేవతాః. 5

పితరో మా ప్రణశ్యన్తు మత్తో దామ్పత్యభేదతః | లక్ష్మ్యా వియుజ్యతే దేవో న కదాచిద్యథా భవాన్‌. 6

తథా కలత్రసమ్బన్దో దేవ మా మే విభిద్యతామ్‌ | లక్ష్మ్యా న శూన్యం వరద యథా తే శయనం విభో. 7

శయ్యా మమాప్యశూన్యాస్తు తథైవ మధుసూదన | లక్ష్మీం విష్ణుం యజేదబ్దం దద్యాచ్ఛయ్యాం ఫలాని చ. 8

ప్రతిమాసం చ సోమాయ దద్యాదర్ఘ్యం సమన్త్రకమ్‌ | గగనాఞ్గణ సందీప దుగ్ధాబ్దిమథనోద్భవ. 9

భాభాసితరిగాభోగ రమానుజ నమో7స్తుతే | ఓం శ్రీధరాయ నమః సోమాత్మానం హరిం యజేత్‌. 10

ఘం ఢం భం హం శ్రియై నమా దశరూపమహాత్మసే |

ఘృతేన హోమో నక్తం చ శయ్యాం దద్వాద్ద్విజాతయే. 11

దీపాన్నభాజనైర్యుక్తం ఛత్రోపానహమాసనమ్‌ | సోదకుమ్భం చ ప్రతిమాం విప్రాయాథ చ పాత్రకమ్‌. 12

పత్న్యా య ఏవం కురుతే భుక్తి ముక్తీ అవాప్నుయాత్‌ |

కాన్తివ్రతం ప్రవక్ష్యామి కార్తికస్య సితే చరేత్‌. 13

నక్తభోజీ ద్వితీయాయాం పూజయేద్భల కేశవౌ | వర్షం ప్రాప్నోతి వై కాన్తిమాయూరారోగ్యకాదికమ్‌. 14

అథ విష్ణువ్రతం వక్ష్యే మనోవాఞ్ఛితదాయకమ్‌ | పౌషశుక్లద్వితీయాది కృత్వా దినచతుష్టయమ్‌. 15

పూర్వం సిద్ధార్థకైః స్నానం తతః కృష్ణతిలైః స్మృతమ్‌ | వచయా చ చతుర్థే7హ్ని సర్వౌషధ్యాచతుర్థకే. 16

సురా మాంసీ వచా కుష్ఠం శైలేయం రజనీద్వయమ్‌ | శటీ చమ్పకముస్తంచ సర్వోషధిగణః స్మృతః. 17

నామ్నా కృష్ణా చ్యుతానన్తహృషీకేశేతి పూజయేత్‌ | పాదేనాభ్యాం చక్షుషీ చ క్రామాచ్ఛిరసి పుష్పకైః. 18

శశిచన్ద్రశశాఙ్కేన్దుసంజ్ఞాభిశ్చార్ఘ్యమిన్దవే | నక్తం భుఞ్జీత చ నరో యావత్తి ష్ఠేత చన్ద్రమాః. 19

షణ్మాసం పావనం చాబ్దం ప్రాప్నుయాత్సకలం వ్రతీ |

ఏతద్ర్వతం నృపైః స్త్రీభిః కృతం పూర్వం సురాదిభిః. 20

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ద్వితీయావ్రతాని నామ సప్తసప్తత్యధిక శతతమోధ్యాయః.

