Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

భద్రగరిక్షేత్రము

''శ్రీరాములవారి చరణస్పర్శచేత పవిత్రమైనది. ఈ గోదావరీతీరం, ఈతీరాన వెలసిఉన్నది భద్రగిరిక్షేత్రం, ఈ క్షేత్రమెప్పటికీ భద్రంగా వుండాలి. నిత్యకళ్యాణంగా, మంగళ కరంగా, శుభంగా వుండాలి. ఇక్కడ నివసించేవారు. ఇక్కడికివచ్చి దేవుని దర్శించేవారు అందరూ భద్రంగావుండాలి. ఈ క్షేత్రంలో వేంచేసినవున్న శ్రీరామభద్రుని అనుగ్రహంచేత ప్రపంచమంతా భద్రంగా వుండాలి.

''శ్రీరాములవారి చరణస్పర్శచేత పవిత్రమైన గోదావరీ తీరము. ఇక్కడికి అనతిదూరంలో వున్న పరణశాల సీతారాములు వాసంచేసినస్థలం, చిత్రకూటంలో కొంతకాలం గడిపిన పిమ్మట సీతారాములు గోదావరీ తీరానికివచ్చారు, ఇంచుమించు పదిసంవత్సరాలకుపైగా ఇక్కడే వుండివుంటారు. అప్పుడు చాలాదూరం గోదావరీ తీరమున సంచారం చేయడం చేత ఈతీరమంతా వారిచరణస్పర్శచేత పవిత్రమైనది.''

శ్రీరామునికే ''రామభద్రుడు '' అనిపేరు.

''రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే!

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ''

ఇక్కడ ఈ క్షేత్రంలో ఆయన భద్రాద్రి రాముడై నాడు, రామభద్రుడు భద్రరాముడైనాడు. ఇక్కడినుంచే ప్రపంచమంతటినీ భద్రంగా చూస్తున్నాడు.

ఎవరికెట్టి ఆపదసంభవించినా, తనయందు నిజమైన నమ్మకం గలవారిని కాపాడడానికి తాను వారికి దాసుడనౌతానన్నాడు. రామదాసు శ్రీరామునికి దాసుడుకావడమే కాదు. రామదాసుకే శ్రీరాముడు దాసుడైనాడు. రామలక్ష్మణులు రామసింగ్‌, లక్ష్మణ్‌సింగ్‌ అనే రూపాలు దాల్చి రామదాసు భటులమని చెప్పుకోలేదా?

దాసులకు దామడు :

తనపట్ల అచంచలమైన విశ్వాసంవుంచితే చాలు, ఎట్టి ఆపదలనుంచి అయినా, ఎవరినైనా రక్షించగలడు. అతడు సంకల్పించితే ఎట్టి క్రూరులైనను ప్రభువులైన వారిలో సైతం భక్తిని కలుగజేసి, దాసులకు దాసుడూ, దాసానుదాసుడుగా కూడా తాను అవుతాడు, 'నాయందు నమ్మక ముంచినవారికి నేను దాసుడ నౌతాను' అన్న నిదర్శనం చూపించా డిక్కడ శ్రీరాముడు.

''విశ్వాసఫలదాయకః''

