Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

ఆదిశంకరులు

బుద్ధుడు జైనుడువంటి మతాచార్యులు తమకు కలిగిన బోధను అనుసరించి తమతమ మతములను ప్రవర్తిల్ల చేశారని శ్రీ ఆదిశంకరులు అలాకాక శుత్రిసమ్మతంగా ఉపనిషదను గుణంగా తమ అద్వైతదర్శనాన్ని లోకమున ప్రచారం చేశారు.

ఆదిశంకరులు ఎనిమిదవ ఏట సన్యసించారు. సన్యసించి ఆసేతు హిమాచలం సంచారం చేశారు. దేనివల్లనైతే శాశ్వతమైన ఆనందం కలుగుతుందో దానిని ప్రజలకందరకు పంచి పెట్టడమే ఆయన లక్ష్యం, జనం ఎప్పుడూ సుఖదుఃఖాలలో పడి కొట్టుకుపోతూ ఉంటారు. ఏదైనాలాభం వస్తే సంతోషం, చిక్కులువస్తే దుఃఖం, కొంతకాలం సుఖం, కొంతకాలం దుఃఖం, ఒకప్పుడు నిబ్బరం, ఒకప్పుడు భయం, ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. అలాకాక ఎప్పుడు ఏపరిస్థితులు ఏర్పడినప్పటికీ ఏవికారానికో లోనుకాకుండా నిశ్చలంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండగలగడానికి ఒక వస్తువున్నది. మన పూర్వులు దానిని జ్ఞానం అన్నారు. ఇప్పుడు దానిని అందరూఫిలాసఫీ అంటూ ఉంటారు. ఆ జ్ఞానం ఒక పెద్ద మూలధనం వంటిది. ఎంత డబ్బు ఉన్నవారైనా ఎంత పెద్దపదవులలో ఉన్నవారైనా ఈ జ్ఞానధనం లేనప్పుడు ఏడుస్తూనే వుంటారు. ఎంతబీదవారైనా ఎన్ని చిక్కులలో ఉన్నవారైనా ఈ ధనం ఉన్నప్పుడు సంతోషంగానే గడుపుతారు. ఈ జ్ఞానం ఆదిశంకరులకు ఎనిమిదవ ఏటనే కలిగింది, వారి భాషణమే భాష్యం అయింది.

మట్టితో బొమ్మలు చేస్తూ ఉంటారు, అందులో కొన్ని బొమ్మలు భయంకరంగా ఉంటాయి. కొన్ని సౌమ్యంగా ఉంటాయి. కొన్ని ఏడ్చేవి, కొన్ని సంతోషంగా ఉన్నవి, వాటికి రంగులు వేసి అలంకారాలు చేస్తారు; కొందరు చక్కెరతో బొమ్మలు చేయించి, వాటికి రంగులు వేసి అట్టేపెడతారు. చక్కెరతోనే కాకరకాయలు, మిరపకాయలు చేస్తారు. పిల్లలు వాటిని చూచినప్పుడు ఇది కాకరకాయ కనుక చేదుగా ఉంటుందని, ఇది మిరపకాయ కనుక కారంగా ఉంటుందని, అనుకుంటారు, అవన్నీ చక్కెరతో చేసినవే అని తెలుసుకొన్న వారు, అంటే జ్ఞానం వచ్చినప్పుడు అన్నీ తీపిగానే ఉంటాయని గ్రహిస్తారు.

ఈ సృష్టికంతకు మూలకారణమైన పరమాత్మ ఆనందస్వరూపుడు. ఈ సృష్టిలో కనబడే వన్నీ పర్వతాలు, సముద్రాలు, సూర్యచంద్రులు, సమస్తభూతజాలం, అన్నీ ఆయన రూపాలే, చెట్టుచేమలు భూమిలోనుంచి వచ్చి, మరల భూమిలో కలసిపోతున్నాయి. ఉత్పత్తికి ఏది కారణమో లయానికికూడా అదే కారణమౌతోంది. మరి ఆ మట్టికి కారణం ఏమిటి? అని విచారించుకొంటూపోతే అన్ని వస్తువులకు మూలకారణం పరమాత్మ అనీ, అతడు ఆనంద స్వరూపుడనీ అజ్ఞానం కలిగినప్పుడు నిరంతరం ఆనందంగా ఉండడం సాధ్యమౌతుందని తెలుసుకొంటాంః చూచేది, చూడబడేది, ఒకటైనప్పుడు అది అనుభవానికి వచ్చినప్పుడు ఇక కోపానికి, విషాదానికి హేతు వేముంటుంది? ఇంగ్లీషులో కూడా ''అమ్మీషియెంట్‌, ఆమ్ని ప్రజంట్‌.''అని అంటూ ఉంటారు. ఈ తత్వాన్ని అందరకు చెప్పాలి. పక్వమైన వారికి ఉపయోగిస్తుంది. మిగిలిన వారు కూడా పక్వం కావటానికి అనుష్ఠానాలు నీతులు ధర్మాలు అవసరమైనాయి.