అగ్ని దేవుడు చెప్పెను ; నే నిపుడు భుక్తిముక్తిప్రదములగు ద్వితీయావ్రతములను గూర్చి చెప్పెదను. ప్రతిమాసమునందును ద్వితీయయందు పుష్పములు మాత్రము భుజించవలెను. అశ్వినీదేవతలను పూజించవలెను. ఒక సంవత్సరము ఈ వ్రతము ననుష్ఠించుటచే సౌందర్యము, సౌభాగ్యము లభించును, అంతమున స్వర్గము లభించును. కార్తిక శుక్లద్వితీయయందు యముని పూజించవలెను. పిదప ఒక సంవత్సరము ప్రతి శుక్లద్వితీయయందును ఉపవాసపూర్వకముగ వ్రత మాచరించవలెను. ఇట్లు చేయుటచే మానవుడు స్వర్గమునకు వెళ్ళును. నరకమునకు వెళ్ళడు. ఇపుడు అశూన్యశయనవ్రతమును చెప్పెదను. ఇది స్త్రీలకు అవైధన్యమును, పురుషులకు సర్వదా భార్యాసుఖమును ఇచ్చును. శ్రావణకృష్ణపక్షద్వితీయయందు ఈ వ్రతమును అనుష్టించవలెను. ''వక్షఃస్థలమునందు శ్రీవత్సమును ధరించిన ఓ శ్రీకాన్తా! నీవు లక్ష్మీ నివాసభూతుడవు. లక్ష్మీపతివి. వినాశనరహితుడ వగు సనాతన పరమేశ్వరుడవు. ధర్మార్థకామములకు నిలయ మగు నా గార్హస్థ్యము నీ కృపచే సుస్థిరముగా నుండుగాక. నా గృహమునందలి అగ్ని ఎన్నటికిని చల్లారకుండుగాక! గృహదేవత ఎన్నడును అదృశ్యురాలు కాకుండుగాక. నా పితరులకు నాశము కలుగకుండుగాక. నా దాంపత్యము విహతము కాకుండుగాక. నీకు ఏ విధముగ ఎన్నడును లక్ష్మీవియోగము కలుగదో అట్లే నాకును పత్నీవియోగ మెన్నడును కలుగకుండుగాక. వరదాత వైన ఓ ప్రభూ! నీ శయనము ఏ విధముగ లక్ష్మీవిహీనము కాదో అదే విధముగ నా శయ్య కూడ పత్నీవిహీనము కాకుండుగాక''-ఈ విధముగ శ్రీ మహావిష్ణువును ప్రార్థించి, వ్రతము ప్రారంభితంచి, ఒక్క సంవత్సరము వరకును, ప్రతిమాసమునందును, ద్వితీయయందు లక్ష్మీవిష్ణువులను యథావిధిగా పూజించవలెను. శయ్యాదానము. ఫలదానము చేయవలెను. ప్రతిమాసమునందును అదే తిథియందు చంద్రునకు మంత్రోచ్చారణపూర్వకముగా అర్ఘ్యప్రదానము చేయవలెను. ''భగవంతుడ వైన చంద్రా! నీవు గగన ప్రాంగణమును దీపింపచేయువాడవు. క్షీరసాగరమును మథించుటచే నీవు ఆవిర్భవించితివి. నీవు నీ కాంతిచే సకలదిఙ్మండలమును ప్రకాశింపచేయుచున్నావు. ఓ లక్ష్మీదేవితమ్ముడా! నీకు నమస్కారము'' అని ఆ మంత్రమున కర్థము. ''ఓం శ్రీం శ్రీధరాయ నమః'' అను మంత్రముతో సోమరూపు డగు శ్రీహరిని పూజించవలెను. ''ఘం టం హం సం శ్రియై నమః'' అను మంత్రముతో లక్ష్మీదేవిని, ''దశరూపమహాత్మనే నమః'' అను మంత్రముతో శ్రీ మహావిష్ణువును పూజించవలెను. రాత్రి ఆజ్యహోమము చేసి బ్రాహ్మణునకు శయ్యాదానము చేయవలెను. దానితో దీపము, ఆన్నముతో నింపిన పాత్ర, ఛత్రము, పాదుకలు, ఆసనము, జలపూర్ణకలశము, శ్రీహరి ప్రతిమ, పాత్రకూడ బ్రాహ్మణునకు దానము చేయవలెను. ఈ విధముగా వ్రతపాలనము చేసినవాడు భోగమోక్షములకు అర్హుడగును. ఇపుడు కాంతివ్రతమును వర్ణించెదను. కార్తిక శుక్ల ద్వితీయయందు దీనిని ప్రారంభించవలెను. పగలు ఉపవాసము చేసి, రాత్రి భోజనము చేయవలెను. ఈ వ్రతమునందు శ్రీకృష్ణబలరాములను పూజించవలెను. ఈ విధముగ ఒక సంవత్సరము వ్రతము చేసినవాడు కాంతి, ఆయుర్దాయము, ఆరోగ్యము మొదలగువాటిని పొందును.

ఇపుడు మనోవాంఛితములను ఇచ్చు విష్ణువ్రతమును వర్ణించెదను. పుష్యశుక్లద్వితీయనాడు ప్రారంభించి వ్రతము నాలుగు దినములు చేయబడును. మొదటి దినమున ఆవాలు కలిపిన జలముతో స్నానము చేయవలెను. రెండవ దినమున తిలలు కలిపిన జలముతోను, మూడవ దినమున వచ అను ఓషధి కలిపిన జలములోను, నాల్గవ దివసమున సర్వౌషధిమిశ్ర జలముతోను స్నానము చేయవలెను. సురామాంసి, వచ, కుష్ఠము, శైలేయము, రెండు రకముల పసుపు, శటి, చంపకము, ముస్తము, అను ఓషధుల సముదాయమునకు సర్వౌషధులని పేరు. మొదటి దివసమున 'శ్రీకృష్ణాయ నమః', రెండవ దివసమున ''అచ్యుతాయ నమః మూడవ దివసమున ''అనన్తాయ నమః'' నాల్గవ దివసమున ''హృషీకేశాయ నమః '' అను నామ మంత్రములతో వరుసగా భగవంతుని చరణ-నాభి-నేత్ర, శిరస్సులందు పుష్పములు సమర్పించుచు పూజచేయవలెను. ప్రతిదినము ప్రదోషసమయమునందు చంద్రునకు అర్ఘ్యప్రదానము చేయవలెను. నాలుగు దినములందును వరుసగా 'శశినే నమః', ''చంద్రాయ నమః'', ''శశాఙ్కాయ నమః'', ''ఇన్దవే నమః'', అను మంత్రములతో అర్ఘ్యప్రదానము చేయవలెను. రాత్రి చంద్రుడు కనబడునంతకాలము లోపల భోజనము చేయవలెను. ఈ విధముగ ఆరు మాసములు లేదా ఒక సంవత్సరము ఈ వ్రత మాచిరించినవాడు సంపూర్ణవాంఛితములను పొందును. పూర్వకాలమున రాజులు, స్త్రీలు, దేవతలు కూడ ఈ వ్రత మాచరించిరి.

అగ్ని మహాపురాణమునందు ద్వితీయావ్రతవర్ణన మను నూటడెబ్బదిఏడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters