Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథు ఏకాదశో త్తర ద్విశతతమోధ్యాయః

అథ నానాదానవర్ణనమ్‌.

అగ్నిరువాచ :

ఏకాంగాం దశగుర్దర్యాద్దశ దద్యాచ్చ గోశతీ | శతం సహస్రగుర్దద్యాత్సర్వే తుల్య ఫలా హి తే. 1

ప్రాసాదా యత్ర సౌవర్ణా వసోర్ధారా చ యత్ర సా | గన్ధర్వాప్సరసో యత్ర తత్రయాన్తి సహస్రదాః. 2

గవాం శతప్రదానేన ముచ్యతే నరకార్ణవాత్‌ | దత్వా వత్సతరీం చైవ స్వర్గలోకే మహీయతే. 3

గోదానాదాయురారోగ్యం సౌభాగ్యస్వర్గమాప్నుయాత్‌ | ఇన్ద్రాదిలోకపాలానాం యా రాజమహిషీ శుభా. 4

మహిషీదానమాహాత్మ్యాదస్తు మే సర్వకామదా | ధర్మరాజస్య సాహాయ్యే యస్యాః పుత్రః ప్రతిష్ఠితః. 5

మహిషాసురన్య జననీ యా సాస్తు వరదా మమ | మహిషీదానాచ్చ సౌభాగ్యం వృషదానాద్దివం వ్రజేత్‌. 6

అగ్నిదేవుడు చెప్పెను: వసిష్ఠా! పది గోవు లున్నవాడు ఒక గోవును, నూరుగోవులున్నవాడు పదిగోవులను, వెయ్యి గోవు లున్నవాడు నూరు గోవులను దానము చేయగా వారికి లభించు ఫలము సమముగనే ఉండును. కుబేరుని రాజధాని యగు అలకాపురియందు ఉన్న సువర్ణనిర్మిత భవనమున గంధర్వులును, అప్పరసలును విహరించుచుందురు. సహస్రగోదానము చేసినవాడు ఆచటికి వెళ్లును. శతగోదానములు చేసినవాడు నరకసముద్రము నుండి విముక్తు డగును. వత్సదానము చేసినవాడు స్వర్గమున పూజింపబడును. గోదానము చేయుటచే దీర్ఘాయురారోగ్యసౌభాగ్యములు లభించును.. స్వర్గము ప్రాప్తించును. ఈ క్రింది మంత్రము చదువుచు మహిషీదానము చేయుటచే సౌభాగ్యము లభించును:- "ఇంద్రాదిలోకపాలుల మంగళమయరాజమహిషి యైన దేవి ఈ మహిషీదానము చేసిన పుణ్యముచే నాకు సకలాభీష్టవస్తువులను ఇచ్చుగాక. ఏ మహిషి పుత్రుడు యమధర్మరాజునకు సహాయుడుగ నియుక్తుడైనాడో, ఏ మహిషి మహిషాసురుని తల్లియో ఆ దేవి నాకు వరములనొసంగుగాక! వృషభదానముచే మనుష్యుడు స్వర్గమును పొందును.

సంయుక్తహలపజ్త్వాఖ్యం దానం సర్వఫలప్రదమ్‌ | పఙ్త్కిర్దశహలా ప్రోక్తా దారుజా వృషసంయుతా. 7

సౌవర్ణపట్టసన్నద్ధాన్‌ దత్త్వా స్వర్గే మహీయతే | దశానాం కపిలానాం తు దత్తానాం జ్యేష్ఠపుష్కరే. 8

తత్ఫలం చాక్షయం ప్రోక్తం వృషభస్య తు మోక్షణ |

ధర్మోసి త్వం చతుష్పాదశ్చతస్రస్తే ప్రియా ఇమాః 9

నమో బ్రహ్మణ్య దేవేశ పితృభూతర్షిపోషక | త్వయి ముక్తేక్షయా లోకా మమ సన్తు నిరామయాః. 10

మా మే ఋణోస్తు దైవత్యో భీతః పైత్రోథ మానుషః |

ధర్మస్త్వం త్వత్ర్పపన్నస్య యా గతిః సాస్తు మే ధ్రువా. 11

ఆఙ్కయేచ్చక్రశూలాభ్యాం మన్త్రేణానేన చోత్సృజేత్‌ | ఏకాదశాహే ప్రేతస్య యస్య చోత్సృజ్యతే వృషః.