వీటిమూలంగా జ్ఞానం పండినప్పుడు అన్ని బంధాలు విడిపోతాయి, పచ్చిగా ఉన్నప్పుడు కాయకోస్తే నీరు కారుతుంది. అది కాయకూ కష్టమే. చెట్టుకూ కష్టమే పండుగా పండినప్పుడు మనం కోయనక్కరలేదు, అదే రాలిపోతుంది. జ్ఞానం కలిగినప్పుడు బంధాలన్నీ అలా అనాయాసంగా అప్రయత్నంగా విడిపోతాయి.

ఇట్టి బంధవిమోచన హేతువైన జ్ఞానాన్నే ఆదిశంకరులు వారు అందరకు పంచిపెట్టారు. వారి భాషణమే భాష్యం అయింది. బుద్ధుడు జినుడువంటి మతాచార్యులు తమకు కలిగిన బోధను అనుసరించి తమ తమ మతములను వెలయింప చేశారు. శ్రీ శంకరాచార్యులవారు అలాకాక శ్రుతిసమ్మతంగా ఉపనిషదనుగుణంగా తమ అద్వైతదర్శనాన్ని ప్రవచించారు. వారి సూత్రభాష్యంపై అనేక వ్యాఖ్యానాలు వచ్చాయి. వాటిలో వాచస్పతిమిత్రుల భామతి ప్రసిద్ధమైంది: ఆనందగిరి వ్యాఖ్యానం కూడా వున్నది. ఇవికాక గోవిందానందుని రత్నప్రభ వ్యాఖ్యానం విశేషప్రచారంలో ఉన్నది. భాష్య పరమార్థం అవగాహన చేసికోడానికి అందరు రత్నప్రభ చదువుతూ ఉంటారు.

ఈ గోవిందానందుని స్వస్థలం కృష్టాతీరప్రాంతమైన వ్యాఘ్రేశ్వర గ్రామమే, (పెద్దపులివర్రు), సన్యాసాశ్రమం స్వీకరించి, గోవిందానందనామం స్వీకరించే ముందు ఇతణ్ణి 'భర్మభట్టు' అని వ్యవహరించేవారు. అప్పు డీతడు సాహిత్య రత్నాకరం అనే గ్రంథం వ్రాశాడు. సాహిత్య రసాస్వాదన పరులకు యిది ఇప్పటికి పఠనీయంగా వుంటున్నది.

ఈయన తర్వాత కంచివెళ్లారు. కృష్ణానదినుంచి బాహూనది వద్దకు వెళ్లారు. అక్కడ గురుపరంపర ద్వారా సంప్రదాయ సిద్ధంగా జ్ఞానసముపార్జన చేశారు. అటుపిమ్మటనే ఆయన ఈ రత్నప్రభను రచించారు.

వీరి పరమేష్ఠి గురువులకు, కామాక్షి అమ్మవారు ప్రత్యక్షమై తనకు నివేదనం చెయ్యబడిన పాయసాన్ని ప్రసాదించిందని, దానిని ఆరగించిన వెంటనే ఆయనకు బ్రహ్మసాక్షాత్కారం కలిగిందనీ ప్రతీతి. అట్టి గురుసంప్రదాయం ద్వారా లభించిన జ్ఞానంతో వారు రచించిన ఈ వ్యాఖ్యానం ఎంత మహత్తరంగా ఉంటుందో చెప్పనక్కరలేదు.

8-18ొ


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page