Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ త్రినవత్యుత్తర శతతమో೭ధ్యాయః అథ శివరాత్రివ్రతమ్ అగ్నిరువాచ : శివరాత్రివ్రతం వక్ష్యే భుక్తిముక్తిప్రదం శృణు | మాఘఫాల్గునయోర్మధ్యే కృష్ణా యా తు చతుర్దశీ 1 కామయుక్తా తు సోపోష్యా కుర్వన్ జాగరణం వ్రతీ | శివరాత్రివ్రతం కుర్వే చతుర్దశ్యామభోజనమ్. 2 రాత్రిజాగరణనైవ పూజయామి శివం వ్రతీ | ఆవాహయామ్యహం శమ్భుం భుక్తిముక్తిప్రదాయకమ్. 3 నరకార్ణవకోత్తారనావం శివ నమోస్తుతే | నమః శివాయ శాన్తాయ ప్రజారాజ్యాదిదాయినే. 4 సౌభాగ్యారోగ్య విద్యార్థస్వర్గమార్గప్రదాయినే | ధర్మం దేహి ధనం దేహి కామభోగాది దేహి మే. 5 గుణకీర్తిసుఖం దేహి స్వర్గం మోక్షం చ దేహి మే | లుబ్దకః ప్రాప్తవాన్ పుణ్యం పాపీ సున్దరసేనకః. 6 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే శివరాత్రివ్రతం నామ త్రినవత్యధిక శతతమో೭ధ్యాయః. అగ్నిదేవుడు చెప్పెను : ఇపుడు భుక్తిముక్తిప్రద మగు శివరాత్రివ్రతమును గూర్చి చెప్పెదను. ఏకాగ్రచిత్తముతో వినుము మాఘఫాల్గుణముల మధ్య వచ్చు కృష్ణ చతుర్దశినాడు కోరికలు గలవాడు ఉపవాస ముండవలెను. రాత్రి జాగరము చేసి ఇట్లు చెప్పవలెను. ''నేను చతుర్దశినాడు ఉపవాస ముండి శివరాత్రి వ్రతము చేయుచున్నాను. నేను వ్రతముక్తుడ నై రాత్రి జాగరము చేసి శివుని పూజ చేయుచున్నాను. భోగమోక్షములను ప్రసాదించు శివుని ఆవాహనము చేయుచున్నాను. శివా! నీవు నరకసముద్రమును దాటించు నౌకవంటివాడవు. నీకు నమస్కారము. నీవు ప్రజారాజ్యాదుల నిచ్చువాడవు. మంగలమయుడవు. శాంతస్వరూపుడవు. నీకు నమస్కారము. నీవు సౌభాగ్య - ఆరోగ్య - విద్యా - ధన - స్వర్గముల నిచ్చువాడవు. నాకు ధర్మమును, ధనమును, కామభోగాదికమును ప్రసాదించుము. నన్ను గుణ - కీర్తి - సుఖసంపన్నుని చేయుము. నాకు స్వర్గ - మోక్షముల నిమ్ము'' శివరాత్రివ్రతప్రభావముచే పాపాత్ముడైన సుందరసేనుడను వ్యాధుడు కూడ పుణ్యవంతు డాయెను. అగ్నిమహాపురాణమునందు శివరాత్రివ్రత మను నూట తొంబది మూడవ అధ్యాయము సమాప్తము.