ముచ్యతే ప్రేతలోకాత్తు షణ్మాసే చాబ్దికాదిషు | దశహస్తేన కుణ్డన త్రింశత్కుణ్డాన్నివర్తనమ్‌. 13

తాన్యేవ దశవిస్తారాదోచర్మైతత్ప్రదేఘభిత్‌ | గోభూహిరణ్యసంయుక్తం కృష్ణాజినం తు యోర్పయేత్‌.

సర్వదుష్కృతకర్మాపి సాయుజ్యం బ్రహ్మణో వ్రజేత్‌ | భాజనం తిలసంపూర్ణం మధునా పూర్ణమేవ చ. 15

దద్యాత్కృష్ణతిలానాం చ ప్రస్థమేకం చ మాగధమ్‌ |

శయ్యాం దత్త్వా తు సగుణాం భుక్తిముక్తిమవాప్నుయాత్‌. 16

"సంయుక్తహలపంక్తి" యను దానము సమస్తఫలప్రదము. కఱ్ఱతో తయారు చేసిన పది నాగళ్ళ పంక్తిని సువర్ణమయ మగు పట్టికతో ఒకదానితో ఒకటి కట్టవలెను. ఒక్కొక్క హలముతో ఆవశ్యక సంఖ్యలో వృషభము లుండవలెను. వాటి దానము "సంయుక్తహలపంక్తి దానము". ఈ దానము చేసినవాడు స్వర్గమున పూజించబడును. జ్యేష్ఠ పుష్కరతీర్థమునందు పది కపిలగోవుల దానము చేసినచో దాని ఫలము అక్షయము. వృషోత్సర్గముచేతి గూడ అక్షయ ఫలము లభించును. ఆబోతుకు చక్ర-త్రిశూలముద్రలు వేసి - "దేవేశ్వరా! నీవు సాక్షాత్తు నాలుగు పాదములు గల ధర్మదేవతవు. ఈ నాలుగు నీ ప్రియతములు. పితృ-మనుష్య-ఋషులను పోషించు ఓ వేదమూర్తియైన వృషభమా! నిన్ను విడచుటచే నాకు అమృతమయము లగు శాశ్వతలోకములు ప్రాప్తించుగాక. దేవ-భూత-పితృ-ఋణముల నుండి విముక్తుడనగుదును గాక. నీవు సాక్షాత్తు ధర్మము. నిన్ను ఆశ్రయించువారికి కలుగు గతి నాకు ప్రాప్తించు గాక" అని పఠించుచు విడువలెను. మృతుని ఏకాదశ-షాణ్మాసిక-వార్షిక శ్రాద్ధములలో ఒక దానియందు వృషోత్సర్గము చేసినచో ఆతడు ప్రేత లోకము నుండి విముక్తు డగును. పది హస్తముల దండములుమొదలు ముప్పది హస్తములదండములకు సమాన మైన భూమి "నివర్తనము: పది నివర్తనముల భూమి గోచర్మము". అంత భూమి దానము చేసినవాడు తన సమస్తపాపములను నశింప చేసికొనును. గో-భూ-సువర్ణ యుక్త కృష్ణమృగచర్మ నుదానము చేసినవాడు ఎన్ని పాపములు చేసినవాడైనను, బ్రహ్మ సాయుజ్యమును పొందును. తిలములతోను, మధువుతోను నింపిన పాత్రను, మగధదేశీయమానానుసారము ఒక ప్రస్థము కృష్ణతిలలను దానము చేయవలెను దీనితో పాటు ఉత్తమ మగు శయ్యను కూడ దానము చేయుటచే దాత భుక్తిభుక్తులను పొందును.