కృష్ణావతారంలోకూడా భగవంతుడు అర్జునునకుదాసుడైనాడు, సారధి అయినాడు, దేవునిపైగానీ, పెద్దలపైగానీ, మిత్రులయందు గానీ ఎవరియందో ఒకరియందు నమ్మకం గల వాడు కృతార్థుడు కాగలడు, అట్టివానికి దుఃఖమే వుండదు. ఒకరు చెప్పినట్టు మనం నడుచుకుందామనే నమ్మకం గనుక వుంటే మనపూచీ అంతా వారిపైన వుంటుంది. ఒకవేళ వారు తప్పుచేస్తే ఆ నష్టం మనం అనుభవించటమా అన్న అనుమానం కలగవచ్చు, మనం తలచే తలంపే తప్పుగావుండి, దానివల్ల నష్టం కలిగితే అప్పుడు మనం చేయగలిగిన దేమున్నది? అందుచేత, వారిబుద్ధే మనబుద్ధి అనుకోవాలి. ఆ విధంగా మనభారం వారిపైన వుంచాలి. ఆ భారాన్ని మిత్రులపైన వుంచినప్పటికీ మనమనస్సు తేలిక అవుతుంది. మనకు కష్టం వుండదు. నమ్మి మనం చెడినా బాధలేదు. ''విశ్వాసః ఫలదాయకః'' అని పెద్దల వాక్యం, కొందరు మిత్రులపట్ల విశ్వాసం కలిగి వుంటారు. మరికొందరు దేవుని యందు విశ్వాసం ఉంచుకుంటారు. రామదాసు భగవంతుని యందు శ్రీరామునియందే సర్వభారమూ మోపినాడు.

మన పురాణాలు చూచేట్టయితే సుఖంగా జీవించిన వాళ్ళు ఎక్కువ మందిలేరు. హరిశ్చంద్రుడు నలమహారాజు, పంచపాండవులు, రామదాసు -మొదలైనవారంతా కష్టాలనుభవించినవారే. ''మనమే అనేక కష్టాలుపడుతున్నాము, ఎన్నో తంటాలు పడుతున్నాము, భగవంతుడు మనలను పరీక్ష చేస్తున్నాడు,'' అని ఏమోమో అనుకుంటాము, మన పురాణాల్లోని కథలను గమనిస్తే వాళ్లంతా మనకంటే ఎన్నో రెట్లు కష్టాలనుభవించినట్టు తెలుస్తుంది. అయితే ఎంతకష్టం మొచ్చినా, భగవంతుని నమ్మిన పక్షంలో, అతడు మనకు దాసానుదాసుడై మనకష్టాలన్నిటిని నివృత్తి చేయగలడని మనకు ఋజువవుతుంది.

8-16ొ

''భద్రాన్ని ప్రసాదించే స్థలం'' :

భద్రమనే శబ్దానికి నిఘంటువు ఇలా అర్థం చెప్పింది; ''స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం.''

''భద్ర''మనేది మధ్యలోవున్నది: ఈ క్షేత్రం పేరు భద్రగిరి. ఇదెప్పుడూ భద్రంగా వుండాలి. కళ్యాణంగా వుండాలి, నిత్యకళ్యాణంగా, మంగళకరంగా, శుభంగా వుండాలి, ఇక్కడ నివసించేవారు, ఇక్కడికి వచ్చి దేవుని దర్శించేవారు అందరూ భద్రంగా వుండాలి. ఈ క్షేత్రంలో వేంచేసివున్న శ్రీరామభద్రుల అనుగ్రహంచేత ప్రపంచ మంతా కూడా భద్రంగా వుండాలి. ఒక్కజీవుడు, ఒక్క కుటుంబం, ఒకవూరు వీటిని కాపాడడానికి మాత్రమేకాదు, పరమేశ్వరుడు భద్రుడు అనుపేరు వహించింది. ప్రపంచమంతటికీ భద్రాన్ని అనుగ్రహించే స్థలమిది, ఇది ఉత్తరోత్తరా ఇంకా అభివృద్ధి కావాలి.

రామాయణంలో ముఖ్యపాత్ర సీతామహాలక్ష్మీ, 'మా జానకీ చెట్టబట్టగా మహారాజు వైతివి-' అని త్యాగరాజు రామునిగూర్చి అన్నాడు. శ్రీరాముడిక్కడ సీతను వామభాగంలో పెట్టుకుని ఆవిర్భవించాడు. ప్రపంచంలో మన మందరం ఆమహాతల్లి బిడ్డలమే, ఆ తల్లే మనల నందరిని సృష్టించింది, సీతారామప్రసాద సిద్ధిరస్తు.


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page