హైమీం ప్రతికృతిం కృత్వా దత్త్వా స్వర్గస్తథాత్మనః |

విపులం దు గృహం కృత్వా దత్త్వాస్యాద్భుక్తిముక్తిభాక్‌. 17

గృహం మఠం సభాం స్వర్గీ దత్త్వా స్యాచ్ఛ ప్రతిశ్రయమ్‌ |

దత్త్వా కృత్వా గోగృహం చ నిష్పాపః స్వర్గమాప్నుయాత్‌. 18

యమమాహిషదానాత్తు నిష్పాపః స్వర్గమాప్నుయత్‌ | బ్రహ్మ హరో హరిర్దేవైర్మధ్యే చ యమదూతకః. 19

పాశీ తస్య శిరశ్ఛిత్త్వా తం దద్యాత్స్వర్గభాగ్భవేత్‌ |

త్రిముఖాఖ్యమిదం దానం గృహీత్వా తు ద్విజోఘభాక్‌. 20

చక్రం రూప్యమయం కృత్వాజ్కే ధృత్వా తత్ర్పదాపయేత్‌ |

హేమయుక్తం ద్విజాయైతత్కాలచక్రమిదం మహత్‌. 21

ఆత్మతుల్యం తు యో లౌహం దదేన్న నరకం వ్రజేత్‌ |

పఞ్చాశత్పలసంయుక్తం లౌహదణ్డం తు యోర్పయేత్‌. 22

వస్త్రేణాచ్ఛాద్య విప్రాయ యమదణ్డో న విద్యతే | మూలం ఫలాది వా ద్రవ్యం సంహతం వాథ చైకశః. 23

మృత్యుఞ్జయం నముద్దిశ్య దద్యాదాయుర్వివృద్ధయే | పుమాన్‌ కృష్ణతిలై | కార్యో రౌప్యదన్తః సువర్ణదృక్‌. 24

ఖడ్గోద్యతకరో దీర్ఘో జపాకుసుమమణ్ణలః | రక్తామ్బరధరః స్రగ్వీ శఙ్ఖమాలావిభూషితః. 25

ఉపానద్యుగయుక్తాఙ్ఘ్రిః కృష్ణకమ్బలపార్శ్వకః గృహీతమాంసపిణ్డశ్చ వామే వై కాలపూరుషః. 26

సంపూజ్య తం చ గన్దాద్యైః బ్రాహ్మణాయోవపాదయేత్‌ | మరణవ్యాధిహీనః స్యాద్రాజరాజేశ్వరో భ##వేత్‌. 27

గోవృషౌ తు ద్విజే దత్త్వా భుక్తిముక్తిమవాప్నుయాత్‌ |

రేవన్తాధిష్ఠితం చాశ్వం హైమం దత్త్వా న మృత్యుభాక్‌. 28

ఘణ్టాదిపూర్ణమప్యేకం దత్త్వా స్యాద్భుక్తిముక్తిభాక్‌ |

స్వర్ణముతో తన ప్రతిమ చేయించి దానము చేయువాడు స్వర్గమును పొందును విశాల మగు ఇల్లు కట్టించి దానము చేయువాడు భోగమోక్షములను పొందును. గృహమును, మఠమును, ధర్మశాలను, ఆవాసస్థానమును దానము చేసిన వాడు స్వర్గమున సుఖము లనుభవించును. గోశాల నిర్మించి దానము చేయువాడు పాపరహితుడై స్వర్గము పొందును. యమునికి సంబంధించిన మహిషమును దానము చేసినవాడు పాపరహితుడై స్వర్గము పొందును. దేవతాసహితు లగు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య పాశధారి యగు యమదూత మూర్తి స్థాపించి ఆ యమదూత శిరస్సు ఖండించి ఆ మూర్తితో కూడిన మండలమును బ్రాహ్మణునకు దానము చేయవలెను. ఇట్లు చేయుటచే దాత స్వర్గమునకు వెళ్లును గాని, ఆ 'త్రిముఖ'మను దానము పట్టిన బ్రాహ్మణునకు పాపము సంక్రమించును. వెండి చక్ర మొకటి చేయించి, దానిని నీటిలో నుంచి దాని నిమిత్తము హోమములు చేసి, దానిని బ్రాహ్మణునకు దానము చేసినచో అది "కాలచక్ర దానము". తన బరువుతో సమానమైన బరువు గల ఇనుము దానము చేయువాడు నరకమున పడడు. ఏబది పలముల లోహదండమును వస్త్రము చుట్టి దానము చేయువానికి యమదండ భయ ముండదు. దీర్ఘాయువును కోరువాడు మృత్యుంజయుని ఉద్దేశించి ఫలములు, మూలములు, ద్రవ్యము అన్నింటిని ఒక్కసారిగాని, వేరువేరుగా గాని దానము చేయవలెను. కృష్ణతిలలతో పురుషుని చేసి వెండి దంతములు, బంగారు కళ్లు అమర్చవలెను. మాలను ధరించి దీర్ఘాకారముతో నున్న ఆ పురుషుని కుడి చేతిలో ఎత్తిన ఖడ్గ ముండవలెను. ఎఱ్ఱని వస్త్రములు, జపాపుష్పములు, శంఖమాల ధరించి యుండవలెను. రెండు పాదములందు పాదుకలు, పార్శ్వమున నల్లని కంబళి ఉండవలెను. ఎడమ చేతిలో మాంసపిండ ముండవలెను. ఈ విధముగ కాలపురుషుని నిర్మించి గంధాదిద్రవ్యములచే పూజించి, బ్రాహ్మణునకు దాన మీయవలెను. ఇట్లు చేసిన దాత వ్యాధిమృత్యురహితుడై రాజరాజేశ్వరు డగును. బ్రాహ్మణునకు రెండు ఎద్దులు దానము చేసినవాడు భుక్తిముక్తులను పొందును.

సర్వకామానవాప్నోతి యః ప్రయచ్ఛతి కాఞ్చనమ్‌. 29

సువర్ణే దీయమానే తు రజతం దక్షిణష్యతే | అన్యేషామపి దానానాం సువర్ణం దక్షిణా స్మృతా. 30

సువర్ణం రజతం తామ్రం తణ్డులం ధాన్యమేవ చ | నిత్యశ్రాద్ధం దేవపూజా సర్వమేతదదక్షిణమ్‌. 31

రజతం దక్షిణా పిత్రే ధర్మకామార్థసాధనమ్‌ | సువర్ణం రజతం తామ్రం మణిముక్తావసూని చ. 32

సర్వమేతన్మహాప్రాజ్ఞో దదాతి వసుధాం దదత్‌ | పితౄంశ్చ పితృలోకస్థాన్దేవస్థానే చ దేవతాః. 33

సన్తర్పయతి శాన్తాత్మా యో దదాతి వసున్ధరామ్‌ | ఖర్వటం ఖేటకం వాపి గ్రామం వా సస్యశాలినమ్‌. 34

నివర్తనశతం వాపి తదర్ధం వా గృహాదికమ్‌ | అపి గోచర్మమాత్రాం చా దత్త్వోర్వీం సర్వభాగ్బవేత్‌. 35

తైలబిన్దుర్యథాచాప్సు ప్రసర్పేద్భూగతం తథా | సర్వేషామేవ దానానామేకజన్మానుగం ఫలమ్‌. 36

హాటకక్షితి గౌరీణాం సప్తజన్మానుగం ఫలమ్‌ | త్రిసప్తకులముద్ధృత్య కన్యాదో బ్రహ్మలోకభాక్‌. 37

గజం సదక్షిణం దత్త్వా నిర్మలః స్వర్గభాగ్భవేత్‌ |

అశ్వం దత్త్వాయురారోగ్యసౌభాగ్యం స్వర్గమాప్నుయాత్‌. 38

దాసీం దత్త్వా ద్విజేన్ద్రాయ అప్సరోలోకమాప్నుయాత్‌ |

దత్త్వా తామ్రమయీం స్థాలీం పలానాం పఞ్చభిః శ##తైః. 39

అర్ధైస్తదర్ధైరర్ధైర్వా భుక్తిముక్తిమవాప్నుయాత్‌ |

సువర్ణదానమును చేయువానికి అభీష్టవస్తుసిద్ధి యగును. సువర్ణదానము సఫల మగుటకు వెండి దక్షిణగా ఇవ్వవలెను. అన్యదానముల సాద్గుణ్యము నిమిత్తము సువర్ణదక్షిణ మంచిది. సువర్ణమే కాక రజతము, తామ్రము, తండు లములు ధాన్యములు కూడ దక్షిణకు తగినవి. నిత్యశ్రాద్ధ నిత్యదేవపూజాదులందు దక్షిణ ఇవ్వవలసిన పని లేదు. పితృకార్యమునందు రజతదక్షిణ ధర్మార్థకామప్రదము. భూమి దానము చేసిన బుద్ధిమంతుడు సువర్ణ - రజత - తామ్ర మణి - ముక్తాదుల దానము కూడ చేసిన ఫలము పొందును. భూదానము చేసిన శాంతచిత్తుడు పితృలోకములో నున్న పితృ దేవతలను, దేవలోకములో నున్న దేవతలను గూడ పూర్తిగా సంతృప్తిపరచును. సస్యములతో నిండి యున్న చిన్నపల్లె. గ్రామము, ఖర్వటము, నూరు నివర్తనముల ప్రమాణము లేదా దానిలో సగము ప్రమాణమున నిర్మించిన గృహాదికము గోచర్మ ప్రమాణము గల (పది నివర్తనములు) భూమి దానము చేసినవాడు అన్నియు పొందును. తైలబిందువు నీటిపై గాని, భూమిపై గాని పడి వ్యాపించి నట్లు అన్ని దానములఫలము ఒక జన్మవరకును ఉండును. స్వర్గ - భూ - గౌరీకన్యాదానఫలము ఏడు జన్మల వరకును స్థిరముగా నుండును. కన్యాదానము చేసినవాడు ఇరుపదియొక్క తరములను నరకము నుండి ఉద్ధరించి, బ్రహ్మలోకమును పొందును. దక్షిణా సహితముగ గజదానము చేసినవాడు పాపరహితుడై స్వర్గమును చేరును. అశ్వదానము చేయుటచే దీర్ఘాయురారోగ్య సౌభాగ్య - స్యర్గములను పొందును. శ్రేష్ఠబ్రాహ్మణులకు దాసీదానము చేయువాడు అప్సరస్త్రీలలోకమున సుఖము లనుభవించును. ఐదువందల పలములు లేదా రెండువందల ఏబది పలములు, నూటఇరువదియైదు పలములు, లేదా వాటిలో సగము పలములు బరువు గల తామ్రపాత్రను దానము చేసినవాడు భుక్తిముక్తులను పొందును.

శకటం వృషసంయుక్తం దత్త్వా మానేన నాకభాక్‌. 40

వస్త్రదానాల్లభేదాయురారోగ్యం స్వర్గమక్షయమ్‌ | ధాన్యగోధూమ కలమయవాదీస్స్వర్గభాగ్దదత్‌. 41

ఆసనం తైజసం పాత్రం లవణం గన్ధచన్దనమ్‌ |

ధూపం దీపం చ తామ్బూలం లోహం రూప్యం చ రత్నకమ్‌. 42

దివ్యాని నానాద్రవ్యాణి దత్త్వా స్యాద్భుక్తిముక్తిభాక్‌ |

తిలాంశ్చ తిలపాత్రం చ దత్త్వా స్వర్గమవాప్నుయాత్‌. 43

అన్నదానాత్పరం నాస్తి న భూతం న భవిష్యతి | హస్త్యశ్వరథదానాని దాసీదాసగృహాణి చ. 44

అన్నదానస్య సర్వాణి కలాం నార్హన్తి షోడశీమ్‌ | కృత్వాపి సుమహత్పాపం యః పశ్చాదన్నదో భ##వేత్‌. 45

సర్వపాపవినిర్ముక్తో లోకానాప్నోతిచాక్షయాన్‌ | పానీయం చ ప్రపాం దత్త్వా భుక్తిం ముక్తిమవాప్నుయాత్‌.

అగ్నిం కాష్ఠం చ మార్గాదౌ దత్త్వా దీప్తిమవాప్నుయాత్‌ | దేవగన్ధర్వనారీభిర్విమానే సేవ్యతే దివి. 47

ఘృతం తైలం చ లవణం దత్త్వా సర్వమవాప్నుయాత్‌ | ఛత్రోపానహకాష్ఠాది దత్త్వా స్వర్గే సుఖీ వసేత్‌.

ప్రతిపత్తిథిముఖ్యేషు విష్కుమ్భాదికయోగకే | చైత్రాదౌ వత్సరాదౌ చ హ్యశ్విన్యాదౌ హరిం హరమ్‌. 49

బ్రహ్మాణం లోకపాలాదీన్‌ ప్రార్చ్య దానం మహాఫలమ్‌ | వృక్షారామాన్భోజనాదీన్మార్గసంవాహనాదికాన్‌. 50

పాదాభ్యఙ్గాదికం దత్త్వా భుక్తింముక్తి మవాప్నుయాత్‌ |

వృషభసహితశకట దానము చేసినవాడు విమానముపై స్వర్గమునకు వెళ్లును. వస్త్రదానముచే ఆయురారోగ్యములు, అక్షయస్వర్గప్రాప్తి కలుగును. ధాన్యము, గోధుమలు, అగ్రహాయణీ తండులములు, జొన్నలు మొదలగునవి దానము చేయువాడు స్వర్గము పొందును. ఆసనము, ధాతునిర్మితపాత్రమ, లవణము, సుగంధి చందనము ధూపదీపములు, తాంబూలము, ఇనుము, వెండి, రత్నములు, వివిధ, దివ్యపదార్థములు దానము చేయువాడు భుక్తిముక్తులను పొందును. తిలలను - తిలపాత్రను దానము చేసినవాడు స్వర్గసుఖము పొందును. అన్నదానమును మించిన దాన మేదియు లేదు, ఉండబోదు. గజ - అశ్వ - రథ - దానదాసీ - గృహాదులు దానము అన్నదానము యొక్క పదహారవ కలకు కూడ సరితూగవు. మహాపాపములు చేసిన వాడు కూడ అన్న దానము చేసినచో ఆ పాపము లన్నింటినుండియు విముక్తుడై అక్షయ్యలోకములను పొందును. జలమును, పానపాత్రను దానము చేసినవాడు భుక్తిముక్తులను పొందును. శీతకాలమునందు మార్గమధ్యాదులందు అగ్నిని, కట్టెలను ఇచ్చువాడు తేజోయుక్తుడై స్వర్గమునందు దేవతా - గంధర్వాప్సరాదులచే సేవింపఖడును. ఘృతతైల లవణదానము చేసినవానికి అన్నియు లభించును. ఛత్ర - పాదుకా - కాష్ఠాదులను దానము చేసినవాడు స్వర్గములో సుఖముగ నివసించును. ప్రతిపదాది పుణ్యతిథులందును. విష్కంభాది యోగములందును, చైత్రాది మాసములందును, సంవత్సరారంభమునందును, అశ్విన్యాది నక్షత్రములందును, విష్ణు - శివ - బ్రహ్మలోకపాలాదుల నర్చించి చేసిన దానము మహాఫలప్రదము. వృక్ష - ఉద్యాన - భోజన - వాహనాదులను, పాదములకు మర్దించుటకై తైలాదికమును ఇచ్చిన మానవుడు భుక్తిముక్తులను పొందును.

త్రీణి తుల్యఫలాన్యాహ గావః పృథ్వీ సరస్వతీ. 51

బ్రాహ్మీం సరస్వతీం దత్త్వా నిర్మలో బ్రహ్మలోకభాక్‌ | సప్తద్వీపమహీదః స బ్రహ్మజ్ఞానం దదాతి యః.

అభయం సర్వభూతేభ్యో యో దద్యాత్సర్వభాఙ్నరః | పురాణం భారతం వాపి రామాయణమథాపి వా. 53

లిఖిత్వా పుస్తకం దత్త్వా భుక్తిం ముక్తిమవాప్నుయాత్‌ |

వేదశాస్త్రం నృత్యగీతం యోధ్యాపయతి నాకభాక్‌. 54

విత్తం దద్యాదుపాధ్యాయే ఛాత్రాణాం భోజనాదికమ్‌ | కిమదత్తం భ##వేత్తేన ధర్మకామాదిదర్శినా. 55

వాజపేయసహస్రస్య సమ్యగ్ధత్తస్య యత్ఫలమ్‌ | తత్ఫలం సర్వమాప్నోతి విద్యాదానాన్న సంశయః. 56

శివాలయే విష్ణుగృహే సూర్యస్య భవనే తథా | సర్వదానప్రదః స స్యాత్పుస్తకం వాచయేత్తు యః. #9; 57

త్రైలోక్యే సర్వవర్ణాశ్చ చత్వారశ్చాశ్రమాః పృథక్‌ | బ్రహ్మాద్యా దేవతాః సర్వా విద్యాదానే ప్రతిష్ఠితాః.

విద్యాకామదుఘా ధేనుర్విద్యా చక్షురనుత్తమమ్‌ | ఉపవేదప్రదానేన గన్ధర్వైః సహ మోదతే. 59

వేదాఙ్గానాం చ దానేన స్వర్గలోకమవాప్నుయాత్‌ | ధర్మశాస్త్రప్రదానేన ధర్మేణ సహ మోదతే. 60

సిద్ధాన్తానాం ప్రదానేన మోక్షమాప్నోత్యసంశయమ్‌ | విద్యాదానమవాప్నోతి ప్రదానాత్ఫున్తకస్య తు. 61

శాస్త్రాణి చ పురాణాని దత్త్వా సర్వమవాప్నుయాత్‌ | శిష్యాంశ్చ శిక్షయేద్యస్తు పౌణ్డరీకఫలం లభేత్‌. 62

గోదాన - విద్యాదాన - భూదానములు మూడును సమానఫలములు. వేదవిద్యాదానము చేసినవాడు పాపరహితుడై బ్రహ్మలోకమునందు నివసించును. యోగ్యుడైన శిష్యునకు బ్రహ్మజ్ఞాన మిచ్చినవాడు సప్తద్వీపసమన్విత యగు భూమిని దానము చేసినట్లే. సకలప్రాణులకును అభయదానము చేసినవాడు సర్వమును, పొందగల్గును. పురాణమును గాని, మహాభారతమును గాని రామాయణమును గాని వ్రాసి ఆ పుస్తకము దానము చేసినవాడు భుక్తిముక్తులను పొందును. వేదాదిములను నృత్యగీతములను నేర్పినవాడు స్వర్గము పొందును. ఉపాధ్యాయునకు వృత్తిని, విద్యార్థులకు భోజనమును ఏర్పరిచి నవాడు ధర్మకామాది పురుషార్థముల రహస్యము తెలిసినవాడు; అతడు చేయని దాన మేమున్నది? విద్యాదానము చేసినవాడు - సహస్రవాజపేయములను విధిపూర్వకముగ దానముచేయుటచే ఎట్టి ఫలము లభించునో అంతఫలమును పూర్తిగ పొందును. సందేహ మేమాత్రము లేదు. శివ - విష్ణు - సూర్యదేవాలయములలో గ్రంథప్రవచనము చేయువానికి సకలదానఫలములు లభించును. త్రిలోకములలో నున్న బ్రాహ్మణాది వర్ణములును, బ్రహ్మచర్యాది ఆశ్రమములును. బ్రహ్మాదిదేవగణములును విద్యాదానమునందు ప్రతిష్ఠితములై యున్నవి. విద్యయే కామధేనువు; విద్యయే నేత్రము; గాంధర్వాద్యుపవేదములు దానము చేసినవాడు గంధర్వులతో కలిసి ఆనందించును. వేదాంగముల దానముచే స్వర్గమును పొందును. ధర్మశాస్త్రదాన ముచే ధర్మసంనిధి చేరి ఆనందించును. సిద్ధాంతముల దానము చేసినవాడు నిస్సంశయముగ మోక్షమును పొందును. పుస్తకదానముచే విద్యాదాన ఫలము లభించును. అందుచే శాస్త్రపురాణముల దానము చేసినవాడు సర్వమును పొందును. శిష్యులకు శిక్షాదానము చేసినవాడు పౌండరీకయాగము చేసిన ఫలము పొందును.

యేన జీవతి తద్దత్త్వా ఫలస్యాన్తో న విద్యతే | లోకే శ్రేష్ఠతమం సర్వమాత్మనశ్చాపి యత్ర్పియమ్‌. 63

సర్వం పితౄణాం దాతవ్యం తేషామేవాక్షయార్థినా | విష్ణుం రుద్రం పద్మయోనిం దేవీవిఘ్నేశ్వరాదికాన్‌. 64

పూజయిత్వా ప్రదద్యాద్యః పూజాద్రవ్యం స సర్వభాక్‌ |

దేవాలయం చ ప్రతిమాం కారయన్సర్వమాప్నుయాత్‌. 65

సంమార్జనం చోపలేపం కుర్వన్‌ స్యాన్నిర్మలః పుమాన్‌ | నానామణ్డలకార్యగ్రే మణ్డలాధిపతిర్భవేత్‌. 66

గన్ధం పుష్పం ధూపదీపం నైవేద్యం చ ప్రదక్షిణమ్‌ | ఘణ్టాధ్వజవితానం చ ప్రేక్షణం వాద్యగీతకమ్‌. 67

వస్త్రాది దత్త్వా దేవాయ భుక్తిం ముక్తిమవాప్నుయాత్‌ | కస్తూరికాం సిహ్లకం చ శ్రీఖణ్డమగరుం తథా. 68

కర్పూరం చ తథా ముస్తం గుగ్గులుం విజయం దదేత్‌ |

ఘృతప్రస్థేన సంస్థాప్య సంక్రాన్త్యాదౌ స సర్వభాక్‌. 69

స్నానం పలశతం జ్ఞేయమభ్యఙ్గం పఙ్చవింశతిః | పలానాం తు సహస్రేణ మహాస్నానం ప్రకీర్తితమ్‌. 70

దశాపరాధాస్తోయేన క్షీరేణ స్నాపనాచ్ఛతమ్‌ | సహస్రం పయసా దధ్నా ఘృతేనాయుతమిష్యతే. 71

దాసీదాసమలఙ్కారం గోభూమ్యశ్వగజాదికమ్‌ | దేవాయ దత్త్వా సౌభాగ్యం ధనాయుష్మాన్ర్మజేద్ధివమ్‌. 72

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నానాదానాని నామ ఏకాదశాధికద్విశతతమోధ్యాయః.

జీవికా దానఫలము అనంతము. పితరులకు అక్షయలోకావాప్తి కోరువాడు, ఈ లోకమునందు సర్వశ్రేష్ఠము లైన వస్తువులను, తనకు ప్రియ మగు సకలపదార్థములను పితరుల నుద్దేశించి దానము చేయవలెను. బ్రహ్మ విష్ణు శివదేవీగణశాదుల పూజచేసి ఆ పూజాద్రవ్యముల నన్నింటిని బ్రాహ్మణునకు దానము చేయువాడు సర్వమును పొందగలడు. దేవాలయములను కట్టించువారును, దేవప్రతిమలు నిర్మించువారును సమస్తమైన అభిలషిత వస్తువులను పొందగలరు. దేవాలయ ములలో తుడిచి కడుగువాడు పాపరహితు డగును. దేవప్రతిమకు ఎదురుగ వివిధమండముల నిర్మాణము చేయువాడు మండలాధిపతి యగును. దేవతలకు గంధ - పుష్ప - ధూప - దీప - నైవేద్య - ప్రదక్షిణ - ఘంటా - ధ్వజ - వస్త్రాదులను సమర్పించుటచేతను, దేవతాదర్శనము చేతను, దేవతాసమక్షమున నాట్యగానములు చేయుటచేతను మనుష్యుడు భుక్తిని ముక్తిని కూడ పొందును. భగవంతునకు కస్తూరి, సింహలదేశీయచందనము, అగురు, కర్పూరము, ముస్తాది సుగంధద్రవ్యములు, విజయగుగ్గులు సమర్పించవలెను. సంక్రాంత్యాదిదినములందు ఒక ప్రస్థము నేతితో స్నానము చేయించువాడు అన్నియు పొందును. నూరుపలములతో స్నానము, ఇరువదియైదుపలములతో అభ్యంగము, వేయిపలములతో మహా స్నానము చేయించవలెను. భగవంతునకు జలస్నానము చేయించుటచే పది అపరాధములు, దుగ్ధ - దధులతో స్నానము చేయించుటచే సహస్రాపరాధములు, ఘృతస్నానము చేయించినచో వెయ్యి అపరాధములు వినష్టములగును. దేవతలను ఉద్దేశించి దాసదాసులను, అలంకారములను, భూమిని, గజాశ్వములను, సౌభాగ్యద్రవ్యములను సమర్పించువాడు దీర్ఘాయుర్యుక్తుడై స్వర్గలోకమును పొందును.

అగ్నిమహాపురాణమునందు నానాప్రకారదానమహిమవర్ణనమను రెండువందలపదకొండవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters